సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ద్రావణాలు, కషాయాలను చిన్న, సన్నకారు రైతులు తయారు చేసుకొని వాడగలుగుతున్నారు. అయితే, ఎక్కువ విస్తీర్ణంలో సేంద్రియ/ప్రకృతి సేద్యం చేసే పెద్ద రైతులకు వీటి తయారీ కష్టం కావటంతో జీవన ఎరువులు, జీవన పురుగుమందులను విరివిగా వినియోగిస్తున్నారు. రైతు శాస్త్రవేత్త, తునికిలోని ఏకలవ్య కేవీకే సలహాదారు, హార్ట్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఎం.ఎస్.సుబ్రహ్మణ్యం రాజు గత కొన్ని సంవత్సరాలుగా చిన్న, పెద్ద కమతాల్లో సాగు చేసే రైతులతో కలసి పనిచేస్తున్నారు. ఖరీఫ్/లేటు ఖరీఫ్ వరి సాగులో చిన్న కమతాల రైతులు, పెద్ద కమతాల రైతులు ఏయే ఉత్పాదకాలను, ఎంతెంత మోతాదులో వాడితే మంచి ఫలితాలు వస్తున్నాయన్న అంశాలను ఆయన ‘సాక్షి సాగుబడి’కి ఇలా వివరించారు.
వరి నారుమడిని నీరు నిలవని విధంగా తయారు చేసుకోవాలి. విత్తనాన్ని ఒక రోజు ముందు ఎండబెట్టి మరునాడు విత్తన శుద్ధి చేయాలి. నిద్రావస్థ ఉన్న విత్తనాలను, నిద్రావస్థ తొలగించడానికి గోరువెచ్చని నీటిలో నానబెట్టి, అనంతరం విత్తనాలను నారుమడిపై వెదజల్లాలి. 2వ రోజు నీరు బయటకు తీయాలి. 5వ రోజు నీరు పెట్టాలి. తర్వాత తగినంత నీరు ఇస్తుండాలి. చాలా ప్రాంతాల్లో నారు 6 అంగుళాల సైజు నుంచి 10 అంగుళాల సైజు వచ్చినప్పుడు మాత్రమే ఊడ్పు/నాట్లు వేస్తుంటారు. నాట్లు వేసిన 7 రోజులకు.. చనిపోయిన మొక్కల స్థానంలో మళ్లీ నాట్లు వేయాలి.
ప్రధాన పొలాన్ని ఊడ్పుకు ముందు 20 రోజుల నుంచి దఫ దఫాలుగా వారానికి ఒకసారి దుక్కి దున్ని, చదును చేసుకోవాలి. ఎకరాకు 3 నుంచి 5 టన్నుల పశువుల ఎరువు వెయ్యాలి. నాట్లతో పాటుగా వివిధ రకాల జీవన ఎరువుల (బ్యాక్టీరియాల) ను ఇవ్వాలి. మొక్కల మధ్య 20 సెం.మీ. దూరం ఉండేలా వరి నాట్లు వేయాలి. మధ్యలో కాలి బాటలు తీయాలి. గట్లపై నువ్వుల విత్తనాలను చల్లుకుంటే నువ్వుల పువ్వులు ఎనాగరస్ అనే కీటకాన్ని ఆకర్షించటం ద్వారా తెల్లదోమ నివారణ జరుగుతుంది.
సేంద్రియ వరి సాగులో చిన్న, పెద్ద రైతులకు అనువైన ఉత్పాదకాల పట్టిక!
మోతాదు ఎంత?
ఎకరం పంటకు సగటున 100–120 లీ. నీటిని పిచికారీ చేయాలి
మీనామృతాన్ని నారుమడిపై లీ. నీటికి 5 ఎం.ఎల్., పైరు ఎదిగిన దశలో లీ. నీటికి / 10ఎం.ఎల్. చొప్పున కలిపి పిచికారీ చేయాలి
బవేరియాను లీ. నీటికి /10 గ్రా. కలిపి పిచికారీ చేయాలి ∙మెటారైజమ్ లీ. నీటికి/ 10 గ్రా. వాడాలి ∙హ్యూమిక్ యాసిడ్ కిలో విత్తనాలకు/ 10 గ్రా. వాడాలి. ∙కిలో నేలవేము పొడిని 100 లీ. నీటిలో కలిపి కషాయం తయారు చేయాలి
1500 గ్రా. వావిలాకు పొడిని కషాయం చేసుకొని 100 లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి ∙ఎకరానికి రకానికి ఒక కిలో చొప్పున జీవన ఎరువులు వాడాలి ∙లీ. నీటికి 10 ఎం.ఎల్. కొబ్బరి నీరు కలపాలి
పంచగవ్య నారుమడిలో పిచికారీకి లీ. నీటికి 5 ఎం.ఎల్. కలపాలి. పైరు ఎదిగే దశలో పిచికారీకి లీ. నీటికి 20 ఎం.ఎల్. కలపాలి ∙అర కేజీ ఇంగువతో ద్రావణం చేసుకొని వంద లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి
200 గ్రా. పసుపును కషాయం చేసుకొని వంద లీ. నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి ∙2 కిలోల మొలకలతో ద్రావణం చేసుకొని వంద లీ. నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి ∙6 లీ. పుల్ల మజ్జిగను వంద లీ. నీటితో కలిపి పిచికారీ చేయాలి.
ఆగ్నేయ అస్త్రం తయారీలో మిర్చి, అల్లం, వెల్లుల్లిలను అర కిలో చొప్పున తీసుకొని నూరి కషాయం తయారు చేసి వంద లీ. నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
(ఇతర వివరాలకు.. సుబ్రహ్మణ్యం రాజు మొబైల్: 76598 55588)
బయోచార్‌తో సేంద్రియ ఇంటిపంటల సాగుపై శిక్షణ
సేంద్రియ ఇంటిపంటల సాగుపై పట్టణ/నగర వాసులపై ఆసక్తి పెరుగుతోంది. బయోచార్ (బొగ్గుపొడి) కలిపిన మట్టి మిశ్రమంతో టెర్రస్ గార్డెన్లు, పెరటి తోటలు, బాల్కనీలలో కూరగాయల పెంపకంపై ఈ నెల 24, 25 తేదీల్లో హైదరాబాద్ మలక్‌పేటలోని న్యూలైఫ్ ఫౌండేషన్ శిక్షణ ఇవ్వనుంది. మిగులు పంట దిగుబడులను సోలార్ డ్రయ్యర్‌తో ఎండబెట్టే విధానం కూడా వివరిస్తామని న్యూలైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శివ షిండే తెలిపారు. వివరాలకు.. 81210 08002.
17న అమలాపురంలో ప్రకృతి సేద్యంపై శిక్షణ
శ్రీనివాస సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 17న కోనసీమ జిల్లా అమలాపురంలోని (ముక్తేశ్వరం– కొత్తపేట రోడ్డు) శ్రీసత్యనారాయణ గార్డెన్స్‌లో ప్రకృతి వ్యవసాయంపై నిపుణులు విజయరామ్ రైతులకు అవగాహన కల్పిస్తారని నిర్వాహకులు నిమ్మకాయల సత్యనారాయణ తెలిపారు. ప్రవేశం ఉచితం. ముందుగా పేరు నమోదు చేసుకోవాలి. వివరాలకు.. 64091 11427 (సా. 3 గం. నుంచి 6 గం. వరకు మాత్రమే).
పతంగి రాంబాబు, సాగుబడి డెస్క్.
(చదవండి: ఢిల్లీకి.. మా ఊరి బొప్పాయి! ప్యాకింగ్ మరింత స్పెషల్!)
Comments
Please login to add a commentAdd a comment