సాక్షి, అమరావతి : పెట్టుబడి లేని వ్యవసాయం (జీరో బడ్జెట్ ప్రకృతి సాగు) ముసుగులో అప్పులు చేస్తూ రైతులకు శిక్షణలు, సదస్సులు, ఈవెంట్ల పేరుతో ప్రభుత్వ పెద్దలు భారీగా కమీషన్లు కాజేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ప్రకృతి సాగు కోసం శిక్షణలు, భోజనాలు, సామర్థ్యం పెంపు పేరుతో కేంద్రం నుంచి వివిధ పథకాల కింద అందే రూ.100 కోట్లను వ్యయం చేసినా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని వ్యవసాయ శాఖ అధికారులు పెదవి విరుస్తున్నారు.
కేంద్రం అనుమతి కోసం ప్రతిపాదనలు
రాష్ట్రంలో వచ్చే ఆరేళ్లలో పెట్టుబడి లేని ప్రకృతి సాగు కోసం రూ.16,000 కోట్లు అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అంచనా వేశారు. వివిధ సంస్థల నుంచి ఈమేరకు అప్పులు చేయనున్నారు. చంద్రబాబు గతంలో అమెరికాలో పర్యటించిన సందర్భంగా ప్రకృతి సాగు కోసం కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి అప్పు చేసేందుకు అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా తొలిదశలో రూ.2,046 కోట్ల అప్పు కోసం వ్యవసాయశాఖ ప్రతిపాదనలు పంపడంపై ఆర్థికశాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం అంటూ శిక్షణలు, సదస్సుల కోసం రూ.వేల కోట్ల అప్పులు చేయడం తగదని సూచించింది. ఈ అప్పుల వల్ల ఎలాంటి ఉత్పాదకత, సంపద సమకూరడం లేదని పేర్కొంది. ప్రాజెక్టులో దేనికి ఎంత వ్యయం చేస్తారు? ఎన్ని ఎకరాల్లో ప్రకృతి సాగు చేపడతారు? తదితర వివరాలను పేర్కొనక పోవడంపై అభ్యంతరం తెలిపింది. అసలు ఈ కార్యక్రమం అమలుకు ఏదైనా వ్యవస్థ ఉందా? లేక అదనపు పోస్టులు కావాలంటారా? అని ఆర్థిక శాఖ ప్రశ్నించింది. అయితే బ్యాంకు నుంచి అప్పు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఒత్తిడి తేవడంతో గత్యంతరం లేక తొలిదశలో రూ.2,046 కోట్ల రుణానికి అనుమతిస్తూ గత బుధవారం జీవో జారీ చేసింది. అప్పు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ప్రతిపాదనలు పంపాలని జీవోలో పేర్కొన్నారు. మొత్తం రూ.2,046 కోట్ల విలువైన ప్రాజెక్టులో కేఎఫ్‌డబ్ల్యూ రూ.1,650 కోట్లను రుణంగా ఇవ్వనుంది. రూ.85 కోట్లను గ్రాంటుగా మంజూరు చేయనుంది. మిగతా రూ. 311 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద భరించనుంది. ఈ ప్రాజెక్టు కాల వ్యవధిని 2024 వరకు ప్రతిపాదించారు.
మరి రసాయన ఎరువుల అవసరం ఏముంది?
ఏపీలో లక్షల ఎకరాల్లో జీరో బడ్జెట్‌తో ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నామని, రైతులు పెద్ద ఎత్తున ఈ పథకంలో చేరుతున్నారంటూ ప్రతిపాదనలను పంపుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎరువులు, పురుగుమందుల కోటాను తగ్గించే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యవసాయశాఖ అధికారుల్లో వ్యక్తమవుతోంది. లక్షల ఎకరాలను ప్రకృతి వ్యవసాయంలోకి మారిస్తే రసాయన ఎరువులు అవసరం ఏముందని కేంద్రం ప్రశ్నిస్తే ఏం చేయాలని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయం పేరుతో రైతులను బస్సుల్లో తరలిస్తూ శిక్షణ కింద రూ.వందల కోట్లను స్వచ్చంధ సంస్థలకు దోచి పెడుతూ కమీషన్లు కాజేస్తున్నారని వ్యవసాయ శాఖ ఉద్యోగులే వ్యాఖ్యానించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment