డిసెంబర్ నెలాఖరుకు అప్పులు మొత్తం రూ.31,000 కోట్లు
ఇప్పటికే రూ.19,000 కోట్లు అప్పు చేసిన బాబు ప్రభుత్వం
వచ్చే మూడు నెలల్లో మరో రూ.12,000 కోట్లు అప్పులు చేస్తాం
ఆర్‌బీఐకు వెల్లడించిన బాబు ప్రభుత్వం
ఆర్‌బీఐ నెలవారీ మంగళవారాల అప్పునకు క్యాలెండర్ విడుదల
సాక్షి, అమరావతి: మంగళవారం వచ్చిందంటే చంద్రబాబు సర్కారు అప్పు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా డిసెంబర్ నెలాఖరుకు చంద్రబాబు సర్కార్ అప్పులు రూ. 31,000 కోట్ల చేరుతున్నాయి. ఇప్పటికే 80 రోజుల వ్యవధిలోనే చంద్రబాబు సర్కారు రూ. 19,000 కోట్లు అప్పు చేసింది. మరో మూడు నెలల్లో అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మరో రూ.12,000 కోట్లు అప్పు చేయనున్నట్లు చంద్రబాబు సర్కారు ఆర్‌బీఐకి తెలిపింది. దీంతో ఆర్‌బీఐ నెలవారీ మంగళవారాల్లో బాబు సర్కారు చేసే అప్పుల క్యాలెండర్‌ను శుక్రవారం విడుదల చేసింది.
ఇందులో భాగంగానే వచ్చే నెల 1వ తేదీన మంగళవారం చంద్రబాబు ప్రభుత్వం మరో రూ. 3,000 కోట్లు అప్పు చేయనుందని ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ అప్పును ఆర్‌బీఐ శుక్రవారం నోటిఫై చేసింది. 14 సంవత్సరాల కాలవ్యవధిలో రూ. 1,000 కోట్లు, 20 సంవత్సరాల కాల వ్యవధిలో రూ.1,000 కోట్లు, 24 సంవత్సరాల కాలవ్యవధిలో రూ.1,000 కోట్లు అప్పు పొందనున్నట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్‌బీఐ ఈ మొత్తం రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించనుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిబంధనలు, అనుమతి మేరకు అప్పులు చేస్తే ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది.
అయితే ఇప్పుడు ప్రతీ మంగళవారం చంద్రబాబు సర్కారు అప్పులు చేస్తున్నప్పటికీ ఆ ఎల్లో మీడియా ఒక ముక్క కూడా ప్రజలకు చెప్పడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిదాకా చంద్రబాబు చేసిన అప్పులు దేనికి ఖర్చు చేశారో తెలియడంలేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇంత అప్పు చేసినా సూపర్ సిక్స్ హామీలేమీ అమలు చేయకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
80 రోజుల్లోనే రూ. 19 వేల కోట్లు అప్పు చేయడమే సంపద సృష్టించడమా అంటూ ప్రశ్నిస్తున్నారు. అప్పు చేసి తెచ్చిన నిధులు ఏ అభివృద్ధి పనులకు వెచ్చి0చారో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుతో పాటు కూటమి నేతలపై ఉందంటున్నారు. అలాగే వచ్చే మూడు నెలల్లో చేసే రూ. 12 వేల కోట్లను ఏ అభివృద్ధికి వ్యయం చేస్తారో చెప్పాల్సి కూడా ఉందంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment