
35 రోజుల్లో రూ.12 వేల కోట్ల అప్పు చేసిన చంద్రబాబు సర్కారు
మంగళవారం 7.34 శాతం వడ్డీతో రూ.3,000 కోట్ల అప్పు
సెక్యూరిటీల వేలం ద్వారా రుణాన్ని సమీకరించిన ఆర్‌బీఐ
సాక్షి, అమరావతి: అప్పులు చేయడం ద్వారా కాకుండా, సంపద సృష్టించడం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పిన చంద్రబాబు.. తీరా గద్దెనెక్కాక అందుకు విరుద్దంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం 35 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.12,000 కోట్లు అప్పు చేసింది.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అప్పు చేసిన రోజల్లా ప్రతి మంగళవారం అప్పు చేయనిదే గడవదని తప్పు పడుతూ ఎల్లో మీడియా కథనాలను రాయడం, వాటి ఆధారంగా చంద్రబాబు అండ్ కో రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేయడం తెలిసిందే. మరి ఇప్పుడు ఇదే చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కేవలం 35 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.12 వేల కోట్లు అప్పు చేసినా, మంగళవారాలు అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియా ఒక్క ముక్క కూడా రాయడం లేదు ఎందుకో అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
గత నెల 25వ తేదీన రూ.2 వేల కోట్ల అప్పుతో చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత ఈ నెల 2వ తేదీన ఒకేసారి రూ.5,000 కోట్లు అప్పు చేసింది. 16వ తేదీన మరో రూ.2,000 కోట్లు అప్పు చేసింది. తాజాగా మంగళవారం (నిన్న) సెక్యూరిటీల వేలం ద్వారా ఆర్‌బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3,000 కోట్ల రుణాన్ని సమీకరించింది. ఇందులో రూ.1,000 కోట్లు 15 సంవత్సరాల కాల వ్యవధికి, మరో రూ.1,000 కోట్లు 20 సంవత్సరాల కాల వ్యవధికి, ఇంకో రూ.1,000 కోట్లు 25 సంవత్సరాల కాల వ్యవధికి 7.34 శాతం వడ్డీతో అప్పు చేసింది. ఈ లెక్కన నెల ఐదు రోజుల్లోనే కూటమి ప్రభుత్వం రూ.12 వేల కోట్లు అప్పు చేసింది.

ఇంత అప్పు చేసినా ఒక్క పెన్షన్ పెంపు తప్ప మిగతా హామీల్లోని ఏ ఒక్కదాని అమలు ప్రారంభించలేదు. మరి ఈ అప్పులన్నీ దేనికి వ్యయం చేసినట్లో చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లో మీడియా చెప్పాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిబంధనల మేరకు పరిమితికి లోబడే అప్పులు చేసినా రాష్ట్రాన్ని శ్రీలంక చేశారంటూ.. లేని అప్పులున్నట్లు దుష్ప్రచారం చేయడం ఎల్లో మీడియా పక్షపాత ధోరణికి అద్దం పడుతోందని విమర్శిస్తున్నారు.

ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏం చెప్పారని, ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆర్థిక వేత్తలు ప్రశి్నస్తున్నారు. రూ.12 వేల కోట్లు అప్పు చేయడమే సంపద సృష్టించడంలా ఉందని ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన అప్పులను ఏ అభివృద్ధి పనులకు వెచ్చించారో చెప్పాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది.
Comments
Please login to add a commentAdd a comment