గుంటూరు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో రైతులతో మాట్లాడుతున్న వైవ్స్ నోయెల్ లెక్లెర్క్
సాక్షి, అమరావతి: ఏపీలో అమలవుతోన్న ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆదర్శంగా ఉన్నాయని, ఈ విధానంలో పండించే ఆహార ఉత్పత్తులు రుచి, నాణ్యతతో పాటు సురక్షితమైనవిగా గుర్తించామని అంతర్జాతీయ ఆహార ఉత్పత్తుల తయారీ సంస్థ మెక్‌కెయిన్ ఫుడ్స్ గ్లోబల్ డైరెక్టర్ వైవ్స్ నోయెల్ లెక్లెర్క్ చెప్పారు. 160 దేశాల్లో బంగాళదుంప ఆధారిత ఆహార ఉత్పత్తులను విక్రయిస్తూ అంతర్జాతీయంగా గుర్తింపుపొందిన ఈ సంస్థ బృందం మంగళవారం రాష్ట్రంలో పర్యటించింది. ‘ఫ్రెంచ్ ప్రైస్’ వంటి బహుళజాతి సంస్థతో అంతర్జాతీయంగా 27 శాతం మార్కెట్‌ను సొంతం చేసుకున్న ఈ సంస్థ ఏపీతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చింది.
2030 నాటికి ప్రపంచంలో తాము సేకరించే బంగాళదుంప వ్యవసాయ క్షేత్రాలన్నింటిలోను సుస్థిర వ్యవసాయ విధానాలను అమలుచేయాలనే లక్ష్యంతో ఈ సంస్థ అడుగులేస్తోంది. ఇండియాలో ఈ సంస్థతో కలిసి పనిచేస్తున్న బావిక్ కుమార్ బ్రహంభట్‌తో కలిసి నోయల్ లెక్లెర్క్ బృందం గుంటూరు జిల్లాలో నూతక్కి, కొత్తపాలెం, రేవెంద్రపాడు గ్రామాల్లో పర్యటించింది.
ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో బంగాళదుంప సాగుచేస్తున్న రైతుక్షేత్రాలతో పాటు ఇతర పంటలను బృందం సభ్యులు పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, పాటిస్తున్న యాజమాన్య పద్ధతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం గురించి ఆరా తీశారు. మల్చింగ్ (నేలను కప్పి ఉంచడం) వల్ల కలిగే ఉపయోగాలు.. తదితర అంశాలపై అధ్యయనం చేశారు. ఏపీలో అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు ఆయా దేశాల్లో అమలుచేసేలా కృషిచేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment