వాణిజ్యం.. అతలాకుతలం | Corona Effect: Huge Losses to Trade With Covid-19 | Sakshi
Sakshi News home page

వాణిజ్యం.. అతలాకుతలం

Published Sun, Apr 19 2020 3:04 AM | Last Updated on Sun, Apr 19 2020 3:53 AM

Corona Effect: Huge Losses to Trade With Covid-19 - Sakshi

కృష్ణా జిల్లా నున్నలో ధాన్యం ఆరబోస్తున్న రైతు కూలీలు

కరోనా దెబ్బకు యావత్‌ ప్రపంచం గజగజ వణికిపోతోంది. అన్ని రంగాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వ్యాపారాలన్నీ పూర్తిగా పడకేశాయి. ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. రాబడి ఆగిపోయింది. వ్యాపార, వాణిజ్య వర్గాలకు చేతులాడటం లేదు. మన రాష్ట్రంలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. వేల కోట్ల రూపాయల విలువైన సరుకు ఎక్కడికక్కడే ఉండిపోయింది.  టెక్స్‌టైల్స్, వంట నూనెలు, పండ్లు, ధాన్యం.. తదితరాలు ఎగుమతికి నోచుకోవడం లేదు. మొత్తంగా వేల కోట్ల రూపాయల నష్టం. ఒక్కమాటలో చెప్పాలంటే ఇండస్ట్రీ రంగం ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పరిస్థితి వెంటిలేటర్‌పై ఉన్నట్లే.

కరోనా ప్రభావం ఆహార రంగంపై అంచనాలకు మించి ఉంటుందని వాణిజ్య, పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎగుమతులు, దిగుమతుల మీద ప్రతికూల ప్రభావం ఉంటుందని చెబుతున్నాయి. ఎగుమతులు తగ్గడం వల్ల రాష్ట్రానికి లభించే ఆదాయం తగ్గుముఖం పడుతుందనే ఆందోళన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 29 శాతం వాటా కలిగిన వ్యవసాయ రంగం, రొయ్యల ఎగుమతితో దేశంలోనే అత్యధికంగా ఆర్జించే ఆక్వా, ఉపాధిలో కీలక పాత్ర పోషించే టెక్స్‌టైల్స్, తదితరాలు గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటున్నాయి.

ఆక్వా రంగం కుదేలే
సాక్షి, అమరావతి/ మహారాణిపేట/(విశాఖ దక్షిణ)/భీమవరం: కోవిడ్‌–19 కారణంగా ఆక్వా రంగం నెల రోజుల వ్యవధిలోనే రూ.3 వేల కోట్లకు పైగా నష్టపోయింది. గత ఏడాది రాష్ట్రం నుంచి 6.55 లక్షల మెట్రిక్‌ టన్నుల రొయ్యలు యూఎస్, చైనా, సింగపూర్, థాయ్‌లాండ్, యూరోపియన్‌ దేశాలకు ఎగుమతి అయ్యాయి. వీటి విలువ దాదాపు రూ.28,000 కోట్లు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి 15 వరకు రూ.5 వేల కోట్ల విలువైన రొయ్యలు మాత్రమే ఎగుమతి అయ్యాయి. 
► కరోనా సమస్య లేకపోయి ఉండివుంటే ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా డొమెస్టిక్‌ (ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ తదితర) నగరాలకు మరో రూ.10 వేల కోట్ల విలువైన రొయ్యలు ఎగుమతి చేయడానికి వీలుండేది.  

ప్రస్తుత పరిస్థితి
► ఎగుమతులు ప్రారంభం కావడంతో ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, కంటైనర్లు అన్ని రొయ్యలతో నిండిపోయాయి.
► రైతులంతా చెరువుల్ని పట్టి రొయ్యల్ని అమ్మివేయడంతో సాగుకు అవసరమైన సీడ్‌ లేదు.
► ఇతర దేశాల నుంచి తల్లిరొయ్య దిగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది.
► కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అథార్టీ గుర్తించిన తల్లి రొయ్య దిగుమతికే అనుమతి ఇవ్వాలి.
► కంటైనర్లలో పేరుకుపోయిన రొయ్యల్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎగుమతిదారులు కోరుతున్నారు. దీంతో కంటైనర్లు ఖాళీ అవుతాయని, మళ్లీ రైతుల నుంచి రొయ్యల్ని కొనుగోలు చేయవచ్చని ఎగుమతిదారులు కోరుతున్నారు. 
► రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో ఎగుమతిదారులు రొయ్యలు కొనుగోలు చేసి విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నంలలో 10,944 మెట్రిక్‌ టన్నులు ఎగుమతికి సిద్ధం చేశారు.
► పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో రొయ్యలు, చేపల సాగు చేస్తున్నారు. రొయ్యలను చైనా, అమెరికా, యూరప్‌ దేశాలకు ఎగుమతి చేస్తుండగా చేపలను బిహార్, ఢిల్లీ, ఒడిశా, పశ్చిమబెంగాల్, అస్సాం, మిజోరాం, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ రాష్ట్రాలకు ఎగుమతి చేసేవారు. అమెరికాకు ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చొరవతో చైనా దేశానికి 30 శాతం వరకు ఎగుమతులు జరుగుతున్నాయి. అమెరికా, యూరప్‌ దేశాల నుంచి ఆర్డర్లే లేవు.

నిలిచిన సముద్రపు రొయ్యల ఎగుమతులు 
► వియత్నాం, సింగపూర్, జపాన్, ఇటలీ, ఇతర దేశాలకు విశాఖ నుంచి టన్నుల కొద్దీ రొయ్యలు ఎగుమతులు జరుగుతుండేవి. కరోనా, లాక్‌డౌన్‌ వల్ల 25 రోజులుగా ఎగుమతులు ఆగిపోయాయి. 

► సముద్రం ద్వారా టైగర్, బ్రౌన్, వైట్, సింకు, ప్లవర్‌ రొయ్యలు సేకరణ జరిగేది. టైగర్, బ్రౌన్, వైట్‌ రొయ్యలు ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అయ్యేవి. మరబోట్లు, ట్రాలర్ల ద్వారా రోజుకు 20 నుంచి 30 టన్నుల రొయ్యలు సేకరించేవారు. ప్లవర్, సింకు రొయ్యలు స్థానికంగా విక్రయించే వారు.  

వరి, ఉద్యాన ఉత్పత్తులకు పెద్ద దెబ్బ
స్థూల ఉత్పత్తిలో వ్యవసాయం  వాటా 29 శాతం
కరోనా అనంతరం తగ్గనున్న వరి ఎగుమతులు
ఆహార ద్రవ్యోల్బణం పొంచి ఉందంటున్న నిపుణులు

సాగులో ఉపయోగించే రసాయన ఎరువులు, ముడిసరుకులు, వ్యవసాయ ఆధారిత యంత్ర పరికరాలు దిగుమతి చేసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఫలితంగా ధరలు పెరిగి ఆ భారం రాష్ట్రం మీద పడుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఏపీ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వ్యవసాయం వాటా 29 శాతం. రాష్ట్ర జీవీఏ (గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌) విలువ 2018–19లో 6,14,665 కోట్ల రూపాయలైతే అందులో వ్యవసాయం, అనుబంధ రంగాల నుంచి రూ.1,81,074 కోట్లు వచ్చింది. (అంటే 29 శాతం). 

► ప్రధాన ఎగుమతుల్లో వరి అగ్రస్థానంలో ఉండగా ఉద్యాన ఉత్పత్తులు ద్వితీయ స్థానంలో ఉన్నాయి. 2018–19లో రూ.7,324 కోట్ల విలువైన 29,22,019 టన్నుల బియ్యం రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాలకు ఎగుమతి అయ్యాయి. జనవరి నుంచి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలతో కేవలం 3.5 లక్షల టన్నులు మాత్రమే ఎగుమతయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో ఇట్టే అర్థమవుతోంది. 

సరిహద్దులు దాటని పండ్లు, కూరగాయలు
► 2018–19లో రాష్ట్రం నుంచి వివిధ దేశాలకు 5 టన్నుల బొప్పాయి, 75 టన్నుల దానిమ్మ, 16,500 టన్నుల అరటి, 1,471 టన్నుల మామిడి, 50 టన్నుల ఉల్లి, 1,41,000 టన్నుల మిర్చి, 3,200 టన్నుల పూలు ఎగుమతి అయ్యాయి. ఎఫ్‌పీవోల ద్వారా పెద్ద ఎత్తున కోకో, ఆయిల్‌ పామ్, జాజికాయ, దాల్చిన చెక్క కూడా ఎగుమతి అయ్యాయి. గత మూడు నెలలుగా పరిస్థితి పూర్తి ఆందోళనకరంగా మారింది. 
► భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్న కూరగాయల ఉత్పత్తుల్లో ఏపీ వాటా 7.8 శాతం. రాష్ట్రం నుంచి గత మామిడి సీజన్‌లో 3 వేల టన్నులు న్యూజిలాండ్, జపాన్, దక్షిణ కొరియా, బ్రూనే, చైనా, సింగపూర్, కెనడా, జర్మనీ, ఇంగ్లండ్, అమెరికా, సౌదీ అరేబియా తదితర దేశాలకు ఎగుమతి అయ్యాయి. ఈ ఏడాది పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. 
► రాష్ట్రం నుంచి రూ.17.5 కోట్ల పొగాకు ఉత్పత్తులు, 1.50 లక్షల టన్నుల మిర్చి, పత్తి కూడా ఎగుమతి అయ్యేది.

ఆయిల్‌ రిఫైనరీలకూ ఎఫెక్ట్‌
విదేశాల నుంచి ముడి సరుకు దిగుమతికి బ్రేక్‌
భయంతో కార్మికులు రాకపోవడంతో సగానికి సగం మూత
ఒక్క నెలలోనే.. ఒక్క జిల్లాలోనే రూ.33.45 కోట్ల నష్టం
రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఇటీవలే ఊపందుకున్న పనులు

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం : దేశంలోనే పలు రాష్ట్రాలకు వంటనూనెలను (ఎడిబుల్‌ ఆయిల్‌) అందించే పరిశ్రమలు లాక్‌డౌన్‌తో కుదేలయ్యాయి. విదేశాల నుంచి ముడినూనెలు దిగుమతి చేసుకుని శుద్ధి చేసి, ప్యాకింగ్‌ చేయలేక చేతులెత్తేసి తాళాలు వేసేశారు. కరోనా లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి సుమారు 20 రోజులు ఉత్పత్తి నిలిచిపోయి తీవ్రంగా నష్టపోయారు. కార్మికులు రాకపోవడం, విదేశీ దిగుమతులకు బ్రేక్‌ పడి, ఉత్పత్తి నిలిచిపోవడంతో పరిశ్రమలు ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ తీరాన్ని ఆనుకుని వాకలపూడి, సూర్యారావుపేట, కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాల్లో తొమ్మిది ఎడిబుల్‌ ఆయిల్‌ పరిశ్రమలున్నాయి. 

► సంతోషిమాత ఎడిబుల్‌ ఆయిల్‌ రిఫైనరీ, కాళేశ్వరి రిఫైనరీ అండ్‌ ఇండస్ట్రీ, లోహియా ఎడిబుల్‌ ఆయిల్స్, అగర్వాల్‌ ఇండస్ట్రీస్, భగవతి ఫాట్స్‌ అండ్‌ ఎడిబుల్‌ ఆయిల్స్, జెమినీ ఎడిబుల్‌ అండ్‌ ఫాట్స్‌ ఇండియా (సూర్యారావుపేట), అదానీ విల్‌మర్, జెమినీ ఎడిబుల్‌ అండ్‌ ఫాట్స్‌ (వాకలపూడి), రుచి సోయా ఎడిబుల్‌ ఆయిల్‌ పరిశ్రమలు 
► విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ను ఈ పరిశ్రమల్లో శుద్ధి చేసి ప్యాకింగ్‌ చేస్తారు. మన రాష్ట్ర అవసరాలను తీర్చడంతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాలకు ట్యాంకర్ల ద్వారా ఎగుమతి చేసేవారు. 

ప్రతి నెలా 1.30 లక్షల టన్నులు దిగుమతి
► ఈ పరిశ్రమలకు ముడి సరుకు (ముడి నూనెలు)ను విదేశాల నుంచి కాకినాడ పోర్టు ద్వారా దిగుమతి చేసుకుంటారు. ప్రధానంగా మలేషియా, ఇండోనేషియా నుంచి పామాయిల్‌ ముడి నూనె.. రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ దిగుమతి చేసుకుంటున్నారు. మామూలు రోజుల్లో ఈ కర్మాగారాలు విదేశాల నుంచి నెలకు లక్షా 30 వేల టన్నులు, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి మరో 10 టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకుంటాయి.
► ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఆయా దేశాల నుంచి దిగుమతి నిలిచిపోయింది. ఉన్న కొద్దిపాటి నిల్వలను శుద్ధి చేసి, ఇతర రాష్ట్రాలకు రవాణా చేద్దామన్నా కరోనా భయం, లాక్‌డౌన్‌ కారణంగా ఈ ఫ్యాక్టరీల్లో పని చేసే 3 వేల మంది కార్మికులు పనులకు రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అనివార్యంగా రిఫైనరీల్లో ఉత్పత్తి నిలిపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 
► ఈ పరిశ్రమల ద్వారా మామూలుగా రోజుకు 4,820 టన్నుల ఆయిల్‌ ఉత్పత్తి జరుగుతుంది. నెలకు 1,44,600 టన్నుల వంట నూనెలు ఉత్పత్తి చేయాల్సి ఉంది. కరోనా కారణంగా ప్రస్తుతం లక్ష టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని అంచనా. 
► నెల రోజులుగా ఉత్పత్తి నిలిచిపోవడంతో సుమారు రూ.33.45 కోట్ల మేర ఈ ఫ్యాక్టరీలు నష్టపోయాయి. ఈ పరిస్థితుల్లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కార్మికులు భౌతిక దూరం పాటిస్తూ, పనులకు హాజరయ్యేలా అవగాహన కల్పించడం ద్వారా ఉత్పత్తిని పెంచి, రవాణాను పునరుద్ధరించారు. 

టెక్స్‌టైల్స్‌ పరిశ్రమకు గడ్డు రోజులు
► కోవిడ్‌–19 వైరస్‌ అరికట్టడానికి ప్రవేశపెట్టిన లాక్‌డౌన్‌ టెక్స్‌టైల్‌ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. రాష్ట్రంలో టెక్స్‌టైల్‌ పరిశ్రమ పూర్తిగా మూత పడింది. 
► టెక్స్‌టైల్‌ పరిశ్రమకు అవసరమైన ముడి వస్తువు పత్తి, దాని నుంచి తయారయ్యే దారం కొనుగోలు ఆగిపోయింది. రాష్ట్ర టెక్స్‌టైల్‌ పరిశ్రమ టర్నోవర్‌ సుమారు రూ.10,000 కోట్లు ఉండగా, ఇందులో 5,000 కోట్ల వరకు విదేశాలకు ఎగుమతి అవుతుంది. 
► లాక్‌డౌన్‌ ప్రభావంతో ఈ ఏడాది టెక్స్‌టైల్‌ పరిశ్రమ వ్యాపారం రూ.5,000 కోట్లకు పడిపోయే అవకాశం ఉందని ఏపీ టెక్స్‌టైల్‌ మిల్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ లంకా రఘురామి రెడ్డి తెలిపారు.  
► టెక్స్‌టైల్‌ పరిశ్రమల నుంచి దారం కొనుగోలు చేసి వస్త్రాలను తయారు చేసే గార్మెంట్‌ సంస్థలు అమెరికా, యూరోప్‌ దేశాలకు ఎగుమతి చేస్తుంటాయి. ఆయా దేశాలు ఆరు నెలల పాటు కొనుగోళ్ల ఆర్డర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. 

భవిష్యత్‌ గందరగోళమే..
► లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కూడా రాష్ట్రంలో టెక్స్‌టైల్‌ పరిశ్రమ పూర్తి స్థాయిలో పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. 25,000 స్పిండిల్స్‌(పెద్ద సైజు దారపు కండెలు) సామర్థ్యం ఉన్న ప్రతి టెక్స్‌టైల్‌ పరిశ్రమ నెలకు రూ.2.5 కోట్లు నష్టపోతుంది.
► ప్రస్తుతం ఈ పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. వీరిలో ఒరిస్సా, బీహార్‌ వంటి రాష్ట్రాలకు చెందిన వారే అధికం. 
► లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత వీళ్లలో ఎంత మంది తిరిగి పనులకు వస్తారో తెలియని పరిస్థితి. మరో పక్క కరోనా ప్రభావంతో మాల్స్‌లో అమ్మకాలు భారీగా తగ్గే అవకాశం ఉండటంతో దేశీయంగా కూడా డిమాండ్‌ పడిపోయే పరిస్థితి ఉంది.
► ప్రస్తుతం పత్తిని మహారాష్ట్ర, తెలంగాణా రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తూ.. తయారైన దారాన్ని మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలకు అత్యధికంగా ఎగుమతి చేస్తున్నాం. ప్రస్తుతం ఈ ఎగుమతులన్నీ ఆగిపోయాయి.  

కరోనా అనంతరం ఏమి జరగవచ్చంటే.. 
► వ్యవసాయ రంగంలో ప్రధానంగా వినియోగించే ఉత్పాదకాల ధరలు పెరగవచ్చు. ఇప్పటికే ఎరువుల ధరలు పెరిగాయి. ఆర్థిక మాంధ్యం కారణంగా యంత్ర పరికరాలు, ఇంధన ఉత్పత్తుల ధరలు పెరగవచ్చునని, ఆహార ధాన్యాల గిరాకీ, సరఫరా మధ్య సమతూకం దెబ్బతినవచ్చని వ్యవసాయ రంగ నిపుణుల అంచనా. 
► ఎగుమతుల్లో ప్రధానంగా వరి దెబ్బ తింటుంది. భారత్‌ నుంచి ఎక్కువగా అంటే 22 శాతం మేర బియ్యాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో ఇరాన్‌ ఒకటి. ఇప్పుడు ఆ దేశం కరోనాతో అల్లకల్లోలమైంది. సముద్రయానం పూర్తిగా నిలిచింది.  
► యూఏఇ, యెమెన్, సెనెగల్, సౌదీ అరేబియా లాంటి మిడిల్‌ ఈస్ట్‌ దేశాలు, పశ్చిమాఫ్రికా దేశాల నుంచి కూడా ఆశించిన మేర ఆర్డర్లు ఉండకపోవచ్చని, ఆ దేశాల్లోని ఆర్థిక పరిస్థితి దెబ్బతినడమే ఇందుకు కారణం అని చెబుతున్నారు. 

రాష్ట్రం నుంచి మామిడి, జీడిమామిడి, పసుపు, సుగంధ ద్రవ్యాలు, మిర్చి, కోకో, మిరియాలు, పైనాపిల్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. వ్యవసాయ రంగం నుంచే వచ్చే ఆదాయంలో సుమారు 30 శాతం ఉద్యాన పంటల నుంచి వస్తున్నది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement