పర్మాకల్చర్ పెరటి తోటలో లక్ష్మి
‘మనిషి చెయ్యి పెడితేనే మొక్కలకు నష్టం జరుగుతుంది. మొక్కలు మనిషి జోక్యాన్ని ఆశించవు. వాటి నైజం బతకటమే కదా. నేను చేసేదేమి ఉంది? ఇది నా అనుభవం..’ అంటున్నారు సీనియర్ అర్బన్ పర్మాకల్చర్ నిపుణురాలు నాదెండ్ల లక్ష్మి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు పదిలో స్వగృహంలో నివాసం ఉంటున్న ఆమె గత ఐదేళ్లుగా అర్బన్ పర్మాకల్చర్ పద్ధతుల్లో పెరటి తోటను స్వతంత్రంగా పెరిగేలా తీర్చిదిద్దారు. ఆ పెరటి తోటలో మొలిచే చాలా రకాల వార్షిక పంటలు ప్రతి ఏటా విత్తనాలు వేయకుండానే మొలిచి మంచి దిగుబడులను ఇస్తున్నాయి! తన పెరటి తోటలో గత మూడేళ్లుగా ఎటువంటి విత్తనాలనూ పనిగట్టుకొని వేయలేదని, అంతకుముందు వరుసగా రెండేళ్లు నాటిన మొక్కలు, వేసిన విత్తనాలే ప్రతి ఏటా వాటంతట అవే మొలకెత్తి, సంతృప్తికరమైన ఫలసాయాన్ని అందిస్తున్నాయని లక్ష్మి వివరించారు.
విత్తిన మొదటి ఏడాది పంట తీసుకోరు!
ఆమె గార్డెన్‌లో ప్రస్తుతం అనేక కుండీల్లో వంగ మొక్కలున్నాయి. అయితే, ఆమె తన పెరటి తోటలో ఐదేళ్ల క్రితం వంగ విత్తనాలేశారు. ఆమె పెట్టుకున్న నియమం ఏమిటంటే.. ఏ రకం విత్తనాలైతే కొత్తగా తెచ్చి పెరటి తోటలో చేర్చుతారో ఆ మొక్కల కాయలను తొలి ఏడాది ముట్టుకోరు. అవే పెరిగి, పండి రాలిపోయి భూమిలో కలిసిపోతాయి. అనుకూలమైన వాతావరణం ఏర్పడినప్పుడు ఆ విత్తనాలు మళ్లీ మొలకెత్తి, ఫలసాయాన్ని అందిస్తాయి. ప్రతి ఏటా కొన్ని కాయలను విత్తనాలకు వదిలేస్తారు. వాటిని పనిగట్టుకొని దాచిపెట్టి విత్తటం ఉండదు. అవే మట్టిలో కలిసిపోయి.. తిరిగి మొలకెత్తుతూ ఉంటాయి. ఉదాహరణకు.. ఇప్పుడు కొన్ని కుండీల్లో వంగ మొక్కలున్నాయి.
సుమారు 5 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న పెరట్లో కొన్ని సిమెంటు రింగ్‌లు, కొన్ని పెద్ద కుండీలు ఉన్నాయి. చాలా మొక్కలు నేలపైనే పెరుగుతున్నాయి. విత్తనాలు పడి మట్టిలో ఉండి వాటంతటవే తిరిగి మొలుస్తుంటాయి. మొలిచిన మొక్కలకు పరిమితంగా ఆలనాపాలనా చేయడమే తప్ప పెద్దగా చేయాల్సిందేమీ లేదని లక్ష్మి అంటున్నారు. సీజన్‌లో వంగ మొక్కలు అక్కడక్కడా మొలుస్తాయి. మొలిచిన మొక్కను తీసి కుండీల్లోకి చేర్చుతారు.. ఏడాది పొడవునా రాలిన ఆకులతో లీఫ్ కంపోస్టు తయారు చేసి, ఎప్పటికప్పుడు మొక్కలకు వేస్తూ ఉంటారు. తగుమాత్రంగా నీరందిస్తారు. అంతే.. ఇక వాటంతట అవే పెరుగుతూ దిగుబడినిస్తాయి. వంగ, టమాటా మొక్కలను మాత్రమే పీకి కుండీల్లో నాటుతారు. మిగతా కూరగాయలు, ఆకుకూరలు, బొప్పాయి వంటి పండ్ల మొక్కలు ఎక్కడ మొలిస్తే అక్కడే పెరిగి ఫలసాయాన్నిస్తుంటాయని లక్ష్మి వివరించారు. అందుకే తనది ప్రయాస పడి సాగు చేయని (డూ నథింగ్) పెరటి తోట అంటారామె.
భూసారం.. జీవవైవిధ్యం..
భూమిలో వానపాములు, సూక్ష్మజీవరాశి పుష్కలంగా పెరిగేలా సారవంతం చేయడం.. ఆకులు అలములతో ఆచ్ఛాదన కల్పించడం.. వీలైనన్ని ఎక్కువ రకాల (బహువార్షిక, ఏక వార్షిక, స్వల్పకాలిక) పంటల జాతులను కిచెన్ గార్డెన్‌లోకి చేర్చితే చాలు.. అదేపనిగా ప్రతిరోజూ పనిగట్టుకొని పెద్దగా ప్రయాస పడి మొక్కల పనుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని లక్ష్మి చెబుతున్నారు. 2013లో అర్బన్ పర్మాకల్చర్ వర్క్‌షాపును తన ఇంట్లోనే నిర్వహించానని, అప్పటి నుంచి శాశ్వత వ్యవసాయ సూత్రాలను ప్రయాస లేకుండా తు.చ. తప్పకుండా అనుసరిస్తున్నానన్నారు. ఆమె పెరటి తోటలో బొప్పాయి, ప్యాషన్ ఫ్రూట్, దొండ, పొట్ల, అలసంద, 3 రకాల చిక్కుళ్లు, పచ్చిమిర్చి, క్యాప్సికం, వంగ, టమాటాతోపాటు తోటకూర, పాలకూర, మెంతికూర, 3 రకాల బచ్చలికూర మొక్కలున్నాయి. మునగచెట్టు పూలు, పిందెలతో కనువిందు చేస్తుంది. అవకాడొ వంటి అరుదైన పండ్ల మొక్కలూ ఉన్నాయి.
తన పెరట్లో ఎందుకనో గాని దేశవాళీ బొప్పాయి మొక్కలు విత్తనాలు వేయకపోయినా రెండేళ్లకోసారి మాత్రమే పుట్టి పెరిగి పండ్లనిస్తున్నాయని లక్ష్మి తెలిపారు. మగ చెట్టును ఒకదాన్ని ఉంచి మిగతావి తీసేస్తానన్నారు. గుత్తిగా పూలు వస్తే అది మగ చెట్టని, పిందెతో కూడిన పూవు ఒకటే వస్తే అది ఆడ చెట్టని గుర్తించాలన్నారు. ఐదారేళ్ల క్రితం వంగ విత్తనాలు వేసి పెంచానని, తర్వాత విత్తనం వేయలేదని, ప్రతి ఏటా గార్డెన్‌లో అక్కడక్కడా మొలిచిన వంగ మొక్కలను పీకి కుండీల్లో నాటుతానన్నారు. దేశవాళీ టమాటా రకాల విత్తనాలు కొన్ని సంవత్సరాల క్రితం వేశానని, తర్వాత నుంచి వాటికవే మొలుస్తుంటాయని, మొక్కలను తీసి కుండీల్లో నాటి, లీఫ్ కంపోస్టు, నీరు తగినంత అందించడమే తాను చేస్తున్నానన్నారు. రెండు టమాటా మొక్కలుంటే చాలు తమ నలుగురికీ సరిపోయే అన్ని కాయలు కాస్తాయన్నారు. చలికాలంలో 70% తమ కుటుంబానికి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తమ ఇంట్లో పండినవే సరిపోతాయని, వేసవిలో పూర్తిగా మార్కెట్‌లోనే కొంటామని లక్ష్మి(laxmi_nad@yahoo. com) తెలిపారు.
బొప్పాయి మగ పూలు, బొప్పాయి ఆడ పువ్వు, కాప్సికం, ప్యాషన్ ఫ్రూట్
మునగ వైభవం, చిక్కుడు పాదు, వాటికవే మొలిచినవి, తేనెతుట్టె
Comments
Please login to add a commentAdd a comment