Backyard garden
-
ప్రయాస లేని ఇంటిపంటలు!
‘మనిషి చెయ్యి పెడితేనే మొక్కలకు నష్టం జరుగుతుంది. మొక్కలు మనిషి జోక్యాన్ని ఆశించవు. వాటి నైజం బతకటమే కదా. నేను చేసేదేమి ఉంది? ఇది నా అనుభవం..’ అంటున్నారు సీనియర్ అర్బన్ పర్మాకల్చర్ నిపుణురాలు నాదెండ్ల లక్ష్మి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు పదిలో స్వగృహంలో నివాసం ఉంటున్న ఆమె గత ఐదేళ్లుగా అర్బన్ పర్మాకల్చర్ పద్ధతుల్లో పెరటి తోటను స్వతంత్రంగా పెరిగేలా తీర్చిదిద్దారు. ఆ పెరటి తోటలో మొలిచే చాలా రకాల వార్షిక పంటలు ప్రతి ఏటా విత్తనాలు వేయకుండానే మొలిచి మంచి దిగుబడులను ఇస్తున్నాయి! తన పెరటి తోటలో గత మూడేళ్లుగా ఎటువంటి విత్తనాలనూ పనిగట్టుకొని వేయలేదని, అంతకుముందు వరుసగా రెండేళ్లు నాటిన మొక్కలు, వేసిన విత్తనాలే ప్రతి ఏటా వాటంతట అవే మొలకెత్తి, సంతృప్తికరమైన ఫలసాయాన్ని అందిస్తున్నాయని లక్ష్మి వివరించారు. విత్తిన మొదటి ఏడాది పంట తీసుకోరు! ఆమె గార్డెన్లో ప్రస్తుతం అనేక కుండీల్లో వంగ మొక్కలున్నాయి. అయితే, ఆమె తన పెరటి తోటలో ఐదేళ్ల క్రితం వంగ విత్తనాలేశారు. ఆమె పెట్టుకున్న నియమం ఏమిటంటే.. ఏ రకం విత్తనాలైతే కొత్తగా తెచ్చి పెరటి తోటలో చేర్చుతారో ఆ మొక్కల కాయలను తొలి ఏడాది ముట్టుకోరు. అవే పెరిగి, పండి రాలిపోయి భూమిలో కలిసిపోతాయి. అనుకూలమైన వాతావరణం ఏర్పడినప్పుడు ఆ విత్తనాలు మళ్లీ మొలకెత్తి, ఫలసాయాన్ని అందిస్తాయి. ప్రతి ఏటా కొన్ని కాయలను విత్తనాలకు వదిలేస్తారు. వాటిని పనిగట్టుకొని దాచిపెట్టి విత్తటం ఉండదు. అవే మట్టిలో కలిసిపోయి.. తిరిగి మొలకెత్తుతూ ఉంటాయి. ఉదాహరణకు.. ఇప్పుడు కొన్ని కుండీల్లో వంగ మొక్కలున్నాయి. సుమారు 5 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న పెరట్లో కొన్ని సిమెంటు రింగ్‌లు, కొన్ని పెద్ద కుండీలు ఉన్నాయి. చాలా మొక్కలు నేలపైనే పెరుగుతున్నాయి. విత్తనాలు పడి మట్టిలో ఉండి వాటంతటవే తిరిగి మొలుస్తుంటాయి. మొలిచిన మొక్కలకు పరిమితంగా ఆలనాపాలనా చేయడమే తప్ప పెద్దగా చేయాల్సిందేమీ లేదని లక్ష్మి అంటున్నారు. సీజన్లో వంగ మొక్కలు అక్కడక్కడా మొలుస్తాయి. మొలిచిన మొక్కను తీసి కుండీల్లోకి చేర్చుతారు.. ఏడాది పొడవునా రాలిన ఆకులతో లీఫ్ కంపోస్టు తయారు చేసి, ఎప్పటికప్పుడు మొక్కలకు వేస్తూ ఉంటారు. తగుమాత్రంగా నీరందిస్తారు. అంతే.. ఇక వాటంతట అవే పెరుగుతూ దిగుబడినిస్తాయి. వంగ, టమాటా మొక్కలను మాత్రమే పీకి కుండీల్లో నాటుతారు. మిగతా కూరగాయలు, ఆకుకూరలు, బొప్పాయి వంటి పండ్ల మొక్కలు ఎక్కడ మొలిస్తే అక్కడే పెరిగి ఫలసాయాన్నిస్తుంటాయని లక్ష్మి వివరించారు. అందుకే తనది ప్రయాస పడి సాగు చేయని (డూ నథింగ్) పెరటి తోట అంటారామె. భూసారం.. జీవవైవిధ్యం.. భూమిలో వానపాములు, సూక్ష్మజీవరాశి పుష్కలంగా పెరిగేలా సారవంతం చేయడం.. ఆకులు అలములతో ఆచ్ఛాదన కల్పించడం.. వీలైనన్ని ఎక్కువ రకాల (బహువార్షిక, ఏక వార్షిక, స్వల్పకాలిక) పంటల జాతులను కిచెన్ గార్డెన్‌లోకి చేర్చితే చాలు.. అదేపనిగా ప్రతిరోజూ పనిగట్టుకొని పెద్దగా ప్రయాస పడి మొక్కల పనుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని లక్ష్మి చెబుతున్నారు. 2013లో అర్బన్ పర్మాకల్చర్ వర్క్‌షాపును తన ఇంట్లోనే నిర్వహించానని, అప్పటి నుంచి శాశ్వత వ్యవసాయ సూత్రాలను ప్రయాస లేకుండా తు.చ. తప్పకుండా అనుసరిస్తున్నానన్నారు. ఆమె పెరటి తోటలో బొప్పాయి, ప్యాషన్ ఫ్రూట్, దొండ, పొట్ల, అలసంద, 3 రకాల చిక్కుళ్లు, పచ్చిమిర్చి, క్యాప్సికం, వంగ, టమాటాతోపాటు తోటకూర, పాలకూర, మెంతికూర, 3 రకాల బచ్చలికూర మొక్కలున్నాయి. మునగచెట్టు పూలు, పిందెలతో కనువిందు చేస్తుంది. అవకాడొ వంటి అరుదైన పండ్ల మొక్కలూ ఉన్నాయి. తన పెరట్లో ఎందుకనో గాని దేశవాళీ బొప్పాయి మొక్కలు విత్తనాలు వేయకపోయినా రెండేళ్లకోసారి మాత్రమే పుట్టి పెరిగి పండ్లనిస్తున్నాయని లక్ష్మి తెలిపారు. మగ చెట్టును ఒకదాన్ని ఉంచి మిగతావి తీసేస్తానన్నారు. గుత్తిగా పూలు వస్తే అది మగ చెట్టని, పిందెతో కూడిన పూవు ఒకటే వస్తే అది ఆడ చెట్టని గుర్తించాలన్నారు. ఐదారేళ్ల క్రితం వంగ విత్తనాలు వేసి పెంచానని, తర్వాత విత్తనం వేయలేదని, ప్రతి ఏటా గార్డెన్లో అక్కడక్కడా మొలిచిన వంగ మొక్కలను పీకి కుండీల్లో నాటుతానన్నారు. దేశవాళీ టమాటా రకాల విత్తనాలు కొన్ని సంవత్సరాల క్రితం వేశానని, తర్వాత నుంచి వాటికవే మొలుస్తుంటాయని, మొక్కలను తీసి కుండీల్లో నాటి, లీఫ్ కంపోస్టు, నీరు తగినంత అందించడమే తాను చేస్తున్నానన్నారు. రెండు టమాటా మొక్కలుంటే చాలు తమ నలుగురికీ సరిపోయే అన్ని కాయలు కాస్తాయన్నారు. చలికాలంలో 70% తమ కుటుంబానికి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తమ ఇంట్లో పండినవే సరిపోతాయని, వేసవిలో పూర్తిగా మార్కెట్లోనే కొంటామని లక్ష్మి(laxmi_nad@yahoo. com) తెలిపారు. బొప్పాయి మగ పూలు, బొప్పాయి ఆడ పువ్వు, కాప్సికం, ప్యాషన్ ఫ్రూట్ మునగ వైభవం, చిక్కుడు పాదు, వాటికవే మొలిచినవి, తేనెతుట్టె -
ఫేస్బుక్ చూసి ఇంటిపంటల సాగు!
బాల్యంలో చేసిన పనులు ఎప్పటికీ మదిలో నిలిచి ఉంటాయి. అటువంటి జాబితాలో ఇంటిపంటల సంగతి కూడా ఒకటి. అమ్మతో కలిసి తన బాల్యంలో పెరటి తోటలు సాగు చేసిన అనుభవం కొలను పద్మావతి గారిని మేడపై ఇంటిపంటల సాగుకు పురికొల్పాయి. సికింద్రాబాద్ నేరేడ్మెట్ కృప కాంప్లెక్స్ ప్రాంతంలో సొంత ఇంట్లో నివాసం ఉంటున్న ఆమె.. రైల్వే హిందీ అధికారిగా ఉద్యోగ విరమణ చేశారు. సేంద్రియ ఇంటిపంటల మీద ఆసక్తి ఉన్నప్పటికీ చాలా కాలం అడుగు ముందుకు పడలేదు.ఫేస్బుక్లో తమిళనాడు టెర్రస్ గార్డెన్ గ్రూపు తారసపడడంతో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇంటిపంటల నిపుణులు కర్రి రాంబాబు, తుమ్మేటి రఘోత్తమరెడ్డి మాట సాయంతో ఆమె రెండేళ్ల క్రితం నుంచి ఇంటిపంటలను సాగు చేసుకుంటున్నారు. వేదభవన్ గోశాల నుంచి ఆవు పేడ తెచ్చుకొని చెరువు మట్టి, కొబ్బరిపొట్టును కలిపి.. సిమెంటు కుండీలు, ప్లాస్టిక్/సిల్పాలిన్ కవర్లు/బెడ్స్‌లో వంగ, టమాటా తదితర కూరగాయలు, ఆకుకూరలు, పూలు సాగు చేస్తున్నారు. నేలలో వేసిన సొర పాదును గతంలో మేడ మీద పందిరిపైకి పాకిస్తే.. 40 వరకు సొరకాయలు కాశాయని పద్మావతి(99898 39950) సంతోషంగా చెప్పారు. టమాటా మొక్క, ఆకుకూరలు -
పచ్చని పెరటి తోట!
- స్ఫూర్తిదాయకంగా విశ్రాంత ఉపాధ్యాయుడి కుటుంబం ఇంటిపంటల సాగు - ఎర పంటల సాగుతో చీడపీడలు దూరం ఇంటి పంట: రసాయనిక అవశేషాల్లేని స్వచ్ఛమైన ఆహారం కోసం జరిగే ఒక ప్రయత్నం కచ్చితంగా మరెందరిలోనో స్ఫూర్తిని రగిలిస్తుంది. గుంటూరులోని సంపత్‌నగర్‌కు చెందిన బసవరాజు జయశంకర్(60) పెరటి తోట ఇందుకు సజీవ నిదర్శనమైంది. తన ఇంటి వెనుక 7 సెంట్ల స్థలంలో ఈ ఏడాది జూన్ నుంచి జీవామృతం, ఘనజీవామృతం వాడుతూ ఆరోగ్యదాయకంగా ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. విశ్రాంత ఉపాధ్యాయుడు, నంది అవార్డు గ్రహీత అయిన నాటక కళాకారుడు అయిన జయశంకర్(98857 90942) విశ్రాంత వ్యవసాయ విస్తరణాధికారి ఎస్ఎస్ఎన్ మూర్తి తోడ్పా టుతో పెరటి తోట సాగును ప్రారంభించారు. మట్టి తోలించి ఎత్తు మడులు చేశారు. తోటకూర, పాలకూర, గోంగూర, మెంతికూర, వంగ, బెండ, బీర, కాకర, సొర, పొట్ల, మునగ, సోయాచిక్కుళ్లు సాగు చేస్తున్నారు. పెరటి తోట చుట్టూ జొన్న, సజ్జ, ఆముదం, పత్తి మొక్కలు వేసి పంటలకు చీడపీడల బెడద రాకుండా కాపాడుకుంటున్నారు. గత కొద్ది నెలలుగా టమాటా తప్ప మార్కెట్‌కెళ్లి కూరగాయలు, ఆకుకూరలు కొనాల్సిన అవసరం రాలేదన్నారాయన. ఆకుకూరలు, కూరగాయలను ఇతరులకూ పంచిపెడుతున్నామన్నారు. దగ్గర్లోని ఆలయం వద్ద నుంచి తెచ్చిన ఆవు పేడ, మూత్రంతో జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసుకొని వాడుతున్నామన్నారు. ఇతర ఎరువులు, పురుగు మందులు వాడకుండా స్వచ్ఛంగా పండిస్తున్నందున రుచికరమైన కూరగాయలు అందివస్తున్నాయన్నారు. రోజూ పది మందైనా తమ పెరటి తోటను చూసి, వివరాలు తెలుసుకొని వెళ్తున్నారని, వారిలో కొందరు ఇంటిపంటల సాగు ప్రారంభిస్తున్నారని జయశంకర్ తెలిపారు. పెరటి తోటను సందర్శించి ముగ్ధులైన జిల్లా ఉద్యాన శాఖ అధికారులు విత్తనాల ప్యాకెట్లను 90% రాయితీపై అందించారు. దీంతో ఇరుగు పొరుగు వారు సైతం ఇంటిపంటల సాగును ప్రారంభించడం విశేషం. ఇప్పుడు వేసుకోదగిన ఇంటపంటలేవి? శీతాకాలం ప్రారంభమవుతున్నది. ఈ కాలంలో ఎటువంటి ఇంటిపంటలు విత్తుకోవచ్చు లేదా నాటుకోవచ్చు? సుస్థిర వ్యవసాయ కేంద్రం (తార్నాక, సికింద్రాబాద్. ఫోన్: 040- 65268303) శాస్త్రవేత్తలు ఇలా సూచిస్తున్నారు. అక్టోబర్ నెలలో కుండీలు, మడుల్లో సాగు ఆరంభించదగిన ఇంటిపంటలు ఇవి: క్యాబేజ్, క్యాలీఫ్లవర్, క్యాప్సికం, వంగ, టమాట, ఉల్లి, బంగాళ దుంపలు, బీన్స్, ముల్లంగి, బఠాణీ, దోస, అన్ని రకాల ఆకుకూరలు. క్యాబేజ్, క్యాలీఫ్లవర్, క్యాప్సికం, వంగ, టమాట నారు పోసి మొక్కలు నాటుకోవాలి. 3-4 వారాల నారు శ్రేష్టం. ఎదిగిన నారు దొరికితే నాటుకోవచ్చు. లేదా విత్తనాలుంటే ఇప్పుడైనా నారు పోసుకొని, 3-4 వారాల తర్వాత నాటుకోవచ్చు. నవంబర్ 2న ఇంటిపంట గార్డెనర్స్ మీట్! సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు పండిస్తున్న, పండించుకోదలచిన హైదరాబాద్ మహానగర వాసుల సమావేశం నవంబర్ 2 (ఆదివారం)న జరగనుంది. ఏఎస్ రావు నగర్(కాప్ర)లోని విజయ హైస్కూల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ముందుగా పేర్లు నమోదు చేయిం చుకున్న వారెవరైనా ఈ ఉచిత వర్క్‌షాప్‌లో పాల్గొనవచ్చు. manasa.valicherla @gmail.comకు మెయిల్ ఇచ్చి పేరు నమోదు చేయించుకోవాలి. సేంద్రియ ఇంటిపంటల సాగు, వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారీ తదితర విషయాలు చర్చకొస్తాయి. విత్తనాలు, మొక్కలు ఇచ్చిపుచ్చుకోవడం కూడా ఉంటుంది. -
కలుపుతీత ఇక సులభం!
పెరటి తోట పనులను సులభతరం చేసే సరికొత్త పరికరానికి రూపకల్పన ఎవరికి వారే తయారు చేయించుకోవచ్చు పెరటి తోటల్లో మనిషి నిలబడే కలుపు తీయడానికి, పాదులు తీసుకోవడానికి ఉపకరించే ఈ పరికరాన్ని ప్రకాశం జిల్లా కందుకూరు ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ ఎం. లక్ష్మణరావు రూపొందించారు. కూరగాయలు, ఆకుకూరలు పండించే రైతులకు ఇది ఉపయోగపడుతుంది. దీన్ని ఎవరికి వారే స్థానికంగా తయారు చేసుకోవచ్చు. తయారీకి కావాల్సిన ఇనప సామగ్రి: 3 అడుగుల పైపు, 2 అడుగుల పైపు, 10 సెంటీమీటర్ల పొడవైన చువ్వలు నాలుగు. 3 అడుగుల పొడవైన పైపునకు పైభాగాన అడ్డంగా 2 అడుగుల పైపును ఉంచి వెల్డింగ్ చేయాలి. 10 సెంటీమీటర్ల పొడవైన 4 చువ్వలను తీసుకొని.. వాటి కొనలను సన్నగా చేసి, వాటిని అర్థ చంద్రాకారంగా వంచాలి. నిలువు పైపునకు అడుగున (కొనలను కింది వైపునకు ఉంచి) వాటిని తగిన విధంగా అమర్చి వెల్డింగ్ చేయాలి. 2 అడుగుల పైపును చేతులతో పట్టుకొని నేల మీద తిప్పుతూ ఉంటే.. కలుపు మొక్కలు వేళ్లతోపాటు లేచి వస్తాయి. నేల గుల్ల బారుతుంది. ఒకే చోట కొంత సేపు అలాగే చేస్తుంటే.. మొక్క నాటు కోవడానికి అడుగు వెడల్పున పాది సిద్ధమవుతుంది. వయోవృద్ధులు నడుము, మోకాళ్ల నొప్పుల బాధ లేకుండా దీనితో పెరటి తోటల్లో పనులు చూసుకోవచ్చు. ఈ పరికరాన్ని వినియోగిస్తున్న గుంటూరు జిల్లా కొలకలూరుకు చెందిన రైతు సురేష్ (98484 06407) సంతృప్తిని వ్యక్తం చేశారు.