పచ్చని పెరటి తోట!
- స్ఫూర్తిదాయకంగా విశ్రాంత ఉపాధ్యాయుడి కుటుంబం ఇంటిపంటల సాగు
- ఎర పంటల సాగుతో చీడపీడలు దూరం
ఇంటి పంట: రసాయనిక అవశేషాల్లేని స్వచ్ఛమైన ఆహారం కోసం జరిగే ఒక ప్రయత్నం కచ్చితంగా మరెందరిలోనో స్ఫూర్తిని రగిలిస్తుంది. గుంటూరులోని సంపత్‌నగర్‌కు చెందిన బసవరాజు జయశంకర్(60) పెరటి తోట ఇందుకు సజీవ నిదర్శనమైంది. తన ఇంటి వెనుక 7 సెంట్ల స్థలంలో ఈ ఏడాది జూన్ నుంచి జీవామృతం, ఘనజీవామృతం వాడుతూ ఆరోగ్యదాయకంగా ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. విశ్రాంత ఉపాధ్యాయుడు, నంది అవార్డు గ్రహీత అయిన నాటక కళాకారుడు అయిన జయశంకర్(98857 90942) విశ్రాంత వ్యవసాయ విస్తరణాధికారి ఎస్‌ఎస్‌ఎన్ మూర్తి తోడ్పా టుతో పెరటి తోట సాగును ప్రారంభించారు. మట్టి తోలించి ఎత్తు మడులు చేశారు. తోటకూర, పాలకూర, గోంగూర, మెంతికూర, వంగ, బెండ, బీర, కాకర, సొర, పొట్ల, మునగ, సోయాచిక్కుళ్లు సాగు చేస్తున్నారు.
పెరటి తోట చుట్టూ జొన్న, సజ్జ, ఆముదం, పత్తి మొక్కలు వేసి పంటలకు చీడపీడల బెడద రాకుండా కాపాడుకుంటున్నారు. గత కొద్ది నెలలుగా టమాటా తప్ప మార్కెట్‌కెళ్లి కూరగాయలు, ఆకుకూరలు కొనాల్సిన అవసరం రాలేదన్నారాయన. ఆకుకూరలు, కూరగాయలను ఇతరులకూ పంచిపెడుతున్నామన్నారు. దగ్గర్లోని ఆలయం వద్ద నుంచి తెచ్చిన ఆవు పేడ, మూత్రంతో జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసుకొని వాడుతున్నామన్నారు.
ఇతర ఎరువులు, పురుగు మందులు వాడకుండా స్వచ్ఛంగా పండిస్తున్నందున రుచికరమైన కూరగాయలు అందివస్తున్నాయన్నారు. రోజూ పది మందైనా తమ పెరటి తోటను చూసి, వివరాలు తెలుసుకొని వెళ్తున్నారని, వారిలో కొందరు ఇంటిపంటల సాగు ప్రారంభిస్తున్నారని జయశంకర్ తెలిపారు. పెరటి తోటను సందర్శించి ముగ్ధులైన జిల్లా ఉద్యాన శాఖ అధికారులు విత్తనాల ప్యాకెట్లను 90% రాయితీపై అందించారు. దీంతో ఇరుగు పొరుగు వారు సైతం ఇంటిపంటల సాగును ప్రారంభించడం విశేషం.
ఇప్పుడు వేసుకోదగిన ఇంటపంటలేవి?
శీతాకాలం ప్రారంభమవుతున్నది. ఈ కాలంలో ఎటువంటి ఇంటిపంటలు విత్తుకోవచ్చు లేదా నాటుకోవచ్చు?
సుస్థిర వ్యవసాయ కేంద్రం (తార్నాక, సికింద్రాబాద్. ఫోన్: 040- 65268303) శాస్త్రవేత్తలు ఇలా సూచిస్తున్నారు. అక్టోబర్ నెలలో కుండీలు, మడుల్లో సాగు ఆరంభించదగిన ఇంటిపంటలు ఇవి: క్యాబేజ్, క్యాలీఫ్లవర్, క్యాప్సికం, వంగ, టమాట, ఉల్లి, బంగాళ దుంపలు, బీన్స్, ముల్లంగి, బఠాణీ, దోస, అన్ని రకాల ఆకుకూరలు. క్యాబేజ్, క్యాలీఫ్లవర్, క్యాప్సికం, వంగ, టమాట నారు పోసి మొక్కలు నాటుకోవాలి. 3-4 వారాల నారు శ్రేష్టం. ఎదిగిన నారు దొరికితే నాటుకోవచ్చు. లేదా విత్తనాలుంటే ఇప్పుడైనా నారు పోసుకొని, 3-4 వారాల తర్వాత నాటుకోవచ్చు.
నవంబర్ 2న ఇంటిపంట గార్డెనర్స్ మీట్!
సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు పండిస్తున్న, పండించుకోదలచిన హైదరాబాద్ మహానగర వాసుల సమావేశం నవంబర్ 2 (ఆదివారం)న జరగనుంది. ఏఎస్ రావు నగర్(కాప్ర)లోని విజయ హైస్కూల్‌లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ముందుగా పేర్లు నమోదు చేయిం చుకున్న వారెవరైనా ఈ ఉచిత వర్క్‌షాప్‌లో పాల్గొనవచ్చు. manasa.valicherla @gmail.comకు మెయిల్ ఇచ్చి పేరు నమోదు చేయించుకోవాలి. సేంద్రియ ఇంటిపంటల సాగు, వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారీ తదితర విషయాలు చర్చకొస్తాయి. విత్తనాలు, మొక్కలు ఇచ్చిపుచ్చుకోవడం కూడా ఉంటుంది.