ఇంటికి పంటే అందం, ఆరోగ్యం! మొన్నటి వరకు మండిన ఎండల ప్రతాపానికి కూరగాయల దిగుబడి తగ్గి, మార్కెట్‌లో తీవ్ర కొరత ఏర్పడింది. ఫలితంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వాటిల్లోనూ నాణ్యత లోపించింది. మూడు వారాలకు పైగా అదనంగా కొనసాగిన హీట్ వేవ్, వడగాడ్పుల పుణ్యమా అని కూరగాయల సాగు దెబ్బతిన్నది. అననుకూల వాతావరణంలో కూరగాయ పంటలు విత్తలేకపోవడంతో సరఫరా తగ్గిపోయింది. దీంతో ప్రజలకు, ముఖ్యంగా నగరవాసులకు కూరగాయలు కొనాలంటే చుక్కలు కనపడుతున్నాయి.
ఇప్పటికైనా వర్షాలొచ్చాయి కాబట్టి సేంద్రియ ఇంటి పంటలు సాగు చేసుకోవటం మేలు. సొంతిల్లు ఉన్న వారు మార్కెట్‌పై ఆధారపడకుండా.. ఆరోగ్యదాయకమైన కూరగాయలను టెర్రస్(ఇంటి పైకప్పు)ల మీద పెంచుకోవటం ఉత్తమం. ఎత్తుమడుల్లో లేదా కంటెయినర్లలో ఏ కాలమైనా కూరగాయలు సాగు చేసుకోవచ్చంటున్నారు ఇంటిపంట సాగుదారులు..
కూరగాయలు మనమే పండించుకుందాం
మెడిసిన్లో సీటు వచ్చినా ప్రకృతి మీద ఉన్న ప్రేమతో మక్కువతో అగ్రికల్చర్ కోర్సులో చేరాను. సహాయ సంచాలకురాలిగా వ్యవసాయ శాఖలో పనిచేస్తూ ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) చందానగర్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా ఉన్నాను. నా కుటుంబాన్ని విషపూరితమైన పంటల నుంచి నాకు చేతనైనంత వరకు కాపాడాలని నిర్ణయించుకొని ఇంటిపైన కూరగాయల తోటను ప్రారంభించాను. మనం మన పిల్లలకి ఎంత ఆస్తి ఇచ్చాం అనేది కాదు ముఖ్యం.
ఎంత ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించామనేది ముఖ్యం. 2014 అక్టోబర్లో నా మిద్దె తోటలో తొలి బీజం అంకురించింది. నవంబర్లో పంట పురుడు పోసుకుంది. డిసెంబర్లో వజ్రాల్లాంటి పిల్లలను.. అదేనండి పంటని.. నా చేతికి అందించింది. అప్పుడు అరవై కుండీలతో మొదలైన మిద్దె తోట సాగు ఇప్పటివరకు ఆగలేదు. ఏ విధమైన అలుపు గానీ, విసుగు గానీ లేదు. ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవన విధానం అనుసరిస్తున్నాం. ఇప్పుడు నా తోట 600 కుండీలతో నాలుగు అంతస్తులలో అలరారుతోంది.
ప్రకృతి సమతుల్యతను మన వికృత చేష్టలతో మనమే చెడగొట్టుకున్నాం. అందుకని ఇప్పటికైనా నగరవాసులమైన మనం మనకు కావాల్సిన ఆకుకూరలను, కూరగాయలను, పండ్లను సాధ్యమైనంత వరకు మనమే పండించుకోవడం ఉత్తమం. ఇంకెందుకు ఆలస్యం మొదలెడదామా? మనమందరం మిద్దె తోటలను పెంచుకోవాలి. ఉల్లిపాయ తప్పితే మిగతా ఏ కూరగాయలకూ మార్కెట్‌కి వెళ్ళను. మీరు నమ్మినా నమ్మకున్నా 365 రోజుల్లో ఏనాడూ నేను కూరగాయలను బయట కొనటం లేదు.
– ఓ.వి.ఎస్.ఉషారాణి (81217 96299), సేంద్రియ ఇంటిపంటల సాగుదారు, వ్యవసాయ సహాయ సంచాలకులు, జీహెచ్‌ఎంసీ చందానగర్ సర్కిల్ ప్రాజెక్ట్ ఆఫీసర్,హైదరాబాద్.
సేంద్రియ ఇంటిపంటల్లో సంపూర్ణ ఆరోగ్యం
టికి చేయి తినడానికి ఎంత దగ్గరగా అనుకూలంగా ఉంటుందో.. ఇంట్లో వంట చేయడానికి పంట కూడా అంత దగ్గరగా అందుబాటులో ఉండాలి. తాజా కూరగాయలు, పండ్లు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పండించుకొని తినడం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. తాజా కూరగాయలు, పండ్లు తింటే శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. నలిగిన లేదా పగిలిన కణాల నుంచి సెల్యులోజ్ అనే ఎంజైము విడుదలవుతుంది.
ఇలా కణజాల వ్యవస్థ ధ్వసమై మనకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు కాస్తా హానికరమైన యాసిడ్లు (ఆమ్లాలు)గా రూపాంతరం చెందుతాయి. మార్కెట్‌లో లభించే చాలా వరకు కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు యాసిడ్‌లుగా మారే ప్రక్రియకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల గ్యాస్, అసిడిటీ, అల్సర్లు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఇంటిపట్టున/ఇంటికి దగ్గర్లో పండ్లు, కూరగాయలు పండించుకొని తాజాగా తినాలి. సేంద్రియ ఇంటి పంటల్లో సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తిరస్తు.
– డా. జి. శ్యాంసుందర్ రెడ్డి (99082 24649), సేంద్రియ ఇంటిపంటల నిపుణుడు
మిద్దె తోటలో అన్నీ పండించుకోవచ్చు
పూల మొక్కలు చాలా ఏళ్లుగా పెంచుతున్నా కూరగాయల సాగుపై పెద్దగా అవగాహన లేదు. ‘సాక్షి’ పేపర్‌లో ‘ఇంటిపంట’ ఆర్టికల్స్ చదివి అందరూ ఎలా చేస్తున్నారో తెలుసుకున్నా. మిద్దె పైన మొదలు పెట్టి, కనీసం ఆకుకూరల వరకైనా పెంచుకుందాం అని అనుకున్నాను. 2017లో ఐదారు గ్రోబాగ్స్ తెచ్చి ఆకుకూరల సాగు మొదలు పెట్టాను. ఇంటిపంట ఫేస్‌బుక్ గ్రూప్‌లో చేరి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. తర్వాత తుమ్మేటి రఘోత్తమరెడ్డి సూచనలు ఉపకరించాయి. 2019 జూన్ నుంచి పట్టుదలగా కూరగాయ మొక్కలను మిద్దె పైనే పెంచుతున్నాను.
ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. మొక్కలకు తగిన పోషకాలు ఇస్తే మిద్దె తోటలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అన్ని రకాలను ఎలాంటి రసాయనాలు వాడకుండా మనమే పండించుకోవచ్చు. మన పంట మనమే తినవచ్చు. ఆరోగ్యం చేకూరుతుంది. డాక్టర్, మందుల ఖర్చులు తగ్గుతాయి. నగరంలో అందరూ మిద్దె తోటలు సాగు చేస్తే వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. ఇతర ఆలోచనలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది.
– లత కృష్ణమూర్తి (94418 03407), మిద్దె తోటల సాగుదారు, హైదరాబాద్
– పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment