Midde Thota
-
ఇంటి రూఫ్.. మొక్కలు సేఫ్..!
సాక్షి, సిటీబ్యూరో: టెర్రస్‌గార్డెన్.. హైదరాబాద్ నగరంలోని నివాసాల నుంచి పల్లెల వరకూ ఇప్పుడు ఇదే ట్రెండింగ్. పెరుగుతున్న కాలుష్యం ప్రజలను ప్రకృతి ఒడికి చేరువయ్యేలా చేస్తోంది. ఓ వైపు ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం.. మరోవైపు ఆహ్లాదకరమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ తమ నివాసాల్లో మొక్కలు పెంచుతున్నారు. నగరంలో స్థలాభావం కారణంగా మిద్దెలపై మొక్కలు పెంచడం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. దీనికితోడు గ్రీన్ సిటీస్, గ్రీన్ హౌస్ అనే కాన్సెప్‌్టతో ఇప్పటికే అత్యాధునిక సౌకర్యాలతో బిల్డింగ్ డిజైన్లు వెలుస్తున్నాయి. దీంతో నగర వాసుల, ప్రకృతి ప్రేమికుల నివాసాలు పచ్చదనానికి ఆవాసాలుగా మారుతున్నాయి. అపార్ట్మెంట్, కాంప్లెక్స్‌ల నిర్వాహకుల నుంచి ఇండివీడ్యువల్ ఇళ్ల వరకూ గ్రీనరీకి ప్రధాన్యతనిస్తున్నారు.ఆరోగ్యం వెంట.. ఇంటి పంట..ఇటీవలి కాలంలో నగరంలో అధిక శాతం మంది భవనాలపై, టెర్రస్‌లో తమ సొంత కూరగాయలను ఆర్గానిక్ పద్ధతుల్లో పెంచేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇది వారికి ఆరోగ్యకరమైన తాజా ఉత్పత్తులను అందించడమే కాదు.. సొంతంగా పండించుకుంటున్నామనే గొప్ప సంతృప్తిని కూడా అందిస్తుంది. టెర్రస్ గార్డెన్ కేవలం పచ్చదనాన్ని పంచడం మాత్రమే కాకుండా ఆయా కమ్యూనిటీలు నిర్వహించుకునే ఈవెంట్లకు అద్భుతమైన అనువైన ప్రదేశంగా మారాయి. పండుగల నుంచీ బార్బెక్యూల దాకా వేడుకలుగా జరుపుకోడానికి ఇవి వేదికలవుతున్నాయి. నగర జీవితంలో హడావిడి నుంచి తప్పించుకోడానికి నివాసితులకు వీలు కల్పిస్తోంది. మిద్దెతోట.. పచ్చని బాట..నగరంలో స్థల పరిమితులు ఉండటంతో, స్థలాభావం ఉన్నప్పటికీ పచ్చదనానికి పట్టం కట్టాలని ఆరాటపడుతున్న వారికి.. అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లలోని టెర్రస్ గార్డెన్లు పరిష్కారాన్ని అందిస్తున్నాయి. నగరంలో అపార్ట్మెంట్, కాంప్లెక్సుల్లో టెర్రస్ గార్డెన్లు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఒకప్పుడు భవనాల పైకప్పులపై ఖాళీగా ఉన్న స్థలాలు ఇప్పుడు పచ్చని ప్రదేశాలుగా మారి నగరవాసుల అభిరుచుల వైవిధ్యానికి నిదర్శనాలుగా మారుతున్నాయి.పచ్చని వాతావరణాన్ని అందించడమే కాకుండా కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి గాలిలోకి ఆక్సీజన్‌ను విడుదల చేయడం ద్వారా మిద్దె తోటలు గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. అంతేకాదు కూరగాయలు, మూలికలు, పండ్లను సైతం పెంచడానికి అనేక మార్గాలను అన్వేíÙస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. ఇలా పర్యావరణానికి రక్షణగా నిలవడం.. తద్వారా ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి అలవాటుపడుతున్నారు నగరవాసులు.రసాయనాల నుంచి విముక్తికి..‘పురుగుమందులు లేని సేంద్రీయ కూరగాయలకు పెరుగుతున్న డిమాండ్‌తో, తమ సొంత పెరట్లలో లేదా టెర్రస్లలో కూరగాయలు, పండ్లను పండించడం వైపు చాలా మంది ఆకర్షితులవుతున్నారు. అలాగే ఇంటి ఖర్చులో పొదుపు మార్గాలను అందిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కనీసం 45,000 మంది టెర్రస్‌పై తోటలను పెంచేందుకు మా ప్రచారం తోడ్పడింది’ అని శ్రీనివాస్ చెప్పారు. హరిత ఉద్యాన వనాలను మెరుగుపరచడానికి కావాల్సిన విత్తనాలు, మాధ్యమాలు విడిభాగాలను కొనుగోలు చేయడానికి నిపుణుల సలహాలను పొందడంతో పాటు అన్ని రకాల సహకారం అందిస్తామని చెప్పారాయన.సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్..ఆన్లైన్ వేదికగా మిద్దె తోటల పెంపకంపై చర్చోపచర్చలు, గ్రూపులు ఊపందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది ఉద్యానవన ప్రియుడు శ్రీనివాస్ హర్కరా ‘సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్’ స్థాపించారు. ఇప్పుడు ఇది అత్యధిక సంఖ్యలో నిపుణులు, సభ్యులను కలిగిన గ్రూప్స్‌లో ఒకటి. అటువంటి 16 గ్రూప్స్‌తో దాదాపు 25 వేల మంది సభ్యులతో టెర్రస్ గార్డెన్ హవా నడుస్తోంది. రూఫ్ గార్డెనింగ్, ఆర్గానిక్ కూరగాయలు, పండ్లను పండించడానికి సంబంధించిన అన్ని పరిష్కారాల కోసం వన్ స్టాప్ ప్లాట్‌ఫారమ్‌గా మారింది.గోడల నుంచి.. ఎలివేషన్స్ వరకూ..పచ్చదనం కోసం నగరవాసుల్లో పెరుగుతున్న ఆరాటం గోడల నుంచి ఎలివేషన్స్ వరకూ గతంలో ఉపయోగించని ప్రదేశాలను సైతం మొక్కలతో నింపేలా చేస్తోంది. ఈ క్రమంలోనే రూఫ్ గార్డెనింగ్, టెర్రస్, రూఫ్‌టాప్, పాటియో, బాల్కనీ, పోర్చ్, వరండా, సన్డెక్ వంటి ప్రదేశాల్లో మొక్కలు పెంచేస్తున్నారు. దీంతోపాటు హ్యాంగింగ్ గార్డెనింగ్ కూడా ప్రాచుర్యం పొందుతోంది.. బాల్కనీల్లో వైర్లు, బుట్టలు, కుండీలు వంటివి వేలాడదీస్తూ తీగ మొక్కలను పెంచుతున్నారు. తద్వారా ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కూడా లభిస్తోంది.గ్రాండ్.. గార్డెన్ ట్రీట్స్..ఇంటి మిద్దెలు, టెర్రస్ గార్డెన్స్ ఇటీవలి కాలంలో గ్రాండ్ ట్రీట్స్కి వేదికలు అవుతున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, కమ్యూనిటీ మిత్రులు, ఆఫీస్ కొలీగ్స్‌తో కలిసి వీకెండ్స్, ఇతర ప్రత్యేక ఈవెంట్స్‌లో ట్రీట్స్ ఇచ్చుకోడానికి వీలుగా రూపుదిద్దుకుంటున్నాయి. అవుట్డోర్ సీటింగ్‌కు అనుగుణంగా బెంచ్‌లు, కురీ్చలు, ఊయల వంటివి ఏర్పాటు చేసుకుంటున్నారు. రట్టన్, వెదురు, కలప, లోహాలు మొదలైన వాటి నుండి ఆల్–వెదర్ ఫరి్నచర్ శ్రేణిలో రూఫ్ గార్డెన్స్ నిర్మాణమవుతున్నాయి.70 వేలకు పైగా సభ్యులు..నగరంలో టెర్రస్ గార్డెన్స్ ట్రెండ్ బాగా పెరుగుతోంది. ప్రస్తుతం మా సంస్థ ఆధ్వర్యంలో 26 గ్రూప్స్ ఉండగా, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు 70వేల మందికిపైగా సభ్యులున్నారు. పర్యావరణ హితంగా, నగర వాతావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడేందుకు ఈ ట్రెండ్‌ని మరింతగా ప్రోత్సహించాలి. నగరం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మా సంస్థ కృషికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు వచి్చంది. – శ్రీనివాస్, వ్యవస్థాపకులు, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్.. (సీటీజీ)ఇవి చదవండి: ఆయిల్, గ్యాస్ బ్లాకుల కోసం పోటాపోటీ -
పెరటి తోటల పెంపకంలో మెళకువలు
-
తక్కువ బడ్జెట్ తో మిద్దె తోట సాగు
-
ఇంటిపంటలతో సంపూర్ణ ఆరోగ్యం.. మనమే పండించుకుందాం
ఇంటికి పంటే అందం, ఆరోగ్యం! మొన్నటి వరకు మండిన ఎండల ప్రతాపానికి కూరగాయల దిగుబడి తగ్గి, మార్కెట్లో తీవ్ర కొరత ఏర్పడింది. ఫలితంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వాటిల్లోనూ నాణ్యత లోపించింది. మూడు వారాలకు పైగా అదనంగా కొనసాగిన హీట్ వేవ్, వడగాడ్పుల పుణ్యమా అని కూరగాయల సాగు దెబ్బతిన్నది. అననుకూల వాతావరణంలో కూరగాయ పంటలు విత్తలేకపోవడంతో సరఫరా తగ్గిపోయింది. దీంతో ప్రజలకు, ముఖ్యంగా నగరవాసులకు కూరగాయలు కొనాలంటే చుక్కలు కనపడుతున్నాయి. ఇప్పటికైనా వర్షాలొచ్చాయి కాబట్టి సేంద్రియ ఇంటి పంటలు సాగు చేసుకోవటం మేలు. సొంతిల్లు ఉన్న వారు మార్కెట్‌పై ఆధారపడకుండా.. ఆరోగ్యదాయకమైన కూరగాయలను టెర్రస్(ఇంటి పైకప్పు)ల మీద పెంచుకోవటం ఉత్తమం. ఎత్తుమడుల్లో లేదా కంటెయినర్లలో ఏ కాలమైనా కూరగాయలు సాగు చేసుకోవచ్చంటున్నారు ఇంటిపంట సాగుదారులు.. కూరగాయలు మనమే పండించుకుందాం మెడిసిన్‌లో సీటు వచ్చినా ప్రకృతి మీద ఉన్న ప్రేమతో మక్కువతో అగ్రికల్చర్ కోర్సులో చేరాను. సహాయ సంచాలకురాలిగా వ్యవసాయ శాఖలో పనిచేస్తూ ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) చందానగర్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా ఉన్నాను. నా కుటుంబాన్ని విషపూరితమైన పంటల నుంచి నాకు చేతనైనంత వరకు కాపాడాలని నిర్ణయించుకొని ఇంటిపైన కూరగాయల తోటను ప్రారంభించాను. మనం మన పిల్లలకి ఎంత ఆస్తి ఇచ్చాం అనేది కాదు ముఖ్యం. ఎంత ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించామనేది ముఖ్యం. 2014 అక్టోబర్‌లో నా మిద్దె తోటలో తొలి బీజం అంకురించింది. నవంబర్‌లో పంట పురుడు పోసుకుంది. డిసెంబర్లో వజ్రాల్లాంటి పిల్లలను.. అదేనండి పంటని.. నా చేతికి అందించింది. అప్పుడు అరవై కుండీలతో మొదలైన మిద్దె తోట సాగు ఇప్పటివరకు ఆగలేదు. ఏ విధమైన అలుపు గానీ, విసుగు గానీ లేదు. ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవన విధానం అనుసరిస్తున్నాం. ఇప్పుడు నా తోట 600 కుండీలతో నాలుగు అంతస్తులలో అలరారుతోంది. ప్రకృతి సమతుల్యతను మన వికృత చేష్టలతో మనమే చెడగొట్టుకున్నాం. అందుకని ఇప్పటికైనా నగరవాసులమైన మనం మనకు కావాల్సిన ఆకుకూరలను, కూరగాయలను, పండ్లను సాధ్యమైనంత వరకు మనమే పండించుకోవడం ఉత్తమం. ఇంకెందుకు ఆలస్యం మొదలెడదామా? మనమందరం మిద్దె తోటలను పెంచుకోవాలి. ఉల్లిపాయ తప్పితే మిగతా ఏ కూరగాయలకూ మార్కెట్‌కి వెళ్ళను. మీరు నమ్మినా నమ్మకున్నా 365 రోజుల్లో ఏనాడూ నేను కూరగాయలను బయట కొనటం లేదు. – ఓ.వి.ఎస్.ఉషారాణి (81217 96299), సేంద్రియ ఇంటిపంటల సాగుదారు, వ్యవసాయ సహాయ సంచాలకులు, జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ ప్రాజెక్ట్ ఆఫీసర్,హైదరాబాద్. సేంద్రియ ఇంటిపంటల్లో సంపూర్ణ ఆరోగ్యం టికి చేయి తినడానికి ఎంత దగ్గరగా అనుకూలంగా ఉంటుందో.. ఇంట్లో వంట చేయడానికి పంట కూడా అంత దగ్గరగా అందుబాటులో ఉండాలి. తాజా కూరగాయలు, పండ్లు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పండించుకొని తినడం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. తాజా కూరగాయలు, పండ్లు తింటే శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. నలిగిన లేదా పగిలిన కణాల నుంచి సెల్యులోజ్ అనే ఎంజైము విడుదలవుతుంది. ఇలా కణజాల వ్యవస్థ ధ్వసమై మనకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు కాస్తా హానికరమైన యాసిడ్లు (ఆమ్లాలు)గా రూపాంతరం చెందుతాయి. మార్కెట్లో లభించే చాలా వరకు కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు యాసిడ్లుగా మారే ప్రక్రియకు లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల గ్యాస్, అసిడిటీ, అల్సర్లు వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, ఇంటిపట్టున/ఇంటికి దగ్గర్లో పండ్లు, కూరగాయలు పండించుకొని తాజాగా తినాలి. సేంద్రియ ఇంటి పంటల్లో సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తిరస్తు. – డా. జి. శ్యాంసుందర్ రెడ్డి (99082 24649), సేంద్రియ ఇంటిపంటల నిపుణుడు మిద్దె తోటలో అన్నీ పండించుకోవచ్చు పూల మొక్కలు చాలా ఏళ్లుగా పెంచుతున్నా కూరగాయల సాగుపై పెద్దగా అవగాహన లేదు. ‘సాక్షి’ పేపర్లో ‘ఇంటిపంట’ ఆర్టికల్స్ చదివి అందరూ ఎలా చేస్తున్నారో తెలుసుకున్నా. మిద్దె పైన మొదలు పెట్టి, కనీసం ఆకుకూరల వరకైనా పెంచుకుందాం అని అనుకున్నాను. 2017లో ఐదారు గ్రోబాగ్స్ తెచ్చి ఆకుకూరల సాగు మొదలు పెట్టాను. ఇంటిపంట ఫేస్బుక్ గ్రూప్‌లో చేరి కొన్ని విషయాలు తెలుసుకున్నాను. తర్వాత తుమ్మేటి రఘోత్తమరెడ్డి సూచనలు ఉపకరించాయి. 2019 జూన్ నుంచి పట్టుదలగా కూరగాయ మొక్కలను మిద్దె పైనే పెంచుతున్నాను. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. మొక్కలకు తగిన పోషకాలు ఇస్తే మిద్దె తోటలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అన్ని రకాలను ఎలాంటి రసాయనాలు వాడకుండా మనమే పండించుకోవచ్చు. మన పంట మనమే తినవచ్చు. ఆరోగ్యం చేకూరుతుంది. డాక్టర్, మందుల ఖర్చులు తగ్గుతాయి. నగరంలో అందరూ మిద్దె తోటలు సాగు చేస్తే వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. ఇతర ఆలోచనలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. – లత కృష్ణమూర్తి (94418 03407), మిద్దె తోటల సాగుదారు, హైదరాబాద్ – పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
గ్రీన్ లైఫ్: అవును... మిద్దెలపై డబ్బులు కాస్తాయి!!
ఆరోజు మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొని ఇంటికి తీసుకువచ్చింది కేరళలోని కొట్టాయంకు చెందిన రెమాదేవి. కూరగాయలను కడుగుతున్నప్పుడు ఒకరకమైన రసాయనాల వాసన వచ్చింది. ఆ సమయంలో పిల్లలు, వారి భవిష్యత్ గుర్తుకు వచ్చింది. అదే సమయంలో తాను ఒక నిర్ణయం తీసుకుంది... ‘ఇంటికి అవసరమైన కూరగాయలు ఇంటిదగ్గరే పండించుకుంటాను’ అలా మిద్దెతోటకు శ్రీకారం చుట్టింది రెమాదేవి. అమ్మమ్మ రంగంలోకి దిగింది. సేంద్రియ వ్యవసాయంలో అమ్మమ్మది అందెవేసిన చేయి. ఆమె సలహాలు, సూచనలతో మిద్దెతోట పచ్చగా ఊపిరిపోసుకుంది. కొంత కాలానికి... ఇంటి అవసరాలకు పోగా మిగిలిన కూరగాయలను అమ్మడం మొదలుపెట్టారు. తమకు ఉన్న మరో రెండు ఇండ్లలోనూ మిద్దెతోట మొదలుపెట్టింది రెమాదేవి. అలా ఆదాయం పెరుగుతూ పోయింది. మిద్దెతోటపై ఆసక్తి ఉన్న వాళ్లు రెమాను రకరకాల సలహాలు అడిగేవారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ‘రెమాస్ టెర్రస్ గార్డెన్’ పేరుతో యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది. ‘మిద్దెతోటకు పెద్దగా ఖర్చు అక్కర్లేదు’ అని చెబుతూ ఆ తోటపెంపకానికి సంబంధించిన ఎన్నో విషయాలను అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లు చెబుతుంది. వంటగది వ్యర్థాలతో మనకు కావల్సిన ఎరువులు ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోల ద్వారా చూపుతుంది. దీంతోపాటు సోషల్ మీడియా ఫార్మింగ్ గ్రూప్స్ ద్వారా విత్తనాలు అమ్ముతుంది రెమాదేవి. కేవలం విత్తనాల అమ్మకం ద్వారానే నెలకు 60,000 రూపాయల ఆదాయం అర్జిస్తుంది. రెమాదేవిని అనుసరించి ఎంతోమంది మిద్దెతోటలను మొదలుపెట్టి రసాయన–రహిత కూరగాయలను పండించడమే కాదు, తగిన ఆదాయాన్ని కూడా గడిస్తున్నారు. మంచి విషయమే కదా! -
ఆరోగ్యం మన మిద్దె తోటలోనే ఉంది! క్యాన్సర్‌ను జయించి..
ఆరోగ్యం ఆసుపత్రిలో లేదు. మన మిద్దె తోటలోనే ఉంది. మన తినే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను రసాయనాల్లేకుండా మనమే ఇంటిపైన పండించుకుందాం. నలుగురం చేయీ చేయీ కలిపి మిద్దె తోటలు సాగు చేసుకుంటూ ఆరోగ్యంగా జీవిద్దాం.. అని చెప్పటమే కాదు.. మనసా వాచా కర్మణా ఆచరిస్తున్నారు కొల్లి కృష్ణకుమారి. గుంటూరు ఎన్జీవో కాలనీకి చెందిన బీఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగిని అయిన ఆమె 2020 జనవరి నుంచి 1400 చ.అ.ల మిద్దె తోట సాగు చేస్తున్నారు. ఉల్లి, వెల్లుల్లి, క్యారెట్ తప్ప మిగతావన్నీ దాదాపు రోజూ తమ ఇంటిపైన పండించుకున్నవే తింటున్నారు. క్యాన్సర్‌ను జయించిన ఆమె ఉద్యోగవిరమణ తర్వాత ఉద్యమ స్ఫూర్తితో సేంద్రియ మిద్దెతోటలను విస్తరింపజేస్తున్నారు. సంఘ బలం.. ఉత్సాహం.. రిటైరైన ఉద్యోగులు, పెద్దవాళ్లు (సెకండ్ యూత్) కూరగాయలు, పండ్ల మొక్కలను పెంచడం హాబీగా మార్చుకుంటున్నారు. సేంద్రియ ఇంటిపంటలు/ మిద్దె తోటల సంస్కృతిని వ్యాప్తిలోకి తెచ్చే లక్ష్యంతో సంఘాలు కూడా ఏర్పాటవుతున్నాయి. మిద్దెతోటల నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి ఆధ్వర్యంలో గుంటూరు సహా రెండు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోనూ మిద్దెతోటల పెంపకందారుల సంఘాలు ఏర్పాటయ్యాయి. ‘గుంటూరు మిద్దెతోటలు’ పేరుతో ఏర్పాటు చేసిన రెండు వాట్సప్ గ్రూప్‌లలో 659 మందికి పైగా ఉన్నారు. 2021 నుంచి గుంటూరులో మిద్దె తోటల కార్యకలాపాలను కృష్ణకుమారి నేతృత్వంలో వలంటీర్ల బృందం అత్యంత క్రియాశీలంగా నిర్వహిస్తుండటం విశేషం. ఉద్యానవన శాఖ అధికారుల సహకారంతో ప్రతి నెలా అవగాహన కల్పిస్తున్నారు. గుంటూరు మిద్దెతోటలు పేరిట యూట్యూబ్ ఛానల్‌ను ఏర్పాటు చేశారు. ‘గుంటూరు మిద్దె తోటల పెంపకందారుల సంక్షేమ సంఘం(జి.ఎం.ఎస్.ఎస్.)’ లాభాపేక్షలేని సంస్థగా రిజిస్టర్ అయ్యింది. కృష్ణకుమారి ఆమె అధ్యక్షురాలిగా, మరికొందరు ఉత్సాహవంతులైన విశ్రాంత బ్యాంకు అధికారులు, వైద్యులతో కూడిన కార్యవర్గం ఏర్పాటైంది. సంఘ వార్షిక సభ్యత్వ రుసుము రూ. 500. నెలవారీగా సమావేశమవుతూ వారికి కావాల్సిన మొక్కలను కడియం, కుప్పం నర్సరీల నుంచి తెప్పించి సభ్యులకు అందిస్తున్నారు. సంఘం జమాఖర్చులపై ఆడిటింగ్ నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తుండటం ప్రశంసనీయం. ఉత్సాహంగా వాలంటీర్ల సేవలు సాధారణ మొక్కలతో పోల్చితే ఎన్నో రెట్లు ఎక్కువ దిగుబడినిచ్చే గ్రాఫ్టెడ్ మొక్కల అవసరం మేడపైన కుండీలు, మడుల్లో తక్కువ స్థలాల్లో కూరగాయలు పెంచుకునే వారికి ఎంతో ఉందంటారు కృష్ణకుమారి. అడవి వంగతో అంటుకట్టిన(గ్రాఫ్ట్ చేసిన) వంగ, టమాటో, మిరప, సొర మొక్కలతో పాటు పర్పుల్ క్యాబేజి, ఎర్రబెండ, ఎల్లో/పర్పుల్ కాలిఫ్లవర్ వంటి అరుదైన, నాణ్యమైన మొక్కలను నర్సరీల నుంచి తెప్పించి మిద్దెతోట పెంపకందారులకు మూడింట ఒక వంతు ధరకే అందిస్తున్నారు. కృష్ణకుమారి, వలంటీర్ల బృందం సఫలీకృతమయ్యారు. గూగుల్ ఫామ్స్, ఎక్సెల్ షీట్ ద్వారా సభ్యులకు కావాల్సిన మొక్కల ఆర్డర్ తీసుకొని మొక్కలను తెప్పిస్తున్నారు. సభ్యులందరికీ ముద్రిత ఫొటో గుర్తింపు కార్డులు ఇచ్చారు. 50 మంది వాలంటీర్లు ఉత్సాహంగా సేవలందిస్తుండటం వల్ల సంఘాన్ని చురుగ్గా నిర్వహించ గలుగుతూ ఉన్నామని కృష్ణకుమారి చెప్పారు. గత రెండేళ్లలో మిరప రైతులు పురుగుమందులను చాలా ఎక్కువగా వాడాల్సి వస్తోందని అంటూ.. రైతులను తప్పుపట్టలేమని, వినియోగదారులుగా మన జాగ్రత్తలో మనం ఉండాలని, వీలైనన్ని కూరగాయలను మనమే పండించుకోవాలని కృష్ణకుమారి(94906 02366) అంటున్నారు. – దాళా రమేష్‌బాబు, సాక్షి ప్రతినిధి, గుంటూరు ఫోటోలు: గజ్జల రామగోపాలరెడ్డి నిర్వహణ: పంతంగి రాంబాబు చదవండి: ఎకరం భూమి ఉందా? మేకలు, కోళ్లు, ముత్యాలు, పుట్టగొడుగులు.. ఇలా చేస్తే రోజుకు రూ. 1500 ఆదాయం.. ఇంకా.. పెసర, మినుములేనా? బ్రహ్మీ, వస సాగు.. భలే బాగు! ఏడాదికి నికరాదాయం ఎంతంటే..