సేంద్రియ ఇంటిపంటల సాగులో ఆధునిక పద్ధతులను తెలుగునాట విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చిన కాలమ్ ‘ఇంటిపంట’. మేడలపై కుండీల్లో, మడుల్లో పంటలు పండించి తినటం అయ్యేపనేనా అని మొదట్లో సందేహించినా.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాలే కాదు గ్రామాల్లో కూడా పెరట్లోనో, ఇంటి ముందున్న కొద్ది పాటి స్థలంలోనో, మేడ మీదనో ఎవరికి తోచిన విధంగా వారు లక్షలాది మంది సాగు చేస్తూ ఆనందిస్తున్నారు. దేశ, విదేశాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు విశేషాలతో పాఠకులను ఆరోగ్యదాయకమైన ఆచరణ వైపు పురిగొల్పిన ‘సాక్షి’ దినపత్రికలోని ‘ఇంటిపంట’ తెలుగు పత్రికా రంగంలో ఓ ట్రెండ్‌సెట్టర్.
మార్కెట్‌లో అమ్ముతున్న కూరగాయలు, ఆకుకూరల్లో రసాయనాల అవశేషాల వల్ల ప్రజారోగ్యానికి వాటిల్లుతున్న నష్టాన్ని గురించి ‘కాయగూరల్లో కాలకూటం’ శీర్షికన కథనాన్ని ‘సాక్షి’ ప్రచురించింది.. కథనం రాశాం. అంతటితో మన బాధ్యత తీరింది అని అంతటితో సరిపెట్టుకొని ఉంటే.. ‘ఇంటిపంట’ కాలమ్ 2011 జనవరి 21న ప్రారంభమయ్యేదే కాదు! అప్పట్లో వారానికి రెండు రోజులు ప్రచురితమైన ‘ఇంటిపంట’ కథనాలు పెద్ద సంచలనమే రేపాయంటే అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు. సీన్ కట్ చేస్తే.. సరిగ్గా పదేళ్ల తర్వాత.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది సేంద్రియ ఇంటిపంటలను ఎంతో మక్కువతో సాగు చేస్తున్నారు. టెర్రస్ మీద కిచెన్ గార్డెన్ కలిగి ఉండటం ఆరోగ్యదాయకమే కాదు ఇప్పుడు అదొక స్టేటస్ సింబల్‌గా మారిపోయింది అంటారు మిద్దె తోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి.
దాదాపు అన్ని పత్రికలు, టీవీ ఛానల్స్ ఈ ట్రెండ్‌ను అనుసరిస్తున్నాయి. సోషల్ మీడియా సంగతి అయితే ఇక చెప్పనక్కరలేదు. రఘోత్తమరెడ్డి వంటి వారు ఫేస్‌బుక్‌లో అనుదినం రాస్తూ ఉంటే.. తమ టెర్రస్‌లపై ఇంటిపంటల సాగు అనుభవాలను ప్రజలకు ప్రభావశీలంగా అందించడానికి ఏకంగా సొంత యూట్యూబ్ ఛానళ్లనే ప్రారంభించారు కొందరు సీనియర్ కిచెన్ గార్డెనర్లు! హైదరాబాద్‌కు చెందిన పినాక పద్మ, లత, నూర్జహాన్, శాంతి ధీరజ్.., వైజాగ్‌కు చెందిన ఉషా గజపతిరాజు.. ఈ కోవలోని వారే!
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రైతులందరినీ ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించటమే. అందుకు చాలా ఏళ్లు పట్టవచ్చు. అయితే, అప్పటి వరకు ఆగకుండా ఇప్పటికిప్పుడు ప్రజలు (ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారు) తమ ఆరోగ్యం కోసం తాము చేయదగినదేమైనా ఉందా?? ఈ ప్రశ్నే ‘ఇంటిపంట’ కాలమ్ పుట్టుకకు దోహదం చేసింది. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ రోజే సేంద్రియ ఇంటిపంటల సాగు ప్రారంభించండి అంటూ ప్రోత్సహించి.. దారి దీపం అయ్యింది ‘ఇంటిపంట’.
కరోనా, ఏలూరు హెల్త్ ఎమర్జెన్సీ నేపథ్యంలో సేంద్రియ ఇంటిపంటల సాగు ఎంత అవసరమో కాదు.. కాదు.. ఎంతటి ప్రాణావసరమో ప్రతి ఒక్కరికీ బోధపడింది!
వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న ‘సాక్షి’ మీడియా గ్రూప్ చైర్‌పర్సన్ వైఎస్ భారతి రెడ్డి గారికి, అనుదినం వెనుక ఉండి నడిపిస్తున్న సంపాదకులు వర్ధెల్లి మురళి గారికి, ‘ఇంటిపంట’, ‘సాగుబడి’ భావనలకు ఊపిర్లూదిన అప్పటి ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి.. ఈ మహాయజ్ఞంలో నన్ను ‘కలం’ధారిగా చేసినందుకు వేన వేల వందనాలు!!
– పంతంగి రాంబాబు, ఇంటిపంట / సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment