kitchen garden
-
పచ్చిమిరపమొక్కల్ని ఇలా పెంచితే కాయలే కాయలు!
గార్డెనింగ్ ఒక కళ. కాస్త ఓపిక, మరికాస్త శ్రద్ధపెడితే ఇంట్లోనే చాలారకాల పూల మొక్కల్ని పెంచుకోవచ్చు. కూరగాయలు, ఆకుకూరలు పండించు కోవచ్చు. పైగా వర్షాకాలం కాబట్టి బాల్కనీలోగానీ, ఇంటిముందు ఉన్న చిన్నస్థలంలోగానీ హాయిగా వీటిని పెంచు కోవచ్చు. గార్డెనింగ్‌తో మనసుకు సంతోషం మాత్రమేకాదు ఆర్గానిక్ ఆహారాన్ని తిన్నామన్న ఆనందమూ మిగులుతుంది. కిచెన్‌గార్డెన్‌లో చాలా సులభంగా పెరిగే మొక్కల్లో ఒకటి పచ్చి మిరపకాయ. ఇంట్లోనే పచ్చి మిరపకాయలను ఎలా పండించవచ్చు? తొందరగా పూత, కాపు రావాలంటే పాటించాల్సిన కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.పచ్చిమిరపతో చాలా రకాల ప్రయోజనాలున్నాయి. ఆహారంలో రుచిని జోడించడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రసిద్ధి చెందిన విటమిన్ సి విటమిన్ పుషల్కంగా లభిస్తుంది. మొటిమలు, చర్మం ముడతల్ని నివారిస్తుంది. జుట్టుకు మంచిది , బరువు తగ్గడంలో సహాయ పడుతుంది. ఇది జీర్ణ రసాల ఉత్పత్తికి కూడా చాలా మంచిది. మరి ఇన్ని రకాల లాభాలున్న ఈ చిన్ని మొక్కను ఎలా పెంచుకోవాలి.సరైన విత్తనాలు ఎంచుకోవడం ముఖ్యంగా. సాధారణంగా ఎండుమిరపగింజలు వేసినాసులభంగా మొలకెత్తుతాయి. కానీ మంచి ఫలసాయం రావాలంటే నాణ్యమైన విత్తనాలను తెచ్చుకోవాలి. చిన్ని చిన్న కంటైనర్లు , కుండీలలో కూడా బాగా పెరుగుతాయి. 3-4 అంగుళాల లోతు , సరైన డ్రైనేజీ రంధ్రాలు ఉండేలా చూసుకోండి. తేమ , వెచ్చని వాతావరణం అవసరం కాబట్టి వాటిని పండించడానికి ఇంట్లో సెమీ షేడ్ ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోవాలి. కంపోస్ట్ కలిపిన సారవంతమైన మట్టితో కుండీని ఉపయోగించాలి. మంచి నాణ్యమైన పచ్చిమిర్చి విత్తనాలను తీసుకుని, కుండీలో ఒక అంగుళం లోతులో నాటండి. మట్టిని తేమగా ఉంచాలి. అలా అని ఎక్కువ నీరు పోయకూడదు. వాతావరణాన్ని బట్టి ప్రతి రోజు లేదా ప్రతి 2 రోజులకు ఒకసారి నీరు పోయాలి. నీళ్లు ఎక్కువైతే మొక్క కుళ్లిపోతుంది. విత్తనాలను నాటిన 7-10 రోజులలో రెండు చిన్న మొలకలు వస్తాయి. వీటికి ప్రతిరోజూ 5-6 గంటల సూర్యకాంతి తగిలేలా చూసుకోవాలి. కాస్త ఎదిగిన తరువాత ఈ మొక్కలకు ట్రిమ్మింగ్ చాలా కీలకం. పూతకు ముందే చివర్లను కత్తిరిస్తే, మొక్క గుబురుగా వచ్చి, తొందరగా పూత కొస్తుంది. పూత దశలో లిక్విడ్ ఫెర్టిలైజర్ మొక్కకు అందిస్తే పూత నిలబడి, బోలెడన్ని కాయలు వస్తాయి. సరైన రక్షణ, పోషణ అందితే దాదాపు రెండేళ్లయినా కూడా మిరప చెట్టు కాయలు కాస్తుంది. -
అక్కినేని ఫ్యామిలీ కిచెన్ గార్డెన్..వాళ్ల గ్లామర్ రహస్యం ఇదేనా!
కిచెన్ గార్డెన్ అంటూ ఇటీవల దాని ప్రాముఖ్యత గురించి గట్టిగా ప్రచారం చేస్తున్నారు నిపుణులు. అపార్టమెంట్లో ఉంటున్నాం అని బాధపడాల్సిన పనిలేదని అక్కడ కూడా పెరటి మొక్కలు ఎలా పెంచుకోవచ్చో వివరిస్తున్నారు కూడా. అయితే దీనికి సెలబ్రెటీలు, ప్రముఖుల నుంచి మంచి విశేష ఆధరణ ఉంది. అందులోనూ వాళ్ల గ్లామర్‌ను కాపాడుకోవడంలో ముఖ్యంగా జాగ్రత్త ఉంచుకోవాల్సింది ఆరోగ్యం. అందుకని వాళ్లంతా ఈ పెరటి కాయగూరలకే ప్రివరెన్స్ ఇస్తున్నారు. అందులోనూ టాలివుడ్‌కి చెందిన అక్కినేని కుటుంబం ఎంత హెల్తీగా గ్లామార్గా ఉంటారో తెలిసిందే. మితంగా తినండి ఆరోగ్యంగా ఉండండని చాలామందికి సలహలు కూడా ఇస్తుంటారు. ఆ అక్కినేని ఫ్యామిలీ కిచెన్ గార్డెన్ విశేషాలు, వారి ఆరోగ్య రహస్యం ఏమిటో చూద్దామా!. అక్కినేని ఫ్యామిలీలోని లెజెండరి నటుడు నాగేశ్వరావు గారి దగ్గరి నుంచి అఖిల్ వరకు అంతా మంచి ఆరోగ్యంగా గ్లామరస్‌గా కనిపిస్తారు. ముఖ్యంగా నాగేశ్వరరావు గారు యంగ్ హీరోలకు తీసిపోని విధంగా బాడీని మెయింటైన్ చేసేవారు. అయితే వారంతా తినే తిండి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా బిజీగా ఉన్న సమయం నుంచి ఇప్పటి వరకు వారు వారి ఇంట్లో పండే కూరగాయలే కుటుంబ సభ్యులు తింటారు. నాగేశ్వరరావు ఇంటి పక్కనే ఒక కిచెన్ గార్డెన్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజు వాకింగ్‌కి వెళ్లి వచ్చిన తర్వాత ఆ కిచెన్ గార్డెన్లో కాసేపు పనిచేస్తే కానీ ఆయనకు రోజు గడవదని కూడా తరుచు చెబుతుండేవారు. ఈ కిచెన్ గార్డెన్ అనే కాన్సెప్ట్ చాలా ఏళ్ల నుంచి అక్కినేని ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా వారు ఆ కిచెన్ గార్డెన్ ని అలాగే కొనసాగిస్తున్నారు. మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొనకుండా వారి పెరట్లో పండిన కూరగాయలకే ప్రిపరెన్స్ ఇస్తారు. అలాగే కిచెన్ నుంచి వచ్చే ప్రతి వేస్ట్ ని కూడా కంపోస్ట్ చేస్తూ అక్కడే చెట్లకు ఎరువులుగా వాడుతారు. ఇక ఆ అక్కినేని హీరోల డైట్ వద్దకు వస్తే..అక్కినేని మాత్రం చాలా తక్కువగా తినేవారు. ముఖ్యంగా బెల్లంతో చేసిన స్వీట్స్ అంటే ఆయనకు ఎంతో ఇష్టం. నాగార్జున అయితే అన్నీ తక్కువ మోతాదులో తీసుకుంటారు. ఇక నాగార్జున గురించి చెప్పాలంటే నవ మన్మథుడే ఈ హీరో. టాలీవుడ్ కింగ్ ఈ బాస్. 62 ఏళ్ల వయసులోనూ కుర్రహీరోలకు ధీటుగా ఫిట్ నెస్ ను మెయింటెన్ చేస్తూ ఉంటాడు. చాలా మంది హీరోలకు నాగార్జున ఆదర్శం అనడంలో సందేహం లేదు. నాగ్ ఫేస్ లో ఎప్పుడు గ్లో ఉంటుంది. నాగచైతన్య, అఖిల్ కూడా అంతే తండ్రిలానే ఫుల్ జోష్, అందంగా ఉంటారు. ఇక అక్కినేని నాగేశ్వరరావుగారి అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే?..కుర్ర హీరోలకు కూడా జెలసీ వచ్చేంత బాగుండేవారు. వయసు మీద పడ్డా కూడా అందంగా కనిపించేవారు. ఇలా వారి కుటుంబం అంతా ఇంత ఆరోగ్యంగా, ఫిట్నెస్గా ఉండటానికి వారు అనుసరిస్తున్న ఆరోగ్యకరమైన జీవనశైలి, తీసుకుంటున్న మంచి ఆహారమే కారణం. (చదవండి: ఆ ఊళ్లో అతనొక్కడే!.. ఇంకెవరూ ఉండరు!) -
నేచర్ అర్బైన్.. అతిపెద్ద రూఫ్‌టాప్ పొలం!
పారిస్.. ఫ్రాన్స్ రాజధాని. అత్యంత జనసాంద్రత కలిగిన యూరోపియన్ రాజధానులలో ఒకటి. కాంక్రీటు అరణ్యంగా మారిపోవటంతో పచ్చని ప్రదేశాల విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. అన్నే హిడాల్గో అనే మహిళ 2014లో మేయర్‌గా ఎన్నికైన తర్వాత పారిస్ పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. సాధారణ పచ్చదనంతో అన్నే సంతృప్తి చెందలేదు. విస్తారమైన వాణిజ్య సముదాయాల పైకప్పులను పచ్చని సేంద్రియ పంట పొలాలుగా మార్చాలని ఆమె సంకల్పించారు. అర్బన్ కిచెన్ గార్డెన్స్ నిర్మించే సంస్థలను ప్రోత్సహించడానికి నిర్మాణాత్మక కార్యాచరణ చేపట్టి సఫలీకృతులవుతున్నారు. పారిస్‌లో అర్బన్ అగ్రికల్చర్ విస్తీర్ణాన్ని 100 హెక్టార్లకు విస్తరించాలన్న లక్ష్యానికి చేరువలో ఉన్నారు మేయర్ అన్నే హిడాల్గో. పారిస్కల్చర్ రూఫ్టాప్లపైన, పాత రైల్వే ట్రాక్ పొడవునా, భూగర్భ కార్ల పార్కింగ్ ప్రదేశాల్లోనూ, ఖాళీ ప్రదేశాల్లో సేంద్రియ పంటలు, పుట్టగొడుగుల సాగును ప్రోత్సహిస్తు న్నారు. ‘ద పారిస్కల్చర్స్’ పేరిట అర్బన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్‌లకు ప్రోత్సాహం ఇచ్చే పథకానికి మేయర్ శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి అత్యాధునిక మిద్దె (రూఫ్‌టాప్) పొలాలు నగరం అంతటా వెలుస్తున్నాయి. వాటిల్లో ‘నేచర్ అర్బైన్’ అతి పెద్దది. దక్షిణ పారిస్‌లో అద్భుతమైన కొత్త ఎగ్జిబిషన్ హాల్ భవనం పైన 14,000 చదరపు మీటర్ల (3.45 ఎకరాల) విస్తీర్ణంలో ఈ రూఫ్‌టాప్ ఫామ్ ఏర్పాటైంది. రోజుకు వెయ్యి కిలోల సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, సలాడ్ గ్రీన్స్, స్ట్రాబెర్రీ తదితర పండ్లను ఉత్పత్తి చేస్తున్న ‘నేచర్ అర్బైన్’లో 20 మంది పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రూఫ్‌టాప్ క్షేత్రంగా ఇది పేరుగాంచింది. పారిస్ వాసులకు లెట్యూస్, టొమాటోలు, స్ట్రాబెర్రీలు, దుంపలు, తులసి, పుదీనా, ఇతర తాజా 35 రకాల సేంద్రియ పండ్లు, కూరగాయ లతో పాటు ఔషధ, సుగంధ మొక్కలను ‘నేచర్ అర్బైన్’ అందిస్తోంది. కరోనా మహమ్మారి మొదటి దఫా లాక్డౌన్ ముగిసిన తర్వాత .. నగరాల్లోనే సాధ్యమైనంత వరకు సేంద్రియ ఆహారోత్పత్తుల ఆవశ్యకతను చాటిచెబుతూ ‘నేచర్ అర్బైన్’ ప్రారంభమైంది. ఆక్వాపోనిక్స్.. హైడ్రోపోనిక్స్.. రూఫ్‌టాప్ పొలంలో రసాయన ఎరువులు, పురుగుమందులు, శిలీంద్రనాశినులు వాడరు. ఆక్వాపోనిక్స్, హైడ్రోపోనిక్స్ పద్ధతిలో పంటలను సాగు చేస్తున్నారు. మట్టిని వాడరు. పోషకాలు, ఖనిజాలు, జీవన ఎరువులతో కూడిన పోషక ద్రావణం కలిపిన నీటిని మొక్కల వేర్లకు అందిస్తూ పంటలను 10% నీటితోనే సాగు చేస్తున్నారు. నిలువు ప్లాస్టిక్ స్తంభాలలో లెట్యూస్, తులసి, పుదీనా మొక్కలు ఏరోపోనిక్స్ పద్ధతిలో ఏపుగా పెరుగుతుంటాయి. (క్లిక్ చేయండి: పేదల ఆకలి తీర్చే ఆర్గానిక్ గార్డెన్స్!) వీటికి ఎదురుగా, సన్నగా, అడ్డంగా ఉండే ట్రేలలో కొబ్బరి పొట్టులో నోరూరించే దేశవాళీ చెర్రీ టొమాటోలు, నాటు వంకాయలు, టొమాటోలు, కీర దోస తదితర కూరగాయలను పెంచుతున్నారు. పారిస్ వాసులు స్వయంగా తామే ఈ రూఫ్‌టాప్ పొలంలో పంటలు పండించుకోవడానికి ఎత్తు మడులతో కూడిన ప్లాట్లను ఏడాదికోసారి అద్దెకిస్తారు. 140 కూరగాయల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. నగరవాసులకు సాగు నేర్పడానికి పారిస్ నగరపాలక సంస్థ ఒక ప్రత్యేకమైన స్కూల్‌ను కూడా ప్రారంభించింది. పారిస్ నగరపాలకుల ప్రయత్నాల వల్ల స్థానికుల ఆహారపు అవసరాలు తీరేది కొద్ది మేరకే అయినప్పటికీ, తద్వారా ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ఒనగూరే బహుళ ప్రయోజనాలు మాత్రం అమూల్యమైనవి! – పంతంగి రాంబాబు -
పెరటింట..ప్రకృతి తోట
సాక్షి ప్రతినిధి, కడప: ప్రకృతి వ్యవసాయంలో వ్యవసాయ పంటలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఇటు కూరగాయల పంటలకు అంతే ప్రాధాన్యం ఇస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఒక సెంటు నుంచి ఐదు సెంట్ల ఖాళీ జాగాల్లో కిచెన్ గార్డెన్స్, ఇంటి ఆవరణలో న్యూట్రి గార్డెన్స్, ఇంటిపైన టెర్రస్ గార్డెన్స్ పేరుతో పలు రకాల కూరగాయల పంటలను ప్రోత్సహిస్తోంది. దీనిపై ప్రజలకు విస్తృత ప్రచారం కల్పిస్తోంది. ఇందుకోసం నాణ్యమైన విత్తనాలను సరఫరా చేస్తోంది. ప్రకృతి వ్యవసాయంలో పెరటి తోటలు హైబ్రీడ్ విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకానికి స్వస్తి పలికి ప్రభుత్వ సూచనలతో ప్రకృతి వ్యవసాయంవైపు మొగ్గుచూపుతున్న రైతులు అదే సమయంలో ఈ విధానంలో కూరగాయల పంటల సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. రైతులే కాకుండా భూములు లేని ప్రజలు సైతం తమ ఇళ్ల వద్దనే కొద్దిపాటి స్థలంలో ప్రకృతి వ్యవసాయంలో కూరగాయల సాగుకు సిద్ధమవుతున్నారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు విభాగం సలహాలు, సూచనలతో ఈ తరహా వ్యవసాయానికి వేలాది మంది ఇప్పటికే ›శ్రీకారం చుట్టారు. కొందరు పంట పొలాల్లోనే ఇతర పంటలతోపాటు కూరగాయలు పండిస్తుండగా చాలామంది ఇళ్ల వద్దనే కూరగాయలు సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ విభాగం గణాంకాల ప్రకారం జిల్లాలో ఇప్పటివరకు 75,452 కిచెన్ గార్డెన్స్ ఏర్పాటయ్యాయి. ఇందులో భూమి లేని పేదలు 24,399 మంది తమ ఇళ్ల వద్దనే ఉన్న ఖాళీ స్థలంలో నేచురల్ ఫార్మింగ్ ద్వారా పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఇక నూట్రిగార్డెన్స్ 274 ఉండగా, 186 టెర్రస్ గార్డెన్స్ ఉన్నాయి. ఇవన్నీ కేవలం పకృతి వ్యవసాయం పద్ధతిలో సాగు చేస్తున్న ప్లాంట్లు కావడం గమనార్హం. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలోని బద్వేలు, కమలాపురం, పులివెందుల, మైదుకూరు, రాయ చోటి, రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాలతోపాటు పలు నియోజకవర్గాల్లో గ్రామగ్రామాన నేచురల్ ఫార్మింగ్ కిచెన్ గార్డెన్స్‌ను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగ ప్రాజెక్టు కృషి చేస్తోంది. ఈ విభా గం పరిధిలోని మాస్టర్ ట్రైనర్స్, ఇంటర్నల్ కమ్యూనిటీ సోర్స్ పర్సన్స్, నేచురల్ ఫార్మింగ్ అసోసియేట్స్ తదితర విభాగాల్లో పనిచేస్తున్న వారు గ్రామాల్లోని గ్రామ సంఘాల ద్వారా అక్కడి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కిచెన్ గార్డెన్స్, న్యూట్రి గార్డెన్స్, టెర్రస్ గార్డెన్స్‌లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే గార్డెన్స్ ఏర్పాటు చేసిన వారు 15–30 రకాల కూరగాయలు, ఆకుకూరలు, క్యారెట్, బంగాళాదుంప, ఉల్లిపాయలు తదితర వాటిని ఈ తరహా వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్నారు. ప్రత్యేకంగా పురుగు మందులు ఇక పంటలకు సోకిన తెగుళ్లను నివారించేందుకు నీళ్లలో వేపాకు పిండి, పేడ, కుంకుడు కాయల పొడి తదితర వాటిని కలిపి వడగట్టి దోమపోటుతోపాటు ఇతర తెగుళ్లకు పిచికారీ చేస్తున్నారు. రసాయనిక ఎరువులు,పురుగు మందులు లేకుండా.. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా కిచెన్గార్డెన్స్ను నిర్వహిస్తున్నారు.పోషకాహారం ఎరువు స్థానంలో ఘన జీవామృతం పేరుతో పేడ, పప్పుదినుసులు పిండి, నల్లబెల్లం, పుట్టమట్టి, ఆవు లేదా ఇతర పశువుల మూత్రం కలిపి ఘన జీవామృతాన్ని, ఇదే వస్తువులను నీటిలో కలిపి జీవామృతం పేరుతో డ్రిప్ లేదా స్ప్రింకర్ల ద్వారా ఎరువుగా పంటకు అందజేస్తున్నారు. ఆరోగ్యమే ప్రధానం ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు తినడం వల్ల విటమిన్స్, మినరల్స్ అధికంగా పొందే అవకాశం ఉంటుంది. తద్వారా అనారోగ్యం దరిచేరకుండా ఉంటుంది. రసాయనిక ఎరువులు, పురుగు మందులు లేని కలుషిత రహిత ఆహారం తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని గార్డెన్స్ ఏర్పాటు చేసిన వారు పేర్కొంటున్నారు. కిచెన్ గార్డెన్స్‌లో పండించిన ఉత్పత్తులను అమ్ముకుంటూ ఇంటి ఖర్చులను పూడ్చుకుంటున్నట్లు పలువురు పేర్కొంటుండడం గమనార్హం. విటమిన్స్, మినరల్స్ లభ్యమవుతాయి ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రతి ఒక్కరూ కూరగాయల పంటలు పండించేలా చూస్తున్నాం. ఇంటిపైన ఖాళీ స్థలంలోనూ టెర్రస్ గార్డెన్స్ పేరుతో కూరగాయలు సాగు చేయిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే కూరగాయలు తినడం వల్ల విటమిన్స్, మినరల్స్ లభ్యమవుతాయి. తద్వారా ఆరోగ్యం బాగుంటుంది. అందుకే అందరినీ ప్రోత్సహిస్తున్నాం. – సంధ్య, మాస్టర్ ట్రైనర్, హెల్త్, న్యూట్రిషియన్, కడప ప్రకృతి వ్యవసాయంతోనే కూరగాయలు పండిస్తున్నాం మా ఇంటి వద్ద ఐదు సెంట్ల ఖాళీ స్థలంలో అన్ని రకాల కూరగాయలు, క్యారెట్, ఇతర వాటిని కూడా పండిస్తున్నాం. తోట పెట్టి నాలుగు నెలలైంది. మేము ఆరోగ్యకరమైన కూరగాయ లు తినడమే కాకుండా మిగిలిన వాటిని అమ్ముతున్నాం. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా ఎరువులు, జీవామృతం తదితర వాటితో కూరగాయలు పండిస్తున్నాం. –సునీత, సింగరాయపల్లె, కలసపాడు మండలం పెద్ద ఎత్తున పెరటి తోటల పెంపకం జిల్లాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పెద్ద ఎత్తున పెరటి తోటల పెంపకాన్ని చేపట్టారు. ఇప్పటివరకు 75 వేలకు పైగా కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చేశాం. రైతులతోపాటు ఇళ్ల వద్ద తోటల పెంపకానికి మొగ్గుచూపే ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. నాణ్యమైన విత్తనాలు అందిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయ విధానంలో కూరగాయలు, పండించుకుని తినడం వల్ల ఆరోగ్యానికి ఉపయోగకరం. – రామకృష్ణరాజు, డీపీఎం,ప్రకృతి వ్యవసాయం,కడప -
పది నెలలుగా ఇంటి కూరగాయలే
చుట్టూ పచ్చని వాతావరణం.. ఉదయం లేవగానే పలకరించే పూలు.. తాజా సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు... ఇవన్నీ పట్టణంలోనే మన ఇంటిపైనే అందుబాటులోకి తెచ్చుకుంటే అంతకన్నా ఆనందం ఏమి ఉంటుంది. డా. వేదప్రకాశ్, కిరణ్మయి దంపతులు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి గాయత్రీ నగర్‌లోని తమ ఇంటిపై ఎంతో శ్రద్ధగా cను ఏర్పాటు చేసుకున్నారు. బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్‌గా డా. వేదప్రకాశ్ పనిచేస్తున్నారు. 280 చదరవు గజాల ఇంటి పైకప్పుపై ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలతో ఒక పచ్చని లోకాన్ని సృష్టించారు. ఇటు కుండీలు, గ్రోబాగ్స్‌లోను.. అటు హైడ్రోపోనిక్స్ పద్ధతిలోనూ ఇంటిపంటలు సాగు చేసుకొని పది నెలలుగా తింటున్నారు. లాక్డౌన్ సమయంలో పది నెలల క్రితం డా. వేదప్రకాశ్ ఈ మిద్దె తోటకు శ్రీకారం చుట్టారు. కోతుల నుంచి కాపాడుకునేందుకు ఇనుప జాలీని ఏర్పాటు చేస్తూ ఇంటికి కావలసిన కూరగాయలన్నీ పండిస్తున్నారు. రసాయనిక అవశేషాల్లేని కూరగాయలను బందువులు, స్నేహితులకూ రుచి చూపిస్తున్నారు. వేదప్రకాశ్‌తో పాటు కుటుంబ సభ్యులందరూ ఇంటి పంటల సాగు పనులు చూసుకుంటున్నారు. 32 రకాల కూరగాయల సాగు వేదప్రకాశ్ ఇంటి పైకప్పుపై 32 రకాల కూరగాయలు సాగవుతున్నాయి. బీర, కాకర, దోస, గుమ్మడి, చిక్కుడు, సోరకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యారెట్, వంకాయ, టమాట, చిక్కుడు, మిర్చి, క్యాప్సికం, అల్లం, వెల్లుల్లి, ఆలు, ఇలాయిచీ వంటివి పండిస్తున్నారు. అలాగే పాలకూర, తోటకూర, మెంతి, కొత్తిమీర, గోంగూర, బచ్చలి, బిర్యానీ ఆకును అక్కడ పండిస్తున్నరు. అలాగే మామిడి, అరటి, యాపిల్ చెర్రీ, వాటర్ యాపిల్, స్ట్రాబెర్రీ, గ్రేప్స్, సింగపూర్ చెర్రి, జామ, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్స్, నిమ్మ, ఆరెంజ్, బత్తాయి, బాదాం, పనస, మునగ వంటి పండ్లు, కాయల చెట్లు పెంచుతున్నారు. అప్పటి నుంచి మార్కెట్‌కు వెళ్ల లేదు వేదప్రకాశ్ తన ఇంటిపైకప్పుపై పండిస్తున్న కూరగాయలు వాళ్ల ఇంటి అవసరాలకే కాకుండా, ఇరుగు పొరుగు వారికి, బంధువులు, స్నేహితులకు ఇస్తున్నారు. గడచిన పది నెలలుగా మార్కెట్లో అడుగు పెట్టలేదని కిరణ్మయి తెలిపారు. ఇంటి అవసరాలకు కావలసిన అన్ని రకాల కూరగాయలు అక్కడే లభిస్తున్నాయి. మార్కెట్లో లభించనివి కూడా మిద్దెపై అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో ఈ రోజు ఏ కర్రీ వండుకోవాలో మిద్దెపైకి వెళ్లి అక్కడ చూసి నిర్ణయం తీసుకుంటారు. క్షణాల్లో తమకు కావలసిన కూరగాయలను కోసుకుని వెళ్లి వండుకోవడం జరుగుతోంది. ఇంటిపంటల మధ్య వెదురు బొంగులతో వేసిన కుటీరం ఎంతో ఆహ్లాదాన్ని పంచుతోంది. పండుగల పూట, బంధువులు, స్నేహితులు వచ్చినపుడు అందరూ అక్కడే కూర్చుని భోజనాలు చేస్తున్నారు. రాత్రి పూట రంగురంగుల విద్యుద్దీపాల మద్యన విందులు చేసుకుంటున్నారు. ఇంటికి ఎవరు వెళ్లినా మిద్దెపైకి తీసుకువెళ్లి అంతా చూయిస్తారు. తిరిగి వెళ్లేటపుడు కూరగాయలు కత్తిరించి చేతిలో పెట్టి పంపించడం వాళ్లకు ఆనవాయితీగా మారింది. – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి పంట చేలో ఉన్నంత ఆనందం మిద్దె మీద కూరగాయలు, ఆకుకూరలు పండించుకుంటున్నాం. పది నెలల కాలంగా మార్కెట్‌కు వెళ్లే అవసరం రాలేదు. ఇంట్లో అందరం పొద్దున లేస్తే చాలు మిద్దెపైకి రావడం, మొక్కలకు నీళ్లు పట్టడం, వాటì ని చూసుకోవడం అలవాటైంది. మనకు కావలసిన కూరగాయలు మనమే పండించుకుంటే ఎంత ఆనందాన్ని పొందవచ్చో మాకు అర్థమైంది. ఎలాంటి రసాయనాలు లేకుండా కూరగాయలు పండిస్తున్నాం. పండుగల సందర్భంగా అందరం కలిసి ఇక్కడే భోజనం చేస్తుంటే పంట చేను దగ్గర తిన్నంత తృప్తి కలుగుతోంది. – డాక్టర్ వేదప్రకాశ్ (95531 81399), కామారెడ్డి -
ప్రజా ఉద్యమంలా ఇంటిపంట
పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం, ఆహారం లో పురుగు మందుల అవశేషాలు ఎరుగుతున్న నేపధ్యం లో 2011లో ‘సాక్షి’ దినపత్రిక, సుస్థిర వ్యవసాయ కేంద్రం, హార్టీకల్చర్ సొసైటీలు కలిసి హైదరాబాద్ నగరంలో ఇంటిలోనే, వున్న స్థలం లోనే కొన్ని కూరగాయలు పండించుకోవటం, ఇంటిలో ఉండే జీవ వ్యర్ధాల్ని కంపోస్ట్‌గా మార్చి వాడుకోవటం వాడుకోవటంపై కొన్ని శిక్షణలు, అనుభవాలు పంచుకోవటానికి ఒక వేదిక గా ‘ఇంటిపంట’ ప్రారంభించటం జరిగింది. ప్రతి వారం రెండు రోజులు సాక్షి పత్రికలో వ్యాసాలు, అనుభవాలు పంచుకోవటం, హైదరాబాద్ నగరం ఏదో ఒక ప్రాంతంలో ఒక సాయంత్రం దీనిపై శిక్షణ ఏర్పాటు చేయటం వలన వేల మంది ఇందులో పలు పంచుకునే అవకాశం కలిగింది. మా ఇంటితో పాటు నగరంలో చాలా ఇళ్లు ఇంటిపంటల ప్రదర్శన శాలలుగా మారాయి. ఉద్యానవన శాఖ, సుస్థిర వ్యవసాయ కేంద్రం ఇంకా అనేక సంస్థలు తమ ఆఫీస్‌పైన కూడా కూరగాయలు పండించటం, భారతీయ విద్యా భవన్‌లాంటి స్కూళ్లలో కూడా పిల్లలతో ఇలాంటి ప్రయత్నాలు చేయటం జరిగింది. హైదరాబాద్‌లోని అనేక కార్పొరేట్ సంస్థల్లోను, స్వచ్ఛంద సంస్థలలోను ఈ శిక్షణలు ఏర్పాటు చేయటం, ప్రదర్శనలు ఏర్పాటు చేయటం జరిగింది. కొన్ని అపోహలు, సమస్యలు.. పరిష్కారాలు చాలా మందికి ఇంటిపైన పంటలు పెంచుకోవటానికి కుండీలు కాని, బెడ్స్ కాని ఏర్పాటు చేసుకుంటే బరువుకి ఇంటికి ఏమవుతుంది అని భయపడుతుంటారు. కుండీలు/ బెడ్స్‌లో సగానికంటే ఎక్కువ భాగం కంపోస్ట్, పావు వంతు కోకోపిట్ (కొబ్బరి పొట్టు) కలుపుకుంటే బరువు తగ్గుతుంది, నీటిని పట్టి ఉంచే గుణం పెరుగుతుంది, అలాగే మట్టి గట్టిపడే సమస్య తగ్గుతుంది. నీరు పెట్టటం వలన ఇంటి పై కప్పు పాడయ్యే అవకాశం వుంటుంది అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. మనం కావలిసినంత మేరకే నీరు పెట్టుకోవాలి, నీరు కొద్దిగా బయటకు వచ్చినా పెద్ద సమస్య ఉండదు. సీజన్లో పండే కూరగాయలు, ఆకుకూరలు కలిపి ఈ కుండీలు/ కంటైనర్లు/ బెడ్స్ పైన పండించుకోవచ్చు. ‘ఇంటిపంట’తో వచ్చిన అనుభవాలతో ‘బడి పంట’ కూడా ప్రారంభించటం జరిగింది. చిన్న స్కూల్లో పిల్లలు నేర్చుకోవటానికి ఉపయోగపడే వాటి నుంచి, మధ్యాహ్న భోజన అవసరాలు తీరేలా, హాస్టల్ అవసరాలు తీరేలా ఈ బడి తోటలు డిజైన్ చేయటం జరిగింది. తెలంగాణ లో ఇప్పుడు కొన్ని రెసిడెన్సియల్ స్కూల్లో ఈ మోడల్స్ ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే, ఇంటిపంట సాగులో భాగస్వాములు అయిన అనేక మంది అనేక మోడల్స్ ఏర్పాటు చేయటం, విత్తనాల సేకరణ, పంచుకోవటం చేయటం చేసారు. ఒక సంవత్సరంలోనే 10 వేల మందికి పైగా ఇంటిపంటలు ఏర్పాటు చేసుకున్నారంటే ఈ కార్యక్రమం ప్రభావం ఎంత వున్నది అన్నది అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికి అనేక పేర్లతో, అనేక వాట్సప్ గ్రూప్‌లలో, ఫేస్బుక్ గ్రూప్‌లలో ఇంటిపంటలు పండించుకునే వారు తమ తమ అనుభవాలు పంచుకోవటం, ఇతరుల నుంచి నేర్చుకోవటం చేస్తున్నారు. చిన్న స్థలాన్ని కూడా సమర్ధవంతంగా ఇంటి ఆహారం పండించుకోవటానికి ఎలా వాడుకోవచ్చు అని అర్ధం చేసుకోవటంతో పాటు రెండు కీలకమైన అంశాలు ఈ శిక్షణలో భాగస్వామ్యం అయ్యాయి. ఒకటి, ఇంటి వ్యర్ధాల్ని బయట పడేసి పర్యావరణాన్ని పాడు చేసే కంటే, ఇంటిలో, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లలో, కాలనీలలోనే కంపోస్ట్ చేసుకునే పద్దతులు, రెండు, ఇంటిపై, చుట్టూ పడిన వాన నీటిని ఫిల్టర్ చేసుకొని మరల వాడుకోవటానికి ప్రయత్నం చేయటం. ఈ మూడు పద్ధతులు కాని ప్రతి ఇంటిలో పాటిస్తే నగరంలో మనం చూస్తున్న చెత్త, వర్షం రాగానే జలమయం అవుతున్న రోడ్ల సమస్యలు చాలా మటుకు తగ్గిపోతాయి. ఇందుకు ప్రతి కాలనీ/అపార్ట్మెంట్ వేల్ఫేర్ కమిటీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రయత్నాలు చేయాలి. ఒక చిన్న ఆలోచన, చిన్న ప్రయత్నం ఒక ప్రజా ఉద్యమంగా ఎలా తాయారు అవుతుంది అన్న దానికి మన ‘ఇంటిపంట’ ఒక ఉదాహరణ. ‘సాక్షి’ దిన పత్రిక ఆ తర్వాత చేసిన ‘సాగుబడి’ ప్రయత్నం కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి తోడ్పడింది. ఇలాంటి అనేక ప్రయత్నాలు ‘సాక్షి’ చేయాలని, హైదరాబాద్ నగర వాసులు ఇలాంటి ప్రయత్నాలలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ అందరికీ అభినందనలతో పాటు ఇలాంటి ప్రయత్నాలకి మా వంతు సహకారం ఇస్తామని మరల, ఒకసారి ఇలాంటి ప్రయత్నం అందరం చేయాలనీ ఆశిస్తున్నాం. – డాక్టర్ జీ వీ రామాంజనేయులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సుస్థిర వ్యవసాయ కేంద్రం (90006 99702) -
పదేళ్ల మన ‘ఇంటిపంట’
సేంద్రియ ఇంటిపంటల సాగులో ఆధునిక పద్ధతులను తెలుగునాట విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చిన కాలమ్ ‘ఇంటిపంట’. మేడలపై కుండీల్లో, మడుల్లో పంటలు పండించి తినటం అయ్యేపనేనా అని మొదట్లో సందేహించినా.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాలే కాదు గ్రామాల్లో కూడా పెరట్లోనో, ఇంటి ముందున్న కొద్ది పాటి స్థలంలోనో, మేడ మీదనో ఎవరికి తోచిన విధంగా వారు లక్షలాది మంది సాగు చేస్తూ ఆనందిస్తున్నారు. దేశ, విదేశాల్లో సేంద్రియ ఇంటిపంటల సాగు విశేషాలతో పాఠకులను ఆరోగ్యదాయకమైన ఆచరణ వైపు పురిగొల్పిన ‘సాక్షి’ దినపత్రికలోని ‘ఇంటిపంట’ తెలుగు పత్రికా రంగంలో ఓ ట్రెండ్‌సెట్టర్. మార్కెట్లో అమ్ముతున్న కూరగాయలు, ఆకుకూరల్లో రసాయనాల అవశేషాల వల్ల ప్రజారోగ్యానికి వాటిల్లుతున్న నష్టాన్ని గురించి ‘కాయగూరల్లో కాలకూటం’ శీర్షికన కథనాన్ని ‘సాక్షి’ ప్రచురించింది.. కథనం రాశాం. అంతటితో మన బాధ్యత తీరింది అని అంతటితో సరిపెట్టుకొని ఉంటే.. ‘ఇంటిపంట’ కాలమ్ 2011 జనవరి 21న ప్రారంభమయ్యేదే కాదు! అప్పట్లో వారానికి రెండు రోజులు ప్రచురితమైన ‘ఇంటిపంట’ కథనాలు పెద్ద సంచలనమే రేపాయంటే అతిశయోక్తి ఎంత మాత్రమూ కాదు. సీన్ కట్ చేస్తే.. సరిగ్గా పదేళ్ల తర్వాత.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది సేంద్రియ ఇంటిపంటలను ఎంతో మక్కువతో సాగు చేస్తున్నారు. టెర్రస్ మీద కిచెన్ గార్డెన్ కలిగి ఉండటం ఆరోగ్యదాయకమే కాదు ఇప్పుడు అదొక స్టేటస్ సింబల్‌గా మారిపోయింది అంటారు మిద్దె తోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి. దాదాపు అన్ని పత్రికలు, టీవీ ఛానల్స్ ఈ ట్రెండ్‌ను అనుసరిస్తున్నాయి. సోషల్ మీడియా సంగతి అయితే ఇక చెప్పనక్కరలేదు. రఘోత్తమరెడ్డి వంటి వారు ఫేస్బుక్లో అనుదినం రాస్తూ ఉంటే.. తమ టెర్రస్‌లపై ఇంటిపంటల సాగు అనుభవాలను ప్రజలకు ప్రభావశీలంగా అందించడానికి ఏకంగా సొంత యూట్యూబ్ ఛానళ్లనే ప్రారంభించారు కొందరు సీనియర్ కిచెన్ గార్డెనర్లు! హైదరాబాద్‌కు చెందిన పినాక పద్మ, లత, నూర్జహాన్, శాంతి ధీరజ్.., వైజాగ్‌కు చెందిన ఉషా గజపతిరాజు.. ఈ కోవలోని వారే! ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం రైతులందరినీ ప్రకృతి/సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించటమే. అందుకు చాలా ఏళ్లు పట్టవచ్చు. అయితే, అప్పటి వరకు ఆగకుండా ఇప్పటికిప్పుడు ప్రజలు (ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారు) తమ ఆరోగ్యం కోసం తాము చేయదగినదేమైనా ఉందా?? ఈ ప్రశ్నే ‘ఇంటిపంట’ కాలమ్ పుట్టుకకు దోహదం చేసింది. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఈ రోజే సేంద్రియ ఇంటిపంటల సాగు ప్రారంభించండి అంటూ ప్రోత్సహించి.. దారి దీపం అయ్యింది ‘ఇంటిపంట’. కరోనా, ఏలూరు హెల్త్ ఎమర్జెన్సీ నేపథ్యంలో సేంద్రియ ఇంటిపంటల సాగు ఎంత అవసరమో కాదు.. కాదు.. ఎంతటి ప్రాణావసరమో ప్రతి ఒక్కరికీ బోధపడింది! వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న ‘సాక్షి’ మీడియా గ్రూప్ చైర్పర్సన్ వైఎస్ భారతి రెడ్డి గారికి, అనుదినం వెనుక ఉండి నడిపిస్తున్న సంపాదకులు వర్ధెల్లి మురళి గారికి, ‘ఇంటిపంట’, ‘సాగుబడి’ భావనలకు ఊపిర్లూదిన అప్పటి ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి.. ఈ మహాయజ్ఞంలో నన్ను ‘కలం’ధారిగా చేసినందుకు వేన వేల వందనాలు!! – పంతంగి రాంబాబు, ఇంటిపంట / సాగుబడి డెస్క్ -
సాగుబడి
సాక్షి, హైదరాబాద్: తాజా కూరగాయలు.. ఆకు కూరలు. అప్పటికప్పుడు కోసి అక్కడికక్కడే వండుకొని తింటే ఆ రుచే వేరు. రసాయనాలు లేకుండా.. సేంద్రియ ఎరువులతో పండించే ఆహారం భుజిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు. ఖర్చు కూడా ఆదా. ఇదే విధానాన్ని ఇకపై ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల విద్యాలయాల్లో అమలు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ప్రతి బడిలో కిచెన్‌గార్డెన్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. కల్తీ, నాసిరకం కూరగాయలు వండి వార్చుతుండటంతో బడి పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. పోషక విలువలు లేకపోవడంతో చిన్నారుల ఎదుగుదల, మేధస్సుపై విపరిణామం కనబరుస్తోంది. అందుబాటులో పౌష్టికాహారం.. కూరగాయల ధరలు కూడా నింగినంటడం.. కొనుగోలు కూడా భారంగా మారడంతో విద్యాసంస్థల్లో దాదాపుగా ఒకటే మెనూ ఉంటోంది. ఈ నేపథ్యంలో కిచెన్ గార్డెన్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రతి స్కూల్ ఆవరణలు, మిద్దెలపై (టెర్రస్ గార్డెన్) పండ్లు, కూరగాయల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించింది. పోషకాల పాఠశాల–కిచెన్ గార్డెన్ (ఎన్‌ఎన్‌కేజీ) పేరిట పాఠశాలలు, ఆశ్రమ స్కూళ్లు, హాస్టళ్లలో వీటిని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. తోటల పెంపకంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలని నిర్ణయించింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, వార్డెన్లు, అధికారులతో కిచెన్ గార్డెన్లను విజయవంతంగా నడపాలని యోచిస్తోంది. రోజువారీ అవసరాలకు వాడే కూరగాయలతో పాటు పండ్ల మొక్కలను కూడా నాటాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా స్కూల్ ఆవరణలో ఎక్కడైనా ఖాళీ ప్రదేశముంటే అందులో వీటిని అభివృద్ధి చేసేందుకు వినియోగించుకోవాలని నిర్దేశించింది. ఈ తోటల్లో పండే ఆహార ఉత్పత్తులను స్వీకరించడం వల్ల పోషకాలకు పోషకాలు.. తోటలపై విద్యార్థులకు అవగాహన కలుగుతుందని.. విద్యా సంస్థలకు సరిపడా కూరగాయలు చౌకగా అందుబాటులో ఉంటాయని భావిస్తోంది. కేవలం విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వార్డెన్లకే బాధ్యత అప్పగించకుండా.. వివిధ ప్రభుత్వ శాఖల సహకారం తీసుకోనుంది. మొక్కలు నాటేందుకు గుంతలు, భూమి చదును, సూక్ష్మ నీటి సేద్యానికి గ్రామీణ ఉపాధి హామీ, ఉద్యాన శాఖ సేవలను వినియోగించుకోనుంది. ఆయా కార్యక్రమాలను అమలు చేసేందుకు స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సర్కారు భావిస్తోంది. జిల్లా యువజన సర్వీసుల అధికారి నోడల్ అధికారిగా వ్యవహరించే ఈ పథకం.. కలెక్టర్ పర్యవేక్షణలో సాగనుంది. ఈ మేరకు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ కమిషనర్ జిల్లా కలెక్టర్లకు తాజాగా లేఖ రాశారు. -
మోడల్ టెర్రస్ కిచెన్ గార్డెన్!
మేడ మీద నాలుగు పూల మొక్కలు పెంచుకునే ఒక సాధారణ గృహిణి.. ఏకంగా ముప్పై రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతోపాటు నాటు కోళ్లను సైతం సునాయాసంగా సాగు చేసుకునే సేంద్రియ ఇంటిపంటల నిపుణురాలిగా మారిపోయారు! ‘సాక్షి’ ఏడేళ్ల క్రితం ప్రారంభించిన ‘ఇంటిపంట’ ప్రచారోద్యమంతోపాటు ఫేస్బుక్లో ఇంటిపంట గ్రూప్ ఆమెకు ప్రేరణ, మార్గదర్శి కావటం విశేషం!! ఆమె పేరు వి. ఎం. నళిని, మెహదీపట్నం(హైదరాబాద్). తమ రెండంతస్తుల మేడ పైన 1300 చదరపు అడుగుల విస్తీర్ణంలో పూర్తిస్థాయి ఇంటిపంటల జీవవైవిధ్య క్షేత్రాన్ని నిర్మించుకున్నారు. బాల్యం నుంచీ పూల మొక్కలపై మక్కువ కలిగిన నళిని.. మెట్టినింటి మేడ మీద పూల మొక్కలను పెంచుకుంటూ ఉండేవారు. ఆ దశలో సాక్షిలో సేంద్రియ ఇంటిపంట కాలమ్ గురించి, ఫేస్బుక్లో ఇంటిపంట గ్రూప్ గురించి తెలుసుకొని పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు సాగుపై దృష్టిపెట్టారు. ఇనుప స్టాండ్లపై 300 గ్రోబాగ్స్, కుండీలు.. తండ్రి న్యాయవాది, భర్త ఇంజనీరు. వ్యవసాయ నేపథ్యం లేకపోయినప్పటికీ, కంపోస్టు నుంచి చీడపీడల యాజమాన్యం వరకు ఒక్కో విషయం నేర్చుకున్నానని నళిని తెలిపారు. ఇంటిపంట మిత్రబృందం అడపా దడపా కలుసుకొని విత్తనాలు, మొక్కలు పంచుకోవడం, అనుభవాలు కలబోసుకోవడం ద్వారా ఆమె తన గార్డెన్‌ను పరిపూర్ణమైన మోడల్ టెర్రస్ కిచెన్ గార్డెన్‌గా ఆహ్లాదకరంగా, ముచ్చటగా తీర్చిదిద్దుకోవడం విశేషం. చిన్నా పెద్దా అన్నీ కలిపి 300కు పైగా సిల్పాలిన్ గ్రోబాగ్స్, టబ్‌లలో 22 రకాల పండ్ల మొక్కలు, 10 రకాల ఆకుకూరలు, 8 రకాల కూరగాయలు, ఐదారు రకాల తీగ జాతి కూరగాయలు సాగు చేస్తున్నారు. ఇనుప స్టాండ్లపైన గ్రోబాగ్స్‌ను ఏర్పాటు చేయడంతో.. టెర్రస్‌పై పడిన నీరు, ఆకులు అలములను సులభంగా శుభ్రం చేసుకోవడానికి వీలుగా ఉంది. మూడు వైపులా కొంత భాగంలో షేడ్‌నెట్ వేశారు. నీడను ఇష్టపడే మొక్కలు, తీగజాతి పాదులను దీనికింద పెంచుతున్నారు. గత ఏడాది నుంచి రెండు గూళ్లలో కింద నాటు కోళ్లను, పైన లవ్‌బర్డ్స్‌ను పెంచుతున్నారు. అరుదైన జాతులు.. అనేక రకాలు.. ఒకే జాతి పండ్లు/కూరగాయల్లో అనేక రకాల మొక్కలను నళిని శ్రద్ధగా సేకరించి సాగు చేస్తున్నారు. వంగలో ఏడు రకాలు.. ముల్లు వంగ(గుండ్రం/పొడవు), వైట్ (రౌండ్/లాంగ్), వెంగోరి బ్రింజాల్, సన్న వంకాయ, ముసుగు(తొడిమతోపాటు ఉండే పొర కాయను చాలా వరకు కప్పి ఉంచుతుంది) వంకాయ, భర్తా బేంగన్ రకాలున్నాయి. తమ్మ (చమ్మ) కాయల తీగతోపాటు చెట్టు కూడా ఉంది. ‘365 డేస్’ చిక్కుడు ఉంది.సాధారణ చిక్కుడు కన్నా 2 నెలలు ముందు నుంచి కాపునివ్వడంతోపాటు.. సాధారణ చిక్కుడు కాపు ముగిసిన తర్వాత నెల అదనంగా చిక్కుడు కాయలను అందిస్తుంది. ఇప్పటికే రెండు నెలలుగా కాస్తున్నదని నళిని తెలిపారు. పొట్టి పొట్ల, చిట్టి కాకర, రెగ్యులర్ కాకర, టమాటా, తెల్లకాకర, ముల్లంగి, రెడ్ బెండ, దొండ పాదులున్నాయి. కాప్సికం గ్రీన్, రెడ్, ఎల్లో రకాలున్నాయి. మిర్చిలో రౌండ్, బ్లాక్, ఉజ్వల(గుత్తులుగా ఆకాశం వైపు తిరిగి ఉండే) రకాలున్నాయి. టమాటా ఎల్లో/రెడ్/బ్లాక్/మదనపల్లి/బెంగళూరు రకాలున్నాయి. మలేషియన్ జామ, బ్లాక్ గాల్, అలహాబాద్ సఫేద్,లక్నో 49 రకాల జామ మొక్కలున్నాయి. ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్ బెర్, సీతాఫలం, బొప్పాయి, మల్బరీ, ఫాల్స ఫ్రూట్, అరటి, ఆరెంజ్, సీడ్నిమ్మ, సీడ్ లెస్ నిమ్మ, అంజీర, డ్రాగన్ ఫ్రూట్, పునాస మామిడి, వాటర్ ఆపిల్ (వైట్/పింక్), ఆల్‌బకర (3 ఏళ్ల నుంచీ కాపు రాలేదు), చైనీస్ లెమన్, లక్ష్మణ ఫలం మొక్కలున్నాయి. చేమ ఆకు, మునగాకు, పాలకూర, చుక్కకూర, గోంగూర, పెరుగుతోటకూర, ఎర్ర తోటకూర, సిలోన్ బచ్చలి, ఎర్ర బచ్చలి, గ్రీన్ బచ్చలి తదితర ఆకుకూరలున్నాయి. కూరగాయలు, పండ్లు 70% మావే ఒకే రకం కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు ఎన్ని ఉన్నా.. వాటిని పక్క పక్కనే పెట్టకుండా వేర్వేరు చోట్ల పెట్టడం ద్వారా చీడపీడల బెడదను చాలా వరకు నివారించవచ్చునని నళిని తెలిపారు. ఒకే కుండీలో కొన్ని రకాల మొక్కలను కలిపి పెంచుతున్నారు. వంగ+మిర్చి, టమాటా+తులసి+ఉల్లి, మామిడి+టమాట+ముల్లంగి.. కలిపి పెంచుతున్నారు. పురుగుల రాకను గుర్తించి తొలిదశలోనే చేతులతో తీసేయడం ముఖ్యమైన విషయమని నళిని అంటారు. ఆవ, బంతి మొక్కలను గార్డెన్లో అక్కడక్కడా పెంచుతున్నారు. పురుగులు తొలుత ఈ రెండు మొక్కలను ఆశిస్తాయి. కనిపించిన రోజే పురుగులను ఏరి నాశనం చేస్తామన్నారు. కాబట్టి పురుగుల బెడద మొక్కలకు ఉండదన్నారు. టమాటా మొక్కను బక్కెట్‌కు అడుగున బెజ్జం పెట్టి నాటి.. తల్లకిందులుగా పెంచుతున్నారు. టమాటాకు అలా పెరగడమే ఇష్టమని నళిని అంటారు. తమ ఇంట్లో ఐదుగురు పెద్దవాళ్లుంటామని, కిచెన్ గార్డెన్ నుంచి పండ్లు, కూరగాయలను 70 శాతం వరకు సమకూర్చుకుంటున్నామని ఆమె సంతృప్తిగా చెప్పారు. కంపోస్టు.. జీవామృతం.. కోళ్ల ఎరువు, పశువుల ఎరువు, గొర్రెల ఎరువుకు ఎండు ఆకులు, అలములతోపాటు వంటింటి వ్యర్థాలు కలిపి స్వయంగా తయారు చేసుకున్న కంపోస్టుతోపాటు.. స్వయంగా తయారు చేసుకునే జీవామృతాన్ని 15 రోజులకోసారి మొక్కలకు ఇస్తూ నళిని చక్కని దిగుబడులు సాధిస్తున్నారు. గ్రాఫ్టెడ్ పండ్ల మొక్కలను నాటడం, ఒకసారి తెచ్చిన కూరగాయ/ఆకుకూర మొక్కల నుంచి విత్తనాలను స్వయంగా తయారు చేసుకొని వాడుకోవడం ఆమె ప్రత్యేకత. ఇంటిపంట ఫేస్బుక్ గ్రూప్ నుంచే తాను అన్ని విషయాలూ నేర్చుకున్నానంటున్న నళిని.. గ్రూప్‌లో ఏదైనా అంశంపై సాధికారంగా, శాస్త్రీయంగా సమాధానాలు ఇస్తూ ఇతరులకు లోతైన అవగాహన కల్పిస్తుండటం ప్రశంసనీయం. నగరంలో పుట్టి పెరుగుతూ.. గడప దాటెళ్లే పని లేకుండా.. రోజుకు కేవలం ఓ గంట సమయాన్ని కేటాయించడం ద్వారా తన కుటుంబానికి కావాల్సిన వైవిధ్యభరితమైన, అమూల్యమైన సేంద్రియ పౌష్టికాహారాన్ని సమర్థవంతంగా సమకూర్చుకుంటున్న ఆదర్శప్రాయురాలైన గృహిణి నళిని గారికి ‘సాక్షి’ జేజేలు పలుకుతోంది! ముసుగు వంగ, పునాస మామిడి, టమాటో, చెట్టు తమ్మ (చెమ్మ) ఉజ్వల మిరప, నాటు కోళ్లు, ఆపిల్ బెర్ -
ప్రయాస లేని ఇంటిపంటలు!
‘మనిషి చెయ్యి పెడితేనే మొక్కలకు నష్టం జరుగుతుంది. మొక్కలు మనిషి జోక్యాన్ని ఆశించవు. వాటి నైజం బతకటమే కదా. నేను చేసేదేమి ఉంది? ఇది నా అనుభవం..’ అంటున్నారు సీనియర్ అర్బన్ పర్మాకల్చర్ నిపుణురాలు నాదెండ్ల లక్ష్మి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు పదిలో స్వగృహంలో నివాసం ఉంటున్న ఆమె గత ఐదేళ్లుగా అర్బన్ పర్మాకల్చర్ పద్ధతుల్లో పెరటి తోటను స్వతంత్రంగా పెరిగేలా తీర్చిదిద్దారు. ఆ పెరటి తోటలో మొలిచే చాలా రకాల వార్షిక పంటలు ప్రతి ఏటా విత్తనాలు వేయకుండానే మొలిచి మంచి దిగుబడులను ఇస్తున్నాయి! తన పెరటి తోటలో గత మూడేళ్లుగా ఎటువంటి విత్తనాలనూ పనిగట్టుకొని వేయలేదని, అంతకుముందు వరుసగా రెండేళ్లు నాటిన మొక్కలు, వేసిన విత్తనాలే ప్రతి ఏటా వాటంతట అవే మొలకెత్తి, సంతృప్తికరమైన ఫలసాయాన్ని అందిస్తున్నాయని లక్ష్మి వివరించారు. విత్తిన మొదటి ఏడాది పంట తీసుకోరు! ఆమె గార్డెన్లో ప్రస్తుతం అనేక కుండీల్లో వంగ మొక్కలున్నాయి. అయితే, ఆమె తన పెరటి తోటలో ఐదేళ్ల క్రితం వంగ విత్తనాలేశారు. ఆమె పెట్టుకున్న నియమం ఏమిటంటే.. ఏ రకం విత్తనాలైతే కొత్తగా తెచ్చి పెరటి తోటలో చేర్చుతారో ఆ మొక్కల కాయలను తొలి ఏడాది ముట్టుకోరు. అవే పెరిగి, పండి రాలిపోయి భూమిలో కలిసిపోతాయి. అనుకూలమైన వాతావరణం ఏర్పడినప్పుడు ఆ విత్తనాలు మళ్లీ మొలకెత్తి, ఫలసాయాన్ని అందిస్తాయి. ప్రతి ఏటా కొన్ని కాయలను విత్తనాలకు వదిలేస్తారు. వాటిని పనిగట్టుకొని దాచిపెట్టి విత్తటం ఉండదు. అవే మట్టిలో కలిసిపోయి.. తిరిగి మొలకెత్తుతూ ఉంటాయి. ఉదాహరణకు.. ఇప్పుడు కొన్ని కుండీల్లో వంగ మొక్కలున్నాయి. సుమారు 5 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న పెరట్లో కొన్ని సిమెంటు రింగ్‌లు, కొన్ని పెద్ద కుండీలు ఉన్నాయి. చాలా మొక్కలు నేలపైనే పెరుగుతున్నాయి. విత్తనాలు పడి మట్టిలో ఉండి వాటంతటవే తిరిగి మొలుస్తుంటాయి. మొలిచిన మొక్కలకు పరిమితంగా ఆలనాపాలనా చేయడమే తప్ప పెద్దగా చేయాల్సిందేమీ లేదని లక్ష్మి అంటున్నారు. సీజన్లో వంగ మొక్కలు అక్కడక్కడా మొలుస్తాయి. మొలిచిన మొక్కను తీసి కుండీల్లోకి చేర్చుతారు.. ఏడాది పొడవునా రాలిన ఆకులతో లీఫ్ కంపోస్టు తయారు చేసి, ఎప్పటికప్పుడు మొక్కలకు వేస్తూ ఉంటారు. తగుమాత్రంగా నీరందిస్తారు. అంతే.. ఇక వాటంతట అవే పెరుగుతూ దిగుబడినిస్తాయి. వంగ, టమాటా మొక్కలను మాత్రమే పీకి కుండీల్లో నాటుతారు. మిగతా కూరగాయలు, ఆకుకూరలు, బొప్పాయి వంటి పండ్ల మొక్కలు ఎక్కడ మొలిస్తే అక్కడే పెరిగి ఫలసాయాన్నిస్తుంటాయని లక్ష్మి వివరించారు. అందుకే తనది ప్రయాస పడి సాగు చేయని (డూ నథింగ్) పెరటి తోట అంటారామె. భూసారం.. జీవవైవిధ్యం.. భూమిలో వానపాములు, సూక్ష్మజీవరాశి పుష్కలంగా పెరిగేలా సారవంతం చేయడం.. ఆకులు అలములతో ఆచ్ఛాదన కల్పించడం.. వీలైనన్ని ఎక్కువ రకాల (బహువార్షిక, ఏక వార్షిక, స్వల్పకాలిక) పంటల జాతులను కిచెన్ గార్డెన్‌లోకి చేర్చితే చాలు.. అదేపనిగా ప్రతిరోజూ పనిగట్టుకొని పెద్దగా ప్రయాస పడి మొక్కల పనుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని లక్ష్మి చెబుతున్నారు. 2013లో అర్బన్ పర్మాకల్చర్ వర్క్‌షాపును తన ఇంట్లోనే నిర్వహించానని, అప్పటి నుంచి శాశ్వత వ్యవసాయ సూత్రాలను ప్రయాస లేకుండా తు.చ. తప్పకుండా అనుసరిస్తున్నానన్నారు. ఆమె పెరటి తోటలో బొప్పాయి, ప్యాషన్ ఫ్రూట్, దొండ, పొట్ల, అలసంద, 3 రకాల చిక్కుళ్లు, పచ్చిమిర్చి, క్యాప్సికం, వంగ, టమాటాతోపాటు తోటకూర, పాలకూర, మెంతికూర, 3 రకాల బచ్చలికూర మొక్కలున్నాయి. మునగచెట్టు పూలు, పిందెలతో కనువిందు చేస్తుంది. అవకాడొ వంటి అరుదైన పండ్ల మొక్కలూ ఉన్నాయి. తన పెరట్లో ఎందుకనో గాని దేశవాళీ బొప్పాయి మొక్కలు విత్తనాలు వేయకపోయినా రెండేళ్లకోసారి మాత్రమే పుట్టి పెరిగి పండ్లనిస్తున్నాయని లక్ష్మి తెలిపారు. మగ చెట్టును ఒకదాన్ని ఉంచి మిగతావి తీసేస్తానన్నారు. గుత్తిగా పూలు వస్తే అది మగ చెట్టని, పిందెతో కూడిన పూవు ఒకటే వస్తే అది ఆడ చెట్టని గుర్తించాలన్నారు. ఐదారేళ్ల క్రితం వంగ విత్తనాలు వేసి పెంచానని, తర్వాత విత్తనం వేయలేదని, ప్రతి ఏటా గార్డెన్లో అక్కడక్కడా మొలిచిన వంగ మొక్కలను పీకి కుండీల్లో నాటుతానన్నారు. దేశవాళీ టమాటా రకాల విత్తనాలు కొన్ని సంవత్సరాల క్రితం వేశానని, తర్వాత నుంచి వాటికవే మొలుస్తుంటాయని, మొక్కలను తీసి కుండీల్లో నాటి, లీఫ్ కంపోస్టు, నీరు తగినంత అందించడమే తాను చేస్తున్నానన్నారు. రెండు టమాటా మొక్కలుంటే చాలు తమ నలుగురికీ సరిపోయే అన్ని కాయలు కాస్తాయన్నారు. చలికాలంలో 70% తమ కుటుంబానికి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తమ ఇంట్లో పండినవే సరిపోతాయని, వేసవిలో పూర్తిగా మార్కెట్లోనే కొంటామని లక్ష్మి(laxmi_nad@yahoo. com) తెలిపారు. బొప్పాయి మగ పూలు, బొప్పాయి ఆడ పువ్వు, కాప్సికం, ప్యాషన్ ఫ్రూట్ మునగ వైభవం, చిక్కుడు పాదు, వాటికవే మొలిచినవి, తేనెతుట్టె -
మధ్యాహ్న భోజనంలో తాజా కూరలు
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మరింత ఘుమఘుమలాడనుంది. తాజా కూరగాయలతో వంటలు చేసేందుకు విద్యాశాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ల నిర్వహణకు ప్రణాళిక రూపొందించింది. అక్కడ పండించిన కూరగాయలనే భోజనంలో వినియోగించేలా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 27,896 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. స్థలం వెసులుబాటు, నీటి సౌకర్యం ఉన్న పాఠశాలలను విద్యా శాఖ ఎంపిక చేసింది. ఈ ఏడాది 9,958 ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ గార్డెన్ల ఏర్పాటుకు నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా సక్సెస్ ప్రస్తుతం అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి బియ్యాన్ని ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. ఇటీవల సన్న బియ్యంతో భోజనాన్ని పిల్లలకు అందిస్తున్నారు. బియ్యం మినహా మిగతా సరుకులను నిర్వాహకులే కొనుగోలు చేస్తున్నారు. కూరగాయలు తాజాగా లభించకపోవడం.. ధరలు అధికంగా ఉంటున్నాయనే సాకుతో పలుచోట్ల రుచి సరిగాలేని వంటలనే పెడుతున్నారు. దీంతో పలు చోట్ల విద్యాశాఖకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా కూరగాయాలపై దృష్టి సారించిన విద్యాశాఖ కిచెన్గార్డెన్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. గతేడాది 1,203 పాఠశాలల్లో గార్డెన్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసింది. అక్కడ సత్ఫలితాలివ్వడంతో రెండో విడతలో కూడా గార్డెన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. కిచెన్ గార్డెన్ల నిర్వహణ బాధ్యతలు పాఠశాల అభివృద్ధి కమిటీకి అప్పగించింది. విత్తనాల కొనుగోలుకు పాఠశాల గ్రాంటును వినియోగించుకోవాల్సి ఉంటుంది. కిచెన్ గార్డెన్లలో టమాటాతో పాటు సోర, దోస, బీర రకాలను సాగుచేస్తే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. -
‘కంపోస్టు టీ’ మొక్కలకు బలిమి!
ఆకుకూరలు, కూరగాయలను సేంద్రియ పద్ధతుల్లో పండించే క్రమంలో మొక్కలకు పోషకాల లోపం రాకుండా చూసుకోవడం ఒక ముఖ్యాంశం. కుండీలు, మడుల్లో విత్తనాలు లేదా మొక్కలు నాటిన తర్వాత రోజూ అవసరం మేరకు నీళ్లు పోస్తుంటాం. అడపా దడపా కంపోస్టు వేయడం, జీవామృతం, పంచగవ్య వంటి ద్రవ ఎరువులను నీటిలో కలిపి పోయడం లేదా పిచికారీ చేయడం ద్వారా పోషకాల లోపం రాకుండా చూసుకోవచ్చు. అయితే, వీటి సేకరణ వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఈ సమస్యను అధిగమించడానికి మరో మార్గం లేదా? తప్పకుండా ఉంది! అదే.. కంపోస్టు టీ! కిచెన్ గార్డెన్లో మొక్కలకు రోజూ వట్టి నీళ్లకు బదులు పోషకాలతో కూడిన కంపోస్టు టీని పోస్తూ.. మంచి దిగుబడి పొందొచ్చు. హైదరాబాద్ నాగోల్‌లోని గార్డెన్స్ ఆఫ్ అంబడెన్స్ బృందం సభ్యుడు జి. సాయి ప్రసన్నకుమార్ ( 99514 52345) సొంత అనుభవ సారం ఇది.. కంపోస్టు టీ తయారీ ఇలా.. 3 లేదా 4 కప్పుల తాజా వర్మీ కంపోస్టు లేదా కంపోస్టును తీసుకొని.. సాక్స్‌లో లేదా పల్చటి గుడ్డలో మూట కట్టాలి. బక్కెట్ లేదా చిన్న తొట్టిలో 20 లీటర్ల నీటిని పోసి.. ఆ నీటిలో కంపోస్టు మూటను వేలాడగట్టాలి. అర స్పూను బెల్లం/పంచదారతోపాటు.. అర స్పూను శనగ/పెసర/కంది/మినుము పిండిని నీటిలో కలపాలి. చిన్న అక్వేరియం పంపు (బబ్లర్)ను ఈ బక్కెట్‌కు అమర్చి నిరంతరాయంగా ఆక్సిజన్ అందించే ఏర్పాటు చేయాలి. ఈ బబ్లర్కు అయ్యే విద్యుత్ ఖర్చు చాలా స్వల్పం. దీన్ని ఆన్ చేసిన 6 గంటల్లో లేత కషాయం రంగులో ‘కంపోస్టు టీ’ సిద్ధమవుతుంది. రోజువారీగా నీళ్లకు బదులు.. కంపోస్టు టీని (నీటిని కలపకుండా) యథాతథంగా మొక్కలకు పోయాలి. కుండీలు, మడుల్లో అవసరం మేరకు మితంగా పోసుకుంటూ కంపోస్టు టీని పొదుపుగా వాడుకోవాలి. ఇలా.. బక్కెట్లో నుంచి కంపోస్టు టీని తీసిన తర్వాత అందులో మళ్లీ మామూలు నీటిని పోయాలి. ఇలా చేసిన ప్రతిరోజూ లేదా ప్రతిసారీ అరస్పూను బెల్లం, పిండిని ఆ నీటిలో తప్పక కలపాలి. సాక్స్‌లో పోసి బక్కెట్లో నానబెట్టిన కంపోస్టును నీటితోపాటు మార్చాల్సిన అవసరం లేదు. 10 రోజులకోసారి మార్చుకుంటే సరిపోతుంది. పశువుల పచ్చిపేడను కూడా వేరే మూట కట్టి కంపోస్టుతోపాటు బక్కెట్లో నానబెడితే.. కంపోస్టు టీ మరింత ప్రభావశీలంగా తయారవుతుందన్నది నిపుణుల మాట. కంపోస్టు టీ ప్రత్యేకత సూక్ష్మజీవుల తోడ్పాటుతో మొక్కలు పోషకాలను గ్రహిస్తాయి. పోషకాలను మొక్కలు వినియోగించుకోగలిగే రూపంలోకి మార్చి అందించడంలో సూక్ష్మజీవుల పాత్ర కీలకం. కంపోస్టు/పేడలో లెక్కలేనన్ని మేలుచేసే సూక్ష్మజీవులుంటాయి. వీటిని ఎన్నో రెట్లు పెంచి కంపోస్టు టీ ద్వారా రోజూ అందిస్తే కిచెన్ గార్డెన్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. స్వల్ప ఖర్చుతో ఇంటిపట్టునే కంపోస్టు టీని సులభంగా, ప్రతి రోజూ తయారు చేసుకోవచ్చు. సాధారణంగా కంపోస్టు టీ దుర్వాసన రాదు. బక్కెట్లో నీటికి బబ్లర్ ద్వారా ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా, పిండి/బెల్లం మోతాదు ఎక్కువైనా కంపోస్టు టీ రంగు మారి, దుర్వాసన వస్తుంది. ఇది వాడితే ఇంటిపంటలు బలంగా, ఏపుగా పెరుగుతాయి. చీడపీడల బెడద తగ్గుతుంది. ఆకుకూరలు, కూరగాయల రుచి, నాణ్యత ఇనుమడిస్తాయి. -
కిచెన్ గార్డెన్‌కు బలిమి ‘కంపోస్టు టీ’..!
ఇంటి పంట 1. కంపోస్టు టీ తయారీకి కావాల్సిన వస్తువులు ఇవే.. 2. బక్కెట్లో నీరు పోసి, కంపోస్టు / పచ్చి పేడ నింపిన సాక్స్‌లను ఈ విధంగా నీటిలోకి వేలాడ గట్టాలి. బబ్లర్ను ఏర్పాటు చేసి నీటిలో వృద్ధి చెందే సూక్ష్మజీవులకు ప్రాణవాయువును నిరంతరం అందించాలి. 3. బక్కెట్కన్నా ఎక్కువ కంపోస్టు టీ కావాలనుకుంటే.. ఈ విధంగా 200 లీటర్ల డ్రమ్ములను ఉపయోగించవచ్చు. 4. వాడకానికి సిద్ధమైన కంపోస్టు టీ. ఆకుకూరలు, కూరగాయలను సేంద్రియ పద్ధతుల్లో పండించే క్రమంలో మొక్కలకు పోషకాల లోపం రాకుండా చూసుకోవడం ఒక ముఖ్యాంశం. కుండీలు, మడుల్లో విత్తనాలు లేదా మొక్కలు నాటిన తర్వాత రోజూ అవసరం మేరకు నీళ్లు పోస్తుంటాం. అడపా దడపా కంపోస్టు వేయడం, జీవామృతం, పంచగవ్య వంటి ద్రవ ఎరువులను నీటిలో కలిపి పోయడం లేదా పిచికారీ చేయడం ద్వారా పోషకాల లోపం రాకుండా చూసుకోవచ్చు. అయితే, వీటి సేకరణ వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఇవి ఒక్కోసారి దొరక్కపోవచ్చు కూడా. అలాంటప్పుడు పోషకాల లోపంతో కిచెన్ గార్డెన్ కళ తప్పొచ్చు. ఈ సమస్యను అధిగమించడానికి మరో మార్గం లేదా? తప్పకుండా ఉంది! అదే.. కంపోస్టు టీ! కిచెన్ గార్డెన్లో మొక్కలకు నీళ్లకు బదులు పోషకాలతో కూడిన కంపోస్టు టీని పోస్తూ.. మంచి దిగుబడి పొందొచ్చు. పోషకాలను మొక్కలు వినియోగించుకోగలిగే రూపంలోకి మార్చి అందించడంలో సూక్ష్మ జీవుల పాత్ర చాలా కీలకం. కంపోస్టు/పేడలో లెక్కలేనన్ని మేలు చేసే సూక్ష్మజీవు లుంటాయి. కంపోస్టు టీ రూపంలో వీటిని ఎన్నో రెట్లు పెంపొందించి అందిస్తే కిచెన్ గార్డెన్‌కు పుష్కలంగా పోషకాలు అందుతాయి. కంపోస్టు టీతో పంటలు బలంగా, ఏపుగా పెరుగుతాయి. చీడపీడల బెడద తగ్గుతుంది. కంపోస్టు టీని స్వల్పఖర్చుతో ఇంటిదగ్గరే సులభంగా తయారు చేసుకోవచ్చు. కంపోస్టు టీ తయారీ ఇలా.. 3 లేదా 4 కప్పుల తాజా వర్మీ కంపోస్టు లేదా కంపోస్టును తీసుకొని.. సాక్స్‌లో లేదా పల్చటి గుడ్డలో మూట కట్టాలి. బక్కెట్ లేదా చిన్న తొట్టిలో 20 లీటర్ల నీటిని పోసి.. ఆ నీటిలో కంపోస్టు మూటను వేలాడగట్టాలి. అర స్పూను బెల్లం/ పంచ దారతోపాటు.. అర స్పూను శనగ/ పెసర/ కంది/ మినుము పిండిని నీటిలో కలపాలి. చిన్న అక్వేరియం పంపు(బబ్లర్)ను ఈ బక్కెట్‌కు అమర్చి నిరంతరాయంగా ఆక్సిజన్ అందించే ఏర్పాటు చేయాలి. ఈ బబ్లర్కు అయ్యే విద్యుత్ ఖర్చు చాలా స్వల్పం. దీన్ని ఆన్ చేసిన 48 గంటల్లో ‘కంపోస్టు టీ’ వాడకానికి సిద్ధమవుతుంది. కిచెన్ గార్డెన్లో మొక్కలకు నీళ్లకు బదులు కంపోస్టు టీని (నీటిని కలపకుండా) యథాతథంగా మొక్కలకు పోసుకోవచ్చు. కుండీలు, మడుల్లో అవసరం మేరకు మితంగా వాడుకోవాలి. ఇలా.. బక్కెట్లో నుంచి కంపోస్టు టీని తీసిన తర్వాత అందులో మళ్లీ మామూలు నీటిని పోయాలి. ఇలా కొత్త నీరు పోసిన తర్వాత ఒక రోజులోనే కంపోస్టు టీ వినియోగానికి సిద్ధమవుతుంది. కొత్త నీరు పోసిన ప్రతి సారీ బక్కెట్లోని కంపోస్టు మూటను విదల్చాలి. వారానికోసారి అరస్పూను బెల్లం, అరస్పూను పిండిని నీటిలో కలిపితే.. సూక్ష్మజీవులు వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. కంపోస్టు ఎన్నాళ్లకు మార్చాలి? 20 లీటర్ల బక్కెట్లో నానగట్టిన 3 లేదా 4 కప్పుల కంపోస్టును 2 లేదా 3 వారాలకోసారి మార్చుకుంటే సరిపోతుంది. 200 లీటర్ల డ్రమ్ములో అయితే 5 కిలోల కంపోస్టు నానగట్టాలి. దీంట్లోంచి 50 లీటర్ల వరకు కంపోస్టు టీ తీసి వాడుకుంటూ ఆ మేరకు నీటిని తిరిగి నింపుతూ ఉంటే.. 30 రోజులకోసారి కంపోస్టు మార్చుకోవాలి. కంపోస్టుతోపాటు పచ్చి పేడను కూడా వేరే మూటగా కట్టి కంపోస్టుతోపాటు బక్కెట్లో నానబెడితే.. కంపోస్టు టీ మరింత ప్రభావశీ లంగా తయారవుతుందని హైదరాబాద్‌కు చెందిన పర్మాకల్చర్ డిజైనర్, యువ సిటీ ఫార్మర్ జీ సాయి ప్రసన్న కుమార్(99514 52345. మధ్యాహ్నం 2-5 గంటల మధ్యలో మాత్రమే ఫోన్ చేయాలి) తెలిపారు. సాధార ణంగా కంపోస్టు టీ దుర్వాసన రాదు. ఆక్సిజన్ అందకపోయినా, పిండి/ బెల్లం ఎక్కు వైనా రంగుమారి, దుర్వాసన వస్తుంది. - ఇంటిపంట డెస్క్ intipanta@sakshi.com -
పెరటి తోట కోసం న్యాయపోరాటం!
సాధాణంగా పెరటి తోట ఇంటి వెనుక భాగంలో ఉంటుంది. ఇంటి ముందు భాగంలో కిచెన్ గార్డెన్ ఉండడం అమెరికాలో శిక్షార్హమైన నేరం! ఇంటిపంటల ప్రేమికులు ఇంటి ముందు గార్డెన్ కన్నా కిచెన్ గార్డెన్ ఉంటే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. ఇంటి ముందున్న తమ సొంత స్థలంలో సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు పెంచుకునే హక్కు కోసం కోర్టులకెక్కుతున్నారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓర్లాండో నగరానికి చెందిన జాసన్, జెన్నిఫర్ హెల్వెన్స్టన్ దంపతులు ఇటువంటి కేసులో ఇటీవలే విజయకేతనం ఎగురవేశారు. 17 ఏళ్లుగా తమ ఇంటి ముందున్న కిచెన్ గార్డెన్‌ను తొలగించమని స్థానిక అధికారులు గత ఏడాది ఆదేశించడంతో వీరు కోర్టుకెళ్లారు. ‘విత్తు నాటండి.. చట్టం మార్చండి’ నినాదంతో పాట్రియాట్ గార్డెన్స్ సంస్థ సారధ్యంలో 6 వేల మంది స్థానికులు ఈ జంటకు బాసటగా నిలిచి విజయం సాధించడం విశేషం. -
‘ఇంటిపంట’తో సహజ ఆహారం!
ఆహారమే దివ్యౌషధం. ప్రకృతి సిద్ధంగా పం టలు పండించడం ద్వారా అమృత సమాన మైన ఆహారాన్ని తరతరాలుగా మనం తింటు న్నాం. అయితే, ఆధునిక వ్యవసాయ పరిజ్ఞా నం పేరుతో రంగంలోకి వచ్చిన అధిక దిగు బడి వంగడాలు, రసాయనిక ఎరువులు వాటి తో పాటే వచ్చిన పురుగు మందులు, కలుపు నాశనులు, జన్యుమార్పిడి విత్తనాలు... ఆహా రాన్ని విషతుల్యంగా మార్చేశాయి. భూమిని నాశనం చేశాయి. వినియోగదారుడికి రసా యనిక అవశేషాలతో కూడిన ఆహారాన్ని అం దిస్తున్నాయి. ఫలితంగా ఎటు చూసినా మధు మేహం, కేన్సర్, గుండెజబ్బులు... లేని జబ్బు లేదు. మార్కెట్లోకి వెళ్లి ఆకుకూరలు కొను గోలు చేసి కూరవండితే రసాయనాల వాసన! పాలకుల ఉదారవాద విధానాల వలన వ్యవసాయం కుంటుపడి జీవికకు ఆధార పడదగిన వృత్తి కాకుండాపోయింది. ఫలితంగా అన్నివర్గాల ప్రజలూ గ్రామాలను వదిలి పట్టణాలు, నగరాలకు వలస వెళుతున్నారు. నగరాలు, పట్టణాలు ఎంత విస్తరిస్తూ ఉంటే.. ప్రకృతి ఆ మాటకొస్తే పంట పొలం - ఆయా నగరాలు, పట్టణాల్లోని జనానికి అంత దూ రంగా జరుగుతోంది. దీని అర్థం ఏమిటం టే... పోయిన ఏడాదికంటే ఈ ఏడాది మరింత ఎక్కువ దూరం నుంచి తర లించిన ఆహా రంపై పట్టణ ప్రాంతవాసులు ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో నగరాలు, పట్ట ణాల్లో నివాసం ఉంటున్న పౌరులు ఎవరైనా చేయా ల్సిందేమిటి? ‘థింక్ గ్లోబల్లీ... యాక్ట్ లోకల్లీ’ అనే నినాదం పర్యావరణ పరిరక్షణకే కాదు, మంచి ఆహారోత్పత్తికీ వర్తిస్తుంది. ఆహారోత్పత్తి గ్రామీణ రైతుల పని మా త్రమేనా? పట్టణాలు, నగరాల్లో ఇళ్లు కట్టు కొని నివాసం ఉంటున్నంత మాత్రాన విని యోగదారులు రసాయనాల అవశేషాలున్న ఆహారం తింటూ రోగగ్రస్తులు కావాల్సిందే నా? పట్టణాలు, నగరాలలో ఇళ్లపైన, ఇంటి ముందు, వెనుక ఉండే పెరటి స్థలాలను - అవి ఎంత చిన్నవైనా సరే - ఉపయోగించి ఉన్నంతలో, సాధ్యమైనన్ని ‘ఇంటిపంట’లు పండించలేమా? కనీసం ఆకుకూరలు, కూర గాయలు పండించుకోలేమా? నగరాలు, పట్టణాల్లో ఖాళీగా ఉంటున్న మేడల పైకప్పులను వృథాగా వదిలేయకుండా అక్కడ పరిమితంగా పండించలేమా? క్యూబాలో మాదిరిగా ఆహారాన్ని భారీ ఎత్తున ఆరోగ్యదాయకంగా పండించుకోవడం ప్రారంభిస్తే రసాయనాల వాడకానికి అలవాటైపోయిన రైతులకు కూడా ఈ దారి చూపొచ్చుకదా? మాకు రసాయనాలు వాడకుండా పండించిన ఆహారమే కావా లని ప్రభుత్వానికి చాటి చెప్పడానికి ‘ఇంటి పంట’ల సాగు ఒక ఆచరణాత్మక మార్గం కాదా? ఇటువంటి ఆలోచనల నుంచే ‘సాక్షి’ దిన పత్రికలో ‘ఇంటిపంట’ శీర్షిక సరిగ్గా రెండున్న రేళ్ల క్రితం పుట్టుకొచ్చింది. స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు భాగస్వా ములవడంతో ఇంతింతై వటుడింతై అన్న ట్లుగా ప్రజాయజ్ఞంగా మారింది. పర్యావరణా నికి అనుకూలమైన సాగు పద్ధతులను పట్టణ, నగర, గ్రామీణ ప్రాంత తెలుగు పాఠకులకు ప్రభావశీలంగా పరిచయం చేయడానికి ఇంటి పంట శీర్షిక ఎంతగానో దోహదపడింది. సోషల్ మీడియాలో కూడా ‘ఇంటిపంట’ తనదైన చెరగని ముద్రవేసింది. గూగుల్ గ్రూప్స్‌లో ‘ఇంటిపంట’ ఆన్లైన్ గ్రూపును ఏర్పాటు చేయడం, ఫేస్బుక్లో ‘ఇంటిపంట’ గ్రూప్ ప్రారంభమయ్యాయి. దీంతో హైదరా బాద్లోనే కాకుండా దేశ విదేశాల్లో ఉంటున్న కిచెన్ గార్డెనింగ్ ప్రేమికులంతా చర్చించుకోవ డం, అనుభవాలను పరస్పరం పంచుకోవడం నిత్యకృత్యమైంది. ‘ఇంటిపంట’ వేదిక ద్వారా స్నేహితులైన వారు కలుసుకుంటూ భావాల ను కలబోసుకుంటూ, విత్తనాలను, మొక్క లను పంచుకుంటూ ఆనందిస్తూ ఉండటం ఆహ్వానించదగిన పరిణామం. ‘సాక్షి’ వంటి ఒక ప్రధానస్రవంతి మీడియాసంస్థ ‘ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్’ను ఒక యజ్ఞంలా చేపట్టి కొనసాగించడం బహుశా దేశంలో ఇదే ప్రథమం. ‘ఇంటిపంట’ ప్రభుత్వాన్ని సైతం కదిలించడం విశేషం. ఉద్యానశాఖ కేంద్ర ప్రభు త్వపథకం ఆర్కేవీవై గ్రాంటు ద్వారా ‘ఇంటి పంట’ సబ్సిడీ పథకాన్ని హైదరాబాద్ నగరంలో 2013 మార్చిలో ప్రారంభించింది. సబ్సిడీతో ‘ఇంటిపంట’ కిట్లు అందిస్తున్నారు. విపరీతమైన స్పందన రావడంతో తొలుత ఇచ్చిన 75 శాతం సబ్సిడీ ఇప్పుడు 50 శాతా నికి తగ్గిందని అధికారులు చెబుతున్నారు. వేసవి తరువాత ఈ సబ్సిడీ పథకాన్ని ఇంత వరకు తిరిగి ప్రారంభించకపోవడం ప్రజలను నిరుత్సాహపరుస్తోంది. రాష్ట్ర ర్యాప్తంగా ఈ సబ్సిడీ పథకాన్ని అందించి ఆరోగ్యదాయ కంగా మేడలపైన, పెరట్లో సేంద్రియ కూరగా యలు, ఆకుకూరలు, పండ్లు పండించుకునేం దుకు దోహదపడతామని ఉద్యాన మంత్రి అప్పట్లో ప్రకటించారు. ఈ హామీని అమలు చేయడం అవసరం. హైదరాబాద్‌లో ప్రారం భమైన ‘ఇంటిపంట’ సబ్సిడీ పథకం స్ఫూర్తి తో తమిళనాడు ప్రభుత్వం చెన్నై, కోయంబ త్తూరు నగరాలలో సబ్సిడీ పథకాన్ని ప్రారం భించింది. కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. ఇళ్లదగ్గరే కాదు బహిరంగ స్థలాలలోనూ ఇంటిపంటల సాగుకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. నగరాలు, పట్టణాలకు వలస వచ్చే నిరుపేదల కోసం పది చదరపు గజాల చొప్పున ప్రభుత్వ స్థలం కేటాయిస్తే సామూహిక ఇంటిపంటల సాగుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలించాలి. పోషకాహార లభ్యతను పెంచ డంలో సామూహిక ఇంటిపంటల సాగు ఎం తో ఉపయుక్తంగా ఉంటుందని ఇతర దేశాల అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా క్యూబా వంటి దేశాల్లో అక్కడి పట్టణాలు, నగరాల్లో ఇంటిపంటల ద్వారా పండిన కూర గాయలు, ఆకుకూరలు, పండ్లు గ్రామాలకు సరఫరా అవుతున్నాయి. పట్టణ ప్రాంత జనా భా ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న ఈ తరు ణంలో ప్రపంచవ్యాప్తంగా ఇంటిపంటలకు ఆవశ్యకత పెరుగుతున్నది. నిరుద్యోగులు, వలస వచ్చిన గ్రామీణుల ఉపాధి కల్పనకు ప్రభుత్వం సామూహిక ఇంటిపంటల సాగు క్షేత్రాలను ఏర్పాటు చేస్తే మంచి ఆహారాన్ని పట్టణ, నగర ప్రజలకు అందుబాటులోకి తేవ డానికి ఆస్కారం ఏర్పడుతుంది. విద్యార్థుల ను సైతం ఈ మహాయజ్ఞంలో భాగస్వాముల ను చేయగలిగితే భవిష్యత్తరానికి మట్టి వాస న చూపే సదవకాశం కలుగుతుంది. వాతావ రణ మార్పుల నేపథ్యంలో రానున్న సంక్షో భాలను ఎదుర్కోవడానికి ఇది తెలివైన మా ర్గంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. రసాయనిక వ్యవసాయంతో ప్రాప్తించిన ఎడతెగని వ్యవసాయ సంక్షోభం రాచపుం డులా సమాజాన్ని నిలువునా తొలిచేస్తోంది. అప్పుల నుంచి, భూసార నష్టం నుంచి బయ టపడే మార్గాలను రైతులు వెదుక్కుంటు న్నారు. రసాయనిక అవశేషాలతో కూడిన ఆహారంతో వ్యాధుల రూపంలో విరుచుకు పడుతున్న ఉపద్రవాన్ని వినియోగదారులూ గ్రహిస్తున్నారు. ఈ పూర్వరంగంలో తెలుగు నాట ప్రారంభమైన ఈ ‘ఇంటిపంట’ల సేం ద్రియ/ప్రకృతి ఆహారోద్యమం సుదీర్ఘ ప్రయా ణానికి చిన్న ప్రారంభం మాత్రమే. -పంతంగి రాంబాబు ‘సాక్షి’ స్పెషల్ డెస్క్