కిచెన్ గార్డెన్‌కు బలిమి ‘కంపోస్టు టీ’..! | making of compost tea at kitchen garden | Sakshi
Sakshi News home page

కిచెన్ గార్డెన్‌కు బలిమి ‘కంపోస్టు టీ’..!

Published Sat, Sep 6 2014 11:26 PM | Last Updated on Sat, Sep 2 2017 12:58 PM

కిచెన్ గార్డెన్‌కు బలిమి ‘కంపోస్టు టీ’..!

కిచెన్ గార్డెన్‌కు బలిమి ‘కంపోస్టు టీ’..!

ఇంటి పంట
1. కంపోస్టు టీ తయారీకి కావాల్సిన వస్తువులు ఇవే..  
2. బక్కెట్‌లో నీరు పోసి, కంపోస్టు / పచ్చి పేడ నింపిన సాక్స్‌లను ఈ విధంగా నీటిలోకి వేలాడ గట్టాలి. బబ్లర్‌ను  ఏర్పాటు చేసి నీటిలో వృద్ధి చెందే సూక్ష్మజీవులకు ప్రాణవాయువును నిరంతరం అందించాలి.  
3. బక్కెట్‌కన్నా ఎక్కువ కంపోస్టు టీ కావాలనుకుంటే.. ఈ విధంగా 200 లీటర్ల డ్రమ్ములను ఉపయోగించవచ్చు.
4. వాడకానికి సిద్ధమైన కంపోస్టు టీ.
ఆకుకూరలు, కూరగాయలను సేంద్రియ పద్ధతుల్లో పండించే క్రమంలో మొక్కలకు పోషకాల లోపం రాకుండా చూసుకోవడం ఒక ముఖ్యాంశం. కుండీలు, మడుల్లో విత్తనాలు లేదా మొక్కలు నాటిన తర్వాత రోజూ అవసరం మేరకు నీళ్లు పోస్తుంటాం. అడపా దడపా కంపోస్టు వేయడం, జీవామృతం, పంచగవ్య వంటి ద్రవ ఎరువులను నీటిలో కలిపి పోయడం లేదా పిచికారీ చేయడం ద్వారా పోషకాల లోపం రాకుండా చూసుకోవచ్చు. అయితే, వీటి సేకరణ వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఇవి ఒక్కోసారి దొరక్కపోవచ్చు కూడా. అలాంటప్పుడు పోషకాల లోపంతో కిచెన్ గార్డెన్ కళ తప్పొచ్చు. ఈ సమస్యను అధిగమించడానికి మరో మార్గం లేదా? తప్పకుండా ఉంది! అదే.. కంపోస్టు టీ! కిచెన్ గార్డెన్‌లో మొక్కలకు   నీళ్లకు బదులు పోషకాలతో కూడిన కంపోస్టు టీని పోస్తూ.. మంచి దిగుబడి పొందొచ్చు.  
 
పోషకాలను మొక్కలు వినియోగించుకోగలిగే రూపంలోకి మార్చి అందించడంలో సూక్ష్మ జీవుల పాత్ర చాలా కీలకం. కంపోస్టు/పేడలో లెక్కలేనన్ని మేలు చేసే సూక్ష్మజీవు లుంటాయి. కంపోస్టు టీ రూపంలో వీటిని ఎన్నో రెట్లు పెంపొందించి అందిస్తే కిచెన్ గార్డెన్‌కు పుష్కలంగా పోషకాలు అందుతాయి. కంపోస్టు టీతో పంటలు బలంగా, ఏపుగా పెరుగుతాయి. చీడపీడల బెడద తగ్గుతుంది. కంపోస్టు టీని స్వల్పఖర్చుతో ఇంటిదగ్గరే సులభంగా తయారు చేసుకోవచ్చు.

కంపోస్టు టీ తయారీ ఇలా..
3 లేదా 4 కప్పుల తాజా వర్మీ కంపోస్టు లేదా కంపోస్టును తీసుకొని.. సాక్స్‌లో లేదా పల్చటి గుడ్డలో మూట కట్టాలి. బక్కెట్ లేదా చిన్న తొట్టిలో 20 లీటర్ల నీటిని పోసి.. ఆ నీటిలో కంపోస్టు మూటను వేలాడగట్టాలి. అర స్పూను బెల్లం/ పంచ దారతోపాటు.. అర స్పూను శనగ/ పెసర/ కంది/ మినుము పిండిని నీటిలో కలపాలి. చిన్న అక్వేరియం పంపు(బబ్లర్)ను ఈ బక్కెట్‌కు అమర్చి నిరంతరాయంగా ఆక్సిజన్ అందించే ఏర్పాటు చేయాలి. ఈ బబ్లర్‌కు అయ్యే విద్యుత్ ఖర్చు చాలా స్వల్పం. దీన్ని  ఆన్ చేసిన 48 గంటల్లో  ‘కంపోస్టు టీ’ వాడకానికి సిద్ధమవుతుంది.

కిచెన్ గార్డెన్‌లో మొక్కలకు  నీళ్లకు బదులు కంపోస్టు టీని (నీటిని కలపకుండా) యథాతథంగా మొక్కలకు పోసుకోవచ్చు.  కుండీలు, మడుల్లో అవసరం మేరకు మితంగా వాడుకోవాలి. ఇలా.. బక్కెట్‌లో నుంచి కంపోస్టు టీని తీసిన తర్వాత అందులో మళ్లీ మామూలు నీటిని పోయాలి. ఇలా కొత్త నీరు పోసిన తర్వాత ఒక రోజులోనే కంపోస్టు టీ వినియోగానికి సిద్ధమవుతుంది. కొత్త నీరు పోసిన ప్రతి సారీ బక్కెట్‌లోని కంపోస్టు మూటను విదల్చాలి. వారానికోసారి అరస్పూను బెల్లం, అరస్పూను పిండిని నీటిలో కలిపితే.. సూక్ష్మజీవులు వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది.
 
కంపోస్టు ఎన్నాళ్లకు మార్చాలి?
20 లీటర్ల బక్కెట్‌లో నానగట్టిన 3 లేదా 4 కప్పుల కంపోస్టును 2 లేదా 3 వారాలకోసారి మార్చుకుంటే సరిపోతుంది. 200 లీటర్ల డ్రమ్ములో అయితే 5 కిలోల కంపోస్టు నానగట్టాలి. దీంట్లోంచి 50 లీటర్ల వరకు కంపోస్టు టీ తీసి వాడుకుంటూ ఆ మేరకు నీటిని తిరిగి నింపుతూ ఉంటే.. 30 రోజులకోసారి కంపోస్టు మార్చుకోవాలి.  కంపోస్టుతోపాటు పచ్చి పేడను కూడా వేరే మూటగా కట్టి కంపోస్టుతోపాటు బక్కెట్‌లో నానబెడితే.. కంపోస్టు టీ మరింత ప్రభావశీ లంగా తయారవుతుందని హైదరాబాద్‌కు చెందిన పర్మాకల్చర్ డిజైనర్, యువ సిటీ ఫార్మర్ జీ సాయి ప్రసన్న కుమార్(99514 52345. మధ్యాహ్నం 2-5 గంటల మధ్యలో మాత్రమే ఫోన్ చేయాలి) తెలిపారు. సాధార ణంగా కంపోస్టు టీ దుర్వాసన రాదు. ఆక్సిజన్ అందకపోయినా, పిండి/ బెల్లం ఎక్కు వైనా రంగుమారి, దుర్వాసన వస్తుంది.    
 - ఇంటిపంట డెస్క్  intipanta@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement