పెరటి తోట కోసం న్యాయపోరాటం!
సాధాణంగా పెరటి తోట ఇంటి వెనుక భాగంలో ఉంటుంది. ఇంటి ముందు భాగంలో కిచెన్ గార్డెన్ ఉండడం అమెరికాలో శిక్షార్హమైన నేరం! ఇంటిపంటల ప్రేమికులు ఇంటి ముందు గార్డెన్ కన్నా కిచెన్ గార్డెన్ ఉంటే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. ఇంటి ముందున్న తమ సొంత స్థలంలో సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు పెంచుకునే హక్కు కోసం కోర్టులకెక్కుతున్నారు.
ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓర్లాండో నగరానికి చెందిన జాసన్, జెన్నిఫర్ హెల్వెన్‌స్టన్ దంపతులు ఇటువంటి కేసులో ఇటీవలే విజయకేతనం ఎగురవేశారు. 17 ఏళ్లుగా తమ ఇంటి ముందున్న కిచెన్ గార్డెన్‌ను తొలగించమని స్థానిక అధికారులు గత ఏడాది ఆదేశించడంతో వీరు కోర్టుకెళ్లారు. ‘విత్తు నాటండి.. చట్టం మార్చండి’ నినాదంతో పాట్రియాట్ గార్డెన్స్ సంస్థ సారధ్యంలో 6 వేల మంది స్థానికులు ఈ జంటకు బాసటగా నిలిచి విజయం సాధించడం విశేషం.