‘కంపోస్టు టీ’ మొక్కలకు బలిమి!
ఆకుకూరలు, కూరగాయలను సేంద్రియ పద్ధతుల్లో పండించే క్రమంలో మొక్కలకు పోషకాల లోపం రాకుండా చూసుకోవడం ఒక ముఖ్యాంశం. కుండీలు, మడుల్లో విత్తనాలు లేదా మొక్కలు నాటిన తర్వాత రోజూ అవసరం మేరకు నీళ్లు పోస్తుంటాం. అడపా దడపా కంపోస్టు వేయడం, జీవామృతం, పంచగవ్య వంటి ద్రవ ఎరువులను నీటిలో కలిపి పోయడం లేదా పిచికారీ చేయడం ద్వారా పోషకాల లోపం రాకుండా చూసుకోవచ్చు. అయితే, వీటి సేకరణ వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఈ సమస్యను అధిగమించడానికి మరో మార్గం లేదా? తప్పకుండా ఉంది! అదే.. కంపోస్టు టీ! కిచెన్ గార్డెన్‌లో మొక్కలకు రోజూ వట్టి నీళ్లకు బదులు పోషకాలతో కూడిన కంపోస్టు టీని పోస్తూ.. మంచి దిగుబడి పొందొచ్చు. హైదరాబాద్ నాగోల్‌లోని గార్డెన్స్ ఆఫ్ అంబడెన్స్ బృందం సభ్యుడు జి. సాయి ప్రసన్నకుమార్ ( 99514 52345) సొంత అనుభవ సారం ఇది..
కంపోస్టు టీ తయారీ ఇలా..
3 లేదా 4 కప్పుల తాజా వర్మీ కంపోస్టు లేదా కంపోస్టును తీసుకొని.. సాక్స్‌లో లేదా పల్చటి గుడ్డలో మూట కట్టాలి. బక్కెట్ లేదా చిన్న తొట్టిలో 20 లీటర్ల నీటిని పోసి.. ఆ నీటిలో కంపోస్టు మూటను వేలాడగట్టాలి. అర స్పూను బెల్లం/పంచదారతోపాటు.. అర స్పూను శనగ/పెసర/కంది/మినుము పిండిని నీటిలో కలపాలి. చిన్న అక్వేరియం పంపు (బబ్లర్)ను ఈ బక్కెట్‌కు అమర్చి నిరంతరాయంగా ఆక్సిజన్ అందించే ఏర్పాటు చేయాలి. ఈ బబ్లర్‌కు అయ్యే విద్యుత్ ఖర్చు చాలా స్వల్పం. దీన్ని ఆన్ చేసిన 6 గంటల్లో లేత కషాయం రంగులో ‘కంపోస్టు టీ’ సిద్ధమవుతుంది.
రోజువారీగా నీళ్లకు బదులు.. కంపోస్టు టీని (నీటిని కలపకుండా) యథాతథంగా మొక్కలకు పోయాలి. కుండీలు, మడుల్లో అవసరం మేరకు మితంగా పోసుకుంటూ కంపోస్టు టీని పొదుపుగా వాడుకోవాలి. ఇలా.. బక్కెట్‌లో నుంచి కంపోస్టు టీని తీసిన తర్వాత అందులో మళ్లీ మామూలు నీటిని పోయాలి. ఇలా చేసిన ప్రతిరోజూ లేదా ప్రతిసారీ అరస్పూను బెల్లం, పిండిని ఆ నీటిలో తప్పక కలపాలి. సాక్స్‌లో పోసి బక్కెట్‌లో నానబెట్టిన కంపోస్టును నీటితోపాటు మార్చాల్సిన అవసరం లేదు. 10 రోజులకోసారి మార్చుకుంటే సరిపోతుంది. పశువుల పచ్చిపేడను కూడా వేరే మూట కట్టి కంపోస్టుతోపాటు బక్కెట్‌లో నానబెడితే.. కంపోస్టు టీ మరింత ప్రభావశీలంగా తయారవుతుందన్నది నిపుణుల మాట.
కంపోస్టు టీ ప్రత్యేకత
సూక్ష్మజీవుల తోడ్పాటుతో మొక్కలు పోషకాలను గ్రహిస్తాయి. పోషకాలను మొక్కలు వినియోగించుకోగలిగే రూపంలోకి మార్చి అందించడంలో సూక్ష్మజీవుల పాత్ర కీలకం. కంపోస్టు/పేడలో లెక్కలేనన్ని మేలుచేసే సూక్ష్మజీవులుంటాయి. వీటిని ఎన్నో రెట్లు పెంచి కంపోస్టు టీ ద్వారా రోజూ అందిస్తే కిచెన్ గార్డెన్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. స్వల్ప ఖర్చుతో ఇంటిపట్టునే కంపోస్టు టీని సులభంగా, ప్రతి రోజూ తయారు చేసుకోవచ్చు.
సాధారణంగా కంపోస్టు టీ దుర్వాసన రాదు. బక్కెట్‌లో నీటికి బబ్లర్ ద్వారా ఆక్సిజన్ సరిగ్గా అందకపోయినా, పిండి/బెల్లం మోతాదు ఎక్కువైనా కంపోస్టు టీ రంగు మారి, దుర్వాసన వస్తుంది. ఇది వాడితే ఇంటిపంటలు బలంగా, ఏపుగా పెరుగుతాయి. చీడపీడల బెడద తగ్గుతుంది. ఆకుకూరలు, కూరగాయల రుచి, నాణ్యత ఇనుమడిస్తాయి.