ఏపీలోని కర్నూల్‌కు చెందిన సోమేశుల సుబ్బలక్ష్మి బాటనీ లెక్చరర్. పాతికేళ్లుగా చేస్తున్న ఉద్యోగం మానేసి.. తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఆకుకూరలు, కూరగాయలను హైడ్రోపోనిక్ పద్ధతిలో సాగు చేసుకునే హోమ్ కిట్లను రూపొందించారు. వీటిలో ఉపయోగించే పోషకాల మిశ్రమాలను మార్కెట్‌లో లభించే ధరలో సగానికే అందుబాటులోకి తెస్తున్నారు. వీరి కృషిని ప్రోత్సహిస్తూ తిరుపతిలోని వ్యవసాయ పరిశోధనా స్థానం రూ. 4 లక్షల గ్రాంటును మంజూరు చేయటం విశేషం.
భర్త డా. మైకేల్ డేవిడ్ ప్రోత్సాహంతో ఏడాదిన్నర క్రితం శుద్ధ గ్రీన్స్ అనే స్టార్టప్‌ను స్థాపించారు సుబ్బలక్ష్మి. అపార్ట్‌మెంట్లలో నివసించే మధ్యతరగతి కుటుంబాలకు అనువైన ౖహైడ్రోపోనిక్ హోమ్ కిట్లను రూపొందించారు. బాల్కనీలో, కారిడార్‌లలో, గ్రిల్‌కు, ఇంటి ముందు, ఇంటిపైన అమర్చుకోవచ్చని సుబ్బలక్ష్మి తెలిపారు. తమ అపార్ట్‌మెంట్ భవనం టెర్రస్ పైన 700 చదరపు అడుగులలో ఇనుప చువ్వలతో పందిరి వేసి దానిపై ఇన్‌సెక్ట్ నెట్ వేసి.. అందులో హైడ్రోపోనిక్ పద్ధతిలో ఆకుకూరలు సాగు చేస్తున్నారు. తాము తినటంతోపాటు ఇతరులకూ వంద గ్రాములు రూ. పదికి అమ్ముతున్నారు.
కుండీలు, మడుల్లో కన్నా హైడ్రోపోనిక్ పద్ధతిలో 15 రోజులు ముందుగానే ఆకుకూరలు కోతకు వస్తాయని సుబ్బలక్ష్మి తెలిపారు. ప్రోట్రేలలో కొబ్బరి పొట్టు నింపి, ఆకుకూరల విత్తనాలు వేసి 21 రోజులు పెంచుతారు. ఆ తర్వాత మొక్కలను పీవీసీ పైపులతో తయారైన ఎన్.ఎఫ్.టి. ఛానల్స్‌లో పెడతారు. ఆ పైపులలో నిరంతరం పోషకాలతో కూడిన నీరు సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇలా పెట్టిన పాలకూర, కొత్తిమీర, ఎర్రతోటకూర, సిరికూర, గోంగూర, గంగవాయిలి, పుదీన తదితర పంటలు 20–25 రోజుల్లో ఆకుకూరలు కోతకు వస్తున్నాయని ఆమె తెలిపారు. ఆకుకూరలు, మొక్కలు పెరగడానికి 16 మూలకాలు కావాలి. అందులో కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్ మొక్కలు వాతావరణంలో నుంచి తీసుకుంటాయి. మితగా 13 రకాలతోపాటు కొన్ని రకాల జీవన ఎరువులను తాము తగిన మోతాదులో కలిపి రెండు రకాల పొడులు, ద్రావణాల రూపంలో ఇస్తున్నామని ఆమె తెలిపారు. బయట దొరికే వాటితో పోల్చితే సగం ధరకు తాము వీటిని వినియోగదారులకు అందిస్తున్నామన్నారు.
90, 48, 32, 24 మొక్కలు పెంచుకోవడానికి వీలయ్యే హైడ్రోపోనిక్ హోమ్ కిట్లతోపాటు పోషక మిశ్రమాలను ఇస్తున్నామన్నారు. వీటిని అనేక నగరాలతోపాటు విదేశాలకూ ఎగుమతి చేస్తున్నామన్నారు. బక్కెట్‌లో 4–5 రోజులకోసారి నీటిని, పోషకాలను తగు మాత్రంగా కలుపుతూ ఉంటే ఆకుకూరలను సులువుగా పండించుకోవచ్చని సుబ్బలక్ష్మి తెలిపారు. కొంచెం అవగాహన పెంచుకుంటే సాధారణ గృహిణులు సైతం ఆకుకూరలు, టమాటా, మిరపకాయలు కూడా ఇలా సులువుగా, ఆరోగ్యదాయకంగా పండించుకోవచ్చని సుబ్బలక్ష్మి(86391 03060) చెబుతున్నారు.
హైడ్రోపోనిక్ సాగు సులువే!
Published Mon, Jan 18 2021 9:51 AM | Last Updated on Mon, Jan 18 2021 12:09 PM
1/1
Advertisement
Comments
Please login to add a commentAdd a comment