soybeans
-
సోయా కొనుగోళ్లకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, నిజామాబాద్: సోయా కొనుగోళ్లకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది కూడా సోయా సేకరణకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నాఫెడ్ ఇటీవల సూత్రప్రాయంగా అంగీకరించిందని మార్క్‌ఫెడ్ వర్గాలు పేర్కొంటున్నారు. ఎంత పరిమాణంలో కొనుగోలు చేస్తుందనేదానిపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. దీంతో జిల్లాలో ఈసారి సోయా సాగు చేస్తున్న రైతులకు కనీస మద్దతు ధర దక్కే అవకాశాలున్నాయి. 5.93 లక్షల క్వింటాళ్ల దిగుబడి వరి, మొక్కజొన్న తర్వాత జిల్లాలో అత్యధికంగా సోయా పంట సాగవుతుంది. ఈసారి 74,153 ఎకరాల్లో ఈ పంటను వేసుకున్నారు. విస్తారంగా వర్షాలు కురియడంతో దిగుబడులు కూడా భారీగా పెరిగే అవకాశాలున్నాయి. గత ఏడాది ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల వరకు వస్తే ఈసారి మరో రెండు క్వింటాళ్లు అదనంగా దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ భావిస్తోంది. ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల చొప్పున లెక్కేస్తే 74,153 ఎకరాలకు సుమారు 5.93 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని అంచనా. మార్కెట్ ధరపైనే ఆధారం.. కాగా సోయా కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) క్వింటాలుకు రూ.3,880 ఉంది. అయితే మార్కెట్ ధర కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఉంటే రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయిస్తారు. ప్రస్తుతం మార్కెట్ ధర క్వింటాలుకు రూ.3,400 వరకు పలుకుతోంది. సోయాలు మార్కెట్‌కు వచ్చేసరికి ఇదే ధర ఉంటే రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే సోయాలను విక్రయిస్తారు. ఏటా అక్టోబర్ మొదటి వారంలో సోయా కోనుగోళ్లు ప్రారంభమవుతాయి. మరో ఇరవై రోజుల్లో సోయాలు మార్కెట్లోకి వస్తాయి. దీంతో మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. గత ఏడాది 16 వేల క్వింటాళ్ల సేకరణ.. గత ఏడాది ఖరీఫ్ కొనుగోలు సీజనులో జిల్లాలో 16,525 క్వింటాళ్లు సేకరించారు. 1,027 మంది రైతులకు సంబంధించి సుమారు రూ.6.13 కోట్లు విలువ చేసే సోయాను కొనుగోలు చేశారు. అయితే ఈసారి మార్కెట్ రేట్ కనీస మద్దతు ధర కంటే తక్కువగా ఉంటే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయాల్సిన ఉంటుందని భావిస్తున్నారు. జిల్లాల వారీగా అలాట్మెంట్ ఇస్తాం.. నాఫెడ్ ఉన్నతాధికారులతో ఇటీవల సమావేశం జరిగింది. సోయా కొనుగోళ్లకు నాఫెడ్ అంగీకరించింది. రాష్ట్రంలో ఎంత పరిమాణంలో కొనుగోలు చేస్తారనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది. నాఫెడ్ స్పష్టత ఇచ్చిన వెంటనే జిల్లాల వారీగా సోయా సేకరణకు అలాట్మెంట్ ఇస్తాము. – మార గంగారెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మన్ -
అమెరికాపై చైనా ‘సోయాబీన్స్’ యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధంలో ‘సోయాబీన్స్’ చైనాకు ప్రధాన ఆయుధమైంది. 25, 000 డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై అమెరికా ఇటీవల దిగుమతి సుంకాలను పెంచినందుకు ప్రతీకారంగా అమెరికా నుంచి సోయాబీన్స్ దిగుమతిని పూర్తిగా నిలిపివేసింది. ప్రపంచంలోనే సోయాబీన్స్‌ను దిగుమతి చేసుకుంటున్న అతిపెద్ద దేశం చైనానే. దీని వల్ల అమెరికాకు తీవ్రమైన నష్టం కలుగుతుంది. ప్రపంచ ఆహారం లింకుల్లో సోయాబీన్స్ చాలా ముఖ్యమైనది. పందులు, కోళ్ల పెంపకంలో ఇది చాలా ముఖ్యమైన ప్రొటీన్. ఒకప్పుడు రైస్ ఎక్కువగా తిన్న చైనా ప్రజలు ఆవులు, పందులు, కోళ్ల మాంసానికి అలవాటు పడడంతో పెరిగిన డిమాండ్‌కు తగ్గట్టుగా దేశంలో మాంసం ఉత్పత్తులను పెంచేందుకు ఈ సోయాబీన్స్‌ను చైనా దిగుమతి చేసుకుంటోంది. చైనాలో 1986లో మాంసానికున్న డిమాండ్ 2012 నాటికి 250 రెట్లు పెరిగింది. 2020 నాటికి మరో 30 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. ఆవులు, గొర్రెలు, పందుల పెంపకానికి చాలినంత ఫీడ్‌ను చైనా ఉత్పత్తి చేయలేక పోతోంది. అందుకని అమెరికా, బ్రెజిల్ నుంచి భారీ ఎత్తున సోయాబీన్స్ దిగుమతి చేసుకుంటూ వచ్చింది. బ్రెజిల్ ఏటా 25,700 డాలర్లు విలువైన సోయాబీన్స్‌ను ఎగుమతి చేస్తుండగా, ఆ తర్వాత స్థానంలో అమెరికా ఏటా 21,400 డాలర్లు విలువైన సోయాబీన్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఆ తర్వాత స్థానాల్లో అర్జెంటీనా, పరాగ్వే, కెనడా ఎగుమతి చేస్తున్నాయి. 2017లోనే అమెరికా, బ్రెజిల్ నుంచి చైనా 34,600 డాలర్ల విలువైన సోయాబీన్స్‌ను దిగుమతి చేసుకుంది. చైనా దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచడంతో ముందుగా చైనా ప్రభుత్వం అమెరికా నుంచి సోయాబీన్స్ దిగుమతిపై 25 శాతం సుంకాన్ని పెంచింది. గతంలో అమెరికా రైతులు ఏటా చైనాకు 2.9 కోట్ల మెట్రిక్ టన్నుల సోయాబీన్స్‌ను సరాసరి సగటున ఎగుమతి చేయగా, సుంకం పెంచిన తర్వాత 59 లక్షల మెట్రిక్ టన్నులనే ఎగుమతి చేయగలిగారు. అప్పుడే ఎంతో నష్టపోయిన అమెరికా రైతులు, ఇప్పుడు చైనా నిర్ణయంతో ఎక్కువ నష్టపోతారు. తక్కువపడే సోయాబీన్స్‌ను బ్రెజిల్‌తోపాటు ఇతర దేశాల నుంచి చైనా దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు చేపట్టింది. -
సోయా పాలతో దేహానికి పుష్టి...
ఒకప్పుడు పాలు అంటే ఆవు లేదా బర్రె నుంచి పిండుకున్నవే. మరిప్పుడో.. బోలెడన్ని రకాలు. సోయా, బాదాం, బియ్యపుపాలు, కొబ్బరిపాలు.. ఇలా పాలు వేర్వేరు రూపాల్లో అందుతోంది. ఆవు, బర్రెపాలు అంటే పడనివారు చాలామంది వీటిని ఉపయోగిస్తున్నారు కూడా. ఎన్ని రకాలు ఉంటేనేం ఆరోగ్యానికి ఆవుపాలే మేలు అంటున్నారా? మీ అంచనా నిజమేకానీ.. సోయా గింజల నుంచి సేకరించిన పాలు కూడా దాదాపు ఇంతే మేలు చేస్తాయని అంటున్నారు మెక్‌గిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. గింజల, కాయల నుంచి సేకరించే రకరకాల పాలన్నింటిలోని పోషకాలను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని... అన్ని రకాల పోషకాలు సమతులంగా ఉండే పాలు సోయా అని వారు చెప్పారు. సోయాలోని ఐసోఫ్లేవిన్స్ అనే రసాయనాలు కేన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాయన్నది తెలిసిన విషయమే. దీంతోపోలిస్తే బియ్యంతో చేసిన పాలు తీయగా ఉన్నప్పటికీ పోషకాలు మాత్రం తక్కువేనని వీరి అధ్యయనంలో తెలిసింది. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల పసిపిల్లలకు అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇక ఆసియాతోపాటు దక్షిణ అమెరికాలో ఎక్కువగా వినియోగించే కొబ్బరి పాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఇక బాదాంపాలలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు బరువు తగ్గించుకునేందుకు భేషుగ్గా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తల అంచనా. -
రైతుల కన్నెర్రకు కారణాలివే
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతం రైతులు ఆందోళన చేయడానికి దారితీసిన కొన్ని ప్రత్యేక కారణాలు వెలుగులోకి వచ్చాయి. భారత్‌లో పండే మొత్తం సోయాబిన్ పంటలో 20 శాతం పంట ఇక్కడి మాల్వా ప్రాంతంలోనే పండుతుంది. ఈ పంట నేరుగా ఇండోర్‌లోని చమురు విత్తనాల క్రషింగ్ కంపెనీలకు వెళుతుంది. ఆ కంపెనీలు చమురు తీయగా మిగలిన సోయాబిన్ పొడిని సోయాబిన్ ఆహారం పేరిట అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఈ ఆహారాన్ని పశువుల దాణా కింద అమెరికా ఉపయోగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గత ఐదేళ్ల కాలంలో సోయాబిన్ ఉత్పత్తి 150 శాతం పెరగడం, భారత్‌కన్నా ఇతర దేశాల నుంచే సోయాబిన్ గింజలు చౌకగా లభిస్తుండడంతో అమెరికా ఎగుమతులు పడిపోవడం, భారత్ చమురు కంపెనీలు కూడా విదేశీ సోయాబిన్ గింజల దిగుమతికే ప్రాధాన్యం ఇవ్వడం, పర్వవసానాల కారణంగా దేశంలో సోయాబిన్ పంట ధర ఘోరంగా పడిపోయింది. 2012–2013 సంవత్సరంలో విదేశాల నుంచి సోయాబిన్ గింజల దిగుమతి 10.91 లక్షల టన్నులు ఉండగా, 2015–16 సంవత్సరానికి 42.35 లక్షల టన్నులకు చేరుకుంది. విదేశీ దిగుమతులను అరికట్టేందుకు వాటిపై 45 శాతం పన్ను విధించే అవకాశం భారత ప్రభుత్వానికి ఉన్నప్పటికీ 12.50 శాతానికే పన్నును పరిమితం చేయడంతో దిగుమతులు పెరుగుతున్నాయి. 2010–11 సంవత్సరంలో మన దేశం నుంచి అమెరికా లాంటి దేశాలకు దాదాపు 43 లక్షల టన్నుల సోయాబిన్ ఎగుమతి జరగ్గా అది 2015–16 సంవత్సరం నాటికి మూడు, నాలుగు లక్షల టన్నులకు పడిపోయింది. ప్రపంచంలో సోయాబిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న అర్జెంటీనా లాంటి దేశాలు భారత్ కన్నా అతి తక్కువ ధరకు ఎగుమతి చేస్తుండడంతో భారత్ మార్కెట్ పోటీని తట్టుకోలేక పోతోంది. భారత్‌లో ఓ హెక్టార్ భూమిలో ఓ టన్ను సోయాబిన్‌ను దిగుబడి వస్తుండగా, అర్జెంటీనా ఓ హెక్టార్ భూమిలో మూడు టన్నుల సోయాబిన్ దిగుబడిని తీస్తోంది. అందుకు కారణం ఆధునిక సోయాబిన్ వంగడాలను వాడడమేనని వ్యవసాయ నిపుణలు తెలియజేస్తున్నారు. భారత్‌లో 23 ఏళ్ల క్రితం అభివద్ధి చేసిన సోయాబిన్ విత్తనాలనే నేటికి ఉపయోగిస్తున్నారు. దేశంలో 2015 నాటి వరకు కూడా దాదాపు క్వింటాల్ సోయాబిన్‌కు ధర దాదాపు నాలుగువేల రూపాయలు ఉండగా, గత ఏడాదికి అది 3, 200 రూపాయలకు పడిపోయింది. ప్రస్తుతం 18,00 రూపాయలకు మించి పలకడం లేదు. అంటే ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (రూ.2,750) కన్నా చాలా తక్కువ. ఆ ధరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ముందుకు రావడం లేదు. తమకు మరో పంట వేయడం తెలియకుండా పోయిందని, గిట్టుబాటు ధర లేక గత సోయాబిన్ పంటను అలాగే గిడ్డంగుల్లో నిల్వచేసి ఉంచామని రైతులు వాపోతున్నారు. 1980లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చొరవ వల్ల రాష్ట్రంలో రైతులంతా సోయాబిన్ పంటవైపు మొగ్గుచూపారు. సోయాబిన్ పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ‘ఆయిల్‌ఫెడ్’ లాంటి సంస్థలను ఏర్పాటు చేసింది. కనీస మద్దతు ధరను నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల రైతులు దెబ్బతింటున్నారు. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 31.35 కోట్ల టన్నుల సోయాబిన్ గింజలు ఉత్పత్తి అవుతాయని అమెరికా వ్యవసాయ సంఘం తాజాగా అంచనా వేసింది. భారత్‌లో కూడా మరో మూడు నెలల్లో కొత్త పంట వస్తున్నందున సోయాబిన్ మార్కెట్ ధర ప్రస్తుతం కంటే మరింతగా పడిపోతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అదే కనుక జరిగితే మధ్యప్రదేశ్ రైతులకు కష్టాలు తప్పవు. -
ఉప్పు ద్రావణంతో సోయా గింజలకు రక్షణ
కోతకు వచ్చిన సోయాచిక్కుళ్లను ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలు దెబ్బతీస్తున్నట్లు సమాచారం. జూన్ 3వ వారంలో విత్తిన సోయాచిక్కుళ్లు పంటలో మొదట వచ్చిన కాయలు కోతకు అందివస్తున్నాయి. అయితే, ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాల మూలంగా సోయా మొక్కలకు ఉన్న కాయల్లో గింజలు మొలకెత్తి బూజు పట్టి పాడైపోతున్నట్లు రైతులు చెబుతున్నారు. జూన్ 3వ వారంలో విత్తిన పంటలో తొలి కాయలు పక్వానికి వస్తున్న దశలో వర్షాలు రావడంతో కాయలు చెట్టుకు ఉండగానే గింజలు మొలకెత్తుతున్నాయని, బూజు పట్టి కాయలు రంగు మారి పాడైపోతున్నాయని సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త డా. గడ్డం రాజశేఖర్ తెలిపారు. సోయా గింజలకు నిద్రావస్థ లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. సోయాబీన్స్ విస్తారంగా సాగవుతున్న ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాలతోపాటు మహారాష్ట్రలోని యవత్మాల్, వార్థా జిల్లాల్లో కూడా ఈ సమస్య గత మూడేళ్లుగా రైతులను వేధిస్తున్నదన్నారు. వర్షం వెలసిన తర్వాత.. 5% ఉప్పు (అంటే.. 100 లీటర్ల నీటికి 5 కిలోల ఉప్పు కలిపి) ద్రావణాన్ని సోయా పంటపై పిచికారీ చేస్తే కాయల్లో గింజలు మొలకెత్తే సమస్యను అధిగమించవచ్చని డా. రాజశేఖర్ (83329 45368) వివరించారు. -
కొనుగోళ్లపై సోయేది...
*ప్రారంభానికి నోచుకోని సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు * ప్రైవేట్ కొనుగోళ్లదే హవా.. * తక్కువ ధరకే అమ్మకం.. తూకాల్లో మోసాలు * మార్కెట్ ఆదాయానికి గండి *రైతులను ముంచుతున్న దళారులు ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో పత్తి తర్వాత అధికంగా సాగయ్యే పంట సోయా. ప్రస్తుతం సోయాబీన్ పంట దిగుబడులు వస్తున్నా మార్కెట్ యార్డుల్లో ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో సోయాబీన్ రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన పలువురు వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. దానికితోడు తూకాల్లోనూ మోసాలకు పాల్పడుతూ రైతులను మోసం చేస్తున్నారు. ఈ ప్రైవేటు దందాతో మార్కెట్‌కు సెస్ రూపంలో రావాల్సిన లక్షల ఆదాయానికి గండిపడుతోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు వంద వరకు ప్రైవేటు కేంద్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. భారీగా తగ్గిన దిగుబడి.. జిల్లాలో ఈ ఏడాది 1,11,367 హెక్టార్లలో సోయాపంట విత్తారు. 20 లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ.. వర్షాభావ పరిస్థితులు, నాణ్యత లేని విత్తనాలతో దిగుబడి గణనీయంగా పడిపోయింది. 5 లక్షల క్వింటాళ్ల వరకు రావడం గగనమే. ఒక ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు రావాల్సిన దిగుబడి 3 నుంచి 5 క్వింటాళ్ల వరకు పడిపోయింది. వర్షాలు లేక విత్తిన పంట మొలకెత్తక భూమిలోనే మురిగిపోయింది. దీంతో రెండుమూడు సార్లు విత్తనాలు వేశారు. దీనికితోడు ప్రభుత్వం రాయితీపై అందించిన విత్తనాలు మొక్కలు పెరిగిన కొన్ని మండలాల్లో కాత లేదు. కొన్ని మండలాల్లో కాత ఉన్నా అందులో గింజలు లేవు. ఉన్నా చిన్నవిగా ఉండి నాణ్యత లోపించింది. కాస్తోకూస్తో వచ్చిన దిగుబడిని అమ్ముకుందామంటే మార్కెట్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. వ్యాపారులు నిర్ణయించిన ధర రూ.2200 నుంచి రూ.2500 వరకే అమ్ముకుంటున్నారు. రూ.2500 వరకు చెల్లించినా తూకంలో మోసం చేస్తున్నారు. ఈ ఏడాది ఇంత వరకు కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో దళారులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2560కి తక్కువగా చెల్లిస్తున్నారు. నాణ్యత లేని విత్తనాలతో.. వర్షాలతో రెండు మూడు సార్లు విత్తనాలు విత్తి రైతులు నష్టపోగా.. ప్రభుత్వం 33శాతం రాయితీపై రూ.1570లకు రైతులకు అందించిన విత్తనాలు మరింత ముంచాయి. జిల్లాలో 80 క్వింటాళ్ల వరకు విత్తనాలు అందించగా.. నాణ్యత లేకపోవడంతో తాంసి, జైనథ్, ఆదిలాబాద్, సిర్పూర్(టి), కాగజ్‌నగర్, బజార్ హత్నూర్, ఇచ్చోడ, నార్నూర్, మండలాల్లో దిగుబడి గణనీయంగా తగ్గింది. పలు మండలాల రైతులు పంట నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. రెండ్రోజుల్లో ఏర్పాటు చేస్తాం.. - కిష్టాగౌడ్, ఆదిలాబాద్ మార్కెట్ కార్యదర్శి సోయాబీన్ కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వ రంగ సంస్థలతో, వ్యాపారులతో చర్చించి రెండ్రోజుల్లో ఏర్పాటు చేయిస్తాం. రైతులు పంటకు మద్దతు ధర రావాలంటే మార్కెట్ యార్డులోనే విక్రయాలు జరపాలి. సోయాలో చెత్త లేకుండా, తేమా తక్కువగా ఉండేలా చూసుకునే తీసుకురావాలి. -
పచ్చని పెరటి తోట!
- స్ఫూర్తిదాయకంగా విశ్రాంత ఉపాధ్యాయుడి కుటుంబం ఇంటిపంటల సాగు - ఎర పంటల సాగుతో చీడపీడలు దూరం ఇంటి పంట: రసాయనిక అవశేషాల్లేని స్వచ్ఛమైన ఆహారం కోసం జరిగే ఒక ప్రయత్నం కచ్చితంగా మరెందరిలోనో స్ఫూర్తిని రగిలిస్తుంది. గుంటూరులోని సంపత్‌నగర్‌కు చెందిన బసవరాజు జయశంకర్(60) పెరటి తోట ఇందుకు సజీవ నిదర్శనమైంది. తన ఇంటి వెనుక 7 సెంట్ల స్థలంలో ఈ ఏడాది జూన్ నుంచి జీవామృతం, ఘనజీవామృతం వాడుతూ ఆరోగ్యదాయకంగా ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. విశ్రాంత ఉపాధ్యాయుడు, నంది అవార్డు గ్రహీత అయిన నాటక కళాకారుడు అయిన జయశంకర్(98857 90942) విశ్రాంత వ్యవసాయ విస్తరణాధికారి ఎస్ఎస్ఎన్ మూర్తి తోడ్పా టుతో పెరటి తోట సాగును ప్రారంభించారు. మట్టి తోలించి ఎత్తు మడులు చేశారు. తోటకూర, పాలకూర, గోంగూర, మెంతికూర, వంగ, బెండ, బీర, కాకర, సొర, పొట్ల, మునగ, సోయాచిక్కుళ్లు సాగు చేస్తున్నారు. పెరటి తోట చుట్టూ జొన్న, సజ్జ, ఆముదం, పత్తి మొక్కలు వేసి పంటలకు చీడపీడల బెడద రాకుండా కాపాడుకుంటున్నారు. గత కొద్ది నెలలుగా టమాటా తప్ప మార్కెట్‌కెళ్లి కూరగాయలు, ఆకుకూరలు కొనాల్సిన అవసరం రాలేదన్నారాయన. ఆకుకూరలు, కూరగాయలను ఇతరులకూ పంచిపెడుతున్నామన్నారు. దగ్గర్లోని ఆలయం వద్ద నుంచి తెచ్చిన ఆవు పేడ, మూత్రంతో జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసుకొని వాడుతున్నామన్నారు. ఇతర ఎరువులు, పురుగు మందులు వాడకుండా స్వచ్ఛంగా పండిస్తున్నందున రుచికరమైన కూరగాయలు అందివస్తున్నాయన్నారు. రోజూ పది మందైనా తమ పెరటి తోటను చూసి, వివరాలు తెలుసుకొని వెళ్తున్నారని, వారిలో కొందరు ఇంటిపంటల సాగు ప్రారంభిస్తున్నారని జయశంకర్ తెలిపారు. పెరటి తోటను సందర్శించి ముగ్ధులైన జిల్లా ఉద్యాన శాఖ అధికారులు విత్తనాల ప్యాకెట్లను 90% రాయితీపై అందించారు. దీంతో ఇరుగు పొరుగు వారు సైతం ఇంటిపంటల సాగును ప్రారంభించడం విశేషం. ఇప్పుడు వేసుకోదగిన ఇంటపంటలేవి? శీతాకాలం ప్రారంభమవుతున్నది. ఈ కాలంలో ఎటువంటి ఇంటిపంటలు విత్తుకోవచ్చు లేదా నాటుకోవచ్చు? సుస్థిర వ్యవసాయ కేంద్రం (తార్నాక, సికింద్రాబాద్. ఫోన్: 040- 65268303) శాస్త్రవేత్తలు ఇలా సూచిస్తున్నారు. అక్టోబర్ నెలలో కుండీలు, మడుల్లో సాగు ఆరంభించదగిన ఇంటిపంటలు ఇవి: క్యాబేజ్, క్యాలీఫ్లవర్, క్యాప్సికం, వంగ, టమాట, ఉల్లి, బంగాళ దుంపలు, బీన్స్, ముల్లంగి, బఠాణీ, దోస, అన్ని రకాల ఆకుకూరలు. క్యాబేజ్, క్యాలీఫ్లవర్, క్యాప్సికం, వంగ, టమాట నారు పోసి మొక్కలు నాటుకోవాలి. 3-4 వారాల నారు శ్రేష్టం. ఎదిగిన నారు దొరికితే నాటుకోవచ్చు. లేదా విత్తనాలుంటే ఇప్పుడైనా నారు పోసుకొని, 3-4 వారాల తర్వాత నాటుకోవచ్చు. నవంబర్ 2న ఇంటిపంట గార్డెనర్స్ మీట్! సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు పండిస్తున్న, పండించుకోదలచిన హైదరాబాద్ మహానగర వాసుల సమావేశం నవంబర్ 2 (ఆదివారం)న జరగనుంది. ఏఎస్ రావు నగర్(కాప్ర)లోని విజయ హైస్కూల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ముందుగా పేర్లు నమోదు చేయిం చుకున్న వారెవరైనా ఈ ఉచిత వర్క్‌షాప్‌లో పాల్గొనవచ్చు. manasa.valicherla @gmail.comకు మెయిల్ ఇచ్చి పేరు నమోదు చేయించుకోవాలి. సేంద్రియ ఇంటిపంటల సాగు, వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారీ తదితర విషయాలు చర్చకొస్తాయి. విత్తనాలు, మొక్కలు ఇచ్చిపుచ్చుకోవడం కూడా ఉంటుంది. -
కరువుతో కాపురమే!
ఈసారీ విదర్భ రైతుకు కష్టకాలమే నాగపూర్: కరువుతో కాపురం చేసే విదర్భ రైతు పరిస్థితి ఈ ఏడాది కూడా మారేలా కనిపించడంలేదు. పైగా మరిన్ని కష్టాలను ఎదుర్కోవాల్సిన దుస్థితి ఎదురు కానుంది. పత్తి, సోయా పంటలపై ఎక్కువగా ఆధారపడే ఈ ప్రాంత రైతులు వర్షాలు కురుస్తాయన్న ఆశతో విత్తనాలను వేలాది ఎకరాల్లో నాటి చినుకు కోసం ఎదురు చూస్తున్నారు. జూన్ మొదటి వారంలోనే వర్షాలు కురవాల్సి ఉన్నా ఇప్పటిదాకా చినుకు జాడే లేదు. విత్తనాలు నాటి దాదాపు నెల గడుస్తున్నా చినుకు పడలేదు. మొక్క మొలవలేదు. భూమిలో నాటిన విత్తనాలు పాడైపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో విత్తనాలు మళ్లీ మొలకెత్తే పరిస్థితి కనిపించడంలేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వర్షాలు కురవకపోతే నాటిన విత్తనాలతోపాటు ఎరువుల ఖర్చు భారం కూడా రైతన్న మోయాల్సి వస్తుందంటున్నారు. మరో పక్షం రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురిసినా పంటకాలం దాటిపోవడంతో ఆశించినమేర దిగుబడి రావడం కష్టమేనంటున్నారు. పెట్టుబడి మట్టిపాలు... ‘విదర్భ రైతులు వేలాది రూపాయలు బ్యాంకుల నుంచి రుణంగా తీసుకొని విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశారు. మట్టి సారం పెరిగేందుకు ఇప్పటికే వేలాది రూపాయల ఎరువులను పొలంలో చల్లారు. విత్తనాలను కూడా నాటుకున్నారు. వర్షాలు ఆలస్యం కావడంతో ఈసారీ కరువు తప్పదేమోనన్న బెంగలో రైతులున్నారు. రైతులు తీవ్ర నిర్ణయాలు తీసుకోకముందే ప్రభుత్వం వారిని ఆదుకోవాలి. ఇప్పటికే తీసుకున్న బ్యాంకు రుణాలను మాఫీ చేసి, ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతును ప్రోత్సహించాలి.అందుకు అవసరమైన విత్తనాల సరఫరా వంటివి చేయాల’ని విదర్భ జనాందోళన్ సమితి అధ్యక్షుడు కిశోర్ తివారీ డిమాండ్ చేశారు. విదర్భ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితి నెలకొనడం ఇది వరుసగా రెండో ఏడాది. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఫరవాలేదనిపించిన వర్షాలు విదర్భ రైతులపై మాత్రం కనికరం చూపలేదు. అయినా కష్టపడి రైతులు పండించిన పంటను అకాల వర్షాలు ఊడ్చుకొని పోయాయి. దీంతో చెమటోడ్చి కూడా రైతన్న కరువుతో కాపురమే చేయాల్సి వచ్చింది. అయితే ఈ ఏడాది కూడా దాదాపు అదే పరిస్థితి నెలకొనే అవకాశముందని వాతావరణ నిపుణులు కూడా చెబుతున్నారు. ఠాణేలో కాంగ్రెస్ యాగం... వరుణుడి జాడ లేకపోవడంతో వర్షాలు కురవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోమవారం యాగం చేశారు. రాష్ట్రాన్ని కరువు కాటు నుంచి తప్పించాలని కోరుతూ వరుణ దేవుడిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతల తోపాటు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలతో యజ్ఞం జరుగుతున్న పరిసరాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కుంభాదేవి ఆలయంలో బీజేపీ... భారతీయ జనతా పార్టీ కూడా ఆదివారం వరుణ యాగం చేసింది. నగరంలోని కుంభాదేవి ఆలయంలో నిర్వహించిన ఈ యజ్ఞంలో బీజేపీ నగరశాఖ అధ్యక్షుడు ఆశిష్ శేలార్, పార్టీ నేత రాజ్‌పురోహిత్ తదితరులు పాల్గొన్నారు. యజ్ఞ గుండంలో స్వయంగా నెయ్యిని పోసి వరుణ దేవుడిని ఆహ్వా నించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొనకుండా చూడాలని వేడుకున్నారు. ప్రచార ఆర్భాటాలే... త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు యజ్ఞయగాలను ఓ ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. కరువు కోరల్లో చిక్కుకుంటున్న రైతులను ఆదుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని, మూగజీవాలకు గడ్డిని, నీటిని అందించే ఏర్పాట్లు చేయాని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇలా యజ్ఞయాగాల పేరుతో ప్రజల ఓట్లను కొల్లగొట్టేందుకు పార్టీలు ప్రయత్నించడం సరికాదంటున్నారు. -
ఆందోళనలో అన్నదాతలు
నిర్మల్, న్యూస్‌లైన్ : వరుణుడు కరుణించాడని ఆనందపడాలో.. అధిక వర్షాలతో పంటలు తెగుళ్ల బారి న పడుతున్నాయని బాధపడాలో తెలియని పరిస్థితి రైతన్నది. గతేడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురియక రైతులు నష్టపోయారు. జిల్లాలో ఈ ఏడాది జూలై నెలాఖరు నాటికి సరాసరిగా 558.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది 1056.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అంటే సాధారణం కంటే 90 శాతం అధికం. అధిక వర్షాలతో చేలలో నీరు నిలిచి రైతులు నష్టపోయారు. జిల్లాలో ఈ ఏడాది 5,23,273 హెక్టార్లలో వివిధ పంటలను సాగు చేయగా అందులో వర్షాల కారణంగా 1.14 లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లినట్టు అధికారులు ప్రాథమిక అంచనా రూపొందించారు. తెగుళ్లను నివారించడానికి రైతులు ఆర్థిక కష్టాలు పడే అవకాశం ఉంది. అయితే ఆశించిన తెగుళ్లను ఎలా నివారించాలో నిర్మల్ ఏడీఏ వినయ్‌బాబు ‘న్యూస్‌లైన్’కు వివరించారు. దుంప తెగుళ్ల బారిన పసుపు పసుపు సాగు రైతన్నకు ఆదిలోనే కష్టాలు తెచ్చిపెట్టింది. జిల్లాలో పసుపు 5,028 హెక్టార్లలో సాగు చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు పసుపు చేనులో నీరు నిల్వ ఉండటంతో దుంప తెగులు సోకింది. ఈ దుంప తెగులు నివారించడానికి చేనులో నీరు నిలువ లేకుండా చూడాలి. రిడోమిల్ ఒక గ్రాము లేదా క్రాప్టాన్ రెండు గ్రాముల మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. పక్షం రోజుల్లో రెండు సార్లు చేసినట్లయితే తెగుళ్లను నివారించవచ్చు. పత్తికి కుళ్లు జిల్లావ్యాప్తంగా పత్తి 3,10,500 హెక్టార్లలో సాగైంది. అధిక వర్షాలతో కుళ్లు తెగుళ్లు ఆశిస్తుండడంతో పంట ఎదుగుదల లోపిస్తోంది. దీనిని నివారించడానికి మొదటగా చేనులోని నీటిని బయటకు పంపించాలి. అనంతరం ఎకరానికి 25 నుంచి 30 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ కలిపి వేయాలి. కుళ్లు తెగుళ్లు రాకుండా ఉండేందుకు కాపర్ ఆక్సిక్లోరైడ్ మూడు గ్రాముల మందును ఒక లీటరు నీటిలో కలిపి పంటపైన, మొక్క మొదళ్లలో 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. పంట వేసి 40 రోజుల నంచి 45 రోజుల సమయం అయితే దానిపై రసం పీల్చే పురుగులు ప్రభావం పడే అవకాశం ఉంది. దీనికి ప్రధానంగా కాండం పూత పద్ధతి పాటించాలి. ఇందుకోసం పావు లీటరు మోనోక్రోటోఫాస్‌ను లీటరు నీటిలో కలిపి కాండంపై పూత పూయాలి. ఇది రెండు నుంచి మూడు ఎకరాలకు సరిపోతుంది. అయితే పిచికారి చేస్తే మిత్ర పురుగులు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే కాండం పూత పూయాలి. ఇది 20 రోజుల వ్యవధిలో రెండు సార్లు చేస్తే రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. సోయాబీన్‌కు లద్దె పురుగు జిల్లాలో సోయా పంట 1,19,907 హెక్టార్లలో సాగైంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లద్దె పురుగు ఆశించే ప్రమాదం ఉంది. లద్దె పురుగు ప్రధానంగా ఆకు అడుగున పెట్టే గుడ్ల నుంచి పిల్ల పురుగులు వందల సంఖ్యలో పెరిగి ఆకులను తినడంతో ఆకులు పూర్తిగా పోయి ఈనెలు మాత్రమే మిగులుతాయి. ప్రధానంగా ఈ ప్రభావం అధిక వర్షాల వల్లే ఉంటుంది. దీనికి ప్రధానంగా 2.5 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్ను లీటరు నీటిలో కలిపి పిచికారి చేస్తే లద్దె పెరుగు ప్రభావం ఉండదు. అలాగే లద్దె పురుగులు పంట పొలంలోని సాళ్లలో రాత్రివేళలో నివాసం ఉంటాయి. వాటిని అరికట్టేందుకు తౌడు, బెల్లం, మంచినూనె, మోనోక్రోటోఫాస్, క్లోరోఫైరిపాస్ను గానీ కలిపి సాళ్లలో వేస్తే అవి చనిపోతాయి. వర్షం లేని సమయాన్ని చూసి వేయాలి. నీరు పట్టిన మొక్కజొన్న జిల్లాలో మొక్కజొన్న 8,200 హెక్టార్లలో సాగైంది. ప్రధానంగా మోగి పురుగు ఆశిస్తోంది. మోగి పురుగు ఆశిస్తే దానికి కార్బొఫ్యూరాన్ గుళికలు రెండు నుంచి మూడు గ్రామాలు వేయాలి. ముందుగా మొక్కజొన్న పంట పొలంలో ఉన్న నీటిని తీసివేయాలి. ఆ తర్వాత ఈ గుళికలు వేస్తే మోగిపురుగును నివారించవచ్చు. నెల రోజులుగా పంట నీళ్లలోనే.. - సల్ల ప్రకాశ్‌రెడ్డి, రైతు, దిలావర్పూర్ నేను రెండు ఎకరాల్లో పత్తి పంట వేశాను. అయితే కురిసిన వర్షాలకు పత్తి పంటలో పూర్తిగా నీళ్లు వచ్చి చేరాయి. దీంతో పంట అంతా నీళ్లలో మునిగింది. ఆ నీళ్లు పోయాయో లేదో మళ్లీ వర్షాలు కురస్తుండడంతో నెల రోజులుగా పంటంతా నీళ్లలోనే ఉంది. దీంతో తెగుళ్లు ఆశించాయి. నేను ఇప్పటిదాక రూ.25వేల పైనే ఖర్చు పెట్టాను. ఈ తెగుళ్ల కోసం మరింత ఖర్చు పెట్టే పరిస్థితి ఏర్పడింది.