*ప్రారంభానికి నోచుకోని సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు
* ప్రైవేట్ కొనుగోళ్లదే హవా..
* తక్కువ ధరకే అమ్మకం.. తూకాల్లో మోసాలు
* మార్కెట్ ఆదాయానికి గండి
*రైతులను ముంచుతున్న దళారులు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో పత్తి తర్వాత అధికంగా సాగయ్యే పంట సోయా. ప్రస్తుతం సోయాబీన్ పంట దిగుబడులు వస్తున్నా మార్కెట్ యార్డుల్లో ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో సోయాబీన్ రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా భావించిన పలువురు వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. దానికితోడు తూకాల్లోనూ మోసాలకు పాల్పడుతూ రైతులను మోసం చేస్తున్నారు. ఈ ప్రైవేటు దందాతో మార్కెట్‌కు సెస్ రూపంలో రావాల్సిన లక్షల ఆదాయానికి గండిపడుతోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు వంద వరకు ప్రైవేటు కేంద్రాలు ఉన్నట్లు తెలుస్తోంది.
భారీగా తగ్గిన దిగుబడి..
జిల్లాలో ఈ ఏడాది 1,11,367 హెక్టార్లలో సోయాపంట విత్తారు. 20 లక్షల క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ.. వర్షాభావ పరిస్థితులు, నాణ్యత లేని విత్తనాలతో దిగుబడి గణనీయంగా పడిపోయింది. 5 లక్షల క్వింటాళ్ల వరకు రావడం గగనమే. ఒక ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు రావాల్సిన దిగుబడి 3 నుంచి 5 క్వింటాళ్ల వరకు పడిపోయింది. వర్షాలు లేక విత్తిన పంట మొలకెత్తక భూమిలోనే మురిగిపోయింది. దీంతో రెండుమూడు సార్లు విత్తనాలు వేశారు.
దీనికితోడు ప్రభుత్వం రాయితీపై అందించిన విత్తనాలు మొక్కలు పెరిగిన కొన్ని మండలాల్లో కాత లేదు. కొన్ని మండలాల్లో కాత ఉన్నా అందులో గింజలు లేవు. ఉన్నా చిన్నవిగా ఉండి నాణ్యత లోపించింది. కాస్తోకూస్తో వచ్చిన దిగుబడిని అమ్ముకుందామంటే మార్కెట్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. వ్యాపారులు నిర్ణయించిన ధర రూ.2200 నుంచి రూ.2500 వరకే అమ్ముకుంటున్నారు. రూ.2500 వరకు చెల్లించినా తూకంలో మోసం చేస్తున్నారు. ఈ ఏడాది ఇంత వరకు కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో దళారులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2560కి తక్కువగా చెల్లిస్తున్నారు.
నాణ్యత లేని విత్తనాలతో..
వర్షాలతో రెండు మూడు సార్లు విత్తనాలు విత్తి రైతులు నష్టపోగా.. ప్రభుత్వం 33శాతం రాయితీపై రూ.1570లకు రైతులకు అందించిన విత్తనాలు మరింత ముంచాయి. జిల్లాలో 80 క్వింటాళ్ల వరకు విత్తనాలు అందించగా.. నాణ్యత లేకపోవడంతో తాంసి, జైనథ్, ఆదిలాబాద్, సిర్పూర్(టి), కాగజ్‌నగర్, బజార్ హత్నూర్, ఇచ్చోడ, నార్నూర్, మండలాల్లో దిగుబడి గణనీయంగా తగ్గింది. పలు మండలాల రైతులు పంట నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.
రెండ్రోజుల్లో ఏర్పాటు చేస్తాం.. - కిష్టాగౌడ్, ఆదిలాబాద్ మార్కెట్ కార్యదర్శి
సోయాబీన్ కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వ రంగ సంస్థలతో, వ్యాపారులతో చర్చించి రెండ్రోజుల్లో ఏర్పాటు చేయిస్తాం. రైతులు పంటకు మద్దతు ధర రావాలంటే మార్కెట్ యార్డులోనే విక్రయాలు జరపాలి. సోయాలో చెత్త లేకుండా, తేమా తక్కువగా ఉండేలా చూసుకునే తీసుకురావాలి.
కొనుగోళ్లపై సోయేది...
Published Tue, Nov 4 2014 1:32 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement