సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధంలో ‘సోయాబీన్స్’ చైనాకు ప్రధాన ఆయుధమైంది. 25, 000 డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై అమెరికా ఇటీవల దిగుమతి సుంకాలను పెంచినందుకు ప్రతీకారంగా అమెరికా నుంచి సోయాబీన్స్ దిగుమతిని పూర్తిగా నిలిపివేసింది. ప్రపంచంలోనే సోయాబీన్స్‌ను దిగుమతి చేసుకుంటున్న అతిపెద్ద దేశం చైనానే. దీని వల్ల అమెరికాకు తీవ్రమైన నష్టం కలుగుతుంది. ప్రపంచ ఆహారం లింకుల్లో సోయాబీన్స్ చాలా ముఖ్యమైనది. పందులు, కోళ్ల పెంపకంలో ఇది చాలా ముఖ్యమైన ప్రొటీన్.
ఒకప్పుడు రైస్ ఎక్కువగా తిన్న చైనా ప్రజలు ఆవులు, పందులు, కోళ్ల మాంసానికి అలవాటు పడడంతో పెరిగిన డిమాండ్‌కు తగ్గట్టుగా దేశంలో మాంసం ఉత్పత్తులను పెంచేందుకు ఈ సోయాబీన్స్‌ను చైనా దిగుమతి చేసుకుంటోంది. చైనాలో 1986లో మాంసానికున్న డిమాండ్ 2012 నాటికి 250 రెట్లు పెరిగింది. 2020 నాటికి మరో 30 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. ఆవులు, గొర్రెలు, పందుల పెంపకానికి చాలినంత ఫీడ్‌ను చైనా ఉత్పత్తి చేయలేక పోతోంది. అందుకని అమెరికా, బ్రెజిల్ నుంచి భారీ ఎత్తున సోయాబీన్స్ దిగుమతి చేసుకుంటూ వచ్చింది. బ్రెజిల్ ఏటా 25,700 డాలర్లు విలువైన సోయాబీన్స్‌ను ఎగుమతి చేస్తుండగా, ఆ తర్వాత స్థానంలో అమెరికా ఏటా 21,400 డాలర్లు విలువైన సోయాబీన్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఆ తర్వాత స్థానాల్లో అర్జెంటీనా, పరాగ్వే, కెనడా ఎగుమతి చేస్తున్నాయి.
2017లోనే అమెరికా, బ్రెజిల్ నుంచి చైనా 34,600 డాలర్ల విలువైన సోయాబీన్స్‌ను దిగుమతి చేసుకుంది. చైనా దిగుమతులపై ట్రంప్ ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచడంతో ముందుగా చైనా ప్రభుత్వం అమెరికా నుంచి సోయాబీన్స్ దిగుమతిపై 25 శాతం సుంకాన్ని పెంచింది. గతంలో అమెరికా రైతులు ఏటా చైనాకు 2.9 కోట్ల మెట్రిక్ టన్నుల సోయాబీన్స్‌ను సరాసరి సగటున ఎగుమతి చేయగా, సుంకం పెంచిన తర్వాత 59 లక్షల మెట్రిక్ టన్నులనే ఎగుమతి చేయగలిగారు. అప్పుడే ఎంతో నష్టపోయిన అమెరికా రైతులు, ఇప్పుడు చైనా నిర్ణయంతో ఎక్కువ నష్టపోతారు. తక్కువపడే సోయాబీన్స్‌ను బ్రెజిల్‌తోపాటు ఇతర దేశాల నుంచి చైనా దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment