సోయా పాలు
ఒకప్పుడు పాలు అంటే ఆవు లేదా బర్రె నుంచి పిండుకున్నవే. మరిప్పుడో.. బోలెడన్ని రకాలు. సోయా, బాదాం, బియ్యపుపాలు, కొబ్బరిపాలు.. ఇలా పాలు వేర్వేరు రూపాల్లో అందుతోంది. ఆవు, బర్రెపాలు అంటే పడనివారు చాలామంది వీటిని ఉపయోగిస్తున్నారు కూడా. ఎన్ని రకాలు ఉంటేనేం ఆరోగ్యానికి ఆవుపాలే మేలు అంటున్నారా? మీ అంచనా నిజమేకానీ.. సోయా గింజల నుంచి సేకరించిన పాలు కూడా దాదాపు ఇంతే మేలు చేస్తాయని అంటున్నారు మెక్‌గిల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. గింజల, కాయల నుంచి సేకరించే రకరకాల పాలన్నింటిలోని పోషకాలను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామని... అన్ని రకాల పోషకాలు సమతులంగా ఉండే పాలు సోయా అని వారు చెప్పారు.
సోయాలోని ఐసోఫ్లేవిన్స్ అనే రసాయనాలు కేన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాయన్నది తెలిసిన విషయమే. దీంతోపోలిస్తే బియ్యంతో చేసిన పాలు తీయగా ఉన్నప్పటికీ పోషకాలు మాత్రం తక్కువేనని వీరి అధ్యయనంలో తెలిసింది. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల పసిపిల్లలకు అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇక ఆసియాతోపాటు దక్షిణ అమెరికాలో ఎక్కువగా వినియోగించే కొబ్బరి పాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఇక బాదాంపాలలో ఉండే మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు బరువు తగ్గించుకునేందుకు భేషుగ్గా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తల అంచనా.
Comments
Please login to add a commentAdd a comment