శరీరంలో కాల్షియంది చాలా కీలకమైన పాత్ర. కాల్షియం లోపం వల్ల చాలా రకాల సమస్యలు వస్తాయి. కాల్షియం లోపాన్ని సరిచేసేందుకు చాలా మంది రకరకాల మందులు వాడుతుంటారు. అలా కాకుండా ఆహార పానీయాల ద్వారానే కాల్షియం స్థాయులను పెంచుకోవచ్చు. ఆహారం కన్నా కొన్ని రకాలపానీయాలను తాగడం ద్వారా కూడా తగినన్ని పాళ్లలో క్యాల్షియం ఉండేలా చూసుకోవచ్చు. ఆపానీయాలేమిటో తెలుసుకుందాం.
శరీరంలో కాల్షియం స్థాయిలను పెంచడానికి ఉత్తమపానీయాలు.
వృక్షాధారితం: సాధారణంగా శరీరంలో క్యాల్షియం పెరిగేందుకుపాలు తాగడం మంచిదంటారందరూ. అయితే జంతుసంబంధమైన గేదెపాలలో కన్నా వృక్ష సంబంధమైన బాదం, సోయా వోట్ మిల్క్‌లో కూడా క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి వేగన్ డైట్ తీసుకునేవాళ్లు కూడా నిరభ్యంతరంగా ఈ పాలు తాగవచ్చు.
లీఫీ స్మూతీస్: పాలకూర, మెంతికూర, చుక్కకూర వంటి ఆకుకూరలకు అల్లం, సైంధవ లవణం, కొన్ని రకాల పండ్ల ముక్కలు కలిపి తయారు చేసిన స్మూతీస్ తాగడం వల్ల శరీరానికి కాలిష్యం సమృద్ధిగా అందుతుంది.
బోన్ సూప్: ఎముక ఆరోగ్యం బాగుండాలంటే కాల్షియం అవసరం. అదేవిధంగా ఎముకలకు కాల్షియం సమృద్ధిగా అందాలంటే బోన్‌సూప్ తాగడం చాలా మేలు చేస్తుందంటున్నారు పోషకాహార నిపుణులు.
నువ్వుల పాలు: గ్లాసుపాలలో కన్నా స్పూను నువ్వు గింజలలోనే ఎక్కువ కాల్షియం ఉంటుందట. అయితే నువ్వులను నమిలి తినడం కన్నా నువ్వులను నానబెట్టి రుబ్బి, వడకట్టి తేర్చిన పాలను తాగితే రోజంతటికీ కావలసిన కాల్షియం లభిస్తుంది.
టోఫు స్మూతీస్: సహజంగానే టోఫులో కాల్షియం ఎక్కువగానే ఉంటుంది. అయితే దానిలో కాల్షియం సల్ఫేట్, కొన్ని పండ్ల ముక్కలతో తయారు చేసిన దానిలో కాల్షియం మరింత సమృద్ధిగా ఉంటుంది.
కొబ్బరినీళ్లు: నీరసంగా ఉన్నప్పుడు, జ్వరపడి కోలుకుంటున్నప్పుడు కొబ్బరినీళ్లు తాగమని చెబుతుంటారు వైద్యులు. కొబ్బరినీళ్లలో ఎలక్ట్రోలైట్స్, పొటాషియం పుష్కలంగా ఉండటమే అందుకు కారణం. వాటితోపాటు కొబ్బరినీళ్లలో కాల్షియం మోతాదు కూడా తక్కువేం కాదు.
ఇదీ చదవండి: శీతాకాలంలో కీళ్ల నొప్పులు : నువ్వులను ఇలా తింటే..!
ఆవుపాలు: గేదెపాలతో పోల్చితే ఆవుపాలలో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుందట. అందువల్ల కాల్షియం లోపించిన వారిని పాలు తాగమని చెప్పినప్పుడు గేదెపాలకన్నా ఆవుపాలకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.
పై పానీయాలలో వీలున్నవాటిని తాగుతుండటం వల్ల కాల్షియం లోపం తొందరగా భర్తీ అవుతుంది.పెరుగు, జున్ను, మజ్జిగ, చియాసీడ్స్, గసగసాలలో కూడా కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇతర ఆరోగ్య పరిస్థితులను బట్టి అందుబాటులో ఉన్న పానీయాలు తాగాలి.
కాల్షియం లోపంతో బాధపడుతున్నారా ? ఈ పాలు ట్రై చేయండి!
Comments
Please login to add a commentAdd a comment