Calcium deficiency
-
ఈ లక్షణాలు కనిపిస్తే మీరు కాల్షియం లోపంతో బాధపడుతున్నట్లే
శరీరానికి అనేక పోషకాలు అవసరం అందులో ముఖ్యమైన వాటిలో కాల్షియం కూడా ఒకటి. కాల్షియం లోపం వల్ల ఎముకలు బలహీనపడటంతోపాటు దంతాలకు సంబంధించిన సమస్యలు, గోళ్లు విరగడం, తలతిరగడం తదితర సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల, ఆహారంలో కాల్షియం తగినంత మొత్తంలో ఉండాలి. శరీరంలో కాల్షియం లేకపోతే, అది ఎముకల నుండి కాల్షియం తీసుకోవడం ప్రారంభిస్తుంది, దీని కారణంగా ఎముకలు మరింత బలహీనమవుతాయి. మరి కాల్షియం మన శరీరానికి దొరకాలి అంటే మనం తగినన్ని పాలు తాగాలి. కానీ, కొందరికి పాల వాసన కూడా పడదు. అలాంటప్పుడు కాల్షియం ఎలా తీసుకోవాలి? పాల ఉత్పత్తులు కాకుండా దండిగా కాల్షియం లభించే ఆహార పదార్థాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. కాల్షియం మన శరీరంలోని ఎముకలు, దంతాలను బలోపేతం చేయడమే కాకుండా.. కండరాల బలాన్ని, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. మన శరీరానికి రోజూ ఎంతమేర కాల్షియం అవసరం అన్నది ముందుగా తెలుసుకోవాలి. పురుషులు అయితే.. కనీసం 1000-1200 mg,మహిళలు, వృద్ధులు అయితే 1200- 1500 mg, పిల్లలు అయితే కనీసం 1300, గరిష్టంగా 2500 mg కాల్షియం తీసుకోవాల్సి ఉంటుంది. పాలతో మాత్రమే ఈ అవసరం తీరుతుందని అపోహ మాత్రమే. పాల ఉత్పత్తుల్లోనే కాకుండా చాలా ఆహార పదార్థాల్లోనూ కాల్షియం మెండుగా దొరుకుతుంది. కాల్షియం లోపిస్తే కనిపించే లక్షణాలు వేళ్లు, పాదాలు, కాళ్లలో తిమ్మిరి, ఒకవిధమైన జలదరింపు కండరాలలో తిమ్మిరి లేదా కండరాలు పట్టేయడం బద్ధకం, తీవ్రమైన అలసట బలహీనమైన, పెళుసుగా ఉండే గోర్లు దంత సమస్యలు, దంతాలు రావడంలో ఆలస్యం తికమకగా అనిపించడం ఆకలి లేకపోవడం. పాలు ఇష్టం లేకపోతే, ఇవి తీసుకోండి ► తెల్లనువ్వులు లేదా నల్ల నువ్వులు రెండింటిలో క్యాల్షియం అధికమొత్తంలో ఉంటుంది. రోజుకి టీస్పూను నువ్వులు ఆహారంలో చేర్చుకుంటే మంచిది. ►ఖర్జూర పండ్లు: కాల్షియం, ఐరన్ లోపాలతో బాధపడేవారు ఖర్జూర పండ్లు తీసుకోవడం చాలా మంచిది. ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి, అనిమీయా వ్యాధిని కూడా తగ్గిస్తాయి. ► అవిసె గింజల్లో ఒమేగా–3 ప్యాటీ యాసిడ్స్, ప్రొటీన్, పీచుపదార్థంతోపాటు క్యాల్షియం అధికంగా ఉంటుంది. డైలీ టీస్పూను గింజలను తింటే శరీరానికి కావాల్సిన క్యాల్షియం అందుతుంది. ► కాల్షియం అధికంగా ఉండే మినరల్ వాటర్ ►మ్యాంగనీస్, ప్రొటీన్, పీచుపదార్థంతోపాటు క్యాల్షియం కూడా గసగసాల్లో పుష్కలంగా ఉంటుంది. నేరుగా గానీ, ఇతర రకాల ఆహార పదార్థాల్లో వీటిని చేర్చుకోవడం ద్వారా శరీరంలో క్యాల్షియం స్థాయులను పెంచుకోవచ్చు. ► ఆకుకూరల్లో శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు ఉంటాయి. మెంతికూర, మునగాకుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిని కూరలుగా లేదా ఎండబెట్టి తీసుకుంటే క్యాల్షియంతోపాటు, యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజపోషకాలు శరీరానికి అందుతాయి. ► సముద్రం నుంచి లభించే ఆహారపదార్థాలు (సీఫుడ్), కొవ్వు లేని మాంసాలు, గుడ్లు ► ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పు, మొలకలు, బాదం, నట్స్ లాంటి ఆహారం తీసుకోవాలి. ► బ్రోకలీ, బీట్రూట్, బచ్చలికూర, అరటి, సోయాబీన్, గుడ్లు, చేపలు, బాదం, జీడిపప్పు నుంచి కాల్షియం లభిస్తుంది. ► మేడి పండ్లలో కూడా మంచి కాల్షియం ఉంటుంది. 8 మేడిపండ్లు తీసుకుంటే,241 mg కాల్షియం లభిస్తుంది. ► ఒక కప్పు పొద్దుతిరుగుడు గింజలలో 109 mg కాల్షియం ఉంటుంది మరియు ఈ విత్తనాలలో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది ► శరీరం క్యాల్షియంను గ్రహించాలంటే విటమిన్ డి3తోపాటు వ్యాయామం అవసరం. విటమిన్ డి3 కోసం పొద్దున పూట సూర్యరశ్మి శరీరానికి తగిలేలా వ్యాయామం చేస్తే శరీరం క్యాల్షియంను గ్రహించుకుంటుంది. లేకుంటే క్యాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కాల్షియం లోపిస్తే? మన శరీరానికి కాల్షియం అన్నది ఎంతో అవసరం. కాల్షియం తగినంద అందకపోతే, చర్మం పొడిబారుతుంది. దంతాలు బలహీన పడతాయి. ఎముకలు కూడా బలహీనమవుతాయి.ఉదయం లేవగానే ఎముకల్లో తిమ్మిరిగా అనిపిస్తాయి. కాల్షియం లోపం వల్ల కొన్నికొన్ని సార్లు చేతులు, పాదం, కాలు, నోటి చుట్టూ కూడా తిమ్మిరి ఏర్పడుతుంది. కాల్షియం లేకపోవడం ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. చాలా తక్కువ కాల్షియం బోలు ఎముకల వ్యాధిని పెంచుతుంది. ఇది వృద్ధ మహిళల్లో సాధారణంగా కనిపిస్తుంది. ఇదే కాకుండా ఎముకలలో పటుత్వం తగ్గి ఎముకలు త్వరగా విరిగిపోవడం లేదా, బలహీనపడతాయి. ఇది కాకుండా గుండె సంబంధిత సమస్యలు, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.కాల్షియం మంచిది కదా అని మరీ ఎక్కువ తీసుసుకోకూడదు. ఎక్కువ మోతాదులో ఉంటే ప్రతికూల దుష్ప్రభావాలను కలిగిస్తుంది. మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదనపు కాల్షియం మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.కాబట్టి ఎప్పటికప్పుడు కాల్షియం చెక్ చేసుకుంటూ అవసరాన్ని బట్టి తీసుకోవడం మంచిది. -
పాల జ్వరంతో జాగ్రత్త..
సాక్షి, కోటవురట్ల(పాయకరావుపేట) : పాడి రైతులకు పశుపోషణతో పాటు సంరక్షణ చాలా కీలకం. పాడి పశువుల్లో వచ్చే వ్యాధుల పట్ల అవగాహన పెంచుకోవాలి. సకాలంలో వ్యాధులను గుర్తించి నివారణకు చర్యలు తీసుకుంటే నష్టం తప్పుతుంది. ప్రధానంగా పాడి పశువుల్లో వచ్చే పాల జ్వరం పట్ల అప్రమత్తత అవసరమని పశుసంవర్ధక శాక ఏడీ శ్రీధర్ తెలిపారు. పాల జ్వరం, దాని నివారణ గురించి వివరించారు. పాల జ్వరం... పాడి గేదెలు, ఆవులలో ఈనిన మొదటి వారంలోనే ఈ జబ్బు వస్తుంది. అధిక పాల ఉత్పత్తి ఉన్న పశువుల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఈనిన వెంటనే పాలు పితకడం వల్ల కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. వ్యాధి ఎప్పుడు వస్తుంది... ఈ వ్యాధి కాల్షియం లోపం కారణంగా వచ్చే అవకాశం ఉంది. జున్నుపాలు, సాధారణ పాలల్లో పశువు శరీరంలోని కాల్షియం శాతం తగ్గిపోవడం వల్ల ఈనిన తర్వాత వస్తుంది. వ్యాధి లక్షణాలు.. పశువు తల, మెడ, ఒక వైపుకు తిరిగి తలను డొక్కలో పెట్టుకుని పడుకుంటుంది. బాగా నీరసించిపోయి మేత మేయడం మానేస్తాయి. ఈ వ్యాధిని అశ్రద్ధ చేస్తే ప్రమాదకరంగా మారి పశువుకు తీరని నష్టాన్ని కలగజేస్తుంది. ఈ వ్యాధి సోకిన పశువులు ఎక్కువగా కింద పడిపోవడం, తన్నుకోవడం చేస్తాయి. కండరాలు వణకడం కనిపిస్తాయి. కళ్ల నుంచి నీరు కారుతూ, చెవులు వాచిపోతాయి. కొన్ని పశువుల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే చూపు మందగిస్తుంది. పశువు చిరాకుగా ఉండి ఉలిక్కిపడుతూ ఉంటుంది. వ్యాధి నివారణ ఇలా.. ఈనిన వెంటనే పశువుల పొదుగును శుభ్రం చేయాలి. అదే విధంగా ఈనిన వెంటనే పొదుగు నుంచి మొత్తం పాలను పితకకూడదు. పశువు చూడితో ఉండగానే లేదా ఈనిన తర్వాత డాక్టరును సంప్రదించి సలహా మేరకు కాల్షియం, మెగ్నీషియం ఖనిజ లవణాలు తగు మోతాదులో ఇవ్వాలి. చికిత్స... వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వీలైనంత తొందరగా డాక్టరును కలిసి కాల్షియం ఇంజక్షన్లు ఇప్పించాలి. ముందుగానే తగిన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి బారిన పడకుండా పశువును కాపాడుకోవచ్చు. థైలేరియాసిస్తో అప్రమత్తత అవసరం.. ఈ వ్యాధి ఎక్కువగా అధిక పాలఉత్పత్తి ఉన్న సంకరజాతి ఆవులకు సోకుతుంది. అన్ని వయస్సుల పశువులకు ఇది వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా వర్షాకాలం, వేసవి కాలాలలో ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాధి ఎలా వస్తుంది.. ఈ వ్యాధి ఓ రకమైన పరాన్న జీవుల వల్ల సోకుతుం ది. గోమార్ల ద్వారా కూడా ఒక పశువు నుంచి మరొక పశువుకు సంక్రమిస్తుంది. వ్యాధి సోకిన పశువుల లింపుగ్రంధులు వాచిపోతాయి. ముక్కు నుంచి నురగ కారుతుంది. శ్వాస తీసుకోవడంతో చాలా ఇబ్బంది పడతాయి. కళ్లు ఎర్రబడడమే కాకుండా ఒక్కోసారి కంట్లో పువ్వు వేయడం జరుగుతుంది. పశువులు తీవ్ర జ్వరంతో బాధపడతాయి. 104 నుంచి 106 డిగ్రీల వరకు జ్వరం వస్తుంది. ఆకలి మందగించి బాగా నీరసించిపోతాయి. చూడి ఆవులు ఈదుసుకుపోతాయి. పాల దిగుబడి ఒక్కసారిగా తగ్గిపోతుంది. వ్యాధి నుంచి పశువులు కోలుకున్నప్పటికి వాటి ఉత్పాదక శక్తిని కోల్పోయి రైతు ఆర్ధికంగా నష్టపోయే పరిస్థితి కలుగుతుంది. వ్యాధి సోకిన పశువులకు రక్తం, బంకతో కూడిన విరేచనాలు అవుతాయి. వ్యాధి నివారణ ఇలా.. రక్షా–టి వ్యాధి నిరోధక టీకాను సంవత్సరానికి ఒకసారి వేయించాలి. దూడలకు 4 నెలల వయస్సులో ఇప్పించాలి. గోమార్లు వ్యాప్తి చెందకుండా కొట్టం పరిసర ప్రాంతాలను క్రిమిసంహారక మందులతో పిచికారి చేయించాలి. డాక్టరు సలహా మేరకు యాంటిబయోటిక్ మందులు, విటమిను ఇంజక్షన్లు వేయించాలి. -
విటమిన్ 'ఢీ'
సాక్షి, హైదరాబాద్ : శేరిలింగంపల్లికి చెందిన ఐటీ ఉద్యోగి రాజేశ్ రాత్రంతా ఆఫీసులో, పగలంతా ఇంట్లో గడుపుతాడు. సికింద్రాబాద్కు చెందిన టీవీ యాంకర్ శైలజ రాత్రిపూట ఆఫీసులో విధులు నిర్వహించి పగలు ఏసీ గదిలో నిద్రపోతుంది. లేత సూర్యకిరణాలకు నోచుకోకపోవడంతో వారి శరీరాల్లో క్యాల్షియం లోపించి ఎముకలు దెబ్బతింటున్నాయి. కేవలం రాజేశ్, శైలజ మాత్రమే కాదు, గ్రేటర్ హైదరాబాద్లో నూటికి 80 శాతం మంది విటమిన్ ’డి’లోపంతో బాధపడుతున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) నిపుణులు, కేర్, షాదన్, దక్కన్ ఆస్పత్రుల వైద్యులు ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. బాధితుల్లో 70 శాతం మంది మహిళలు, 56 శాతం మంది వృద్ధులున్నట్లు గుర్తించింది. బాధితుల్లో 70 శాతం మహిళలే... ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో మహిళలకు ఇచ్చే ఆహారంపై మొదటి నుంచి వివక్ష కొనసాగుతోంది. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభించే ఆహారాన్ని మగపిల్లలకు ఇచ్చి, ఆడపిల్లలకు కేవలం అన్నంతో సరిపెడుతున్నారు. వివాహిత తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా నిత్యం భర్త, పిల్లల కోసమే పనిచేస్తోంది. గడప దాటడం లేదు. సూర్యకిరణాలు శరీరానికి తాకడంలేదు. దీంతో క్యాల్షియం లోపించి, చిన్న వయసులోనే కీళ్లనొప్పుల బారిన పడుతున్నారు. సాధారణంగా మహిళల్లో 40 నుంచి 45 ఏళ్లకు వచ్చే మేనోపాజ్ దశ 35 ఏళ్లకే వస్తోంది. మోనోపాజ్ తర్వాత శరీరంలోని క్యాల్షియం ఏటా సాధారణం కన్నా ఎక్కువ తగ్గుతుంది. ఐటీ అనుబంధ రంగాల్లో... గ్రేటర్ హైదరాబాద్లో ఐటీ, అనుబంధ రంగాల్లో ఏడు లక్షల మంది పనిచేస్తున్నారు. నెలలో సగం రోజులు సగం మంది పగలు పనిచేస్తే, మరో సగంమంది రాత్రిపూట పనిచేస్తున్నారు. వీరిలో నూటికి 90 శాతం మందికి సూర్యరశ్మి అంటే ఏమిటో తెలియదంటే అతిశయోక్తికాదు. సాధారణంగా మనిషి శారీరక ఎదుగుదల 20 ఏళ్లలోపే. కానీ, 30 ఏళ్ల వరకు క్యాల్షియాన్ని నిల్వ చేసుకునే శక్తి శరీరానికి ఉంటుంది. ఆ తర్వాత పురుషులు ఏటా ఒక శాతం, మహిళలు రెండు శాతం క్యాల్షియాన్ని కోల్పోతున్నట్లు పలు పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. పరోక్షంగా ఇది హైపర్టెన్షన్, కార్డియో వ్యాస్కులర్ వంటి జబ్బులకు కారణమవుతోంది. ఎముకలు, దంతాలు పటుత్వాన్ని కోల్పోవాల్సి వస్తోంది. ఎముకలు దృఢంగా ఉండాలంటే... పిల్లలకు రోజూ పావులీటరు పాలు, పెరుగు, గుడ్డు, చేపలు, మాంసం, తాజా కూరలు, డ్రైప్రూట్స్, గింజలు, నారింజ, ద్రాక్ష వంటి ఫలాలిస్తే ఎముకల పటుత్వం పెరుగుతుంది. ప్రొటీన్లు, సోడియం, కెఫిన్ అతిగా తీసుకోవడం వల్ల ఎముకలు దెబ్బతింటాయి. – డాక్టర్ కమల్, ఆర్థోపెడిక్ లేతకిరణాల మధ్య వ్యాయామం ఉత్తమం ఉదయం ఏడు గంటల్లోపు వచ్చే సూర్యకిరణాల్లో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. ఉదయం ఏడు గంటలలోపు వ్యాయామం చేయాలి. గంటలన్నర సేపు లేత కిరణాల మధ్య గడపాలి. మధ్యాహ్నం తర్వాత నిద్రలేవడం తగదు, ఉదయం సూర్యకాంతి తగలకుండా కారులో ప్రయాణించవద్దు. శరీరంలో క్యాల్షియం తగ్గడం వల్ల ఎముకల్లో పటుత్వం తగ్గిపోయి వివిధ రకాల నొప్పులకు కారణమవుతుంది. – డాక్టర్ శారద, ఫిజీషియన్ -
జిప్సంతో దిగుబడులు అధికం
ఖమ్మం వ్యవసాయం : నూనె గింజల పంటలలో వేరుశనగ ప్రధానమైనది. ప్రస్తుత రబీలో జిల్లాలో సుమారు ఆరువేల హెక్టార్లలో వేరుశనగ పంట సాగు చేసే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. నీటి అవకాశం ఉన్న ప్రాంతాల్లో వేరుశనగను రబీ పంటగా సాగు చేసే అవకాశం ఉంది. జిల్లాలోని తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, బోనకల్లు, చింతకాని, మధిర, గార్ల, బయ్యారం, ఇల్లెందు, కారేపల్లి, కామేపల్లి, రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్, రూరల్, టేకులపల్లి, కొత్తగూడెం, పాల్వంచ, ముల్కలపల్లి, ఏన్కూరు, జూలూరుపాడు తదితర మండలాల్లో వేరుశనగ పంటను సాగు చేస్తున్నారు. వేరుశనగకు జిప్సం ప్రాముఖ్యతపై జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ జె.హేమంత్ కుమార్(99896 23813), డాక్టర్ యం.వెంకట్రాములు(89856 20346), ఆర్. శ్రీనివాసరావు(83329 51138) వివరించారు. కాల్షియం లోపంతో అంతంత మాత్రంగా దిగుబడులు వేరుశనగలో కాయ బాగా వృద్ధి చెంది గట్టి విత్తనంతోపాటు అధిక నూనె శాతం కలిగి ఉండటానికి కాల్షియం, గంధకం పోషకాలు ప్రధానమైనవి. ఈ పోషకాలు సాధారణంగా నేలలో, పొలానికి వేసే సేంద్రియ, చాలా వరకు ప్రధాన పోషకాల కోసం వాడే రసాయన ఎరువుల్లో ఉండలం వల్ల పైర్లకు కావాల్సిన మోతాదులో అందుతుండేవి. కానీ.. ఒకే భూమిలో ఒకటి కన్నా ఎక్కువసార్లు ఒక సంవత్సరంలో పండించటం, సిఫార్సు మేరకు సేంద్రియ ఎరువులు వాడకపోవడం, ఇటీవల కాల్షియం, గంధకం లేని సంకీర్ణ ఎరువులను రైతులు విరివిగా వాడుతుండటం తదితర కారణాల వల్ల వీటి లోపాలు పైర్లపై కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వేరుశనగలో కాల్షియం, గంధకం లోపాల వల్ల దిగుబడులు బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాల్షియం లోపం కాల్షియం లోపించినప్పుడు లేత ఆకులు ముడుచుకొని వంకరలు తిరగటం, ఆకులు కొసల నుంచి ఎండిపోవటం, వేరు పెరగక వేరుకుళ్లు రోగం రావడం, కాండం బలహీనంగా ఉండి తప్పకాయలు ఏర్పడడం తదితర లక్షణాల వల్ల పైరు సరిగా ఎదగక దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. గంధకం లోపం గంధకం లోపం ఏర్పడినప్పుడు లేత ఆకులు చిన్నవిగా, ముడుచుకుని కాండం పొట్టిగా సన్నగా ఉండి, వేరుబుడిపలు తక్కువగా ఉండటం వల్ల వాతావరణం నుంచి సరిగా నత్రజనిని గ్రహించలేక పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. నూనె శాతం, దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. జిప్సం వాడకం రైతులు వేరుశనగ పైరులో కాల్షియం, గంధకం పోషకాలు విరివిగా లభించే చౌకైన జిప్సంను వాడుకోవటం మంచిది. జిప్సంలో కాల్షియం 24 శాతం, గంధకం 18 శాతం ఉంటుంది. ప్రతి 100 కిలోల జిప్సంలో 24 కిలోల కాల్షియం, 18 కిలోల గంధకం ఉంటుంది. ఎకరా వేరుశనగ పంటకు నీటిపారుదల కింద 200 కిలోల జిప్సంను తొలిపూత సమయంలో మొక్కల మొదళ్ల దగ్గర సాళ్లలో వేసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. వర్షాభావ పరిస్థితుల్లో విత్తిన 45 రోజుల్లో అంటే.. ఊడలు దిగే సమయంలో రెండో కలుపునకు ముందు జిప్సంను వేయాలి. కలుపు తీసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. ఈ విధంగా చేయడం వల్ల కాల్షియం, గంధకం పోషకాలు పైరుకు కావాల్సిన మోతాదులో అంది గింజ, నూనె దిగుబడికి ఎంతగానో ఉపయోగపడుతుంది.