శరీరానికి అనేక పోషకాలు అవసరం అందులో ముఖ్యమైన వాటిలో కాల్షియం కూడా ఒకటి. కాల్షియం లోపం వల్ల ఎముకలు బలహీనపడటంతోపాటు దంతాలకు సంబంధించిన సమస్యలు, గోళ్లు విరగడం, తలతిరగడం తదితర సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల, ఆహారంలో కాల్షియం తగినంత మొత్తంలో ఉండాలి. శరీరంలో కాల్షియం లేకపోతే, అది ఎముకల నుండి కాల్షియం తీసుకోవడం ప్రారంభిస్తుంది, దీని కారణంగా ఎముకలు మరింత బలహీనమవుతాయి.
మరి కాల్షియం మన శరీరానికి దొరకాలి అంటే మనం తగినన్ని పాలు తాగాలి. కానీ, కొందరికి పాల వాసన కూడా పడదు. అలాంటప్పుడు కాల్షియం ఎలా తీసుకోవాలి? పాల ఉత్పత్తులు కాకుండా దండిగా కాల్షియం లభించే ఆహార పదార్థాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.
కాల్షియం మన శరీరంలోని ఎముకలు, దంతాలను బలోపేతం చేయడమే కాకుండా.. కండరాల బలాన్ని, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. మన శరీరానికి రోజూ ఎంతమేర కాల్షియం అవసరం అన్నది ముందుగా తెలుసుకోవాలి. పురుషులు అయితే.. కనీసం 1000-1200 mg,మహిళలు, వృద్ధులు అయితే 1200- 1500 mg, పిల్లలు అయితే కనీసం 1300, గరిష్టంగా 2500 mg కాల్షియం తీసుకోవాల్సి ఉంటుంది. పాలతో మాత్రమే ఈ అవసరం తీరుతుందని అపోహ మాత్రమే. పాల ఉత్పత్తుల్లోనే కాకుండా చాలా ఆహార పదార్థాల్లోనూ కాల్షియం మెండుగా దొరుకుతుంది.
కాల్షియం లోపిస్తే కనిపించే లక్షణాలు
- వేళ్లు, పాదాలు, కాళ్లలో తిమ్మిరి, ఒకవిధమైన జలదరింపు
- కండరాలలో తిమ్మిరి లేదా కండరాలు పట్టేయడం
- బద్ధకం, తీవ్రమైన అలసట
- బలహీనమైన, పెళుసుగా ఉండే గోర్లు
- దంత సమస్యలు, దంతాలు రావడంలో ఆలస్యం
- తికమకగా అనిపించడం
- ఆకలి లేకపోవడం.
పాలు ఇష్టం లేకపోతే, ఇవి తీసుకోండి
► తెల్లనువ్వులు లేదా నల్ల నువ్వులు రెండింటిలో క్యాల్షియం అధికమొత్తంలో ఉంటుంది. రోజుకి టీస్పూను నువ్వులు ఆహారంలో చేర్చుకుంటే మంచిది.
►ఖర్జూర పండ్లు: కాల్షియం, ఐరన్ లోపాలతో బాధపడేవారు ఖర్జూర పండ్లు తీసుకోవడం చాలా మంచిది. ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి, అనిమీయా వ్యాధిని కూడా తగ్గిస్తాయి.
► అవిసె గింజల్లో ఒమేగా–3 ప్యాటీ యాసిడ్స్, ప్రొటీన్, పీచుపదార్థంతోపాటు క్యాల్షియం అధికంగా ఉంటుంది. డైలీ టీస్పూను గింజలను తింటే శరీరానికి కావాల్సిన క్యాల్షియం అందుతుంది.
► కాల్షియం అధికంగా ఉండే మినరల్ వాటర్
►మ్యాంగనీస్, ప్రొటీన్, పీచుపదార్థంతోపాటు క్యాల్షియం కూడా గసగసాల్లో పుష్కలంగా ఉంటుంది. నేరుగా గానీ, ఇతర రకాల ఆహార పదార్థాల్లో వీటిని చేర్చుకోవడం ద్వారా శరీరంలో క్యాల్షియం స్థాయులను పెంచుకోవచ్చు.
► ఆకుకూరల్లో శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు ఉంటాయి. మెంతికూర, మునగాకుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిని కూరలుగా లేదా ఎండబెట్టి తీసుకుంటే క్యాల్షియంతోపాటు, యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజపోషకాలు శరీరానికి అందుతాయి.
► సముద్రం నుంచి లభించే ఆహారపదార్థాలు (సీఫుడ్), కొవ్వు లేని మాంసాలు, గుడ్లు
► ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పు, మొలకలు, బాదం, నట్స్ లాంటి ఆహారం తీసుకోవాలి.
► బ్రోకలీ, బీట్రూట్, బచ్చలికూర, అరటి, సోయాబీన్, గుడ్లు, చేపలు, బాదం, జీడిపప్పు నుంచి కాల్షియం లభిస్తుంది.
► మేడి పండ్లలో కూడా మంచి కాల్షియం ఉంటుంది. 8 మేడిపండ్లు తీసుకుంటే,241 mg కాల్షియం లభిస్తుంది.
► ఒక కప్పు పొద్దుతిరుగుడు గింజలలో 109 mg కాల్షియం ఉంటుంది మరియు ఈ విత్తనాలలో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది
► శరీరం క్యాల్షియంను గ్రహించాలంటే విటమిన్ డి3తోపాటు వ్యాయామం అవసరం. విటమిన్ డి3 కోసం పొద్దున పూట సూర్యరశ్మి శరీరానికి తగిలేలా వ్యాయామం చేస్తే శరీరం క్యాల్షియంను గ్రహించుకుంటుంది. లేకుంటే క్యాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
కాల్షియం లోపిస్తే?
మన శరీరానికి కాల్షియం అన్నది ఎంతో అవసరం. కాల్షియం తగినంద అందకపోతే, చర్మం పొడిబారుతుంది. దంతాలు బలహీన పడతాయి. ఎముకలు కూడా బలహీనమవుతాయి.ఉదయం లేవగానే ఎముకల్లో తిమ్మిరిగా అనిపిస్తాయి. కాల్షియం లోపం వల్ల కొన్నికొన్ని సార్లు చేతులు, పాదం, కాలు, నోటి చుట్టూ కూడా తిమ్మిరి ఏర్పడుతుంది. కాల్షియం లేకపోవడం ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. చాలా తక్కువ కాల్షియం బోలు ఎముకల వ్యాధిని పెంచుతుంది. ఇది వృద్ధ మహిళల్లో సాధారణంగా కనిపిస్తుంది.
ఇదే కాకుండా ఎముకలలో పటుత్వం తగ్గి ఎముకలు త్వరగా విరిగిపోవడం లేదా, బలహీనపడతాయి. ఇది కాకుండా గుండె సంబంధిత సమస్యలు, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.కాల్షియం మంచిది కదా అని మరీ ఎక్కువ తీసుసుకోకూడదు. ఎక్కువ మోతాదులో ఉంటే ప్రతికూల దుష్ప్రభావాలను కలిగిస్తుంది. మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదనపు కాల్షియం మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.కాబట్టి ఎప్పటికప్పుడు కాల్షియం చెక్ చేసుకుంటూ అవసరాన్ని బట్టి తీసుకోవడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment