ఖమ్మం వ్యవసాయం : నూనె గింజల పంటలలో వేరుశనగ ప్రధానమైనది. ప్రస్తుత రబీలో జిల్లాలో సుమారు ఆరువేల హెక్టార్లలో వేరుశనగ పంట సాగు చేసే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. నీటి అవకాశం ఉన్న ప్రాంతాల్లో వేరుశనగను రబీ పంటగా సాగు చేసే అవకాశం ఉంది.
జిల్లాలోని తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, ముదిగొండ, బోనకల్లు, చింతకాని, మధిర, గార్ల, బయ్యారం, ఇల్లెందు, కారేపల్లి, కామేపల్లి, రఘునాథపాలెం, ఖమ్మం అర్బన్, రూరల్, టేకులపల్లి, కొత్తగూడెం, పాల్వంచ, ముల్కలపల్లి, ఏన్కూరు, జూలూరుపాడు తదితర మండలాల్లో వేరుశనగ పంటను సాగు చేస్తున్నారు. వేరుశనగకు జిప్సం ప్రాముఖ్యతపై జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ జె.హేమంత్ కుమార్(99896 23813), డాక్టర్ యం.వెంకట్రాములు(89856 20346), ఆర్. శ్రీనివాసరావు(83329 51138) వివరించారు.
కాల్షియం లోపంతో అంతంత మాత్రంగా దిగుబడులు
వేరుశనగలో కాయ బాగా వృద్ధి చెంది గట్టి విత్తనంతోపాటు అధిక నూనె శాతం కలిగి ఉండటానికి కాల్షియం, గంధకం పోషకాలు ప్రధానమైనవి. ఈ పోషకాలు సాధారణంగా నేలలో, పొలానికి వేసే సేంద్రియ, చాలా వరకు ప్రధాన పోషకాల కోసం వాడే రసాయన ఎరువుల్లో ఉండలం వల్ల పైర్లకు కావాల్సిన మోతాదులో అందుతుండేవి.
కానీ.. ఒకే భూమిలో ఒకటి కన్నా ఎక్కువసార్లు ఒక సంవత్సరంలో పండించటం, సిఫార్సు మేరకు సేంద్రియ ఎరువులు వాడకపోవడం, ఇటీవల కాల్షియం, గంధకం లేని సంకీర్ణ ఎరువులను రైతులు విరివిగా వాడుతుండటం తదితర కారణాల వల్ల వీటి లోపాలు పైర్లపై కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వేరుశనగలో కాల్షియం, గంధకం లోపాల వల్ల దిగుబడులు బాగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.
కాల్షియం లోపం
కాల్షియం లోపించినప్పుడు లేత ఆకులు ముడుచుకొని వంకరలు తిరగటం, ఆకులు కొసల నుంచి ఎండిపోవటం, వేరు పెరగక వేరుకుళ్లు రోగం రావడం, కాండం బలహీనంగా ఉండి తప్పకాయలు ఏర్పడడం తదితర లక్షణాల వల్ల పైరు సరిగా ఎదగక దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది.
గంధకం లోపం
గంధకం లోపం ఏర్పడినప్పుడు లేత ఆకులు చిన్నవిగా, ముడుచుకుని కాండం పొట్టిగా సన్నగా ఉండి, వేరుబుడిపలు తక్కువగా ఉండటం వల్ల వాతావరణం నుంచి సరిగా నత్రజనిని గ్రహించలేక పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. నూనె శాతం, దిగుబడులు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది.
జిప్సం వాడకం
రైతులు వేరుశనగ పైరులో కాల్షియం, గంధకం పోషకాలు విరివిగా లభించే చౌకైన జిప్సంను వాడుకోవటం మంచిది. జిప్సంలో కాల్షియం 24 శాతం, గంధకం 18 శాతం ఉంటుంది. ప్రతి 100 కిలోల జిప్సంలో 24 కిలోల కాల్షియం, 18 కిలోల గంధకం ఉంటుంది. ఎకరా వేరుశనగ పంటకు నీటిపారుదల కింద 200 కిలోల జిప్సంను తొలిపూత సమయంలో మొక్కల మొదళ్ల దగ్గర సాళ్లలో వేసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి.
వర్షాభావ పరిస్థితుల్లో విత్తిన 45 రోజుల్లో అంటే.. ఊడలు దిగే సమయంలో రెండో కలుపునకు ముందు జిప్సంను వేయాలి. కలుపు తీసి మొక్కల మొదళ్లకు మట్టిని ఎగదోయాలి. ఈ విధంగా చేయడం వల్ల కాల్షియం, గంధకం పోషకాలు పైరుకు కావాల్సిన మోతాదులో అంది గింజ, నూనె దిగుబడికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
జిప్సంతో దిగుబడులు అధికం
Published Wed, Nov 19 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 4:41 PM
Advertisement