సాక్షి, కోటవురట్ల(పాయకరావుపేట) : పాడి రైతులకు పశుపోషణతో పాటు సంరక్షణ చాలా కీలకం. పాడి పశువుల్లో వచ్చే వ్యాధుల పట్ల అవగాహన పెంచుకోవాలి. సకాలంలో వ్యాధులను గుర్తించి నివారణకు చర్యలు తీసుకుంటే నష్టం తప్పుతుంది. ప్రధానంగా పాడి పశువుల్లో వచ్చే పాల జ్వరం పట్ల అప్రమత్తత అవసరమని పశుసంవర్ధక శాక ఏడీ శ్రీధర్ తెలిపారు. పాల జ్వరం, దాని నివారణ గురించి వివరించారు.
పాల జ్వరం...
పాడి గేదెలు, ఆవులలో ఈనిన మొదటి వారంలోనే ఈ జబ్బు వస్తుంది. అధిక పాల ఉత్పత్తి ఉన్న పశువుల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఈనిన వెంటనే పాలు పితకడం వల్ల కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది.
వ్యాధి ఎప్పుడు వస్తుంది...
ఈ వ్యాధి కాల్షియం లోపం కారణంగా వచ్చే అవకాశం ఉంది. జున్నుపాలు, సాధారణ పాలల్లో పశువు శరీరంలోని కాల్షియం శాతం తగ్గిపోవడం వల్ల ఈనిన తర్వాత వస్తుంది.
వ్యాధి లక్షణాలు..
పశువు తల, మెడ, ఒక వైపుకు తిరిగి తలను డొక్కలో పెట్టుకుని పడుకుంటుంది. బాగా నీరసించిపోయి మేత మేయడం మానేస్తాయి. ఈ వ్యాధిని అశ్రద్ధ చేస్తే ప్రమాదకరంగా మారి పశువుకు తీరని నష్టాన్ని కలగజేస్తుంది. ఈ వ్యాధి సోకిన పశువులు ఎక్కువగా కింద పడిపోవడం, తన్నుకోవడం చేస్తాయి. కండరాలు వణకడం కనిపిస్తాయి. కళ్ల నుంచి నీరు కారుతూ, చెవులు వాచిపోతాయి. కొన్ని పశువుల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే చూపు మందగిస్తుంది. పశువు చిరాకుగా ఉండి ఉలిక్కిపడుతూ ఉంటుంది.
వ్యాధి నివారణ ఇలా..
ఈనిన వెంటనే పశువుల పొదుగును శుభ్రం చేయాలి. అదే విధంగా ఈనిన వెంటనే పొదుగు నుంచి మొత్తం పాలను పితకకూడదు. పశువు చూడితో ఉండగానే లేదా ఈనిన తర్వాత డాక్టరును సంప్రదించి సలహా మేరకు కాల్షియం, మెగ్నీషియం ఖనిజ లవణాలు తగు మోతాదులో ఇవ్వాలి.
చికిత్స...
వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వీలైనంత తొందరగా డాక్టరును కలిసి కాల్షియం ఇంజక్షన్లు ఇప్పించాలి. ముందుగానే తగిన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి బారిన పడకుండా పశువును కాపాడుకోవచ్చు.
థైలేరియాసిస్‌తో అప్రమత్తత అవసరం..
ఈ వ్యాధి ఎక్కువగా అధిక పాలఉత్పత్తి ఉన్న సంకరజాతి ఆవులకు సోకుతుంది. అన్ని వయస్సుల పశువులకు ఇది వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా వర్షాకాలం, వేసవి కాలాలలో ఎక్కువగా కనిపిస్తుంది.
వ్యాధి ఎలా వస్తుంది..
ఈ వ్యాధి ఓ రకమైన పరాన్న జీవుల వల్ల సోకుతుం ది. గోమార్ల ద్వారా కూడా ఒక పశువు నుంచి మరొక పశువుకు సంక్రమిస్తుంది. వ్యాధి సోకిన పశువుల లింపుగ్రంధులు వాచిపోతాయి. ముక్కు నుంచి నురగ కారుతుంది. శ్వాస తీసుకోవడంతో చాలా ఇబ్బంది పడతాయి. కళ్లు ఎర్రబడడమే కాకుండా ఒక్కోసారి కంట్లో పువ్వు వేయడం జరుగుతుంది. పశువులు తీవ్ర జ్వరంతో బాధపడతాయి. 104 నుంచి 106 డిగ్రీల వరకు జ్వరం వస్తుంది. ఆకలి మందగించి బాగా నీరసించిపోతాయి. చూడి ఆవులు ఈదుసుకుపోతాయి. పాల దిగుబడి ఒక్కసారిగా తగ్గిపోతుంది. వ్యాధి నుంచి పశువులు కోలుకున్నప్పటికి వాటి ఉత్పాదక శక్తిని కోల్పోయి రైతు ఆర్ధికంగా నష్టపోయే పరిస్థితి కలుగుతుంది. వ్యాధి సోకిన పశువులకు రక్తం, బంకతో కూడిన విరేచనాలు అవుతాయి.
వ్యాధి నివారణ ఇలా..
రక్షా–టి వ్యాధి నిరోధక టీకాను సంవత్సరానికి ఒకసారి వేయించాలి. దూడలకు 4 నెలల వయస్సులో ఇప్పించాలి. గోమార్లు వ్యాప్తి చెందకుండా కొట్టం పరిసర ప్రాంతాలను క్రిమిసంహారక మందులతో పిచికారి చేయించాలి. డాక్టరు సలహా మేరకు యాంటిబయోటిక్ మందులు, విటమిను ఇంజక్షన్లు వేయించాలి.
Comments
Please login to add a commentAdd a comment