మాటిమాటికీ దగ్గు, జ్వరం?! | sakshi health councling | Sakshi
Sakshi News home page

మాటిమాటికీ దగ్గు, జ్వరం?!

Published Mon, Jan 23 2017 10:52 PM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM

మాటిమాటికీ దగ్గు, జ్వరం?!

మాటిమాటికీ దగ్గు, జ్వరం?!

హోమియో కౌన్సెలింగ్‌

మా బాబు వయసు ఆరేళ్లు. మాటిమాటికీ జ్వరం, దగ్గుతో బాధపడుతూ ఉన్నాడు. డాక్టర్‌గారికి చూపిస్తే... ఇంతకుముందు నిమోనియా ఏదైనా వచ్చిందా అని అడుగుతున్నారు. నిమోనియా అంటే ఏమిటి? హోమియోలో దీనికి చికిత్స ఉందా?
– శ్రీనివాస్‌ కె., వరంగల్‌

చలికాలంలో ముప్పుతిప్పలు పెట్టే సమస్యల్లో నిమోనియా ఒకటి. ముఖ్యంగా పిల్లలు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఊపిరితిత్తులకు కలిగే అనారోగ్యాన్ని నిమోనియా లేదా నెమ్మువ్యాధి అంటారు. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, అధిక చల్లదనం వల్ల ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్‌ ఏర్పడుతుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, సులువుగా శ్వాస తీసుకోలేని పరిస్థితి ఏర్పడతాయి. ఇతర దేశాల్లో ఇన్‌ఫ్లుయెంజా, రెస్పిరేటరీ సిన్సీషియల్‌ వైరస్‌ వంటి వైరస్‌ల కారణంగా నిమోనియా సంక్రమిస్తే... మన దేశంలో ట్యూబర్క్యులోసిస్‌ అనే బ్యాక్టీరియా ద్వారా ఎక్కువ శాతం ఈ వ్యాధి వస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. పిల్లల్లో నిమోనియా వ్యాధిని సకాలంలో గుర్తించకపోవడంతో వ్యాధి తీవ్రత పెరిగి ప్రమాదస్థాయికి చేరుకుంటోంది.

కారణాలు: ∙బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్‌ల వల్ల ∙స్ట్రెప్టోకోకల్‌ బ్యాక్టీరియా వల్ల ∙వాతావరణంలో కలిగే మార్పుల వల్ల

లక్షణాలు: ∙ఆయాసం ∙తీవ్రమైన జ్వరం ∙వికారం ∙పొడిదగ్గు ∙కఫం ∙ఆకలి లేకపోవడం ∙ఛాతీనొప్పి ∙బలహీనపడటం ∙ఊపిరి పీల్చుకోవడంలో అస్వస్థత ∙బరువు తగ్గడం ∙చర్మం నీలం రంగులోకి మారడం

వ్యాధి నిర్ధారణ: ఛాతీ ఎక్స్‌రే, రక్త పరీక్ష, సీటీ స్కాన్‌

చికిత్స: హోమియోలో నిమోనియాకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. అవి ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా వ్యాధిని తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. హోమియోపతిలో వ్యాధి మూలకారణాన్ని గుర్తించి చికిత్స చేయడం జరుగుతుంది. హోమియోలో నిమోనియా సమస్యకు ఫెర్రమ్‌ ఫాస్ఫోరికమ్, అకోనైట్, అయోడిన్, బ్రయోనియా వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడాలి.

డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో)
స్టార్‌ హోమియోపతి హైదరాబాద్‌


బైక్‌ నడిపితే నడుం నొప్పి వస్తుందా?
లైఫ్‌స్టైల్‌ కౌన్సెలింగ్‌


నా వయసు 28 ఏళ్లు. బైక్‌పై ఎక్కువగా తిరుగుతుంటాను. నాకు తీవ్రమైన నడుం నొప్పి వస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి.
– రమేశ్, హైదరాబాద్‌

ఈ వయసులో నడుం నొప్పి అంత సాధారణం కాదు కాబట్టి బైక్‌ నడపడంలో మీరు అనుసరిస్తున్న కొన్ని అంశాల వల్ల ఈ నొప్పి వస్తుండవచ్చు. సాధారణంగా బైక్‌ల తయారీదారులు హ్యాండిల్‌బార్స్, ఫుట్‌రెస్ట్‌ వంటి అంశాల్లో కొన్ని ప్రమాణాలను  పాటిస్తుంటారు. మీ బైక్‌ ఆ ప్రమాణాలకు అనుగుణంగా తయారైనదైతే మంచిదే. వాటిని అనుసరించడం వల్ల కొన్ని అవయవ సమస్యలు రావు. ఒకవేళ మీ బైక్‌లోని వివిధ అంశాలు  సరైన ప్రమాణాలు లేకపోతే వాటివల్లనే మీకు నడుము నొప్పి వస్తోందని భావించాలి. మీరు మీ బైక్‌ విషయంలో ఈ కింద పేర్కొన్న అంశాల విషయంలో జాగ్రత్తలు పాటించండి.

బైక్‌ల హ్యాండిల్స్‌ సాధారణంగా తగినంత విశాలంగా, రెండు చేతులు బాగా పట్టుకోవడానికి వీలైనంత నిడివితో ఉండాలి. పొట్టిగా ఉండే షార్ట్‌హ్యాండిల్స్‌ వల్ల ఒంటిపై భారం పడి శరీరభాగాల్లో నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ∙మనం కాళ్లు పెట్టుకునే ఫుట్‌రెస్ట్‌ మన శరీరానికి మరీ దూరంగా ఉండకూడదు. దీనివల్ల కాళ్లు సాగినట్లుగా అయిపోయి నడుముపై భారం ఎక్కువగా పడుతుంది. దాంతో నడుమునొప్పి రావచ్చు ∙బైక్‌పై కూర్చొనే సమయంలో వీపు భాగమంతా నిటారుగా ఉండి, మన వెన్ను ఒంగకుండా ఉండాలి. సాధారణ బైక్‌ల నిర్మాణం ఇలాగే ఉంటుంది. కానీ కొన్ని స్పోర్ట్స్‌ బైక్‌లలో సీట్లు ఏటవాలుగా ఉండి, మనం కూర్చొనే భంగిమ వాలుగా ఉండేలా నిర్మితమై ఉంటాయి. దాంతో ముందుకు వాలినట్లుగా కూర్చోవాల్సి వస్తుంది. ఇలా వాలిపోయినట్లుగా కూర్చొనేలా రూపొందించిన ఫ్యాషన్‌ బైక్స్‌ వల్ల మన వెన్ను నిటారుగా నిలపలేకపోవడంతో వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ∙బైక్‌లపై వెళ్లేవారు వీపుపై ఉండే బ్యాగ్స్‌ (బ్యాక్‌ప్యాక్స్‌) పెట్టుకొని వెళ్తుండటం సాధారణం. ఈ భారం నడుంపైనా భారం పడటం వల్ల కూడా నొప్పి రావచ్చు. ఇలాంటివారు ఆ బ్యాగ్‌ భారం వీపుపై కాకుండా సీట్‌పై పడేలా చూసుకోవాలి.  

మీ బైక్‌లో పైన పేర్కొన్న భాగాల అమరిక, మీరు కూర్చొనే భంగిమ ఎలా ఉందో పరీక్షించుకొని, లోపాలు ఉన్నట్లయితే సరిచేసుకోండి. మీ నొప్పి దూరం కావచ్చు. అప్పటికీ నడుం నొప్పి వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించండి.

డాక్టర్‌ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్‌ అండ్‌ రీహ్యాబిలిటేషన్,
కిమ్స్‌ హాస్పిటల్స్, సికింద్రాబాద్‌


సీఏబీజీ సర్జరీ అంటే ఏమిటి?
కార్డియాలజీ కౌన్సెలింగ్‌


నా వయసు 65 ఏళ్లు. ఒక రోజు ఛాతీనొప్పి వస్తే పరీక్షించిన డాక్టర్లు సీఏబీజీ సర్జరీ చేయాలని అని చెప్పారు. అంటే ఏమిటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి.
– సరళ, భద్రాచలం

గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే కీలకమైన ధమనుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు,  రక్తసరఫరా అవరోధం కలగకుండా, సీఏబీజీ అనే సర్జరీ చేసి, రక్తాన్ని ఇతర మార్గాల్లో (బైపాస్‌ చేసిన మార్గంలో) గుండెకండరానికి అందేలా చేసే ఆపరేషనే సీఏబీజీ. మనం ఇంగ్లిష్‌లో సాధారణంగా ‘బైపాస్‌ సర్జరీ’ అని పిలిచే దీన్ని వైద్యపరిభాషలో కరొనరీ ఆర్టరీ బైపాస్‌ గ్రాఫ్టింగ్‌ అని వ్యవహరిస్తారు. దాని సంక్షిప్తరూపమే ఈ సీఏబీజీ ఆపరేషన్‌. ఇందులో కాళ్లు లేదా చేతులపై ఉన్న రక్తనాళాలను తీసి, గుండెకు అడ్డంకిగా ఏర్పడిన రక్తనాళాలకు ప్రత్యామ్నాయంగా, రక్తాన్ని బైపాస్‌ మార్గంలో అందించేలా అమర్చుతారు. సాధారణంగా ఒక బ్లాక్‌ (అడ్డంకి)ని బైపాస్‌ చేయాలంటే ఒక రక్తనాళం అవసరం. గుండె వద్ద ఉన్న రక్తనాళాన్ని నేరుగా బైపాస్‌ చేసే ప్రక్రియను రీ–వాస్క్యులరైజేషన్‌ అంటారు. ఛాతీకీ కుడి, ఎడమ వైపున ఉన్న రక్తనాళాలను ఇంటర్నల్‌ మ్యామరీ ఆర్టరీ అంటారు. గుండెకు ఎడమవైపున ఉన్న నాళాన్ని లెఫ్ట్‌ యాంటీరియర్‌ డిసెండింగ్‌ అర్టరీ అని అంటారు. ఈ రక్తనాళాన్ని బ్లాక్‌ అయిన నాళాల వద్ద బైపాస్‌ మార్గంలా కలుపుతారు. దీర్ఘకాల ప్రయోజనాలతో పాటు రోగి త్వరగా కోలుకుంటున్నందున ఇప్పుడు బైపాస్‌లోనూ సరికొత్త విధానాన్ని పాటిస్తున్నారు.

బైపాస్‌ సర్జరీ చేయించుకున్న తర్వాత, భవిష్యత్తులో ఇలా మార్చిన రక్తనాళాల్లోనూ కొవ్వు పేరుకోకుండా హృద్రోగులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.  రక్తనాళాల్లో పేరుకున్న బ్లాక్స్‌ను అధిగమించి, రక్తాన్ని గుండెకు చేరవేసేందుకు వీలుగా బైపాస్‌ సర్జరీ చేస్తారు. అంతే తప్ప ఇది చేయడం వల్ల అప్పటికే ఉన్న గుండెజబ్బు తొలగిపోయిందని పేషెంట్‌ అపోహ పడకూడదు. అందుకే రోగి మళ్లీ ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవే... రోగికి హైబీపీ ఉన్నట్లయితే దాన్ని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకునేలా డాక్టర్‌ సూచించిన మందులు తీసుకోవాలి. అలాగే రోగికి డయాబెటిస్‌ ఉంటే, రక్తంలోని చక్కెరపాళ్లు ఎల్లప్పుడూ అదుపులో ఉండేలా మందులు తీసుకుంటూ, కొవ్వులు తక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ఇక పొగతాగే అలవాటు ఉంటే దాన్ని తక్షణం పూర్తిగా మానేయాలి. డాక్టర్లు సూచించిన తగిన వ్యాయామాలు చేస్తూ ఉండాలి.

డాక్టర్‌ అనుజ్‌ కపాడియా
సీనియర్‌ కార్డియాలజిస్ట్
కేర్‌ హాస్పిటల్స్, బంజారాహిల్స్
హైదరాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement