అతలాకుతలం | fever in east godavari | Sakshi
Sakshi News home page

అతలాకుతలం

Published Mon, Sep 19 2016 11:12 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

అతలాకుతలం

అతలాకుతలం

విజృంభిస్తున్న జ్వరాలు, విస్తరిస్తున్న అతిసారంతో జిల్లా అతలాకుతలం అవుతోంది. విషజ్వరాల బారినపడిన రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. పలువురికి డెంగీ లక్షణాలు కనిపించడం ఆందోళనకు గురిచేస్తోంది. మరో వంక నేనున్నానంటూ అతిసారం పట్టిపీడిస్తోంది. అడవిపేటలో పలువురు జ్వరాల బారిన పడ్డారు. గ్రామంలో డెంగీ పీడితులు కూడా ఎక్కువగానే ఉన్నారు. కృష్ణవరం, అల్లిపూడి గ్రామాల్లో పదుల సంఖ్యలో అతిసారంతో అలమటిస్తున్నారు.
 
  • విజృంభించిన  అతిసారం
  • జగ్గంపేట ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్న బాధితులు
జగ్గంపేట :
కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో అతిసార వ్యాధి సోకి 15 మంది అస్వస్థకు గురయ్యారు. కొత్త కృష్ణవరం రామాలయం, దుర్గమ్మ ఆలయం వీధిలకు చెందిన 15 మందికి అతిసారం సోకింది. వీరిలో ఎనిమిది మంది వాంతులు, విరేచనాలతో రెండు రోజులుగా జగ్గంపేటలోని ఒక ప్రైవేట్‌ నర్సింగ్‌హోమ్‌లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు ఏలేశ్వరంలో ప్రైవేట్‌ ఆస్పత్రిలో కోలుకుంటున్నట్టు తెలిసింది. జగ్గంపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో సోమవారం రాత్రి బొదిరెడ్ల చక్రం, అల్లం దుర్గాప్రసాద్, చింతల రత్నం, నక్కన అప్పారావు, శనమనశెట్టి నాగభూషణం, కోశెట్టి నూకరత్నం చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు ఆదివారం ఇళ్లకు వెళ్లినట్టు వైద్య సిబ్బంది తెలిపారు. వీరి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టు ప్రైవేటు వైద్యుడు ప్రసాద్‌ తెలిపారు. గ్రామంలో కలుషిత నీటితోనే అతిసారం ప్రబలిందని భావిస్తున్నారు. డ్రైన్లలోని మురుగునీరు వాటర్‌పైపుల లీకులనుంచి కుళాయి నీటిలో కలిసి కలుషితం అయ్యి ఉంటుందని భావిస్తున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. 
 
అల్లిపూడిలో..
అల్లిపూడి (కోటనందూరు):  గ్రామంలో డయేరియా విజృంభించింది. సుమారు 50 మందికి పైగా డయేరియా సోకిన ట్టు స్థానికులు చెబుతున్నారు.  ఆది వారం రాత్రి, సోమవారం గ్రామంలోని రామాలయం వద్ద వైద్యశిబిరం నిర్వహించి రోగులకు వైద్యసేవలందించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించారు. డయేరియా బాధితులకు మాత్రలు పంపిణీ చేశారు. అవసరమైన వారిని కోటనందూరు పీహెచ్‌సీకి తరలించి సెలైన్‌ బాటిళ్లు పెట్టారు. గ్రామంలో పరిస్థితిని పీహెచ్‌సీ వైద్యాధికారి సూర్యప్రభ పర్యవేక్షించారు. సూపర్‌వైజర్‌ అప్పారావు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
 
ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు
గ్రామంలో డయేరియా వ్యాపించడంతో పంచాయితీ అధికారులు పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. గ్రామంలో మాంసం విక్రయాలు నిలిపేయాలంటూ ఆదేశాలిచ్చారు. బ్లీచింగ్‌ చల్లించి మంచినీటి ట్యాంకును క్లోరినేషన్‌ చేయించి నీటిని సరఫరా చేస్తున్నట్టు పంచాయతీ కార్యదర్శి గవర్రాజు తెలిపారు.
 
 
జ్వరాల అడవిపేట
కాట్రేనికోన: డెంగీ, విషజ్వరాల ధాటికి కాట్రేనికోన శివారు అడవిపేట గ్రామస్తులు విలవిల్లాడుతున్నారు. గ్రామానికి చెందిన జనిపెల్లె నరసింహమూర్తికి 12 రోజుల క్రితం జ్వరం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అమలాపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. రక్త పరీక్షల్లో ఆయనకు డెంగీ జ్వరం సోకినట్టు వైద్యులు గుర్తించి ఐదు రోజులు వైద్యం అందించారు. ఆయన కోలుకొని ఇంటికి వచ్చిన వెంటనే ఆయన భార్య మంగ  డెంగీ వ్యాధి లక్షణాలతో ఆస్పత్రిలో చేరింది. ప్లేట్‌లెట్ల సంఖ్య బాగా పడిపోవడంతో ఆమె ఆరు రోజులుగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. అదే విధంగా బడుగు శ్రీను కూడా డెంగీ లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందు తున్నాడు. మరో వంక విషజ్వరాలు గ్రామస్తులను బెంబేలెత్తిస్తున్నాయి. ఒకే కుటుంబంలో బూల అప్పారావు, అతని భార్య సింహాద్రిమ్మ, కుమార్తె మౌనిక, మనుమరాలు సింధు జ్వరంతో మంచాన పడ్డారు. మౌనికకు రెండవ సారి టైఫాయిడ్‌ జ్వరం వచ్చిందని, ఫ్లేట్‌లెట్స్‌ పడిపోతున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 3వతరగతి చదువుతున్న కొంకి రమ్యశ్రీ ఐదు రోజులుగా టైఫాయిడ్‌ జ్వరంతో బాధపడుతోంది. వడ్డి రాజ్‌కుమార్, తాళ్ల హర్షిత, తాళ్ల విద్యలతో పాటు ఇంటికి ఒకరు చొప్పున జ్వరంతో బాధపడుతున్నారు.  కాట్రేనికోన పంచాయతీ పరిధిలో చెత్త పేరుకుపోయి వర్షాలకు కుళ్లిపోవడంతో దుర్వాసన వ్యాపిస్తోంది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, పూడిక తీయకపోవడంతో మురుగు పేరుకుపోయి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా కాలువలు మారాయి. రొయ్యల వ్యాపారులు మురుగు నీరు, మాంసపు వ్యర్థాలను వదులుతున్నారు. గ్రామంలో పందుల సంచారం ఎక్కువగా ఉంది. అడవిపేటలో మరుగు దొడ్డి నీళ్లు సీసీ రోడ్డుపై నిలిచి పోవడంతో దోమలు పెరిగిపోతున్నాయి. గ్రామంలో మంచి నీటి కుళాయిలు మురుగు నీటి గుంటలలో ఉండటంతో తాగు నీరు కలుషితం అవుతోంది. అందువల్లే తాము రోగాల బారిన పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. దీనిపై కాట్రేనికోన పీహెచ్‌సీ ఇన్‌చార్జి వైద్యధికారి, అమలాపురం ఎడిషనల్‌ డీఎం అండ్‌ హెచ్‌ఓ డాక్టర్‌ పుష్కరరావును ‘సాక్షి’ వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని చెప్పారు. గ్రామంలో మంగళవారం సర్వే చేయిస్తానని అన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement