పీడియాట్రిక్ కౌన్సెలింగ్
మా బాబుకు నాలుగేళ్లు. ఇటీవల వాడికి చాలా సార్లు జ్వరం వస్తోంది. మందులు వాడుతున్నంత సేపు తగ్గి మళ్లీ వస్తోంది. ఇలా వాడికి మాటిమాటికీ జ్వరం రావడంతో నాకు చాలా ఆందోళనగా ఉంది. మాకు తగిన సలహా ఇవ్వండి. – మాధవి, కరీంనగర్
చిన్నపిల్లలు తరచూ సూక్ష్మక్రిములు, వైరస్, బ్యాక్టీరియాకు ఎక్స్‌పోజ్ అవుతుండటం వల్ల వాళ్లకిలా జ్వరం రావడం చాలా సాధారణం. అందునా కాలం మారినప్పుడు (సీజనల్ వేరియేషన్స్) ఇన్ఫెక్షన్స్‌ఎక్కువగా రావచ్చు. గడ్డలు, బ్రుస్సెల్లోసిస్, డెంటల్ యాబ్సెస్, దీర్ఘకాలికమైన జబ్బులు, క్రిప్టోకోకస్, సిస్టైటిస్, ఫెమీలియల్ ఫీవర్ సిండ్రోమ్ వంటి అనేక సాధారణ సమస్యలు మొదలుకొని కొన్ని తీవ్రమైన సమస్యల వరకు ఇలా జ్వరం రావచ్చు. మీరు ఇచ్చిన కొద్దిపాటి సమాచారంతో మీ బాబుకు జ్వరం ఎందుకు వస్తోందనేది నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాదు. అయితే ఒకసారి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన పరీక్షలతో పాటు దీర్ఘకాలికమైన జబ్బులకు ఏమైనా అంతర్గతంగా ఉన్నాయేమో అని వాటి నిర్ధారణకు అవసరమైన పరీక్షలు చేయించడం చాలా అవసరం. జ్వరం వచ్చిన ప్రతీసారీ కారణం తెలుసుకోకుండా మందులు – మరీ ముఖ్యంగా యాంటీబయాటిక్స్, ఎన్‌ఎస్‌ఏఐడీ వంటివి చాలాకాలం పాటు వాడుతూ పోవడం చాలా అపాయకరం. అది సరైనదీ కాదు. మీరు మరొకసారి మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి ఈ అంశాలన్నీ చర్చించి, తగిన చికిత్స తీసుకోండి.
పాపకు మెడలో గడ్డ... ఏమిటది?
మా అమ్మాయికి ఏడేళ్లు. ఆమె మెడలో ఒక గడ్డలాగా కనిపిస్తోంది. ఇది కనీసం ఐదారు నెలల నుంచి ఉంది. డాక్టర్‌కు చూపించాం. ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. ఇటీవల అది కాస్త పెద్దదైందేమోనని అనుమానంగా ఉంది. ఈ గడ్డ ఏమిటి? మేం చికిత్స కోసం ఎవరిని కలవాలో చెప్పండి. – నీరజ, కొత్తగూడెం
మీరు చెప్పిన సమాచారాన్ని బట్టి మెడ భాగంలో గడ్డలుగా ఉన్నవి లింఫ్‌నోడ్స్ అయి ఉండవచ్చు. ఈ కండిషన్‌ను సర్వైకల్ లింఫెడినోపతి అంటారు. పిల్లల్లో మెడ భాగంలో లింఫ్ గ్రంధులు పెద్దవిగా (వివిధ సైజుల్లో) ఉండటాన్ని చాలా సాధారణంగా చూస్తుంటాం. లింఫ్‌నోడ్స్ ఇలా పెద్దవి అవడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. సాధారణ ఇన్‌ఫెక్షన్, ఇన్‌ఫ్లమేషన్‌తో పాటు తీవ్రమైన క్యాన్సరస్ పెరుగుదల వంటి ప్రమాదకరమైన కండిషన్స్‌కూ ఇదో సూచన కావచ్చు. ఇక సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, టీబీ లేదా టీబీ కాని బ్యాక్టీరియాలు, లింఫోమా (క్యాన్సర్) వంటి పెద్ద కారణాలతో పాటు, కొన్నిసార్లు కనెక్టివ్ టిష్యూ డిసీజ్, చెవికి ఏదైనా గాయం కావడం (చెవి కుట్టించినప్పుడు కూడా), రకరకాల గొంతు ఇన్ఫెక్షన్స్ వంటి అతి మామూలు కారణాల వల్ల కూడా ఈ గ్లాండ్స్ పెద్దవి కావడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్లాండ్స్ ఎంత పరిమాణంలో పెరిగాయన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అయితే ఇలా పెరగడం అన్నది చాలా సందర్భాల్లో చాలా సాధారణమైన వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్లనే ఎక్కువగా జరుగుతుంది కాబట్టి వారం నుంచి రెండు వారాల పాటు యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేసి చూస్తాం. అప్పటికీ ఇవి తగ్గకుండా ఉండటంతో పాటు, వీటి పరిమాణం 2.5 సెం.మీ. కంటే పెద్దవిగా ఉంటే తప్పనిసరిగా కొన్ని రక్తపరీక్షలతో పాటు, బయాప్సీ కూడా చేయించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఒకే నోడ్ పెద్దగా అయి ఇబ్బంది పెడుతుంది. అప్పుడు కూడా బయాప్సీ చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఇక మీ పాప విషయంలో ఇతర లక్షణాలూ ఏమీ కనిపించడం లేదు కాబట్టి, పాప సాధారణ ఆరోగ్యం కూడా బాగానే ఉంది కాబట్టి మీరు చింతించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ గ్లాండ్ పెరుగుతున్నట్లుగా అనుమానిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా తదుపరి అంశాల నిర్ధారణ కోసం ఒకసారి బయాప్సీ చేయించాల్సిన అవసరం ఉంది. మీరు మీ పిల్లల వైద్యనిపుణుడితో చర్చించి, తగిన తదుపరి చర్యలు తీసుకోండి.
కనుగుడ్లు ఆగకుండా తిరుగుతున్నాయి...
మా బాబుకి పన్నెండేళ్లు. అతడి కనుగుడ్లు తిరుగుతూ ఉంటాయి. ఈ సమస్యతో సరిగా చదవలేకపోతున్నాడు. ఈ సమస్యకు కారణాలు, చికిత్సను సూచించండి.
– సుందరరావు, ఒంగోలు
ఈ లక్షణాలను బట్టి చూస్తుంటే మీ బాబుకి కళ్ల పొజిషన్, కదలికలో తేడా ఉన్నట్టు అనిపిస్తుంది. వీటిలో చాలా రకాలుంటాయి. వాటిలో మీ అబ్బాయికున్న సమస్య నిస్టాగ్మస్ లేదా ఆప్సోక్లోనస్ అనే రెండు సమస్యలలో ఏదో ఒకటై ఉండవచ్చు. నిస్టాగ్మస్ అనేది వ్యాధి కాదు. బాబులోని రుగ్మతకు ఒక సంకేతం మాత్రమే. నిస్టాగ్మస్ ఉన్న వారి కళ్లు రిథమిక్‌గా కదులుతూ (రిథమిక్ ఆసిలేషన్ మూవ్‌మెంట్స్) ఉంటాయి. ఇది ఒకటి లేదా రెండు కళ్లకు ఉండవచ్చు. పుట్టుక నుండి ఉండవచ్చు లేదా ఆ తర్వాత అయినా ఇది రావచ్చు. ఈ పరిస్థితికి అనేక కారణాలుంటాయి. ఉదా. కంటి సమస్యలు, చెవి సమస్యలు (లాబ్రెంతైటిస్), ఆల్బెనిజం, మెదడు సమస్యలు, కొన్ని సార్లు కొన్ని మందుల వల్ల కూడా ఈ విధమైన లోపాలు ఏర్పడుతుంటాయి. ఇక ఆప్సోక్లోనస్ అనే సమస్యలో కళ్లు నాన్ రిథమిక్‌గా, అనేక డైరెక్షన్స్‌లో తిరుగుతుంటాయి. కళ్లను చూస్తే ఏదో కలవరంతోనో, కోపంతో (ఆజిటేటెడ్‌గా) ఉన్నట్లు అనిపిస్తాయి. కొన్నిసార్లు ఈ స్థితి న్యూరోబ్లాస్టోమా అనే తీవ్రమైన మెదడు జబ్బుకి తొలి సూచన కావచ్చు. మీ అబ్బాయి విషయంలో సమస్య పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో కంటి పరీక్షలు చేయించడంతో పాటు ఒకసారి బ్రెయిన్ స్కాన్ కూడా చేయించడం మేలు. మీవాడి సమస్యకు అసలు కారణం తెలిస్తేనే పరిష్కారం చెప్పడం వీలవుతుంది. మీరు ఒకసారి మీ కంటి వైద్య నిపుణుడిని సంప్రదించండి.
డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్ పీడియాట్రీషియన్,
రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment