Herding
-
పాల జ్వరంతో జాగ్రత్త..
సాక్షి, కోటవురట్ల(పాయకరావుపేట) : పాడి రైతులకు పశుపోషణతో పాటు సంరక్షణ చాలా కీలకం. పాడి పశువుల్లో వచ్చే వ్యాధుల పట్ల అవగాహన పెంచుకోవాలి. సకాలంలో వ్యాధులను గుర్తించి నివారణకు చర్యలు తీసుకుంటే నష్టం తప్పుతుంది. ప్రధానంగా పాడి పశువుల్లో వచ్చే పాల జ్వరం పట్ల అప్రమత్తత అవసరమని పశుసంవర్ధక శాక ఏడీ శ్రీధర్ తెలిపారు. పాల జ్వరం, దాని నివారణ గురించి వివరించారు. పాల జ్వరం... పాడి గేదెలు, ఆవులలో ఈనిన మొదటి వారంలోనే ఈ జబ్బు వస్తుంది. అధిక పాల ఉత్పత్తి ఉన్న పశువుల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఈనిన వెంటనే పాలు పితకడం వల్ల కూడా ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. వ్యాధి ఎప్పుడు వస్తుంది... ఈ వ్యాధి కాల్షియం లోపం కారణంగా వచ్చే అవకాశం ఉంది. జున్నుపాలు, సాధారణ పాలల్లో పశువు శరీరంలోని కాల్షియం శాతం తగ్గిపోవడం వల్ల ఈనిన తర్వాత వస్తుంది. వ్యాధి లక్షణాలు.. పశువు తల, మెడ, ఒక వైపుకు తిరిగి తలను డొక్కలో పెట్టుకుని పడుకుంటుంది. బాగా నీరసించిపోయి మేత మేయడం మానేస్తాయి. ఈ వ్యాధిని అశ్రద్ధ చేస్తే ప్రమాదకరంగా మారి పశువుకు తీరని నష్టాన్ని కలగజేస్తుంది. ఈ వ్యాధి సోకిన పశువులు ఎక్కువగా కింద పడిపోవడం, తన్నుకోవడం చేస్తాయి. కండరాలు వణకడం కనిపిస్తాయి. కళ్ల నుంచి నీరు కారుతూ, చెవులు వాచిపోతాయి. కొన్ని పశువుల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే చూపు మందగిస్తుంది. పశువు చిరాకుగా ఉండి ఉలిక్కిపడుతూ ఉంటుంది. వ్యాధి నివారణ ఇలా.. ఈనిన వెంటనే పశువుల పొదుగును శుభ్రం చేయాలి. అదే విధంగా ఈనిన వెంటనే పొదుగు నుంచి మొత్తం పాలను పితకకూడదు. పశువు చూడితో ఉండగానే లేదా ఈనిన తర్వాత డాక్టరును సంప్రదించి సలహా మేరకు కాల్షియం, మెగ్నీషియం ఖనిజ లవణాలు తగు మోతాదులో ఇవ్వాలి. చికిత్స... వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వీలైనంత తొందరగా డాక్టరును కలిసి కాల్షియం ఇంజక్షన్లు ఇప్పించాలి. ముందుగానే తగిన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి బారిన పడకుండా పశువును కాపాడుకోవచ్చు. థైలేరియాసిస్తో అప్రమత్తత అవసరం.. ఈ వ్యాధి ఎక్కువగా అధిక పాలఉత్పత్తి ఉన్న సంకరజాతి ఆవులకు సోకుతుంది. అన్ని వయస్సుల పశువులకు ఇది వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువగా వర్షాకాలం, వేసవి కాలాలలో ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాధి ఎలా వస్తుంది.. ఈ వ్యాధి ఓ రకమైన పరాన్న జీవుల వల్ల సోకుతుం ది. గోమార్ల ద్వారా కూడా ఒక పశువు నుంచి మరొక పశువుకు సంక్రమిస్తుంది. వ్యాధి సోకిన పశువుల లింపుగ్రంధులు వాచిపోతాయి. ముక్కు నుంచి నురగ కారుతుంది. శ్వాస తీసుకోవడంతో చాలా ఇబ్బంది పడతాయి. కళ్లు ఎర్రబడడమే కాకుండా ఒక్కోసారి కంట్లో పువ్వు వేయడం జరుగుతుంది. పశువులు తీవ్ర జ్వరంతో బాధపడతాయి. 104 నుంచి 106 డిగ్రీల వరకు జ్వరం వస్తుంది. ఆకలి మందగించి బాగా నీరసించిపోతాయి. చూడి ఆవులు ఈదుసుకుపోతాయి. పాల దిగుబడి ఒక్కసారిగా తగ్గిపోతుంది. వ్యాధి నుంచి పశువులు కోలుకున్నప్పటికి వాటి ఉత్పాదక శక్తిని కోల్పోయి రైతు ఆర్ధికంగా నష్టపోయే పరిస్థితి కలుగుతుంది. వ్యాధి సోకిన పశువులకు రక్తం, బంకతో కూడిన విరేచనాలు అవుతాయి. వ్యాధి నివారణ ఇలా.. రక్షా–టి వ్యాధి నిరోధక టీకాను సంవత్సరానికి ఒకసారి వేయించాలి. దూడలకు 4 నెలల వయస్సులో ఇప్పించాలి. గోమార్లు వ్యాప్తి చెందకుండా కొట్టం పరిసర ప్రాంతాలను క్రిమిసంహారక మందులతో పిచికారి చేయించాలి. డాక్టరు సలహా మేరకు యాంటిబయోటిక్ మందులు, విటమిను ఇంజక్షన్లు వేయించాలి. -
టూకీగా ప్రపంచ చరిత్ర 67
ఆచారాలు - నమ్మకాలు పశుపోషణ వల్ల మానవుని నివాసం గుహల్లో నుండి తోలు గుడారాలకు మారింది. ఐనా, అది పచ్చికబయళ్ళను వెదుక్కుంటూ సాగిన సంచార జీవితమే. కాకపోతే, వంటకు మట్టిపాత్రలు ప్రవేశించినట్టు కనబడుతుంది. చాలా శతాబ్దాల తరువాత, సంచారజీవనం మందగించింది అనటానికి ఆనవాళ్ళు మట్టిగోడలమీద పూరి కప్పుతో నిర్మించుకున్న గుడిసెలు, ఆ సమయానికి మట్టి పాత్రల నాణ్యత, వైవిధ్యం బాగా పెరిగింది. మట్టిగోడలనూ పాత్రలనూ రంగుతోనో పూజలతోనో అలంకరించడమే గాక, ఆ అలంకరణల్లో సూర్యుడూ చంద్రుడూ, పాములూ, నదులూ, చెట్లవంటి ప్రకృతి దృశ్యాలు చోటు చేసుకోవడం కనిపిస్తుంది. క్రీ.పూ.6000-5000ల ప్రాంతంలో నదుల పరీవాహక పీఠభూములను ఆశ్రయంచి మానవుడు స్థిర నివాసాలకు పూనుకున్నాడు. ఇటుకలతో కట్టిన గోడలూ, స్తంభాలూ దూలాలూ దంతెలతో పటిష్టమైన పైకప్పు ఏర్పడిన విశాల నివాసానికి అతని జీవితం మారిపోయింది. క్రీ.పూ.5000 సంవత్సరాల తరువాతి కాలంలో మానవుని స్థిర నివాసాలు పెద్ద పెద్ద గ్రామాలుగానూ, నగరాలుగానూ రూపొందుతున్న దశలో, జనావాసాలకు మధ్యలో ఒక దేవాలయాన్ని నిర్మించుకునే సంప్రదాయం మెసొపొటేమియాలో మొదలయింది. యూఫ్రాటెస్ నదీతీరంలో, పర్షియన్ గల్ఫ్ ఉత్తరాన త్రవ్వకాల్లో బయటపడిన ‘నిప్పల్’ నగరంలోని దేవాలయాన్ని ప్రపంచ మొత్తంలో అత్యంత ప్రాచీనమైన దేవాలయంగా శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఇతర ఆధారాల మూలంగా అది ‘ఎన్-లిన్’ దేవునికి (గాలి దేవునికి) కట్టిన ఆలయంగా భావించారు. ఐతే ఆ దేవాలయ శిధిలాల్లో ఎలాంటి ప్రతిమ దొరక్కపోవడంతో దృగ్గోచరంగాని ‘గాలి’కి రూపం ఎలాంటిది కల్పించారో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. రాతిలో మలచిన విగ్రహం కాక, అది మట్టితో తయారైన ప్రతిమే అయ్యుంటే గోపురం కూలినప్పుడు చితికిపోయైనా ఉండాలి. లేదా ప్రతిమను ప్రతిష్టించేలోపే కూలిపోయిందైనా అయ్యుండాలి. ‘దేవుని విగ్రహాన్ని మట్టితో ఎందుకు చేస్తారు’ అనే సంశయం రానక్కరలేదు. నిన్నా మొన్నటి వరకు వినాయకుని బొమ్మలు మట్టితో చేసినవిగానే ఉండేవి. దక్షిణ భారత దేశంలో జరుగుతున్న ‘దేవర’ అనే గ్రామదేవతల ఉత్సవానికి ఇప్పుడు గూడా పెద్దమ్మ చిన్నమ్మ ప్రతిమలు బంకమట్టితో చేస్తున్నారు. అలాంటప్పుడు, రాయి దొరకడం దుర్లభమైన దక్షిణ మెసపొటేమియాలో బంకమట్టి ప్రతిమలు అసంభవంగాదు. ‘ఒకవేళ ఆ దేవాలయానికి వాళ్ళు ప్రతిమను స్థాపించాలని ఉద్దేశించలేదేమో’ అనుకునేందుకూ వీలుగాదు. రూపానికి అతీతుడైన ‘ఎహోవా’ పట్ల ఏకోపాసకుడైన ఇజ్రేలీ పాలకుడు సాల్మన్, తన రాజధాని ‘జెరూసెలం’లో ప్రతిమలేని దేవాలయం నిర్మించక పూర్వమున్న ప్రతి దేవాలయ శిధిరలంలోనూ విధాగా విగ్రహం కనిపిస్తుంది. ఇప్పుడున్న దానికంటే పర్షియన్ గల్ఫ్ ఆ రోజుల్లో భూభాగంలోకి మరింత లోతుగా చొచ్చుకుని ఉండేది. అందువల్ల, సముద్రతీరానికి చేరువలో ఉన్న నిప్పర్ నగరం విదేశావర్తకానికి ప్రసిద్ధి కెక్కిన కేంద్రమై ఉండొచ్చు. తెడ్లూ తెరచాపల సహాయంతో పయనించే ఆనాటి నౌకలకు గాలివాటు మిక్కిలి ప్రాధాన్యత కలిగిన అంశం. గాలి అనుకూలిస్తే అనుకున్న దిశగా ఫ్రయాణం సాగి, గమ్యం చేరుకోవడం తేలిక. విజృంభిస్తే నావికుల జీవితాలు అల్లకల్లోలమై చావుబ్రతుకుల అంచుకు చేరుకుంటాయి. అందువల్ల, గాలిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలనే తాపత్రయం నావికుల బృందంలో బలంగా ఏర్పడేందుకు అవకాశాలు మెండు. కాబట్టి, నిప్పర్లో నిరిచిన దేవాలయం గాలిదేవుని ప్రీతికోసం ఏర్పాటుచేసుకున్నదే అయ్యుండాలి. రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com రచన: ఎం.వి.రమణారెడ్డి -
పాలతో పూలబాట!
మొయినాబాద్ రూరల్: పాడి పరిశ్రమపై మండలంలోని రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. దీనిపై ఎక్కువగా యువకులు దృష్టి సారిస్తున్నారు. పశుపోషణతో ఉపాధి పొందుతున్నారు. మండలంలోని కనకమామిడి, అజీజ్‌నగర్, కేతిరెడ్డిపల్లి, హిమాయత్‌నగర్, ఎన్కేపల్లి, నక్కలపల్లి, బాకారం, చిన్నమంగళారం తదితర గ్రామాల్లో రెండువేలకుపైగా పాడి పశువులున్నాయంటే ఈ రంగంపై రైతులు ఎంతగా మక్కువ చూపుతున్నారో అర్థమవుతోంది. 2013-2014 సంవత్సరంలో పశుక్రాంతి పథకంలో భాగంగా మినీ డెయిరీలను ఏర్పాటు చేసుకొనేందుకు ప్రభుత్వం ద్వారా 167 గేదెలను అందజేసింది. ఇందులో ఆయా బ్యాంకుల్లో రుణాలు తీసుకొని మినీ డెయిరీలను కొనసాగిస్తున్నారు. వ్యవసాయానికి తోడుగా పశుపోషణతో రైతులు లాభాల బాట పడుతున్నారు. -
రైతన్న చేతిలో అమృతౌషధాలు
పశువులకు రోగాలు దూరం పాడి పశువుల్లో పొదుగు వాపు, గాలికుంటు వ్యాధులకు చెక్ పాలసార పెంపు, వెన్న శాతం రెట్టింపు మానవ నాగరికత వికాసం పశుపాలనతో ప్రారంభమయిందంటారు చరిత్రకారులు. పశుపాలన వ్యవసాయానికి నాంది పలికింది. భారత వ్యవసాయ చరిత్ర పరిణామాలను పరిశీలిస్తే దాదాపు 3,600 సంవత్సరాల కిందట పశుపాలన ప్రారంభమయినట్లు నమోదయింది. పశుపాలన, పంటల సాగు అడవులు మానవ జీవావరణంలో భాగంగా నిలిచి జమిలిగా సాగాయి. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవనంపై విడదీయరాని ప్రభావం చూపాయి. శతాబ్దాలుగా వ్యవసాయం, పశుపోషణ లాభసాటిగా సాగడానికి అనేక విధానాలకు రూపకల్పన చేశారు. ఈ క్రమంలోనే పశువుల మందల నిర్వహణతో పాటు వైద్య విధానాన్ని రూపొందించారు. ప్రాచీన కాలంలోనే హంసదేవుడు మగ పక్షి శాస్త్ర గ్రంథ్నా రాశారు. బౌద్ధం వర్ధిల్లిన క్రీ.పూ. 300లోనే పశుపోషణ, వైద్యంపై సుత్తని పట అనే పుస్తకం వె లువడింది. వ్యవసాయ రంగం ఆధునికతను సంతరించుకున్న క్రమంలో సుసంపన్నమైన ప్రాచీన జ్ఞానాన్ని పూర్తిగా విస్మరించాం. పశుపోషణలో తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. జాతీయ పశుసంపదలో మన వాటా 8.4 శాతం. తలసరి పాల వినియోగం జాతీయ సగటు 252 గ్రాములు కాగా తెలుగు రాష్ట్రాల సగటు వినియోగం 279 గ్రాములు మాత్రమే. ఇటీవల దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో రసాయనాలతో తయారు చేసిన సింథటిక్ పాల వినియోగం అధికంగా ఉందని తేలింది. ఈ పాలు అనేక ప్రమాదకరమైన రుగ్మతలకు కారణమౌతున్నాయని వైద్య నిపుణులు ప్రకటించారు. పాడి పరిశ్రమ నిర్వాహకుల్లో అత్యధికులు విపరీతంగా యాంటీ బయోటిక్ మందులను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా పాల దిగుబడి పెరుగుతుందని, దూడలు చనిపోయి పాలు ఎగజేపిన ఆవులకు అత్యంత ప్రమాదకరమైన నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఈ ఇంజెక్షన్ ఇచ్చి తీసిన పాలలో ఆక్సిటోసిన్ అవశేషాలు దండిగా ఉండి.. వినియోగదారులకు కేన్సర్ వంటి వ్యాధులు కలుగజేస్తున్నాయి. నాగరికత వికాసంతో పాటే వృద్ధి చెందిన వ్యవసాయంలో పశుపోషణ ఒక ప్రధాన భాగంగా కొనసాగింది. ఇంట పెంచిన పశువును రైతు సొంత బిడ్డల కంటే అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. ఆధునిక అభివృద్ధి పేర వీచిన పడమటి గాలి వ్యవసాయాన్ని పశుపోషణను వేరు చేసింది. వ్యవసాయం.. వ్యాపార పరమావధిగా మారిన తర్వాత రైతు జీవితంలోంచి విడివడిపోవడం మొదలయింది. లాభార్జనే పరమావధిగా మారిన నేపథ్యంలో విపరీతంగా యాంటిబయోటిక్ మందుల వినియోగం పెరిగింది. ఔషధ మూలికలతో ఆరోగ్యదాయకమైన పాల ఉత్పత్తి.. అధికాదాయం అయితే, ఆధునిక మందులేవీ వినియోగించకుండా కేవలం ఔషధ మూలికలను వినియోగిస్తూ పశువులను ఆరోగ్యంగా పెంచిపోషిస్తూ, అధిక పాలదిగుబడి పొందుతున్న రైతులు అనేక మంది ఉన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అనేక మంది పాడి రైతులు గోసంజీవిని- 1, గోసంజీవిని- 2 పేరిట స్థానికంగా లభించే వన మూలికలతో తామే మందులను తయారు చేసు కొని వాడుతున్నారు. గోసంజీవిని- 1, గోసంజీవిని- 2 వా డకం ద్వారా పాల దిగుబడితో పాటు పశువుల రోగనిరోధక శక్తి పెంచుకుంటున్నారు. ఇలా ఆర్థికంగా లాభపడడం తో పాటు ఆరోగ్యకరమైన పాలను ఉత్పత్తి చేస్తున్నారు. గోసంజీవిని-1 తయారీకి అవసరమైన మొక్కలు వేపాకులు: 300 గ్రాములు నర్రెంగ (అల్బిజియా అమర) ఆకులు 300 గ్రాములు అశ్వగంధ (వితానియా సోమ్నిఫేరా): వేరు పొడి 300 గ్రాములు తిప్పతీగ(టిన్సోఫోరా కార్డిఫోలియా): ఆకుల పొడి 50 గ్రాములు నేలవేము (అండ్రొగ్రాఫిస్ పనిక్యూలేట): ఆకుల పొడి 50 గ్రాములు ఈ మూలికల ఆకులను, అశ్వగంధ వేర్లను నీడలో ఎండించి.. విడివిడిగా దంచి పొడులుగా చేసుకోవాలి. జల్లించిన తరువాత పైన పేర్కొన్న మోతాదులో కలిపి పెట్టుకోవాలి. మోతాదు: రోజుకు 50గ్రా. చొప్పున మేతలో కాని తాగే నీటిలో కాని కలిపి పశువులకు ఇవ్వాలి. గోసంజీవిని-1 ప్రత్యేకతలు: పశువు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణకోశాన్ని శుద్ధి చేస్తుంది. పరాన్న జీవులైన నట్టలు, ఏలిక పాములను విసర్జింప జేస్తుంది. పాల దిగుబడిని పెంచడంతో పాటు వెన్న శాతం పెరగడానికి ఉపయోగపడుతుంది. అండం విడుదలను క్రమబద్ధం చేస్తుంది. గర్భధారణ సమస్యలను పరిష్కరించి.. నిర్ణీత సమయంలో ఎదకు వచ్చేలా చేస్తుంది. ఈనిన తర్వాత మాయ పూర్తిగా పడిపోయేట్లు చేస్తుంది. పొదుగువాపు వ్యాధిని నిరోధిస్తుంది. గాలికుంటు, నోటి పుండు వ్యాధులతోపాటు జ్వరాల బారిన పడకుండా కాపాడుతుంది. - జిట్టా బాల్‌రెడ్డి,సాగుబడి డెస్క్ గోసంజీవిని-2 గోసంజీవిని-2 తయారీకి కావాల్సిన పదార్థాలు: 300 గ్రాముల పనస ఆకులు, 300 గ్రాముల వేప బెరడు. తయారీ విధానం ఒక కుండలో 5 లీటర్ల నీరు తీసుకొని చిన్న ముక్కలుగా కత్తిరించిన ఆకులు, బెరడు వేసి.. రెండున్నర లీటర్ల నీరు మిగిలే వరకు మరిగించాలి. చల్లార్చిన తరువాత వచ్చే ఎర్రటి ద్రావణాన్ని వడకట్టి పెట్టుకోవాలి. మోతాదు: పశువులకు అర లీటరు, దూడలకు పావు లీటరు, గొర్రెలకు 100 మిల్లీలీటర్ల చొప్పున తాగించాలి. ఔషధ విశిష్టత: గోసంజీవిని-2 పశువుల గిట్టలు, నోటిలో ఏర్పడే పుండ్లను నివారిస్తుంది. అన్ని రకాల జ్వరాలను తగ్గిస్తుంది. పరాన్న జీవులను నిర్మూలిస్తుంది. గర్భధారణ శక్తిని పెంచుతుంది. ఎలాంటి ఇతర విపరీతాలకు దారితీయదు. రైతు స్థాయిలో తయారు చేసుకొని వాడుకోవచ్చు. -
అంపశయ్యపై.. పశుపోషణ
పత్తాలేని వైద్యం..మూగజీవాల మృత్యువాత సాక్షి నెట్వర్క్: పచ్చని పల్లెలు.. పశు సంపద తగ్గిపోయి కళతప్పాయి. గ్రామాల్లో వ్యవసాయం తర్వాత పశుపోషణే ఎక్కువగా ఉపాధి కల్పిస్తున్న రంగం. కరువు కోరల్లో చిక్కి విలవిల్లాడకుండా రైతులను ఆదుకుంటున్నదీ పాడి పరిశ్రమే. కానీ, ప్రభుత్వాలకు ముందుచూపు లేకపోవడంతో రాష్ట్రంలో పశుపోషణ అంపశయ్యపై యాతన పడుతోంది. తెలంగాణలోని 9 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్క కొత్త పథకమూ మొదలు కాకపోగా, పాతవేమో అటకెక్కాయి. ప్రస్తుతం పశువులకు గొర్రెలకు, కోళ్లకు వచ్చే సాధారణ వ్యాధులకు మాత్రమే చికిత్సచేస్తూ, వ్యాధి నిరోధక టీకాలు, మందులు ఇస్తున్నారు. అయితే, అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడటం, విధాన నిర్ణయాలింకా పట్టాలు ఎక్కకపోవడం కూడా ప్రభావం చూపిస్తోంది. కాగా, కేంద్రం ఇటీవల ‘నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర్రానికి రూ. 80 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ నిధుల్లో జిల్లాల వారీగా ఎవరి వాటా వారికందితే పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశముంది. అటకెక్కిన పథకాలు రాష్ట్ర పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో అమలైన పథకాలన్నీ ఇపుడు ఊసే లేకుండాపోయాయి. కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన మేలుజాతి దూడల పెంపకానికి 75శాతం సబ్సిడీపై ఏడాదిపాటు దాణా సరఫరా చేసే ‘సునందిని’ పథకం పత్తాలేదు. ఇక, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో పూర్తిగా కేంద్రం నిధులతో సబ్సిడీపై రైతులకు పశువులను సరఫరా చేసేవారు. కానీ, ఈ పథకాల జాడే కనిపించడం లేదు. పశుక్రాంతి పథకంలో సైతం రెండు ఆవులు, లేదా రెండు గేదెలను ఆరునెలలకు ఒకటి చొప్పున రెండు విడతలుగా ఇచ్చే పథకం అటకెక్కింది. హైదరాబాద్‌కు పాలు.. ఎట్లా? రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు నిత్యం 20 లక్షల లీటర్ల పాలు అవసరం అవుతున్నట్లు లెక్కలు తీశారు. పశు పోషణ లేకపోవడంవల్ల పాల ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. ఆలస్యంగా కళ్లు తెరిచిన ప్రభుత్వం నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో జిల్లా నుంచి 5 లక్షల లీటర్ల పాల ఉత్పత్తిని సాధించాలని లక్ష్యాలు నిర్దేశించింది. కానీ, జిల్లాల్లో పశుపోషణ, పశువైద్యం విషయంపై మాత్రం దృష్టి సారించ లేదు. -
పాల దిగుబడి పెరగాలంటే...
పాడి-పంట: గుడ్లవల్లేరు (కృష్ణా) : పశు పోషణ విషయంలో చాలా మంది రైతులు నేటికీ సంప్రదాయ పద్ధతులనే పాటిస్తున్నారు. పాడి పశువులకు పోషక విలువలతో కూడిన దాణాను అందించలేకపోతున్నారు. ఫలితంగా దేశవాళీ గేదెలు గరిష్ట స్థాయిలో పాల ఉత్పాదక సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోతున్నాయి. పాడి పశువుల నుంచి అధిక పాల దిగుబడిని పొందాలంటే పుష్టికరమైన మేపును అందించాల్సిందే. అంటే వరిగడ్డితో పాటు సమీకృత దాణానూ ఇవ్వాలి. అప్పుడే దేశవాళీ గేదెల్లో ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుందని, తద్వారా అధిక పాల దిగుబడిని పొందవచ్చునని చెబుతున్నారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండల పశు వైద్యాధికారి డాక్టర్ బి.సత్యప్రసాద్. ఆ వివరాలు... దాణా ఎలా ఉండాలి? పాల ఉత్పత్తి సమయంలో, చూడి దశలో, పెరుగుదల దశలో పశువులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలి. అంటే పశువు రోజువారీ ఆహార అవసరాలకు అనుగుణంగా ఎక్కువ మాంసకృత్తులను, అధిక శక్తిని అందించే ఆహారాన్ని ఇవ్వాలి. ఇందుకోసం అధిక పోషక విలువలు కలిగిన దినుసులను తగు పాళ్లలో కలిపి మర పట్టించాలి. ఆ మిశ్రమాన్నే దాణా అంటారు. ఇందులో జీర్ణమయ్యే మాంసకృత్తులు, పూర్తిగా జీర్ణమయ్యే పోషక పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. దాణాలో మాంసకృత్తులు 16 శాతం, జీర్ణమయ్యే పోషక పదార్థాలు 70 శాతం ఉండేలా వివిధ దినుసులు, పదార్థాలను కలుపుకోవాలి. ఎంత ఇవ్వాలి? సాధారణంగా చాలా మంది రైతులు పశువులకు దాణాగా తౌడును వేస్తుంటారు. సమీకృత దాణా తయారీకి ఖర్చు కొంచెం ఎక్కువ కావడమే దీనికి కారణం. అయితే మాంసకృత్తులు, పోషకాలు, ఖనిజ లవణాలు తగు పాళ్లలో ఉండే సమీకృత దాణాను అందిస్తే పశువులో పాల దిగుబడి సామర్థ్యం పెరుగుతుంది. రెండు లీటర్లకు పైబడి పాలిచ్చే పశువులకు తప్పనిసరిగా సమీకృత దాణాను ఇవ్వాలి. పాలిచ్చే గేదెలైతే ప్రతి రెండు లీటర్లకు కిలో చొప్పున రోజుకు ఏడు కిలోలకు మించకుండా దాణాను అందించాలి. పాలిచ్చే ఆవులకు ప్రతి 2.5 లీటర్లకు ఒక కిలో చొప్పున దాణా ఇవ్వాలి. తాజాగా ఉండాలి పశువులకు అందించే దాణా తాజాగా ఉండాలి. అంటే దానిని ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి కలుపుకోవాలి. గాలి చొరబడని డబ్బాలు లేదా సంచులలో దాణాను నిల్వ చేసుకోవాలి. దాణా తయారీలో వినియోగించే గింజలను చెక్క ముక్కగా ఆడించాలి. వాటిని ముందుగానే ఆడించి నిల్వ చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే గింజలపై ఉన్న పొరలు ఊడిపోయి చీడపీడలు సులభంగా ఆశిస్తాయి. జాగ్రత్తలు తీసుకోవాలి దాణాను తయారు చేసేటప్పుడు పదార్థాలన్నీ బాగా కలిసిపోయేలా చూసుకోవాలి. ముఖ్యం గా తక్కువ పరిమాణంలో వాడే ఖనిజ లవణ మిశ్రమాన్ని దాణాలో కలిపేటప్పుడు తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఒకవేళ కుదరకపోతే దానిని దాణాలో కలపకుండా పశువుకు అందించే ఆహారాన్ని బట్టి రోజువారీగా విడిగా ఇవ్వడం మంచిది. దాణా తయారీకి ఉపయోగించే పదార్థాలు బాగా ఎండి, పెళుసుగా ఉండాలి. వాటిలో తేమ 5 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. తేమ ఎక్కువైతే మొక్కజొన్న, వేరుశనగ, సోయా పిండ్లు బూజు పడతాయి. అప్పుడు దాణాలో అప్లోటాక్సిన్ అనే విష పదార్థం చేరుతుంది. బూజు పట్టిన మొక్కజొన్న గింజలు నల్లగా మారతాయి. అలాంటి వాటిని దాణా తయారీకి ఉపయోగించకూడదు. నాణ్యమైన గింజలనే వాడాలి. వేరుశనగ, సోయా గింజలపై శిలీంద్రాలు (ఫంగస్) ఉన్నాయేమో చూసుకోవాలి. ఆ గింజలను చిన్న చిన్న ముక్కలుగా విరి చి, అంచులను పరిశీలిస్తే నాణ్యంగా ఉన్నాయా లేదా అన్న విషయం అర్థమవుతుంది. పత్తి పిండిని మరీ ఎక్కువగా... అంటే 10 శాతానికి మించి వాడకూడదు. ఎందుకంటే దానిలో గోస్పీపోల్ అనే విష లక్షణం ఉంటుంది. ఉప్పు కలపని ఖనిజ లవణ మిశ్రమాన్ని కొనడం మంచిది. ఆ తర్వాత దానికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి. అయొడైజ్డ్ ఉప్పును వాడడం వల్ల పశువులకు పునరుత్పత్తికి దోహదపడే అయొడిన్ అందుతుంది. ఇలా చేయండి 100 కిలోల సమీకృత దాణాను తయారు చేసుకోవాలంటే 25-30 కిలోల బియ్యం/గోధుమ తౌడు, 30-40 కిలోల మొక్కజొన్న/జొన్న గింజల పిండి, 20-30 కిలోల వేరుశనగ/తెలగ/పత్తి/కొబ్బరి తెలగ పిండి, కిలో ఉప్పు, రెండు కిలోల ఖనిజ లవణ మిశ్రమంతో పాటు 20 కిలోల వరకూ ఉలవలు/శనగపొట్టు/కందిపొట్టు/కర్రపెండలం పిప్పి అవసరమవుతాయి. లభ్యత, ధరను దృష్టిలో ఉంచుకొని అనువైన ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోవాలి. ధాన్యపు గింజలు పశువుకు శక్తినిస్తాయి. ఎందుకంటే వీటిలో పోషకాలు, మాంసకృత్తులు ఉంటాయి. తౌడు ద్వారా పశువులకు జీర్ణమయ్యే పోషకాలు, మాంసకృత్తులతో పాటు విటమిన్లు, భాస్వరం, పీచు పదార్థాలు కూడా లభిస్తాయి. పిండి ద్వారా మాంసకృత్తులు, అదనపు శక్తి చేకూరుతాయి. దాణాలో తగినంత మొలాసిస్ కలిపితే మంచి రుచి వస్తుంది. పశువులకు శక్తి కూడా లభిస్తుంది. ఖనిజ లవణాలు పశువుల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వంద కిలోల దాణా కోసం 30 కిలోల తౌడు (నూనె తీసిన), 37 కిలోల గింజలు, 22 కిలోల తెలగ పిండి, 8 కిలోల పత్తి పిండి, 2 కిలోల ఖనిజ లవణాలు, కిలో ఉప్పు కలుపుకున్నా సరిపోతుంది.