టూకీగా ప్రపంచ చరిత్ర 67
ఆచారాలు - నమ్మకాలు
పశుపోషణ వల్ల మానవుని నివాసం గుహల్లో నుండి తోలు గుడారాలకు మారింది. ఐనా, అది పచ్చికబయళ్ళను వెదుక్కుంటూ సాగిన సంచార జీవితమే. కాకపోతే, వంటకు మట్టిపాత్రలు ప్రవేశించినట్టు కనబడుతుంది. చాలా శతాబ్దాల తరువాత, సంచారజీవనం మందగించింది అనటానికి ఆనవాళ్ళు మట్టిగోడలమీద పూరి కప్పుతో నిర్మించుకున్న గుడిసెలు, ఆ సమయానికి మట్టి పాత్రల నాణ్యత, వైవిధ్యం బాగా పెరిగింది. మట్టిగోడలనూ పాత్రలనూ రంగుతోనో పూజలతోనో అలంకరించడమే గాక, ఆ అలంకరణల్లో సూర్యుడూ చంద్రుడూ, పాములూ, నదులూ, చెట్లవంటి ప్రకృతి దృశ్యాలు చోటు చేసుకోవడం కనిపిస్తుంది. క్రీ.పూ.6000-5000ల ప్రాంతంలో నదుల పరీవాహక పీఠభూములను ఆశ్రయంచి మానవుడు స్థిర నివాసాలకు పూనుకున్నాడు.
ఇటుకలతో కట్టిన గోడలూ, స్తంభాలూ దూలాలూ దంతెలతో పటిష్టమైన పైకప్పు ఏర్పడిన విశాల నివాసానికి అతని జీవితం మారిపోయింది. క్రీ.పూ.5000 సంవత్సరాల తరువాతి కాలంలో మానవుని స్థిర నివాసాలు పెద్ద పెద్ద గ్రామాలుగానూ, నగరాలుగానూ రూపొందుతున్న దశలో, జనావాసాలకు మధ్యలో ఒక దేవాలయాన్ని నిర్మించుకునే సంప్రదాయం మెసొపొటేమియాలో మొదలయింది. యూఫ్రాటెస్ నదీతీరంలో, పర్షియన్ గల్ఫ్ ఉత్తరాన త్రవ్వకాల్లో బయటపడిన ‘నిప్పల్’ నగరంలోని దేవాలయాన్ని ప్రపంచ మొత్తంలో అత్యంత ప్రాచీనమైన దేవాలయంగా శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఇతర ఆధారాల మూలంగా అది ‘ఎన్-లిన్’ దేవునికి (గాలి దేవునికి) కట్టిన ఆలయంగా భావించారు.
ఐతే ఆ దేవాలయ శిధిలాల్లో ఎలాంటి ప్రతిమ దొరక్కపోవడంతో దృగ్గోచరంగాని ‘గాలి’కి రూపం ఎలాంటిది కల్పించారో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. రాతిలో మలచిన విగ్రహం కాక, అది మట్టితో తయారైన ప్రతిమే అయ్యుంటే గోపురం కూలినప్పుడు చితికిపోయైనా ఉండాలి. లేదా ప్రతిమను ప్రతిష్టించేలోపే కూలిపోయిందైనా అయ్యుండాలి. ‘దేవుని విగ్రహాన్ని మట్టితో ఎందుకు చేస్తారు’ అనే సంశయం రానక్కరలేదు. నిన్నా మొన్నటి వరకు వినాయకుని బొమ్మలు మట్టితో చేసినవిగానే ఉండేవి. దక్షిణ భారత దేశంలో జరుగుతున్న ‘దేవర’ అనే గ్రామదేవతల ఉత్సవానికి ఇప్పుడు గూడా పెద్దమ్మ చిన్నమ్మ ప్రతిమలు బంకమట్టితో చేస్తున్నారు. అలాంటప్పుడు, రాయి దొరకడం దుర్లభమైన దక్షిణ మెసపొటేమియాలో బంకమట్టి ప్రతిమలు అసంభవంగాదు. ‘ఒకవేళ ఆ దేవాలయానికి వాళ్ళు ప్రతిమను స్థాపించాలని ఉద్దేశించలేదేమో’ అనుకునేందుకూ వీలుగాదు. రూపానికి అతీతుడైన ‘ఎహోవా’ పట్ల ఏకోపాసకుడైన ఇజ్రేలీ పాలకుడు సాల్మన్, తన రాజధాని ‘జెరూసెలం’లో ప్రతిమలేని దేవాలయం నిర్మించక పూర్వమున్న ప్రతి దేవాలయ శిధిరలంలోనూ విధాగా విగ్రహం కనిపిస్తుంది.
ఇప్పుడున్న దానికంటే పర్షియన్ గల్ఫ్ ఆ రోజుల్లో భూభాగంలోకి మరింత లోతుగా చొచ్చుకుని ఉండేది. అందువల్ల, సముద్రతీరానికి చేరువలో ఉన్న నిప్పర్ నగరం విదేశావర్తకానికి ప్రసిద్ధి కెక్కిన కేంద్రమై ఉండొచ్చు. తెడ్లూ తెరచాపల సహాయంతో పయనించే ఆనాటి నౌకలకు గాలివాటు మిక్కిలి ప్రాధాన్యత కలిగిన అంశం. గాలి అనుకూలిస్తే అనుకున్న దిశగా ఫ్రయాణం సాగి, గమ్యం చేరుకోవడం తేలిక. విజృంభిస్తే నావికుల జీవితాలు అల్లకల్లోలమై చావుబ్రతుకుల అంచుకు చేరుకుంటాయి. అందువల్ల, గాలిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలనే తాపత్రయం నావికుల బృందంలో బలంగా ఏర్పడేందుకు అవకాశాలు మెండు. కాబట్టి, నిప్పర్‌లో నిరిచిన దేవాలయం గాలిదేవుని ప్రీతికోసం ఏర్పాటుచేసుకున్నదే అయ్యుండాలి.
రచయిత ఫోన్: 9440280655;
email: mvrr44@gmail.com
రచన: ఎం.వి.రమణారెడ్డి