టూకీగా ప్రపంచ చరిత్ర - 66
ఆచారాలు - నమ్మకాలు
అదే దశలో, మనిషికి చేయవలసిన పనులూ (కర్తవ్యాలు), మనుషులు చేయడగూడని పనులూ (నిషేధాలు) అనేవి ఒక క్రమంలో పటిష్టమై, ఆచారాల జాబితాలో కలిసి, అనుభవజ్ఞుల జ్ఞాపకంలో పొడవాటి సరంగా పాదుకొని ఉండాలి. అలా కాకపోతే, గుంపును క్రమశిక్షణలో ఉంచడం సాధ్యాపడదు. క్రమశిక్షణ లేని గుంపుకు మనుగడ ఉండదు. ఆనాటి గుంపులు నిరవధికంగా మనుగడ కొనసాగించడమేగాక, తెగలుగానూ, జాతులుగానూ ప్రపంచవ్యాప్తంగా విసృ్తతి చెందడమే పై సమాచారానికి రుజువు.
మరికొంత ముందుచూపు ఏర్పడిన తరువాత, సంచార జీవితంలోనే పశువుల కాపరిగా నెలకొన్న దరిమిలా, సూర్యచంద్రులవల్ల ప్రయోజనం తనకు ఇదివరకు తెలిసినదానికంటే చాలా ఎక్కువగా ఉందని మానవుడు గ్రహించాడు. వలసలకు పగిటివేళలు అనుకూలమైనవిగా ఎన్నుకున్నాడు. పొద్దు పొడుపు, పొద్దు క్రుంకు ప్రదేశాలను తూర్పు పడమరలుగా విభజించుకున్నాడు. నక్షత్రాలను గుర్తించడం ద్వారా ఉత్తర దక్షిణాలను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. పిల్ల తెమ్మర, విసురుగాలి, హోరుగాలి, ప్రచండమారుతం, ప్రళయమారుతం వంటి తేడాలతో గాలి ప్రవర్తించడం గమనించాడు. చిరుజల్లు మొదలు జడివాన దాకా వర్షపాతంలోని తేడాలను తెలుసుకున్నాడు. వాటి అనుకూలతను బట్టి వలసలను మలుచుకోవడమేగాదు, వాటిని సర్వసాధారణమైనవిగాకాక, ఏదో ప్రత్యేకతలు వాటిలో ఉన్నట్లు అనుమానించాడు. పశువుల కాపరిగా ఇప్పుడతనికి దిక్కులతోనూ, వాతావరణంతోనూ, వర్షాలతోనూ అనుబంధం ఏర్పడటమేగాక, నేల కొలతలతో గూడా అవసరం తన్నుకొచ్చింది.
అవెస్టాలో ప్రకృతి శక్తుల సమాచారం ఉన్నప్పటికీ వాటి ప్రాముఖ్యత పెద్దగా కనిపించదు. న్యాయం, ధర్మం వంటి సామాజిక అంశాలకే అందులో ప్రాధాన్యత కనిపిస్తుంది. రుగ్వేదంలో భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నిప్పు, నీరు వంటి దృగ్గోచర పదార్థాలకేగాక, గాలికీ, శౌర్యప్రతాపాల వంటి గుణాలకూ, జ్ఞానానికి, శరీరంలో ఉత్పన్నమయ్యే ఉద్రేకాలకూ రూపం కల్పించి, వాటివల్ల ఒనగూరే ప్రయోజనాలను పొందేందుకూ, వాటివల్ల కలిగే నష్టాలను నివారించుకునేందుకూ, ఆశక్తులకు ‘ప్రీతి’ కలిగించే కార్మకాండ ప్రారంభమయింది. ఈ అడుగుతో, ప్రలోభాలతోపాటు భయం కూడా నమ్మకాల జాబితాలో చేరిపోయింది.
రుగ్వేద కాలంనాటికి తిథులూ, మాసాలూ ఏర్పడిన దాఖలాలు కనిపించవు. కానీ ‘సినీవాలి’ ప్రస్తావనతో చాంద్రాయణాన్ని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు బోధపడుతుంది. బైబిల్లోని ‘నోవా అండ్ ది ఆర్క్’ వృత్తాంతం వివరంగా పరిశీలిస్తే, ఆ ఘోరమైన జలప్రళయం నాటికి చాంద్రాయణమాసం, దినాలూ మెసపటోమియా ప్రాంతంలో అప్పటికే ఏర్పడినట్టు అర్థమౌతుంది. ‘బుక్ ఆఫ్ జెనిసిస్’ తొలి అధ్యాయంలో దేవుడు మొదటి రోజు నుండి ఆరవరోజు వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించి, ఏడవరోజు విశ్రాంతి తీసుకున్నట్టుగా ఉండడంతో, బైబిల్ తయారౌతున్న సమయానికి కాలాన్ని రోజులుగా విభజించి, ఏడురోజులు కలిపి ఒక ‘వారం’గా చేసుకున్న ఏర్పాటు వెల్లడౌతుంది.
లెక్కింపు కోసం కాలాన్ని విభజించుకునే ప్రయత్నం రుగ్వేదకాలం తరువాతి ఆర్యుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. చాంద్రాయణ మాసాన్ని నాలుగు వారాలుగా కాకుండా, రెండు ‘పక్షాలు’గా విభజించుకున్నారు. చంద్రుడు పెరగడం మొదలుపెట్టి పూర్ణబింబంగా ఎదిగేవరకు నడిచేది ‘శుక్లపక్షం’. చంద్రుడు తరిగేది మొదలై పూర్తిగా మాయమయ్యేవరకు నడిచేది ‘బహుళపక్షం’ వారంలోని విభజన ఏడు రోజులై ఉండగా, పక్షంలోని విభజన పదిహేను తిథులకింద జరిగింది. మహాభారత కాలంనాటికి కూడా దినాలను తిథులతోనేగాని, ‘సోమవారం, మంగళవారం’ వంటి రోజులుగా లెక్కించడం కనిపించదు. ఆ తిథుల్లో కొన్ని మంచివిగానూ, మరికొన్ని చెడ్డవిగానూ భావించే సంప్రదాయం ఏర్పడినట్టు కనిపించదు. ఎందుకంటే, మహాభారతంలో శుభకార్యాలకు సుముహూర్తాలు కనిపించవు గాబట్టి.
లెక్కింపు కోసం కాలాన్ని విభజించుకునే ప్రయత్నం రుగ్వేదకాలం తరువాతి ఆర్యుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. చాంద్రాయణ మాసాన్ని నాలుగు వారాలుగా కాకుండా, రెండు ‘పక్షాలు’గా విభజించుకున్నారు. చంద్రుడు పెరగడం మొదలుపెట్టి పూర్ణబింబంగా ఎదిగేవరకు నడిచేది ‘శుక్లపక్షం’. చంద్రుడు తరిగేది మొదలై పూర్తిగా మాయమయ్యేవరకు నడిచేది ‘బహుళపక్షం.
రచన: ఎం.వి.రమణారెడ్డి