రైతన్న చేతిలో అమృతౌషధాలు | Distance cattle diseases | Sakshi
Sakshi News home page

రైతన్న చేతిలో అమృతౌషధాలు

Published Sun, Sep 14 2014 10:32 PM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM

రైతన్న చేతిలో అమృతౌషధాలు

రైతన్న చేతిలో అమృతౌషధాలు

పశువులకు రోగాలు దూరం
పాడి పశువుల్లో పొదుగు వాపు, గాలికుంటు వ్యాధులకు చెక్
పాలసార పెంపు, వెన్న శాతం రెట్టింపు

 
మానవ నాగరికత వికాసం పశుపాలనతో ప్రారంభమయిందంటారు చరిత్రకారులు. పశుపాలన వ్యవసాయానికి నాంది పలికింది. భారత వ్యవసాయ చరిత్ర పరిణామాలను పరిశీలిస్తే దాదాపు 3,600 సంవత్సరాల కిందట పశుపాలన ప్రారంభమయినట్లు నమోదయింది. పశుపాలన, పంటల సాగు అడవులు మానవ జీవావరణంలో భాగంగా నిలిచి జమిలిగా సాగాయి. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక జీవనంపై విడదీయరాని ప్రభావం చూపాయి. శతాబ్దాలుగా వ్యవసాయం, పశుపోషణ లాభసాటిగా సాగడానికి అనేక విధానాలకు రూపకల్పన చేశారు. ఈ క్రమంలోనే పశువుల మందల నిర్వహణతో పాటు వైద్య విధానాన్ని రూపొందించారు. ప్రాచీన కాలంలోనే హంసదేవుడు మగ పక్షి శాస్త్ర గ్రంథ్నా రాశారు. బౌద్ధం వర్ధిల్లిన క్రీ.పూ. 300లోనే  పశుపోషణ, వైద్యంపై  సుత్తని పట అనే పుస్తకం వె లువడింది.

వ్యవసాయ రంగం ఆధునికతను సంతరించుకున్న క్రమంలో సుసంపన్నమైన ప్రాచీన జ్ఞానాన్ని పూర్తిగా విస్మరించాం. పశుపోషణలో తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక స్థానం ఉంది. జాతీయ పశుసంపదలో మన వాటా 8.4 శాతం.  తలసరి పాల వినియోగం జాతీయ సగటు  252 గ్రాములు కాగా తెలుగు రాష్ట్రాల సగటు వినియోగం  279 గ్రాములు మాత్రమే. ఇటీవల దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో రసాయనాలతో తయారు చేసిన సింథటిక్ పాల వినియోగం అధికంగా ఉందని తేలింది. ఈ పాలు అనేక ప్రమాదకరమైన రుగ్మతలకు కారణమౌతున్నాయని వైద్య నిపుణులు ప్రకటించారు. పాడి పరిశ్రమ నిర్వాహకుల్లో అత్యధికులు విపరీతంగా యాంటీ బయోటిక్ మందులను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా పాల దిగుబడి పెరుగుతుందని, దూడలు చనిపోయి పాలు ఎగజేపిన ఆవులకు అత్యంత ప్రమాదకరమైన నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఈ ఇంజెక్షన్ ఇచ్చి తీసిన పాలలో ఆక్సిటోసిన్ అవశేషాలు దండిగా ఉండి.. వినియోగదారులకు కేన్సర్ వంటి వ్యాధులు కలుగజేస్తున్నాయి.

నాగరికత వికాసంతో పాటే వృద్ధి చెందిన వ్యవసాయంలో పశుపోషణ ఒక ప్రధాన భాగంగా కొనసాగింది. ఇంట పెంచిన పశువును రైతు సొంత బిడ్డల కంటే అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. ఆధునిక అభివృద్ధి పేర వీచిన పడమటి గాలి వ్యవసాయాన్ని పశుపోషణను వేరు చేసింది. వ్యవసాయం.. వ్యాపార పరమావధిగా మారిన తర్వాత రైతు జీవితంలోంచి విడివడిపోవడం మొదలయింది. లాభార్జనే పరమావధిగా మారిన నేపథ్యంలో విపరీతంగా యాంటిబయోటిక్ మందుల వినియోగం పెరిగింది.

ఔషధ మూలికలతో ఆరోగ్యదాయకమైన  పాల ఉత్పత్తి.. అధికాదాయం
 
అయితే, ఆధునిక మందులేవీ వినియోగించకుండా కేవలం ఔషధ మూలికలను వినియోగిస్తూ పశువులను ఆరోగ్యంగా పెంచిపోషిస్తూ, అధిక పాలదిగుబడి పొందుతున్న రైతులు అనేక మంది ఉన్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అనేక మంది పాడి రైతులు గోసంజీవిని- 1, గోసంజీవిని- 2 పేరిట స్థానికంగా లభించే వన మూలికలతో తామే మందులను తయారు చేసు కొని వాడుతున్నారు. గోసంజీవిని- 1, గోసంజీవిని- 2 వా డకం ద్వారా పాల దిగుబడితో పాటు పశువుల రోగనిరోధక శక్తి పెంచుకుంటున్నారు. ఇలా ఆర్థికంగా లాభపడడం తో పాటు ఆరోగ్యకరమైన పాలను ఉత్పత్తి చేస్తున్నారు.

గోసంజీవిని-1 తయారీకి అవసరమైన మొక్కలు

వేపాకులు: 300 గ్రాములు
నర్రెంగ (అల్బిజియా అమర) ఆకులు 300 గ్రాములు
అశ్వగంధ (వితానియా సోమ్నిఫేరా): వేరు పొడి 300 గ్రాములు
తిప్పతీగ(టిన్సోఫోరా కార్డిఫోలియా): ఆకుల పొడి 50 గ్రాములు
నేలవేము (అండ్రొగ్రాఫిస్ పనిక్యూలేట): ఆకుల పొడి 50 గ్రాములు
ఈ మూలికల ఆకులను, అశ్వగంధ వేర్లను నీడలో ఎండించి.. విడివిడిగా దంచి పొడులుగా చేసుకోవాలి. జల్లించిన తరువాత పైన పేర్కొన్న మోతాదులో కలిపి పెట్టుకోవాలి.  

మోతాదు: రోజుకు 50గ్రా. చొప్పున మేతలో కాని తాగే నీటిలో కాని కలిపి పశువులకు ఇవ్వాలి.

గోసంజీవిని-1 ప్రత్యేకతలు:

పశువు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణకోశాన్ని శుద్ధి చేస్తుంది. పరాన్న జీవులైన నట్టలు, ఏలిక పాములను విసర్జింప జేస్తుంది. పాల దిగుబడిని పెంచడంతో పాటు వెన్న శాతం పెరగడానికి ఉపయోగపడుతుంది. అండం విడుదలను క్రమబద్ధం చేస్తుంది. గర్భధారణ సమస్యలను పరిష్కరించి.. నిర్ణీత సమయంలో ఎదకు వచ్చేలా చేస్తుంది. ఈనిన తర్వాత మాయ పూర్తిగా పడిపోయేట్లు చేస్తుంది. పొదుగువాపు వ్యాధిని నిరోధిస్తుంది. గాలికుంటు, నోటి పుండు వ్యాధులతోపాటు జ్వరాల బారిన పడకుండా కాపాడుతుంది.    
 - జిట్టా బాల్‌రెడ్డి,సాగుబడి డెస్క్
 
 గోసంజీవిని-2

గోసంజీవిని-2 తయారీకి కావాల్సిన పదార్థాలు: 300 గ్రాముల పనస ఆకులు, 300 గ్రాముల వేప బెరడు.
 
తయారీ విధానం
 
ఒక కుండలో 5 లీటర్ల నీరు తీసుకొని చిన్న ముక్కలుగా కత్తిరించిన ఆకులు, బెరడు వేసి.. రెండున్నర లీటర్ల నీరు మిగిలే వరకు మరిగించాలి. చల్లార్చిన తరువాత వచ్చే ఎర్రటి ద్రావణాన్ని వడకట్టి పెట్టుకోవాలి.

 మోతాదు: పశువులకు అర లీటరు, దూడలకు పావు లీటరు, గొర్రెలకు 100 మిల్లీలీటర్ల చొప్పున తాగించాలి.
 
ఔషధ విశిష్టత: గోసంజీవిని-2 పశువుల గిట్టలు, నోటిలో ఏర్పడే పుండ్లను నివారిస్తుంది. అన్ని రకాల జ్వరాలను తగ్గిస్తుంది. పరాన్న జీవులను నిర్మూలిస్తుంది. గర్భధారణ శక్తిని పెంచుతుంది. ఎలాంటి ఇతర విపరీతాలకు దారితీయదు. రైతు స్థాయిలో తయారు చేసుకొని వాడుకోవచ్చు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement