అంపశయ్యపై.. పశుపోషణ
పత్తాలేని వైద్యం..మూగజీవాల మృత్యువాత
సాక్షి నెట్‌వర్క్: పచ్చని పల్లెలు.. పశు సంపద తగ్గిపోయి కళతప్పాయి. గ్రామాల్లో వ్యవసాయం తర్వాత పశుపోషణే ఎక్కువగా ఉపాధి కల్పిస్తున్న రంగం. కరువు కోరల్లో చిక్కి విలవిల్లాడకుండా రైతులను ఆదుకుంటున్నదీ పాడి పరిశ్రమే. కానీ, ప్రభుత్వాలకు ముందుచూపు లేకపోవడంతో రాష్ట్రంలో పశుపోషణ అంపశయ్యపై యాతన పడుతోంది. తెలంగాణలోని 9 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్క కొత్త పథకమూ మొదలు కాకపోగా, పాతవేమో అటకెక్కాయి. ప్రస్తుతం పశువులకు గొర్రెలకు, కోళ్లకు వచ్చే సాధారణ వ్యాధులకు మాత్రమే చికిత్సచేస్తూ, వ్యాధి నిరోధక టీకాలు, మందులు ఇస్తున్నారు. అయితే, అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడటం, విధాన నిర్ణయాలింకా పట్టాలు ఎక్కకపోవడం కూడా ప్రభావం చూపిస్తోంది. కాగా, కేంద్రం ఇటీవల ‘నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ’ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర్రానికి రూ. 80 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ నిధుల్లో జిల్లాల వారీగా ఎవరి వాటా వారికందితే పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశముంది.
అటకెక్కిన పథకాలు
రాష్ట్ర పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో అమలైన పథకాలన్నీ ఇపుడు ఊసే లేకుండాపోయాయి. కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన మేలుజాతి దూడల పెంపకానికి 75శాతం సబ్సిడీపై ఏడాదిపాటు దాణా సరఫరా చేసే ‘సునందిని’ పథకం పత్తాలేదు. ఇక, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకంలో పూర్తిగా కేంద్రం నిధులతో సబ్సిడీపై రైతులకు పశువులను సరఫరా చేసేవారు. కానీ, ఈ పథకాల జాడే కనిపించడం లేదు. పశుక్రాంతి పథకంలో సైతం రెండు ఆవులు, లేదా రెండు గేదెలను ఆరునెలలకు ఒకటి చొప్పున రెండు విడతలుగా ఇచ్చే పథకం అటకెక్కింది.
హైదరాబాద్‌కు పాలు.. ఎట్లా?
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు నిత్యం 20 లక్షల లీటర్ల పాలు అవసరం అవుతున్నట్లు లెక్కలు తీశారు. పశు పోషణ లేకపోవడంవల్ల పాల ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. ఆలస్యంగా కళ్లు తెరిచిన ప్రభుత్వం నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో జిల్లా నుంచి 5 లక్షల లీటర్ల పాల ఉత్పత్తిని సాధించాలని లక్ష్యాలు నిర్దేశించింది. కానీ, జిల్లాల్లో పశుపోషణ, పశువైద్యం విషయంపై మాత్రం దృష్టి సారించ లేదు.