శిథిలావస్థలో నక్కల చెరువు తూము
-
వృథాగా పోతున్న నీరు
-
ఆందోళనలో ఆయకట్టు రైతులు
-
రూ.24లక్షల పనులు నీటిపాలు
-
పట్టింకోని అధికారులు
చెన్నూర్ : బొట్టు బొట్టు ఒడిసి పట్టు.. ఒక్క నీటి చుక్క వథా కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వ మిషన్ కాకతీయ ద్వారా ముమ్మరంగా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టింది. కోట్లాది రూపాయల నిధులతో నియోజకవర్గంలోని 64 చెరువుల మరమ్మతులకు శ్రీకారం చుట్టింది. అన్ని ఉన్న అల్లుని నోట్లో శని ఉన్న చందంగా మారింది.
చెన్నూర్ పెద్ద చెరువు ఆయకట్టు రైతుల పరిస్థితి. రెండు పంటలకు నీరందించే సామర్థ్యం కల్గిన చెరువులో చుక్క నీరు నిలవని దుస్థితి నెలకొంది. దీంతో వందల ఎకరాల పంట పొలాలు సమీప భవిష్కత్‌లో ఎడారులుగా మారబోతున్నా పట్టించుకున్న వారే కరువయ్యారు.
పెద్ద చెరువు చరిత్ర ఘనం...
ఆగస్త్యా మహాముని నడయాడిన పెద్ద చెరువు (ఆగస్త్యా గుండం)గా పేరుంది. ఎంతో ఘన చరిత్ర ఉన్న చెన్నూర్ పెద్ద చెరువు పునరుద్ధరణ పనులు మిషన్ కాకతీయ ద్వారా చేయకపోవడం దారుణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. పెద్ద చెరువు ఆయకట్టు కింద 320 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి. చెరువుకు ఏర్పాటు చేసిన తూములు శిథిలావస్థకు చేరుకోవడంతో నీరు వృథాగా పోతోంది. దీంతో గత నాలుగేళ్ల నుంచి ఆయకట్టు రైతులు వందలాది ఎకరాల పంట పొలాలను బీళ్లుగా వదిలేశారు. పంట పొలాలు ఉండి రైతులు వ్యవసాయ కూలీలుగా మారాల్సిన దుస్థితి నెలకొంది.
మరమ్మతులు చేసిన ఫలితం శూన్యం
పెద్ద చెరువు మరమ్మతుతో పాటు తూములు, కాల్వల నిర్మాణానికి త్రిబుల్ ఆర్ పథకం కింద రూ. 24 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో వేసవి కాలంలో సదరు కాంట్రాక్టర్ చెరువు మరమ్మతులతో పాటు పెద్ద తూము, ప్రధాన కాల్వ నిర్మాణం చేశారు. నక్కల తూముతో పాటు దిగువ ప్రాంతానికి వెళ్లే కాల్వ పనులు చేపట్టలేదు. ప్రధాన కాల్వ పనులు సైతం సక్రమంగా నిర్మించలేదని రైతులు ఆరోపిస్తున్నారు.
చెరువు నిండినప్పటికీ కనీసం 100 ఎకరాలకు నీరందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.24 లక్షల నిధులతో ఒకే తూము నిర్మించి సదురు కాంట్రాక్టర్ చేతులు దులుపుకున్నా అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరిన నక్కల తూముతో పాటు కాల్వల నిర్మాణం చేపట్టాలని, లేనట్లయితే వర్షాలు సంమృద్ధిగా కురిసిన ఫలితం ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు.