- దిగుబడి పెంపునకు కొత్త పథకం
- రైతులకు అన్నివిధాలుగా శిక్షణ
- తొలి విడత బాపులపాడులో 8 గ్రామాల ఎంపిక
హనుమాన్‌జంక్షన్ : వర్షాధారంతో వ్యవసాయం సాగిస్తున్న రైతాంగానికి తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. సమగ్ర సన్యరక్షణపై రైతులకు శిక్షణ ఇచ్చి, అధిక దిగుబడి సాధించేలా చేయడమే పథకం ముఖ్య లక్ష్యం. ‘మిషన్ ప్రాజెక్టు టూ బూస్ట్ ప్రొడక్టివిటీ’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు తొలివిడతగా బాపులపాడు మండలంలోని ఎనిమిది గ్రామాలను ఎంపిక చేశారు.
వ్యవసాయ పంటల ఉత్పాదతకను పెంచటం కోసం అనుసరించాల్సి పద్ధతులపై ఆయా గ్రామాల్లో రైతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వటంతో పాటు ఎరువులు, పురుగుమందులు, సూక్ష్మ పోషకాలను రాయితీపై అందించనున్నారు. ఇందుకోసం తీర ప్రాంతంలో ఉన్న కానుమోలు, కాకులపాడు, దంటగుంట్ల, రంగయ్యప్పారావు పేట, తిప్పనగుంట, మెట్ట ప్రాంతంలోని మడిచర్ల, బిళ్లనపల్లి, కొత్తపల్లి గ్రామాల పరిధిలోని 200 హెక్టార్లు వ్యవసాయ భూమిని గుర్తించారు. ఆయా గ్రామాల్లో ఈ భూములను సాగు చేస్తున్న దాదాపు 500 మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది.
సస్యరక్షణపై శిక్షణ
ఈ పథకం కింద ఎంపిక చేసిన గ్రామాల్లో రైతులకు సమగ్ర సస్యరక్షణపై వ్యవసాయాధికారులు శిక్షణ ఇవ్వనున్నారు. విత్తన ఎంపిక నుంచి పంట నూర్పిడి వరకు అన్ని పనులు వ్యవసాయాధికారుల పర్యవేక్షణలోనే సాగుతాయి. పొలంబడి కార్యక్రమం నిర్వహించి సాగులో మెలకువలు నేర్పుతారు. ఎరువుల వినియోగం, భూయాజమాన్యం, నీటి యాజమాన్యంపై శిక్షణ ఇస్తారు. ప్రధానంగా సేంద్రియ వ్యవసాయం అవశ్యకత, ఉపయోగాలపై రైతులకు అవగాహన పెంచుతారు.
సేంద్రియ వ్యవసాయంలో అనుసరించాల్సిన విధానాలు, ఎరువులు, పురుగుమందుల తయారీపై తర్ఫీదు ఇస్తారు. పంట దిగుబడిపై అధిక ప్రభావం చూపే విత్తనాల ఎంపిక, అధిక దిగుబడినిచ్చే విత్తనాభివృధ్ధి, భూసార పరీక్షలపై కుడా రైతాంగానికి సలహాలు, సూచనలు అందిస్తారు. వ్యవసాయాధికారులు శాస్త్రీయంగా ఫలితాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ రైతులకు తగిన సూచనలు చేస్తారు. విస్తీర్ణానికి అనుగుణంగా మొక్కల సాంద్రత పాటించకపోవటం వల్ల పంట దిగుబడిపై అధిక ప్రభావం చూపుతుండటంతో, దీనిపై రైతులకు అవగాహన పెంచనున్నారు.
లబ్ధిదారులను గుర్తిస్తున్నాం
‘మిషన్ ప్రాజెక్టు టూ బూస్ట్ ప్రొడక్టివిటీ’ క్రింద వర్షాధార ప్రాంతాల్లో ఉత్పాదకతను పెంపొందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందించాం. ఎనిమిది గ్రామాల్లో దాదాపు 500 మంది లబ్ధిదారులను గుర్తిస్తున్నాం. ఈ పథకం ద్వారా ఆ రైతులకు సమగ్ర సస్యరక్షణపై శిక్షణ, రాయితీపై ఎరువులు, పురుగుమందులు అందిస్తాం. అంతేకాక జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి అనుసంధానం చేయాలని కూడా యోచిస్తున్నారు.
- శ్రీనివాసరావు, బాపులపాడు మండల వ్యవసాయాధికారి