సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చిన్న నీటి వనరులుగా ఉన్న చెరువుల కింద సాగు విస్తీర్ణం గత ఏడాది రబీతో పోలిస్తే కాస్త తగ్గే అవకాశం కనిపిస్తోంది. గడిచిన పదేళ్లలో ఎన్నడూ లేనంతగా రబీలో గత ఏడాది చెరువుల కింద సాగు 7.25 లక్షల ఎకరాలు దాటగా, ఈ ఏడాది 5.16 లక్షల ఎకరాల వరకు ఉండనుంది. మిషన్ కాకతీయ కింద మూడు విడతల్లో 22,895 చెరువులను పునరుద్ధరించినా, లోటు వర్షపాతం కారణంగా చెరువుల్లో నీరు చేరకపోవడం ఆయకట్టును ప్రభావితం చేయనుంది.
పదేళ్లతో పోలిస్తే.. ఆశాజనకమే..
రాష్ట్రంలో మొత్తంగా 46,531 చెరువులు ఉండగా, వాటి కింద 24,39,515 ఎకరాల మేర సాగు విస్తీర్ణం ఉంది. కృష్ణా, గోదావరిలో కలిపి 255 టీఎంసీల మేర కేటాయింపులున్నాయి. అయినప్పటికీ పూర్తి స్థాయిలో నీటి వినియోగం జరగకపోవడంతో గరిష్టంగా 10 లక్షలకు మించి ఆయకట్టుకు నీరందించిన సందర్భాలు లేవు. 2008–09 ఏడాది నుంచి ప్రస్తుతం వరకు ఖరీఫ్, రబీ సీజన్‌ల వారీగా చూస్తే గరిష్టంగా 2013–14 ఖరీఫ్‌లో 9,04,752 ఎకరాల్లో సాగు జరిగింది. గత సంవత్సరం కంటే ముందు 2008–09లో గరిష్టంగా 2.38 లక్షల ఎకరాల్గో రబీ సాగు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. గత ఏడాది 2016–17లో విస్తారంగా వర్షాలు కురవడం, చెరువుల పునరుద్ధరణ రబీ సాగుకు ఊపిరి పోసింది. దీంతో గత ఏడాది రబీలో గరిష్టంగా 7.25 లక్షల ఎకరాల్లో సాగైంది. అయితే ఈ ఏడాది మొత్తం చెరువుల్లో 14,418 చెరువుల్లో 25శాతం కన్నా తక్కువగా నిండగా, మరో 9,289 చెరువుల్లో 25 నుంచి 50 శాతం వరకు మాత్రమే నిండాయి. రంగారెడ్డి జిల్లాలో 2,019 చెరువులు ఉండగా ఏకంగా 1,635 చెరువులు నీటి కరువు ఏర్పడింది.
పెద్దపల్లి జిల్లాలోనూ 1,185 చెరువులకు గానూ 1,070 చెరువుల్లో నీరు చేరలేదు. కృష్ణా బేసిన్‌లోని మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఇక కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలోకి పెద్దగా నీరు చేరని కారణంగా కూడా చెరువులను నింపడం సాధ్యం కాలేదు. అయినప్పటికీ మూడు విడతల్లో పునరుద్ధరించాలని తలపెట్టిన 22,895 చెరువుల్లో ప్రస్తుతం వరకు 15,649 చెరువుల పనులు పూర్తి కావడంతో వర్షాలు మెరుగ్గా ఉన్న చోట్ల నీటి లభ్యత కొంత పెరిగింది. దీంతో ఈ ఏడాది 5,16,097 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని అంచనా వేశారు. గత ఏడాదితో పోలిస్తే ఆయకట్టు తగ్గినా.. పదేళ్ల లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే మాత్రం ప్రస్తుతం చెరువుల ద్వారా సాగయ్యే ఆయకట్టు గణనీయంగా ఉండటం ఆయకట్టు ఆశలను సజీవం చేస్తోంది.
కాస్త తగ్గినా.. రబీ ఆశలు సజీవం!
Published Mon, Jan 1 2018 3:33 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement