ఖమ్మం వ్యవసాయం/వైరా : ప్రస్తుత తరుణంలో వరిని సంప్రదాయ పద్ధతిలో సాగు చేసి నీటి వనరుల కోసం ఎదురు చూడడం కంటే ప్రత్యామ్నాయ పద్ధతుల్లో సాగు చేస్తే ఎంతో మేలు కలుగుతుంది. ఈ పద్ధతుల్లో నీటిని ఆదా చేయడంతో పాటు కూలీల సమస్యను అధిగమించి ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంది. వరి సాగులో రెండు రకాల ప్రత్యామ్నాయ పద్ధతులు ప్రాచుర్యంలో ఉన్నాయి. దమ్ములో విత్తనాలు వెదజల్లడం, డ్రమ్ సీడర్ ద్వారా సాగు చేయడం.
దమ్ములో వెదజల్లే పద్ధతి
ఈ పద్ధతిలో వరి సాగు చేసేందుకు విత్తన రకాన్ని బట్టి ఎకరాకు 12 నుంచి 16 కిలోల విత్తనాలు సరిపోతాయి. అలాగే పలు ప్రాంతాల్లోని రైతులు సన్న రకాలను కేవలం ఎకరానికి 7 నుంచి 8 కేజీల విత్తనాలను మాత్రమే వినియోగిస్తున్నారు.
విత్తన శుద్ధి
లీటరు నీటికి ఒక గ్రాము కార్బండిజమ్ కలిపి ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టిన తర్వాత 24 నుంచి 36 గంటల పాటు మండె కట్టి పొలంలో వెదజల్లాలి.
పొలం తయారీ విధానం
సాధారణ పద్ధతిలాగానే దమ్ము చేసి వీలైనంత భాగా పొలాన్ని చదును చేసుకోవాలి. విత్తనాలు విత్తే సమయంలో నీరు లేకుండా బురదగా ఉండేలా చూసుకోవాలి. ఇసుక శాతం అధికంగా ఉన్న నేలల్లో విత్తనాలు చల్లాలనుకున్న రోజు ఆఖరు దమ్ము చేసి చదును చేయాలి. దానిలో పలుచని నీటి పొర ఉండేలా చూసుకోవాలి. మట్టి పేరుకున్న తర్వాత బురద పదునులో ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల చొప్పున కాలువలు చేసి, ఎక్కువగా ఉన్న నీరు, మురుగునీరు బయటకు వెళ్లేలా ఏర్పాటు చేయాలి. సాధారణంగా వరి సాగు చేసే అన్ని నేలలకు ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది.
డ్రమ్ సీడర్‌తో వరిసాగు
డ్రమ్ సీడర్‌తో వరి విత్తడానికి ఎకరాకు 8 నుంచి 12 కిలోల విత్తనాలు సరిపోతాయి. పొలం తయారీ వెదజల్లే పద్ధతి మాదిరిగానే చేసుకోవాలి. మండె కట్టిన విత్తనాలను కేవలం ముక్కు పగిలి తెల్లపూత వచ్చిన తర్వాత డ్రమ్ సీడర్‌లో పోసి విత్తుకోవాలి. డ్రమ్ సీడర్‌కు 4 ప్లాస్టిక్ డ్రమ్‌లు ఉంటాయి. ప్రతి డ్రమ్‌కు 20 సెం.మీ దూరంలో రెండు చివర్ల రంద్రాలు ఉంటాయి. ఈ డ్రమ్‌లో విత్తనాలను 3/4 వంతు నింపి డ్రమ్ సీడర్ లాగుతే 8 వరుసల్లో వరుసకు, వరుసకు మధ్య 20 సెం.మీ, కుదురుకు కుదురుకు మధ్య 5-8 సెం.మీ దూరంలో గింజలు పడుతాయి. ఈ పద్ధతిలో ఎకరం విత్తటానికి కేవలం ఇద్దరు సరిపోతారు. ఒక ఎకరం విత్తటానికి 2-3 గంటల సమయం సరిపోతుంది.
రెండు పద్ధతుల్లోనూ యాజమాన్యం ఇలా
కలుపు నివారణ...: నేరుగా గింజలను విత్తడం వల్ల కలుపు మొక్కులు కూడా వరి గింజలతో పాటు పెరుగుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కలుపు నివారణ మందును ఖచ్చితంగా వాడాలి. డ్రమ్ సీడర్ లాగినా, దమ్ములో విత్తనాలను వెదజల్లినా మూడు లేదా నాలుగో రోజు 80 గ్రాముల ఫైరజోసల్ఫ్యూరాన్ ఇథైల్ కలుపు మందును ఒక ఎకరం పొలంలో పిచికారీ చేయాలి. విత్తనాలను వేసిన 20 - 25 రోజులకు ఏ కారణం చేతనైనా వెడల్పాటి ఆకులు, సన్న ఆకు కలుపు ఉంటే ఎకరానికి 100 మి.లీ బిస్‌పైరీ బాక్ సోడియం పిచికారీ చేయాలి.
ఎరువుల యాజమాన్యం
సాధారణ పద్ధతిలో వరిసాగుకు సిఫార్సు చేసిన ఎరువుల మోతాదు సరిపోతుంది. దమ్ములో నత్రజని ఎరువులు వేయకుండా భాస్వరం ఎరువు మొత్తం, సగం పొటాష్ ఎరువులను వేయాలి. దమ్ములోకాని, విత్తేటప్పుడు కాని నత్రజని ఎరువులను వేస్తే కలుపు విపరీతంగా వస్తుంది. కనుక నత్రజని ఎరువులను మూడు సమభాగాలుగా చేసి విత్తిన 20, 40, 60 రోజుల్లో వేయాలి. మూడవ దఫాగా వేసే నత్రజని ఎరువుతో పాటు మిగిలిన సగభాగం పొటాష్ ఎరువును కూడా వేయాలి.
నీటి యాజమాన్యం
పొలంలో విత్తనం వేసినప్పటి నుంచి పొట్ట దశ వరకు పొలం తడిగా ఉండాలి. నీరు ఎక్కువయితే బయటకు పోవడానికి కాల్వలు ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల వేర్లు ఆరోగ్యవంతంగా పెరిగి మొక్కలు ఎక్కువ పిలకలు పెడతాయి. పైరు పొట్ట దశ నుంచి గింజ గట్టిపడే వరకు పొలంలో 5 సెం.మీ నీరు నిల్వ ఉండేలా చూసుకోవాలి. కోతకు 10 రోజుల ముందు నుంచి నెమ్మదిగా తగ్గించాలి. పురుగులు, తెగుళ్ల యాజమాన్యం సాధారణ పద్ధతిలో మాదిరిగానే చేపడితే సరిపోతుంది. సాధారణం కంటే పంట 7-10 రోజులు ముందుగా కోతకు వస్తుంది.
ఖర్చు తగ్గుతుంది
వరి సాగులో ఈ పద్ధతులు అనుసరించడం వల్ల ఖర్చు తగ్గుతుంది. వరి నాటు మొదలుకుని కోత వరకు ఎకరానికి రూ. 2500 నుంచి రూ. 3000 వరకు ఖర్చు తగ్గుతుంది. జిల్లాలో గత ఏడాది ఈ విధానాలను దాదాపు 40 వేల ఎకరాల్లో అనుసరించి మంచి దిగుబడులు సాధించినట్లు వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఈ విధానాలను అనుసరించ వచ్చునని శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సూచనలు చేస్తున్నారు.
వరిలో ప్రత్యామ్నాయమే మేలు
Published Thu, Aug 21 2014 3:11 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement