గాడిదల నుంచి శీతాకాలంలో ఎక్కువగా పాల ఉత్పత్తి
తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్న గాడిదల పెంపకం దారులు
రాష్ట్రమంతా విస్తరించి పాలు విక్రయిస్తున్న కుటుంబాలు
ఇంటింటి వచ్చి కళ్లముందే పొదుగు నుంచి తీసిస్తున్న వ్యాపారులు
సాక్షి, అమరావతి: ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’ అనే వేమన పద్యం ఇప్పుడు ‘గరిటెడైనను చాలు.. గాడిద పాలు’ అని రూపుమార్చుకుంది. ప్రస్తుత తరుణంలో కొన్ని వస్తువులకు, ఆహార పదార్థాలకు ఆదరణ అనూహ్యంగా పెరిగింది. అందులో భాగంగానే గాడిద పాలకు డిమాండ్ ఏర్పడింది. అయితే, గాడిద పాలు దొరకడం కష్టం. ఎక్కడోగానీ.. ఎవరికో గానీ గాడిదలు అందుబాటులో ఉండవు. ఈ పరిస్థితుల్లో ఇటీవల వీధుల్లోకి అప్పుడప్పుడు గాడిదల్ని తీసుకొచ్చి మన కళ్లముందే గాడిద పాలు పితికి ఇస్తున్నారు.
తెలంగాణ నుంచి వచ్చి..
తెలంగాణ నుంచి గాడిదలను కొన్ని కుటుంబాల వారు ఏపీకి తీసుకువస్తున్నారు. జూలైలోనే ఇక్కడికి జనవరి వరకూ ఇళ్లను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇక్కడే గాడిదలను పెంచుతున్నారు. శీతాకాలం వచ్చేసరికి గాడిదలు పిల్లల్ని కంటాయి. ఈ కాలంలోనే పాలనూ ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. తెలంగాణ నుంచి వచ్చిన వారంతా పాడి గాడిదను ఊరంతా తిప్పుతూ ఇంటింటికీ పాలను విక్రయిస్తుంటారు. రోజుకి మూడు కప్పులు చొప్పున మూడు రోజుల పాటు గాడిద పాలు తాగితే ఆరోగ్య సమస్యలు తొలిగిపోతాయని వీరు ప్రచారం చేస్తున్నారు.
15 మిల్లీలీటర్లు.. రూ.100
కేవలం 15 మిల్లీలీటర్లు (అర టీ కప్పు) గాడిద పాల ధర రూ.100 పలుకుతోంది. ఇళ్ల వద్దకు వచ్చే పాల విక్రయదారులు ముందుగా రూ.300 వరకూ ధర చెబుతున్నారు. బేరమాడితే రూ.100 నుంచి రూ.200 వరకూ తగ్గించి ఇస్తున్నారు. ఈ లెక్కన లీటరు గాడిద పాల ధర కనీసం రూ.7 వేలు వరకూ ఉంటోంది. అయితే ఇందుకోసం ఒక గాడిదను, దూడను పోషించడానికి ఏటా రూ.80 వేలు ఖర్చవుతుందని పెంపెకందారులు చెబుతున్నారు.
ఎందుకంత డిమాండ్
ఒక గాడిద రోజుకు అర లీటర్ నుంచి 1.30 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. తల్లి పాలలో ఉన్నట్టుగానే గాడిద పాలలోనూ పుష్కలంగా విటమిన్లు (ఏ, బీ1, బీ5, బీ6, బీ12, ఫోలిక్ ఆమ్లం) ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. చర్మ సౌందర్యానికి, శిశు పోషణ కోసం పూర్వం నుంచీ గాడిద పాలను వాడటమేనేది ఉంది. ఊపిరితిత్తుల్లో నిమ్ము, ఆయాసం, కఫం, జలుబు వంటి వాటికి గాడిద పాలు ఔషధంగా పనిచేస్తాయని నమ్ముతుంటారు. దీంతో గాడిద పాల వ్యాపారం బాగా జరుగుతోంది.
రోజుకి రూ.2 వేల సంపాదన
మాది తెలంగాణలోని మంచిర్యాల. మా తాత ముత్తాతల నుంచీ గాడిదలను పెంచడం, పాలను విక్రయించడం మా వృత్తి. 10 కుటుంబాల వాళ్లం ఏటా పిల్లాపాపలతో కలిసి గాడిదలను తీసుకుని ఏపీకి వస్తాం. స్థానికంగా ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటాం. ఇక్కడి ప్రధాన నగరాలు, పట్టణాల్లో గాడిద పాలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. బొంబాయ్ కాలనీలో ఉంటూ విజయవాడ వీధుల్లో పాలు విక్రయిస్తున్నాం. రోజుకి ఒక్కో గాడిద పాల ద్వారా రూ.2 వేల వరకూ ఆదాయం వస్తుంది. పిల్లలు పాఠశాలలకు వెళ్లే సమయానికంటే ముందే ఇళ్లకే వెళ్లి పాలు విక్రయిస్తుంటాం. అప్పుడే వ్యాపారం బాగుంటుంది. – జె.మహేష్, గాడిద పాల వ్యాపారి
Comments
Please login to add a commentAdd a comment