సాక్షి, అమరావతి: పాల సేకరణ, విక్రయాల్లో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాల సేకరణ (రైతు రక్షణ), నాణ్యమైన పాల వినియోగ చట్టం–2023 అమలుకు రంగం సిద్ధమైంది. చట్టం అమలుకు అవసరమైన ఎస్‌ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపకల్పన చేసింది. నియమ, నిబంధనలతో ఇటీవలే అధికారిక గెజిట్‌లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
రాష్ట్రంలో ప్రతిరోజు 4.12 కోట్ల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. స్థానికంగా 1.42 కోట్ల లీటర్ల పాలు వినియోగమవుతుండగా, ఆర్గనైజ్డ్ డెయిరీలు 21.6 లక్షల లీటర్లు, ప్రైవేటు డెయిరీలు 47.6 లక్షల లీటర్లు సేకరిస్తున్నాయి. మిగిలిన పాలు వివిధ రూపాల్లో మార్కెట్‌కి వస్తుంటాయి. పాల సేకరణలో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు తూనికలు–కొలతల చట్టం ప్రకారం తనిఖీ చేసే అధికారాలను స్థానిక పశు వైద్యులకు అప్పగించారు.
అయితే మోసాలకు పాల్పడినట్టు నిర్ధారణ జరిగినప్పుడు మిల్క్ ఎనలైజర్స్, ఇతర పరికరాలను సీజ్ చేయడం, బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం లేకపోవడంతో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెత్తేవి. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ దేశంలోనే తొలిసారి పటిష్టమైన పాలసేకరణ, నాణ్యమైన పాల వినియోగ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
చట్టం అమలు బాధ్యత వీరిదే..
చట్టం అమలు, పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో మిల్క్ కమిషనర్‌గా, కార్యనిర్వాహక అధికారిగా పశుసంవర్ధక శాఖ సంచాలకులు వ్యవహరించనుండగా, జిల్లా స్థాయిలో ఆథరైజ్డ్ ఆఫీసర్స్‌గా జిల్లా పశుసంవర్ధక శాఖాధికారులు, మిల్క్ ఇన్‌స్పెక్టర్లుగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్, ఏవీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్లు వ్యవహరించనున్నారు. వీరు చట్టప్రకారం మిల్క్ ఎనలైజర్స్‌తో పాటు పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు పనిచేసేలా పర్యవేక్షిస్తారు.
పాలనాణ్యత పాటించకపోతే ఫుడ్ సేఫ్టీ, నాణ్యత ప్రమాణాల యాక్టు 2006 ప్రకారం చర్యలు తీసుకుంటారు. పాలల్లో ఫ్యాట్, ఎస్‌ఎన్‌ఎఫ్ శాతాన్ని బట్టి నిర్దేశించిన రేటు చార్ట్ ప్రకారం పాడి రైతుకు మద్దతు ధర దక్కేలా పర్యవేక్షిస్తారు. ఇందుకోసం సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. చట్టం అమలుపై రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసిన రిసోర్స్ పర్సన్స్‌కు ఇటీవలే శిక్షణ కూడా పూర్తి చేశారు. వీరి ద్వారా మండల స్థాయిలో మిల్క్ ఇన్‌స్పెక్టర్లుగా వ్యవహరించనున్న అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు.
మిల్క్ ఎనలైజర్స్‌కు లైసెన్సింగ్ తప్పనిసరి
మిల్క్ ఎనలైజర్స్ కలిగి ఉన్న వారు రూ.1,000 చెల్లించి సంబంధిత ఆథరైజ్డ్ అధికారి నుంచి లైసెన్సు పొందాలి. ఆ తర్వాత ఏటా లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలి. అదే తయారీ దారులు, డీలర్లు ప్రతీ 2 ఏళ్లకోసారి రూ. 2 లక్షలు చెల్లించి మిల్క్ కమిషనర్ ద్వారా లైసెన్సు పొందాల్సి ఉంటుంది. లైసెన్స్ పొందిన తర్వాత మిల్క్ ఎనలైజర్స్‌ను 30 రోజులలోపు వారి పరిధిలోని మిల్క్ ఇన్‌స్పెక్టర్ వద్ద రూ. 500 చెల్లించి కనీసం ఏడాది పాటు చెల్లుబాటు అయ్యేలా వెరిఫికేషన్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. మిల్క్ ఎనలైజర్ లైసెన్స్, వెరిఫికేషన్ సర్టిఫికెట్‌ను పాలసేకరణ కేంద్రంలో ప్రదర్శించాలి. రికార్డులు, రిజిష్టర్లు విధిగా నిర్వహించాలి.
క్రమం తప్పకుండా తనిఖీలు..
చట్టం ప్రకారం మిల్క్ ఇన్‌స్పెక్టర్లు.. పాల సేకరణ కేంద్రాలు, డెయిరీల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహిస్తారు. తేడా ఉన్నట్టుగా గుర్తిస్తే జరిమానా, లైసెన్సు రద్దు, కేసుల నమోదు వంటి చర్యలు తీసుకుంటారు. కల్తీ జరిగినట్టు గుర్తిస్తే తగిన చర్యల కోసం ఆహార భద్రత అధికారికి సమాచారమిస్తారు. మిల్క్ యూనియన్, డెయిరీ నిర్ధారించిన రేట్ చార్జి ప్రకారం పాలుపోసే వారికి పాలసేకరణ ధర చెల్లిస్తున్నదీ లేనిదీ కూడా పరిశీలిస్తారు. జిల్లా స్థాయిలో ఆథరైజ్డ్ అధికారిగా వ్యవహరించే అధికారులు ఈ మిల్క్ ఇన్‌స్పెక్టర్ల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. మోసాలు, కల్తీలు జరిగినట్టుగా గుర్తిస్తే సంబంధిత రికార్డులు సహా ఆయా యూనిట్లను సీజ్ చేస్తారు. శిక్షార్హమైన నేరాలకు చట్టం ప్రకారం జరిమానాలు, కారాగార శిక్షలు విధిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment