![Woman Releases Video On Janasena Kiran Royal Fraud](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/phonetaping1.jpg.webp?itok=HaMLn-sm)
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి జనసేన పార్టీ ఇన్‌చార్జి కిరణ్‌రాయల్ మోసాన్ని వివరిస్తూ ఓ మహిళ విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది. కిరణ్‌రాయల్ తనను బెదిరించి.. రూ.కోటికిపైగా నగదు, 25 సవర్ల బంగారం కాజేసి ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశాడని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ లక్ష్మి అనే మహిళ మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమె ఏం చెప్పిందంటే.. ‘నా పేరు లక్ష్మి. నేను ఒకర్ని నమ్మి మోసపోయాను. అప్పులు చేసి రూ.1.20 కోట్లు ఇచ్చాను. డబ్బులు అడిగితే పిల్లల్ని చంపుతానని బెదిరించి.. ఇంకా ఎన్నో చేసి నాతో వీడియో రికార్డు చేయించుకున్నారు.
కేవలం రూ.30 లక్షలకు బాండ్లు, చెక్కులు రాయించాడు. నా వద్ద అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. పిల్లలు అడుగుతున్నారు. వారికి సమాధానం చెప్పలేకపోతున్నాను. ఇంక నేను బతకలేను. కిరణ్ రాయల్ వల్లే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు మా పిల్లలకు చెందుతాయని ఆశిస్తున్నాను’ అంటూ మహిళ వాపోయింది. శనివారం ఆ వీడియో బయటకు రాగా.. వెంటనే స్పందించిన కిరణ్ రాయల్ ఆమెకు ఫోన్‌చేసి నానా బూతులు తిడుతూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగినట్టు ఆ మహిళ కిరణ్‌రాయల్ వాయిస్ రికార్డును విడుదల చేశారు. వీడియో వైరల్ అయ్యాక కిరణ్‌రాయల్ మీడియా సమావేశం నిర్వహించి.. ఆమె కిలాడి లేడీ అని, బెట్టింగ్‌ల కారణంగా అప్పుల పాలైందని, ఆ కుటుంబాన్ని తానే రక్షించానని చెప్పుకొచ్చారు.
బాధితురాలు ఏమంటోందంటే..
తిరుపతి మండలం చిగురువాడకు చెందిన లక్ష్మి ప్రస్తుతం తిరుపతి ఎంఆర్ పల్లిలో నివాసం ఉంటోంది. చిగురువాడలో ఉండే సమయంలో కిరణ్‌రాయల్ తన నివాసం పక్కనే వచ్చి చేరాడని లక్ష్మి చెబుతోంది. తనతో ఉన్న పరిచయం మేరకు డబ్బులు అడిగేవాడని.. కిరణ్ రాయల్ వాడుతున్న కారు, ఇంటికి కూడా తాను అప్పులు చేసి కొంత, ఎకరం భూమిని అమ్మి మరికొంత డబ్బులు ఇచ్చినట్టు తెలిపింది. మొత్తంగా రూ.1.20 కోట్లు, 25 సవర్ల బంగారు ఆభరణాలు ఇచ్చినట్టు వివరించింది. ఈ విషయం తెలియడంతో భర్త, కుటుంబీకులు నిలదీయగా.. తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేసినట్టు లక్ష్మి వెల్లడించింది.
భర్త మరణించాక పిల్లల చదువులు, కుటుంబ పోషణకు డబ్బులు అడిగినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన డబ్బుకు రెండింతలు ఇస్తానని.. మూడు నెలలు ఆగమని ఒప్పించినట్టు తెలిపింది. ఆ తరువాత డబ్బు అడుగుతుంటే.. రూ.30 లక్షలకు బాండు పేపర్లు, చెక్కులు ఇచ్చారని చెప్పింది. అప్పుల వాళ్ల ఒత్తిళ్లు తీవ్రం కావడం, కుటుంబంలో తీవ్ర ఇబ్బందులు రావటంతో కిరణ్ రాయల్‌కి ఫోన్‌చేసి గట్టిగా మాట్లాడినట్టు తెలిపింది. అయినా అతడి బెదిరింపులు తారస్థాయికి చేరటంతో వీడియో రిలీజ్‌చేసి ఆత్మహత్యకు యత్నించినట్టు వివరించింది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/1_57.png)
బూతులు తిడుతూ..
వీడియో వైరల్ కావడంతో జనసేన నేత కిరణ్‌రాయల్ మీడియాతో మాట్లాడుతూ.. లక్ష్మి కిలాడి లేడీ అని, ఆమెపై జైపూర్, విశాఖ, బెంగళూరులో కేసులు ఉన్నాయని ఆరోపించారు. బెట్టింగ్‌లు, రకరకాల వ్యవసనాలతో ఆమె అప్పులు పాలైందని, ఆ కారణంగానే లక్ష్మిని తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేస్తే తానే విడిపించానని చెప్పారు. కాగా.. వీడియో వైరల్ అయిన వెంటనే.. కిరణ్ రాయల్ లక్ష్మికి ఫోన్‌చేసి నానాబూతులు తిడుతూ.. చంపేస్తానని, ఆ తరువాత నెలలో బయటకు వస్తానంటూ తీవ్రస్థాయిలో బెదిరించిన వాయిస్‌ను లక్ష్మి మీడియా ముందు వినిపించారు.
తన కార్యాలయానికి వచ్చి బెదిరించి వెళ్లిన వీడియోలను కూడా మీడియాకు చూపించారు. తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వారం కాదని, తనకు శత్రువులు లేరని, ఏదైనా జరిగితే కిరణ్‌రాయల్ వల్లే అని లక్ష్మి మీడియా ముందు వెల్లడించారు. కిరణ్ రాయల్ అరాచకాలకు సంబంధించిన ప్రతి దానికి ఆధారాలు తన వద్ద ఉన్నాయని వివరించారు. కిరణ్‌రాయల్ తనకు ఫోన్‌చేసి మాట్లాడిన మాటలకు సంబంధించి 10 వాయిస్ రికార్డులను లక్ష్మి విడుదల చేశారు. ఆ వాయిస్‌లో పత్రికలో రాయలేని విధంగా బూతులు మాట్లాడుతూ.. చంపేస్తానంటూ బెదిరించిన రికార్డులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment