
మూడేళ్లలో 72 లక్షల ఘటనల్లో రూ.11,185 కోట్ల మోసాలు
‘సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్’తో ఫలితాలు
13.36 లక్షల ఫిర్యాదులతో రూ.4,386 కోట్లు ఆదా
రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
సాక్షి, అమరావతి: దేశంలో డిజిటల్ చెల్లింపులతో పాటే డిజిటల్ ఆర్ధిక మోసాలు పెరుగుతున్నాయని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఏడాది జనవరి 25 వరకు 72.05 లక్షల ఘటనల్లో రూ.11,185 కోట్ల మేర ఆర్ధిక మోసాలు జరిగినట్లు మంగళవారం రాజ్యసభలో వెల్లడించింది. వెబ్ ఆధారిత చెల్లింపు మోసాల నివేదన, పరిష్కరించేందుకు రిజర్వ్ బ్యాంక్.. సెంట్రల్ పేమెంట్స్ ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రీని అమలు చేసిందని తెలిపింది.
కాజేసిన డబ్బు మోసగాళ్ల పరం కాకుండా ఆపేందుకు ‘సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్–మేనేజ్‌మెంట్ సిస్టమ్’ను ప్రారంభించినట్లు వివరించింది. దీనిద్వారా 13.36 లక్షల ఫిర్యాదుల్లో రూ.4,386 కోట్లు ఆదా చూసినట్లు తెలిపింది. డిజిటల్ చెల్లింపు భద్రతా నియంత్రణలపై ఆర్‌బీఐ ఎప్పటికప్పుడు మార్గదర్శకాలను జారీ చేస్తోందని.. బ్యాంకులు ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, కార్డు చెల్లింపులు మొదలైన వివిధ మార్గాలకు కనీస భద్రతా నియంత్రణలను అమలు చేయాలని ఆదేశించినట్లు పేర్కొంది.
మోసాల గుర్తింపునకు కృత్రిమ మేధ ఆధారిత టూల్‌ను వినియోగించాల్సిందిగా బ్యాంకులు, ఆర్ధిక సంస్థలకు సూచించినట్లు చెప్పింది. ఎలక్ట్రానిక్–బ్యాంకింగ్ కార్యకలాపాలపై అవగాహన, శిక్షణ కార్యక్రమాల ద్వారా మోసాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment