milk production
-
గరిటెడైనను చాలు.. గాడిద పాలు
సాక్షి, అమరావతి: ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’ అనే వేమన పద్యం ఇప్పుడు ‘గరిటెడైనను చాలు.. గాడిద పాలు’ అని రూపుమార్చుకుంది. ప్రస్తుత తరుణంలో కొన్ని వస్తువులకు, ఆహార పదార్థాలకు ఆదరణ అనూహ్యంగా పెరిగింది. అందులో భాగంగానే గాడిద పాలకు డిమాండ్ ఏర్పడింది. అయితే, గాడిద పాలు దొరకడం కష్టం. ఎక్కడోగానీ.. ఎవరికో గానీ గాడిదలు అందుబాటులో ఉండవు. ఈ పరిస్థితుల్లో ఇటీవల వీధుల్లోకి అప్పుడప్పుడు గాడిదల్ని తీసుకొచ్చి మన కళ్లముందే గాడిద పాలు పితికి ఇస్తున్నారు.తెలంగాణ నుంచి వచ్చి..తెలంగాణ నుంచి గాడిదలను కొన్ని కుటుంబాల వారు ఏపీకి తీసుకువస్తున్నారు. జూలైలోనే ఇక్కడికి జనవరి వరకూ ఇళ్లను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇక్కడే గాడిదలను పెంచుతున్నారు. శీతాకాలం వచ్చేసరికి గాడిదలు పిల్లల్ని కంటాయి. ఈ కాలంలోనే పాలనూ ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. తెలంగాణ నుంచి వచ్చిన వారంతా పాడి గాడిదను ఊరంతా తిప్పుతూ ఇంటింటికీ పాలను విక్రయిస్తుంటారు. రోజుకి మూడు కప్పులు చొప్పున మూడు రోజుల పాటు గాడిద పాలు తాగితే ఆరోగ్య సమస్యలు తొలిగిపోతాయని వీరు ప్రచారం చేస్తున్నారు.15 మిల్లీలీటర్లు.. రూ.100కేవలం 15 మిల్లీలీటర్లు (అర టీ కప్పు) గాడిద పాల ధర రూ.100 పలుకుతోంది. ఇళ్ల వద్దకు వచ్చే పాల విక్రయదారులు ముందుగా రూ.300 వరకూ ధర చెబుతున్నారు. బేరమాడితే రూ.100 నుంచి రూ.200 వరకూ తగ్గించి ఇస్తున్నారు. ఈ లెక్కన లీటరు గాడిద పాల ధర కనీసం రూ.7 వేలు వరకూ ఉంటోంది. అయితే ఇందుకోసం ఒక గాడిదను, దూడను పోషించడానికి ఏటా రూ.80 వేలు ఖర్చవుతుందని పెంపెకందారులు చెబుతున్నారు.ఎందుకంత డిమాండ్ఒక గాడిద రోజుకు అర లీటర్ నుంచి 1.30 లీటర్ల వరకు పాలు ఇస్తుంది. తల్లి పాలలో ఉన్నట్టుగానే గాడిద పాలలోనూ పుష్కలంగా విటమిన్లు (ఏ, బీ1, బీ5, బీ6, బీ12, ఫోలిక్ ఆమ్లం) ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. చర్మ సౌందర్యానికి, శిశు పోషణ కోసం పూర్వం నుంచీ గాడిద పాలను వాడటమేనేది ఉంది. ఊపిరితిత్తుల్లో నిమ్ము, ఆయాసం, కఫం, జలుబు వంటి వాటికి గాడిద పాలు ఔషధంగా పనిచేస్తాయని నమ్ముతుంటారు. దీంతో గాడిద పాల వ్యాపారం బాగా జరుగుతోంది.రోజుకి రూ.2 వేల సంపాదన మాది తెలంగాణలోని మంచిర్యాల. మా తాత ముత్తాతల నుంచీ గాడిదలను పెంచడం, పాలను విక్రయించడం మా వృత్తి. 10 కుటుంబాల వాళ్లం ఏటా పిల్లాపాపలతో కలిసి గాడిదలను తీసుకుని ఏపీకి వస్తాం. స్థానికంగా ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటాం. ఇక్కడి ప్రధాన నగరాలు, పట్టణాల్లో గాడిద పాలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. బొంబాయ్ కాలనీలో ఉంటూ విజయవాడ వీధుల్లో పాలు విక్రయిస్తున్నాం. రోజుకి ఒక్కో గాడిద పాల ద్వారా రూ.2 వేల వరకూ ఆదాయం వస్తుంది. పిల్లలు పాఠశాలలకు వెళ్లే సమయానికంటే ముందే ఇళ్లకే వెళ్లి పాలు విక్రయిస్తుంటాం. అప్పుడే వ్యాపారం బాగుంటుంది. – జె.మహేష్, గాడిద పాల వ్యాపారి -
Ethnoveterinary medicine 90% కేసుల్లో యాంటీబయాటిక్స్ అవసరం లేదు
పశువైద్యంలో సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఎత్నోవెటర్నరీ ప్రాక్టీసెస్ –ఈవీపీల) ద్వారా యాంటీబయాటిక్స్ వాడకాన్ని 90% తగ్గించవచ్చంటున్నారు తమిళనాడుకు చెందిన విశ్రాంత పశువైద్య ఆచార్యుడు డా. ఎన్. పుణ్యస్వామి. గత 20 ఏళ్లుగా సంప్రదాయ పశువైద్యంపై ఆయన పరిశోధనలు చేస్తున్నారు. ఈ చికిత్సలు పొదుగువాపు సహా 42 పశువ్యాధులను 3–5 రోజుల్లో 90% ఖచ్చితత్వంతో తగ్గిస్తున్నాయని రుజువైంది. జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ (ఎన్.డి.డి.బి) దేశవ్యాప్తంగా వీటిని పశువైద్యంలో భాగం చేసింది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎ.ఎం.ఆర్.) సమస్యను అధిగమించాలన్నా, యాంటిబయాటిక్స్‌ను రక్షించుకోవాలన్నా సంప్రదాయ పశువైద్యమే మేలైన మార్గమని పుణ్యస్వామి స్పష్టం చేస్తున్నారు. రైతునేస్తం ఫౌండేషన్ ఇటీవల నిర్వహించిన ‘గోసంజీవని’ ఆంగ్ల పుస్తకావిష్కరణ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన పుణ్యస్వామితో ‘సాక్షి సాగుబడి’ ముచ్చటించింది. ముఖ్యాంశాలు. అల్లోపతి పశువైద్య శాస్త్రంలో ప్రొఫెసర్ అయిన మీ దృష్టి సంప్రదాయ ఆయుర్వేద పశు వైద్య (ఈవీపీ) పద్ధతుల వైపు ఎలా మళ్లింది?పశువైద్యానికి సంబంధించి ఇప్పుడున్న వ్యవస్థ అరకొరగా ఉందని నా అభిప్రాయం. ప్రతి పశువుకు ఆరోగ్య సేవలు అందాలి. వనరులు రైతులకు తక్కువ ఖర్చుతో పరిసరాల్లోనే అందుబాటులో ఉండాలి. చికిత్సకు పొందబోయే ఫలితంపై ఖచ్చితమైన అంచనా ఉండాలి. అల్లోపతి పశువైద్య వ్యవస్థలో ఇవి లోపించాయి. ఎంత ఖచ్చితంగా ఫలితం వస్తుందో చెప్పలేం. అందువల్లే ఆయుర్వేదం, సంప్రదాయ సిద్ధ వైద్య రీతులను 2001 నుంచి అధ్యయనం చేశా. 20 ఏళ్ల నుంచి ఈవీపీ పద్ధతులపై పనిచేస్తున్నాం. 42 పశువ్యాధులకు చికిత్సా పద్ధతులను అభివృద్ధి చేశాం. మేం సూచించిన ఇంట్లోని దినుసులతో రైతులే స్వయంగా ఈ మందులను తయారు చేసుకొని పశువైద్యం చేసుకుంటున్నారు. స్వల్ప ఖర్చుతోనే 3–5 రోజుల్లోనే 80–90% పశువ్యాధులు ఖచ్చితంగా తగ్గిపోతున్నాయి. ఇది శాస్త్రీయంగా నిర్థారణ అయిన సంప్రదాయ చికిత్స పద్ధతి. అందువల్లే ఈ సంప్రదాయ చికిత్సను జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ (ఎన్.డి.డి.బి.) అంగీకరించింది. 2016లో నన్ను సంప్రదించింది. అప్పటి నుంచి 12 రాష్ట్రాల్లో మిల్క్ యూనియన్లతో కలసి పనిచేస్తున్నాం. పశువైద్యులకు, పాడి రైతులకు శిక్షణ ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో ఈవీపి పద్ధతుల్లో పశువైద్యం జరుగుతోంది. పొదుగు వాపు నమ్మకంగా తగ్గిపోతుందా?తప్పకుండా తగ్గి΄ోతుంది. ఎన్.డి.డి.బి. పరిధిలో వేలాది రైతుల అనుభవాలే ఇందుకు నిదర్శనం. పొదుగు వాపు నుంచి గాంగ్రీన్ వరకు 10 రకాల పొదుగు సంబంధిత జబ్బులు వస్తుంటాయి. గాంగ్రీన్ మినహా మిగతా 9 రకాల పశువ్యాధులను 3–5 రోజుల్లోనే ఈవీపీ వైద్యం ద్వారా సమర్థవంతంగా 85–90% కేసుల్లో శాశ్వతంగా తగ్గించవచ్చని నిరూపితమైంది. నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ ఆధ్వర్యంలో సిక్కింలో డాక్టర్లకు శిక్షణ ఇచ్చాం. బీహార్‌లో పశు సఖిలకు శిక్షణ ఇచ్చాం. భారత ప్రభుత్వం కూడా ఎత్నో వెటరినరీ జ్ఞానాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావటం ప్రారంభించింది. పశువైద్యంలో డిగ్రీ కోర్సు (బీవీఎస్సీ) సిలబస్‌లోకి ప్రభుత్వం చేర్చింది.అంతర్జాతీయంగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్(ఎఎంఆర్) సమస్యను పరిష్కరించేందుకు ఈవీపీ చికిత్సలు ఉపయోగ పడతాయా?ప్రపంచవ్యాప్తంగా అందరూ యాంటీబయాటిక్ ఔషధాలను పశువైద్యంలో తగ్గించా లంటున్నారు. అయితే, వీటికి ప్రత్యామ్నాయ మందుల్ని సూచించలేక΄ోతున్నారు. ఇండియాకున్న బలమైన సంప్రదాయ విజ్ఞానం పెద్ద ఆస్థి. ఈవీపీ పద్ధతుల ఉగాండా, ఇథియోపియాలో రైతులకు శిక్షణ ఇచ్చాం. అమలు చేయటం సులభం కాబట్టి ఆయా దేశాల్లో రైతులు సత్ఫలితాలు సాధించారు. నెదర్లాండ్స్ దేశంతో, వాగనింగన్ విశ్వవిద్యాలయంతో కలసి పనిచేస్తున్నాం. అక్కడి పశువైద్యులకు శిక్షణ ఇచ్చాం. ఆహార వ్యవసాయ సంస్థ (యు.ఎన్. ఎఫ్.ఎ.ఓ.) గుర్తించిందా? ఐక్యరాజ్యసమితికి చెందిన ఎఫ్.ఎ.ఓ. కేంద్ర పశుసంవర్థక శాఖతో కలసి ఇటీవలే ‘స్టాండర్డ్ వెటరినరీ ట్రీట్మెంట్ గైడ్‌లైన్స్’ను విడుదల చేసింది. ఇందులో కూడా ఈవీపీ సంప్రదాయ చికిత్సా పద్ధతులను చేర్చింది. అల్లోపతి పశువైద్య చికిత్సా పద్ధతి ఆధిపత్యం గురించో, మరో పద్ధతి ఆధిపత్యం నిరూపణ గురించో మనం మాట్లాడటం లేదు. ఒక జబ్బుకు చికిత్స అందించే సమయంలో పశువైద్యులకు, రైతులకు అనేక రకాల చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉండేలా చూడాలంటున్నాం. ఇప్పటికే అమల్లో ఉన్న అల్లోపతి పశువైద్య చికిత్సా పద్ధతిని తీసివేసి సంప్రదాయ మూలికా వైద్య పద్ధతులను ఆచరణలోకి తేవాలని మేం అనుకోవటం లేదు. ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకండి. నేనూ అల్లోపతి పశువైద్య శాస్త్రం చదువుకున్న వాడినే. రోగ నిర్థారణకు అల్లోపతి జ్ఞానాన్ని, చికిత్సకు సంప్రదాయ పద్ధతిని వాడుతూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం.యాంటీబయాటిక్స్ వాడకం తగ్గుతుందా? పొదుగు వాపు వ్యాధి చికిత్సలో కూడా 90% కేసులలో యాంటీబయాటిక్ మందులను వాడాల్సిన అవసరం లేదు. దూరంలో ఉన్న వైద్యులు టెలిమెడిసిన్ వ్యవస్థ ద్వారా పశువులకు సత్వర చికిత్సను అందించడానికి ఈవిఎం చికిత్సా పద్ధతులు ఎంతో అనువైనవి. ఇతర వైద్య పద్ధతుల్లో ఇది వీలు కాదు. రైతులు నేర్చుకొని, అవసరం వచ్చినప్పుడు తమంతట తాము ఆచరించదగిన గొప్ప పద్ధతి ఎత్నోవెటరినరీ మెడిసిన్. పశువులకు గాలికుంటు వ్యాధి (ఎఫ్.ఎం.డి.) వంటి అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఫోన్ ద్వారా రైతులకు సూచనలు ఇచ్చి చికిత్స చేయవచ్చు. 35–40 ఏళ్లలో ఏ ఒక్క కొత్త యాంటీ బయాటిక్‌ను తయారు చేసుకోలేకపోయాం. అదే సమయంలో మనుషుల చికిత్సకు వాడాల్సిన అనేక యాంటీ బయాటిక్స్‌ను పశు వైద్యంలో విస్తృతంగా వాడటంతో ఆ యాంటీబయాటిక్స్ రోగకారక క్రిముల నిరోధకత (మల్టిపుల్ డ్రగ్ రెసిస్టెన్స్)ను పెంపొందించు కున్నాయి. దీంతో ఆ యాంటీబయాటిక్స్ పనిచేయక మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. యాంటీబయాటిక్ ఔషధాలను మనం రక్షించుకోవాలి. యాంటీబయాటిక్ ఔషధాల జోలికి పోకుండానే పశువుల్లో జ్వరం, విరేచనాలు వంటి సాధారణ జబ్బులకు వైద్యం చేయటానికి ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులను ఆచరించాలి.దేశీ ఆవులు, సంకరజాతి ఆవులు, బర్రెలు అన్నిటికీ ఈ వైద్యం పనిచేస్తుందా?ఏ జాతి పశువులకైనా తప్పకుండా పనిచేస్తుంది. సంకరజాతి ఆవుల్లో మాదిరిగా అధిక పాలు ఇచ్చే సాహివాల్ ఆవుల్లోనూ పొదుగు సంబంధిత సమస్యలు ఎక్కువే. వీటన్నిటికీ ఈవీపీలో నమ్మదగిన పరిష్కారం ఉంది. కృష్ణా మిల్క్ యూనియన్‌లో పొడి రైతులు ఈవీపీల చికిత్స ద్వారా పొదుగువాపు తదితర జబ్బులతో పాటు వంధ్వత్వం వంటి సమస్యలను సైతం అధిగమించారు.కోళ్ల వ్యాధులకు కూడా..?కోళ్ల ఫారాల్లో కూడా ఈవీపీ చికిత్సలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. నేల ఉసిరి (భూమి ఆమ్ల), జిలకర్ర కలిపి నూరి, ఉండలు చేసి.. గంట గంటకు కొక్కెర సోకిన కోళ్లకు తినిపిస్తే 1–2 రోజుల్లోనే తగ్గిపోతుంది. ఇలా ఏ జాతి పశువులైనా, కోళ్లయినా, బాతులైనా.. వాటికి ఇతర ఔషధాల మాదిరిగానే ఈవిఎం మందులను కూడా తయారు చేసుకొని వాడుకోవచ్చు.అల్లోపతి పశువైద్య చికిత్సా పద్ధతిని తీసివేసి సంప్రదాయ మూలికా వైద్య పద్ధతులను ఆచరణలోకి తేవాలని మేం అనుకోవటం లేదు. ఒక జబ్బుకు చికిత్స అందించే సమయంలో పశువైద్యులకు, రైతులకు అనేక రకాల చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉండేలా చూడాలంటున్నాం. సేంద్రియ పాల ఉత్పత్తికి ఈవీపీలు దోహదం చేస్తాయా?నిస్సందేహంగా. అంతర్జాతీయంగా ఇటీవల ‘మెడిసినల్ అగ్రోఎకాలజీ’ భావన బలం పుంజుకుంటున్నది. పంటలనే కాదు పశువులను కూడా రసాయనాల్లేకుండా పెంచటమే ఇందులో ముఖ్యాంశం. (నవంబర్ 18 నుంచి ‘వరల్డ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వీక్’ సందర్భంగా..)నిర్వహణ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
పదేళ్లు.. రూ. 2 వేల కోట్ల వృద్ధి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత పశుసంపద గణనీయంగా వృద్ధి చెందిందని, వాటి విలువ దాదాపు రూ.2 వేల కోట్లు పెరిగిందని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ వెల్లడించింది. మాంసం, గుడ్లు, పాలు ఉత్పత్తుల్లోనూ రాష్ట్రం వృద్ధి సాధించిందని తెలిపింది. ఈ మేరకు ఒక నివేదిక విడుదల చేసింది. పశుసంపద, గుడ్లు, పాలు, మాంస ఉత్పత్తులకు సంబంధించిన గణాంకాలను ఇందులో పొందుపరిచింది.ఈ గణాంకాల ప్రకారం.. 2022–23 నాటికి తెలంగాణలో పశు సంపద విలువ రూ.4,789.09 కోట్లుగా నమోదైంది. అయితే రాష్ట్రం ఏర్పాటైన 2014–15లో ఇది రూ.2,824.57 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. కాగా గుడ్ల ఉత్పత్తిలోనూ రాష్ట్రం మంచి ఫలితాలను సాధించింది. 2014–15లో రూ. 228.97 కోట్ల విలువైన గుడ్లను తెలంగాణ ఉత్పత్తి చేస్తుండగా, 2022–23 నాటికి అది రూ.381.04 కోట్లకు చేరింది. ఇక మాంసం ఉత్పత్తుల విలువ పదేళ్ల కాలంలో గణనీయ వృద్ధి సాధించింది.2014–15లో అన్ని రకాల మాంసం ఉత్పత్తుల విలువ రూ.1,484.05 కోట్లు కాగా, 2022–23 నాటికి అది ఏకంగా రూ.5,531.85 కోట్లకు చేరింది. పశుసంపద గణనీయంగా పెరిగినప్పటికీ పాల ఉత్పత్తిలో మరింత వృద్ధి నమోదు కావలసి ఉందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. 2014–15లో రాష్ట్రం ఏర్పాటయ్యే నాటికి తెలంగాణలో పాల ఉత్పత్తి విలువ రూ.1,350.69 కోట్లు కాగా, 2022–23లో అది రూ.1,874.28 కోట్లకు మాత్రమే పెరిగినట్టు వెల్లడిస్తున్నాయి. -
పాలు అందరికీ అందుతున్నాయా?
అధికారిక డేటా ప్రకారం, దేశంలో పాల ఉత్పత్తి 2021–22లో 221 మిలియన్ టన్నులు. భారతదేశపు పాల ఉత్పత్తి మెజా రిటీ బర్రెల నుండి లభిస్తుండగా, ఆవు పాల వాటా పెరుగుతోంది. 2021 నాటికి ఆవు పాల వాటా 48.2%. 2019లో విడుదల చేసిన 20వ పశుగణన ప్రకారం, ఆవులు బర్రెలు, పాలు ఇచ్చేవి వట్టి పోయినవి కలిపి, దేశంలో మొత్తం పాడి పశువులు 12.57 కోట్లు. మునుపటి గణనమీద ఇది 6% పెరుగు దల. పాలు ఇచ్చే పశువుల సంఖ్య వేరుగా లేదు. వట్టి పోయిన పశువుల సంఖ్య పెరిగిందా, తగ్గిందా? పశువుల సంఖ్యలో పెరుగుదల ఎట్లా సాధ్యం? ప్రభుత్వం ఇస్తున్న లెక్కలకూ, క్షేత్ర పరిస్థితికీ మధ్య తేడా ఉన్నది. పలుచనవుతున్న పాలుదేశంలోని 110 బిలియన్ డాలర్ల పాడి పరిశ్రమలో డెయిరీ సహకార సంఘాలు, ప్రైవేట్ సంస్థలు, ‘అమూల్’, ‘మదర్ డెయిరీ’ వంటి ప్రభుత్వ సంస్థలతో కూడిన సంఘటిత రంగం వాటా కేవలం 30 బిలియన్ డాలర్లు. ఇది 30 శాతం కంటే తక్కువ. భారతదేశంలోని పాల ఉత్పత్తిలో సగానికి పైగా ప్రాసెస్ అవుతున్నది. అంటే నెయ్యి వగైరా వాటికి లేదా ఇతర ఉత్పత్తులలో ఒక ముడి పదార్థంగా వాడతారు. మిగిలిన 48% పాలుగా అమ్ముతున్నారు. నిత్యం పాలు వాడే హోటళ్ళు, స్వీట్ దుకాణాలలో పన్నీర్ కొరకు కూడా డిమాండ్ పెరుగుతోంది. పెద్ద హోటళ్ళు వాళ్ళకు అవసరమైన పాలను అధిక ధరకు కొని, వినియోగ దారుల నుంచి వసూలు చేయగలవు. దరిమిలా చిన్న హోటళ్ళు, చాయ్ దుకాణాలకు అంతగా పాలు దొరక కపోవచ్చు. లేదా ఆ ధర వాళ్ళు పెట్టలేరు. ముడి పాల కొరకు ఉన్న ఇటువంటి పోటీ గురించి, అంతర్గత డిమాండ్ గురించి, ఆ యా వినియోగ వర్గాలు చెల్లిస్తున్న ధరల గురించి విశ్లేషణలు లేవు. పోటీ పడలేని వ్యక్తులు, రంగాలు అసంఘటిత రంగంలోనే ఎక్కువ. పర్యవసానంగా, చాయ్ దుకాణాల చాయ్‌లో పాల ‘శాతం’ తగ్గుతున్నది. కొన్ని ఉత్పత్తులలో పాలు పలుచన అవుతున్నాయి.చిన్న పిల్లల ఎదుగుదలకు ముడి పాలు అవస రమని వైద్యులు, పోషకాహార నిపుణులు నిత్యం వల్లెవేస్తున్న తరుణంలో ‘అందరికీ పాలు’ దొరకక పోవడం అన్యాయమే. పేద వాడికి పాలు అందక పోవడం మన ఆహార వ్యవస్థలో ఉన్న తీవ్ర లోపం. ఈ లోపాన్ని సరిదిద్దే ప్రభుత్వ చర్యలు కావాలి. ఒక ఊర్లో ఉత్పత్తి అవుతున్న పాలు, ఇతర ఉత్పత్తులు అక్కడే, లేదా ఆ ప్రాంతంలోనే వినియోగం అయ్యే పరిస్థితులు ప్రభుత్వం కల్పించాలి.దిగుమతులతో దెబ్బతినే జీవనోపాధిఅమెరికా సహా వివిధ దేశాల నుంచి ఏటా రూ. 200–300 కోట్ల విలువైన పాల ఉత్పత్తులను మన దేశం దిగుమతి చేసుకుంటోంది. 2020లో భారత ప్రభుత్వం 10,000 టన్నుల స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌ను దిగుమతి చేసుకోవడానికి అనుమతించింది. 2023 జన వరిలో, దేశంలోకి పాలు, క్రీమ్ దిగుమతులు మునుపటి సంవత్సరం కంటే వెయ్యి శాతం పైగా పెరిగి 4.87 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ దిగుమతులు ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్ వంటి దేశాల నుండి వచ్చాయి.పాల ఉత్పత్తుల దిగుమతులను సరళీకృతం చేయా లని భారత్ మీద ఐరోపా కమ్యూనిటీ, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల నుంచి ఒత్తిడి ఉన్నది. డెయిరీ ఉత్పత్తుల దిగుమతుల మీద సుంకాలు తగ్గించాలని వాణిజ్య ఒప్పందాలలో భాగంగా చర్చలు జరుగుతున్నాయి. అదే సమయంలో భారతదేశం నుండి డెయిరీ దిగుమతులకు నిబంధనలు పెట్టి రష్యా, యూరప్, మెక్సికో, చైనా అనుమతించడం లేదు. డెయిరీ దిగుమతులపై 60–70% సుంకం విధిస్తున్న అమెరికా, భారతదేశం విధించే 30–60% సుంకాలను తగ్గించాలని కోరుతున్నది. ఇంకొక వైపు అమెరికా తన డెయిరీ రంగానికి సంవత్సరానికి 28 బిలియన్ డాలర్ల సబ్సి డీలను ఇస్తుంది. పాలు, పాల ఉత్పత్తుల దిగుమతులు పెరిగితే లక్షలాది మంది భారత చిన్న, సూక్ష్మ పాడి రైతుల జీవనోపాధి ఆగమైపోతుంది అనే ఆందోళన నెలకొంది.విధానాలు అనుకూలమేనా?ప్రపంచ పాల ఉత్పత్తిలో భారతదేశం వాటా 22%. జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఇది 5%. దాదాపు 7 కోట్ల మంది పాడి రైతులు ఉన్నారు. పాడి పరిశ్రమ జీవనోపాధులను, వాతావరణ మార్పులను, కులం, మతాలను వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుంది. వినియోగదారులు వివిధ రకాలగా పాలకు ధర చెల్లిస్తున్నారు. పంటల మాదిరే పాడి రైతుకు ఆ వినియోగం నుంచి వస్తున్న డబ్బులో ఎంత శాతం చేరుతున్నది అనే ప్రశ్న ఉన్నది. బర్రె మీద, ఆవుల మీద పెట్టాల్సిన ఖర్చుకు తగినట్టు ముడి పాలకు ధర లేదనీ, ఇంకా ఆదాయం సంగతి దేవుడెరుగు అనీ పాడి రైతులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు అనేకం ఉన్నాయి. అందులో అనేకం చిన్న పాడి రైతులు అందుకోలేరు. భారత పాడిపరిశ్రమలో సరళీకృత విధానం చిన్న రైతులకు ముప్పు కలిగిస్తుందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. పాడి రైతులకు భూమి దొరికే అవకాశం తగ్గిపోతున్నది. పట్టణాలలో, పట్టణ శివార్లలో భూమి ధరలకు రియల్ ఎస్టేట్ వలన రెక్కలు రావడం వల్ల చిన్న పాడి రైతు మనగలిగే పరి స్థితులు లేవు.సగటు రైతు ఆదాయం రూ. 7,000 అని ప్రభుత్వం అంటున్నది. పశుపోషణ ఉంటే అదనపు ఆదాయం వస్తుంది. దేశంలోని రైతులు తమ మొత్తం పశుపోషణ ఆదాయంలో దాదాపు 67% పాడి ద్వారా సంపా దిస్తున్నారు. ఇంకా అనేక రకాల ఉపయోగం పాడి పశువులతో ఉంది. పర్యావరణం వినాశనం అవుతున్న తరుణంలో పశువుల వైవిధ్యం, ఆహారం, సుస్థిర జీవనం మీద దృష్టి పెట్టడం ముఖ్యం. పుడమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో పశు పోషణ ఇంకా సమస్యాత్మకంగా మారుతున్నది. హైబ్రిడ్ జాతులతో, పాశ్చాత్య పశు పోషణ పద్ధతుల వల్ల కాలుష్యం పెరుగుతున్నది. అనారోగ్య పశువుల సంఖ్య పెరుగు తున్నది. శుభ్రత పాటించని ఆధునిక డెయిరీల వల్ల పశువుల వ్యాధులు మానవులకు సంక్రమిస్తున్నాయి. పశువులకు సరైన ఆహారం, జీవనం లేని కారణంగా వాటి పాలలో కూడా పోషకాలు ఉండటం లేదు. విషాలు, రసాయనాలు, యాంటీ బయాటిక్స్ వాటికి ఇవ్వడం వలన, వాటి పాల ద్వారా అవి మనుషులకు చేరుతున్నాయి.పశుపోషణలో సంప్రదాయ విజ్ఞానం, నైపుణ్యానికి చాలా విలువ ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాడి పశువులను ప్రకృతి వనరుగా పరిగణించాలి. ఈ సూత్రం ఆధారంగా విధానం తీసుకురావాలి. పథకాలు వాటి సుస్థిరతకు, విస్తృతికి ఉపయోగపడే విధంగా రూప కల్పన చెయ్యాలి. స్థానిక పాడి రైతులను స్థానిక మార్కె ట్లతో అనుసంధానం చెయ్యాలి. పాలు, పాల ఉత్పత్తులు గ్రామాలలో ప్రథమంగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. పాడి రైతులకు ప్రతి ఏటా చట్టబద్ధంగా కనీస మద్దతు ధరను ప్రకటించి, అమలు చెయ్యాలి. పాల సహకార సంఘాల సంఖ్యను పెంచాలి. కేంద్రీకృత పాల మార్కెటింగ్ వ్యవస్థకు ఇచ్చే సబ్సిడీలు స్థానిక సహకార సంస్థలకు ఇవ్వాలి. భూమి వినియోగ విధానం రూపొందించి అందులో గడ్డి మైదానాలకు స్థానం కల్పించాలి. పశుగ్రాసానికి, దాణాకు సంబంధించి శాస్త్రీయ నిర్ణయాలు తీసుకోవాలి. పాడి రైతులకు భూమి ఇవ్వాలి. లేదా భూమి ఉన్న రైతుకు పాడి పశువులను అందజెయ్యాలి.డా‘‘ దొంతి నరసింహా రెడ్డివ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు -
ఆర్గానిక్ పాలకు అధిక డిమాండ్ ఉంది
-
యువత సంకల్పం అత్యంత బలమైంది
తిరుపతి ఎడ్యుకేషన్: నేటి యువతే రేపటి దేశం. యువతకు మించిన గొప్ప శక్తి లేదు. యువత సంకల్పం అన్నింటి కన్నా బలమైనదని గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం (ఎస్వీ వెటర్నిటీ వర్సిటీ) 12వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. చాన్సలర్ హోదాలో గవర్నర్ హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఆ యువత సరైన దిశలో గమ్యం వైపు పయనిస్తే బలమైన భారత్‌గా ఎదుగుతుందన్నారు.పశుపోషణ, పాడి పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో పాల ఉత్పత్తిని పెంచడంలో, పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నట్టు తెలిపారు. అమూల్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుని గ్రామీణ మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. శ్రీవారి నైవేద్యాలకు, భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీతో పాటు అన్ని అవసరాలకు సేంద్రియ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయడం శుభసూచకమన్నారు. రైతులు సహజసిద్ధమైన ప్రకృతి వ్యవసాయాన్ని అవలంభించేలా వారిని ప్రోత్సహించేందుకు ఎద్దులు, ఆవులను విరాళంగా అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే దేశీయ గోజాతులను రక్షించేందుకు టీటీడీ తీసుకున్న చర్యలు అభినందనీయమన్నారు.గురువుల మార్గనిర్దేశంలో క్రమశిక్షణతో విద్యనభ్యసించిన వెటర్నరీ విద్యార్థులు పశువైద్య నీతి సూత్రాలకు అనుగుణంగా ముందుకు సాగుతూ దేశం గర్వించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ఎస్వీ వెటర్నరి వర్సిటీ దినదినాభివృద్ధి చెందుతూ ఈ ఏడాదికి ప్రకటించిన ర్యాంకింగ్‌లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుని 31వ స్థానంలో నిలవడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలను అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు 35 బంగారు పతకాలు, రెండు రజతం, ఒకరికి నగదు బహుమతిని అందించారు. కేరళ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎంఆర్ శశీంద్రనాథ్, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ వీసీ డాక్టర్ వి.పద్మనాభరెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అరుణాచలం రవి పాల్గొన్నారు. -
డైరీ ఫారం ద్వారా లక్షలు సంపాదిస్తున్న రైతు డైరీ ఫారం ద్వారా లక్షలు సంపాదిస్తున్న రైతు
-
పాల ఉత్పత్తిలో టాప్ 5లో ఏపీ
సాక్షి, అమరావతి: జాతీయ సగటును మించి ఆంధ్రప్రదేశ్‌లో రోజు వారీ తలసరి పాల లభ్యత ఎక్కువగా ఉందని కేంద్ర పశు సంవర్థక మంత్రిత్వ శాఖ–2022 సర్వే వెల్లడించింది. జాతీయ స్థాయిలో రోజు వారీ తలసరి పాల లభ్యత 444 గ్రాములుండగా ఆంధ్రప్రదేశ్‌లో 799 గ్రాములుందని సర్వే పేర్కొంది. దేశంలోని పది రాష్ట్రాలు జాతీయ సగటు కంటే ఎక్కువ లభ్యత కలిగి ఉన్నాయని సర్వే తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగోస్థానంలో ఉండగా.. మొదటి మూడు స్థానాల్లో వరుసగా పంజాబ్, రాజస్థాన్, హరియాణ ఉన్నాయి. గతేడాదికి సంబంధించి దేశంలో పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉంది. ఏపీ కంటే ముందువరసలో మొదటి నుంచి నాలుగు వరకు వరసగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ నిలిచాయి. దేశంలో మొత్తం పాల ఉత్పత్తిలో 53.11 శాతం ఈ ఐదు రాష్ట్రాల నుంచే జరుగుతోందని సర్వే వెల్లడించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా రాష్ట్రంలో పాలిచ్చే ఆవులు, గేదెల సంఖ్య పెరగడమే కాకుండా వాటి పాల ఉత్పత్తి కూడా పెరిగిందని సర్వే వివరించింది. రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా పాల ఉత్పత్తి పెరుగుతూ వస్తోంది. 2020–21లో రాష్ట్రంలో 1,47,13,840 టన్నుల పాలు ఉత్పత్తి జరగ్గా 2021–22లో 1,54,03,080 టన్నుల ఉత్పత్తి జరిగినట్లు సర్వే పేర్కొంది. -
పాల ఉత్పత్తుల దిగుమతులపై కేంద్రం దృష్టి!
న్యూఢిల్లీ: దేశంలో పాల ఉత్పత్తి మందగమనం నేపథ్యంలో కేంద్రం డెయిరీ ప్రొడక్టుల దిగుమతుల అవకాశాలను పరిశీలిస్తోంది. పశుసంవర్ధక, డెయిరీ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన అందించిన అధికారిక సమాచారం ప్రకారం, దేశంలో పాల ఉత్పత్తి 2021–22లో 221 మిలియన్ టన్నులు. ఇది అంతకు ముందు సంవత్సరం (2020–21)తో పోల్చితే (208 మిలియన్ టన్నులు) కేవలం 6.25 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన వెల్లడించిన అంశాలు క్లుప్తంగా... ► ప్రస్తుతం ఫ్లషింగ్ (పీక్ ప్రొడక్షన్) సీజన్ ప్రారంభమైన దక్షిణాది రాష్ట్రాల్లో పాల నిల్వలను అంచనా వేసిన తర్వాత అవసరమైతే వెన్న, నెయ్యి వంటి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ► పశువులలో గడ్డలు ఏర్పడడానికి సంబంధించిన చర్మవ్యాధి కారణంగా 2022–23 ఆర్థిక సంవత్సరంలోనూ దేశ పాల ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ వ్యాధి వల్ల గత ఏడాది దాదాపు 1.89 లక్షల పశువులు చనిపోయాయి. అదే సమయంలో దేశీయ డిమాండ్ 8–10% పెరిగింది. కరోనా మహమ్మారి అనంతరం డిమాండ్ పుంజుకుంది. ► పశువుల చర్మవ్యాధి ప్రభావం వల్ల 2022–23లో పాల ఉత్పత్తి కేవలం 1 నుంచి 2 శాతమే పెరిగింది. సాధారణంగా ఈ ఉత్పత్తి వృద్ధి ఏటా 6 శాతంగా ఉంటుంది. 2023–24పైనా అంచనాలు బలహీనంగానే ఉన్నాయి. ► దేశంలో పాల సరఫరాలో ఎటువంటి అడ్డంకు లు లేవు. స్కిమ్డ్ మిల్క్ పౌడర్ (ఎస్ఎంపీ) నిల్వ లు తగినంతగా ఉన్నాయి. కానీ పాల ఉత్పత్తులు ముఖ్యంగా కొవ్వులు, వెన్న, నెయ్యి మొదలైన వాటి విషయంలో నిల్వలు తక్కువగా ఉన్నాయి. ► అయితే ఇప్పుడు డెయిరీ ప్రొడక్టుల దిగుమతులు కూడా ఖరీదయిన వ్యవహారమే. ఇది దేశీయ దిగుమతుల బిల్లును పెంచుతుంది. అంతర్జాతీయ ధరలు ఇటీవల పెరగడం దీనికి కారణం. అందువల్లే ప్రస్తుతం ఫ్లషింగ్ (పీక్ ప్రొడక్షన్) సీజన్ ప్రారంభమైన దక్షిణాది రాష్ట్రాల్లో పాల నిల్వలను అంచనా వేయడానికి తొలుత ప్రాధాన్యత ఇస్తున్నాం. ► 20 రోజులుగా అకాల వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వాతావరణ పరిస్థితులు కొంత అనుకూలించడంతో ఉత్తర భారతదేశంలో పాల కొరత కొంత తక్కువగానే ఉంటుందని భావిస్తున్నాం. ► పశుగ్రాసం ధరల పెరుగుదల డెయిరీ రంగంలో ద్రవ్యోల్బణానికీ దారితీస్తుంది. గత నాలుగేళ్లలో పశుగ్రాసం పంట విస్తీర్ణం భారీగా పెరగలేదు. సహకార రంగమే ప్రాతిపదిక... అయితే ఇక్కడ ఒక విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వం మొత్తం ప్రైవేట్, అసంఘటిత రంగాన్ని కాకుండా సహకార రంగం నుంచి వచ్చే పాల ఉత్పత్తి డేటాను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రభుత్వ అంచనాలు సహకార రంగం నుంచి అందే గణాంకాల ప్రాతిపదికనే ఉంటుంది. భారత్ 2011లో డెయిరీ ప్రొడక్టులను దిగుమతి చేసుకుంది. అటు తర్వాత ఈ పరిస్థితి రాలేదు. -
మండపేట గేదా.. మజాకా! నాలుగేళ్ల వయసు, రోజుకు 26.59 లీటర్ల పాలు
మండపేట (డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ): ఆ గేదె వయసు నాలుగేళ్లు. పాలదిగుబడిలో తన తల్లిని మించిపోయింది. రోజుకు 26.59 లీటర్లు పాలు ఇస్తూ రికార్డు సృష్టించింది. ఆ గేదె తల్లి రోజుకు 26.58 లీటర్లు పాలు ఇస్తూ రాష్ట్రస్థాయి పాల దిగుబడి పోటీల్లో రెండుసార్లు మొదటి స్థానంలో నిలిచింది. తల్లి గేదె ఆరో ఈతలో అత్యధిక దిగుబడి ఇస్తే... నాలుగేళ్ల వయసు కలిగిన పిల్ల గేదె రెండో ఈతలోనే తల్లిని మించి రికార్డు స్థాయిలో రోజుకు 26.59 లీటర్ల పాల దిగుబడిని నమోదు చేసింది. ఈ విషయాన్ని కేంద్రీయ పశు నమోదు పథకం ప్రతినిధి డి.రాజేశ్వరరావు ఆదివారం నిర్ధారించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణానికి చెందిన పాడి రైతు ముత్యాల సత్యనారాయణ (అబ్బు) మేలుజాతి పశు పోషణ చేస్తున్నారు. ఎనిమిదేళ్ల కిందట ఆయన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ముర్రా జాతి పాడి గేదెను కొనుగోలు చేశారు. ఆ గేదె గతంలో విజయవాడ, మండపేటల్లో జరిగిన రాష్ట్రస్థాయి పాల దిగుబడి పోటీల్లో రెండుసార్లు మొదటి స్థానంలో నిలిచింది. ఈ గేదె సాధించిన అత్యధిక దిగుబడి 26.58 లీటర్లు. ఇప్పటివరకూ ఆ గేదె తమ వద్ద ఆరు ఈతలు ఈనగా, నాలుగు దున్నపోతులు, రెండు పెయ్యదూడలు పుట్టాయని అబ్బు చెప్పారు. దున్నపోతుల్లో రెండింటిని సెమన్ సేకరణ కేంద్రాల వారు తీసుకువెళ్లగా, మరో రెండు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం రికార్డు స్థాయిలో పాలదిగుబడిని ఇస్తున్న పెయ్య ఆరో ఈతలో పుట్టిందని వివరించారు. వీటికి దాణాగా రోజుకు రూ.500 ఖర్చుతో పశుగ్రాసాలు, మొక్కజొన్న, ఉలవలు, తవుడు అందిస్తున్నామని ఆయన చెప్పారు. అధికారికంగా పాలదిగుబడి లెక్కింపు ప్రస్తుతం కేంద్రీయ పశు నమోదు పథకం కింద మండపేట, పరిసర ప్రాంతాల్లో అత్యధిక పాల దిగుబడి ఇచ్చే పాడి పశువుల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. కేంద్రీయ పశు నమోదు పథకం ప్రతినిధి డి.రాజేశ్వరరావు పశువుల వద్దకు వెళ్లి మేలుజాతి పాడి గేదెల పాల దిగుబడిని లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా అబ్బుకు చెందిన గేదె ఒక రోజు 26.59 లీటర్ల పాల దిగుబడిని ఇచ్చిందని రాజేశ్వరరావు తెలిపారు. రెండో ఈతలోనే ఈస్థాయిలో దిగుబడి వస్తే మున్ముందు మరింత పెరుగుతుందని ఆయన చెప్పారు. అత్యధిక దిగుబడినిచ్చే పాడి పశువుల వివరాలను సెమన్ సేకరణ కేంద్రాలకు పంపుతామని, వీటి ద్వారా మేలుజాతి పాడి పశువుల పునరుత్పత్తికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాజేశ్వరరావు తెలిపారు. -
భారత్‌లో పాలు, మాంసానికి భారీ డిమాండ్.. నివేదికలో కీలక అంశాలు!
సాక్షి, అమరావతి: పాలు, మాంసం, గుడ్లు, చేపలు.. దేశంలో వినియోగం భారీగా పెరుగుతున్న ఆహారం. జనాభా పెరుగుదల, సంపన్నులు పెరుగుతుండటంతో ఈ డిమాండ్ ఇంకా భారీగా పెరుగుతుందని నాబార్డు అంచనా వేస్తోంది. 2050 నాటికి దేశ జనాభా 1.6 బిలియన్లు దాటే అవకాశం ఉందని, వీరిలో సగం మంది నగరాలు, పట్టణాల్లో నివసిస్తారని, సంపన్నుల సంఖ్యా పెరుగుతున్నందున వీటికి డిమాండ్ వేగంగా పెరుగుతుందని ‘పశువులు, వ్యవసాయ వృద్ధి – పేదరిక నిర్మూలన’పై నాబార్డు అధ్యయన నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ వీటి వినియోగం పెరుగుతోందని, గుడ్ల వాడకం మరింత ఎక్కువగా ఉందని పేర్కొంది. భారతదేశం పశు సంవర్ధక రంగంలో డిమాండ్‌కు తగినట్లుగా వృద్ధి సాధిస్తోందని తెలిపింది. 2010–11 నుంచి 2019–20 మధ్య పశు సంవర్ధక రంగం రికార్డు స్థాయిలో 7.6 శాతం మేర వార్షిక వృద్ధి సాధించిందని వెల్లడించింది. వ్యవసాయ వృద్ధి కంటే ఇది రెండింతలు ఎక్కువని తెలిపింది. వ్యవసాయ వృద్ధిలో పశువుల రంగం వాటా 30 శాతం ఉందని పేర్కొంది. పేదరికాన్ని తగ్గిస్తున్న పశు సంవర్థక రంగం దేశంలో పేదరికాన్ని తగ్గించడంలో పశు సంవర్ధక రంగం ప్రభావం ఎక్కువ ఉంది. పశు పోషణ రంగంలో దేశంలో 70 శాతం కంటే ఎక్కువగా మహిళలే ఉన్నారు. మహిళా సాధికారతకు పశు పోషణ దోహదపడుతోంది. పశువుల ద్వారా వచ్చిన ఆదాయాన్నే మహిళలు ఇంటి బడ్జెట్‌కు వినియోగిస్తున్నారు. ప్రధానంగా ఈ ఆదాయాన్ని పిల్లల పోషకాహారం, ఆరోగ్యం, విద్యకు కేటాయిస్తున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. భవిష్యత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని పేదరిక నిర్మూలనకు దోహదపడే పశు సంవర్ధక రంగాన్ని, పశు పోషణను మరింతగా ప్రోత్సహించాలని నాబార్డు నివేదిక సూచించింది. ఆహార అలవాట్లలో మార్పు 1990–91 నుంచి మొత్తం జనాభా వృద్ధి రేటు 1.57 శాతంతో పోల్చితే పట్టణ జనాభా వృద్ధి రేటు 2.64 శాతంగా ఉందని నివేదిక తెలిపింది. దేశ జనాభాలో మూడింట ఒక వంతు నగరాలు, పట్టణాల్లోనే నివశిస్తున్నారు. ఈ ప్రభావంతో ఆహార అలవాట్లలో మార్పు వచ్చింది. గత రెండు దశాబ్దాలుగా పట్టణాల్లో తలసరి పాలు, పాల ఉత్పత్తుల వినియోగం 10 శాతం పెరిగింది. గుడ్లు వినియోగం 13 శాతం, మాంసం, చేపల వినియోగం 25 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, చేపల వినియోగం దాదాపు ఇదే స్థాయిలో పెరిగాయని పేర్కొంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో గుడ్ల వినియోగం చాలా వేగంగా 45.5 శాతం మేర పెరిగినట్లు నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో 2030 నాటికి దేశంలో పాల డిమాండ్ 65.2 శాతం, మాంసం డిమాండ్ 75.5 శాతం, గుడ్లకు డిమాండ్ 65.7 శాతం, చేపల డిమాండ్ 75.0 శాతం మేర పెరుగుతుందని నాబార్డు నివేదిక అంచనా వేసింది. -
ఫ్యామిలీ డాక్టర్లా క్యాటిల్ డాక్టర్
గ్రామ స్థాయిలో రైతుల ముంగిటే పశువులకు క్రమం తప్పకుండా అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య వివరాలను యానిమల్ హెల్త్ కార్డుల్లో నమోదు చేయాలి. వీటిని ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేయాలి. తద్వారా పశువు ఆరోగ్యం ఎలా ఉంది? టీకాలు ఎప్పుడివ్వాలి? చూలు సమయం ఎప్పుడు? లాంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఆర్బీకేల ద్వారా పశువులకు ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలి. ఫ్యామిలీ డాక్టర్ తరహాలో గ్రామాల్లో పశువులకు వైద్యసేవల కోసం క్యాటిల్ డాక్టర్ వ్యవస్థ తెచ్చేందుకు మండలం యూనిట్‌గా కార్యాచరణ రూపొందించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రతి ఆర్బీకేలో పశు సంవర్ధక శాఖ సహాయకులను నియమించి ఖాళీగా ఉన్న 5,160 పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వెటర్నరీ డాక్టర్లుగా పట్టాలు పొంది 1,200 మంది నిరీక్షిస్తున్న నేపథ్యంలో ప్రతి గ్రామంలో పశు వైద్యుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల, జిల్లా, డివిజన్ స్థాయిలో స్టాఫింగ్ ప్యాట్రన్ ఒకే రీతిలో ఉండేలా రేషనలైజేషన్ చేయాలన్నారు. వచ్చే సమావేశం నాటికి తగిన కార్యాచరణతో తనకు నివేదించాలని అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. పశుసంవర్ధక శాఖపై సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఆ వివరాలివీ.. సేంద్రీయ పాల ఉత్పత్తులు పురుగు మందులు, రసాయనాలను మితిమీరి వాడటంతో ఆహారం ద్వారా జంతువుల్లో చేరుతున్నాయి. పాలల్లో వాటి అవశేషాల కారణంగా క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే స్వచ్ఛమైన పాల ఉత్పత్తులపై రైతులను చైతన్యం చేయాలి. స్వచ్ఛమైన, నాణ్యమైన పాల ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ప్రధానంగా సేంద్రీయ పాల ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి. తక్కువ పెట్టుబడితో సేంద్రీయ పద్ధతుల్లో స్వచ్ఛమైన పాల ఉత్పత్తి సాధించడంపై విస్తృత పరిశోధనలు జరగాలి. ఆ ఫలితాలను రైతులకు అందించే చర్యలు చేపట్టాలి. అమూల్ æద్వారా పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలి. భావి తరాల కోసం.. పాలు, గుడ్లు తీసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వాటిని వినియోగిస్తాం. కానీ పాలల్లో రసాయన అవశేషాల కారణంగా పిల్లల ఆరోగ్యం దెబ్బతింటున్న పరిస్థితులను చూస్తున్నాం. ఆరోగ్యవంతమైన పిల్లల ద్వారానే మంచి భావి తరాలు నిర్మాణం అవుతాయి. ఇందుకోసం నాణ్యమైన, స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందించాలి. ఆ దిశగా పశు యాజమాన్యంలో ఉత్తమ పద్ధతులు పాటించేలా అమూల్ ద్వారా రైతులకు నిరంతర అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలి. పశువులకు పౌష్టికాహారం అందించే విషయంలో గ్రామ స్థాయిల్లో రైతులను చైతన్యపర్చాలి. అక్టోబర్‌లో పశువుల బీమా పథకం పశువులన్నింటికీ బీమా సదుపాయం కల్పించాలి. ఇందుకోసం ప్రత్యేక పథకానికి అక్టోబర్ నుంచి శ్రీకారం చుట్టబోతున్నాం. ప్రమాదవశాత్తూ, రోగాల వల్ల పశువులు చనిపోతే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాంటి సమయంలో వారికి అండగా నిలిచేందుకు ఈ పథకం ఎంతగానో తోడ్పడుతుంది. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల ద్వారా పశువులను కొనుగోలు చేస్తున్నారు. ఆ పశువులన్నింటికీ బీమా ఉందా? లేదా? అనేది మరోసారి పర్యవేక్షించాలి. ఆడిట్ చేసి అక్టోబరులో పథకం ప్రారంభానికి చర్యలు తీసుకోవాలి. బీమా ప్రీమియంలో 80 శాతం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం పశుపోషణ ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయం లభించేలా చూడాలి. పశుపోషణ విషయంలో వారికి అండగా నిలవాలి. దీనివల్ల వ్యవసాయంతో పాటు పశుపోషణ ద్వారా అదనపు ఆదాయం ఆర్జించే అవకాశం కలుగుతుంది. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది. వైఎస్సార్ ఆసరా, చేయూత లబి్ధదారులైన మహిళలకు పశువుల పెంపకం విషయంలో తోడుగా నిలవాలి. బ్యాంకర్లతో మాట్లాడి వారికి ఉదారంగా రుణాలిచ్చేలా కృషి చేయాలి. ప్రతి ఆర్బీకేలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లలో పశుపోషణకు సంబంధించిన పరికరాలను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలి. ‘లంపీ స్కిన్’పై జాగ్రత్త తాజాగా పశువుల్లో లంపీ స్కిన్ వ్యాధి వ్యాపిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అడ్డుకట్ట వేసేలా పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలి. ఆరోగ్యకరమైన పశువులకు ఈ వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరిపడా మందులు, వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచాలి. అవసరమైన మేరకు టీకాలివ్వాలి. సమీక్షలో పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, పశుసంవర్ధక శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, సహకార, మార్కెటింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి చిరంజీవి చౌదరి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆర్.అమరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. నాడు – నేడుతో పశువుల ఆస్పత్రుల రూపురేఖలు మార్చాలి పశువుల ఆస్పత్రుల రూపురేఖలను సమూలంగా మార్చేయాలి. పాఠశాలలు, పీహెచ్‌సీల తరహాలోనే నాడు–నేడు కార్యక్రమం కింద వీటిని చేపట్టాలి. ప్రతి పశువుల ఆస్పత్రిలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలి. అధునాతన పరికరాలు అందుబాటులోకి తేవాలి. మండలం యూనిట్‌గా ప్రతి చోటా వెటర్నరీ వైద్య సదుపాయాలు ఉండేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలి. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలపై నిరంతరం సమీక్ష చేయాలి. రెండో విడతలో మంజూరు చేసిన వాహనాలను అక్టోబరులో ప్రారంభానికి సిద్ధం చేయాలి. -
Sakshi Cartoon: పాల ఉత్పత్తిలో భారత్ టాప్
పాల ఉత్పత్తిలో భారత్ టాప్ -
జయమ్మ విజయం.. కట్టె గానుగ ద్వారా తీసిన నూనె విదేశాలకు..
‘‘ఒక చోటే ఉంటున్నాం. చేసిన పనే చేస్తున్నాం. ఎదుగూ బొదుగు లేకుండా.. గానుగెద్దు జీవితంలా గడిపేస్తున్నాం..’’ అని చాలా మందిలో ఒక అసంతృప్తి ఉంటుంది. ఆరుపదుల వయసు దాటిన జయమ్మ జీవితంకూడా గతంలో ఇదే విధంగా ఉండేది. కానీ, గానుగ చక్రం పట్టుకొని ఆరుపదుల వయసులో విజయం వైపుగా అడుగులు వేస్తోంది జయమ్మ. చదువు లేకపోయినా, వయసు కుదరకపోయినా నవతరానికీ స్ఫూర్తిగా నిలుస్తున్న కోట్ల జయమ్మ స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా, గండీడ్ మండలం, జక్లపల్లి గ్రామం. గానుగ నూనె వ్యాపారాన్ని అంచెలంచెలుగా వృద్ధి చేస్తూ తనతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తుంది. ఆరోగ్యదాయిని పేరుతో ప్రాచీనకాలం గానుగ నూనె ప్రాచుర్యాన్ని ఎల్లలు దాటేలా చేస్తోంది. జయమ్మది వ్యసాయ కుటుంబం. భర్త పిల్లలతో కలిసి పొలం పనులు చేసుకోవడంతో పాటు పాల ఉత్పత్తిని కొనసాగించేది. జయమ్మ నాలుగేళ్ల క్రితం రొమ్ము క్యాన్సర్‌బారిన పడింది. జబ్బు నుండి కోలుకునే క్రమంలో తనకు కలిగిన ఆలోచనను అమలులో పెట్టిన విధానం గురించి జయమ్మ ఇలా చెబుతుంది.. ‘‘పట్నంలో క్యాన్సర్‌కి చికిత్స చేయించుకున్నాను. డాక్టర్లు పదిసార్లు్ల కీమోథెరఫీ చేయాలన్నారు. ఈ సమయంలో ఓ డాక్టర్ గానుగ నూనె వాడమని, ఆహారంలో మార్పులు కూడా చేసుకోమని చెప్పాడు. దీంతో మహబూబ్‌నగర్‌లో కరెంట్ గానుగ నుండి వంట నూనెలు తెచ్చి వాడుకునేవాళ్లం. అప్పుడే వచ్చింది ఆలోచన మేమే గానుగను ఏర్పాటు చేసుకోవచ్చు కదా అని. కరెంట్‌తో నడిచేది కాకుండా ఎద్దులతో తిరిగే కట్టె గానుగ గురించి వెతికాం. మైసూరులో ఉందని తెలిసి, అక్కడికెళ్లి చూశాం. అలా మూడేళ్ల క్రితం ఎద్దుల కట్టె గానుగను ఏర్పాటు చేసి, నూనె తీయడం ప్రారంభించాం. పల్లి, కొబ్బర, ఆవిసె, కుసుమ, నువ్వులతో నూనె తీయడం ప్రారంభించాం. ఏడాది పాటు శిక్షణ... గానుగ ఏర్పాటు చేసిన తర్వాత పొదుపు సంఘాల మహిళలకు ప్రభుత్వం వాళ్లు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో, నేను చేస్తున్న పని వివరించాను. ఎలాగైనా అందరికీ మంచి గానుగ నూనె అందించాలి అని చెప్పాను. ఏడాది పాటు నెలకు కొన్ని రోజుల చొప్పున మార్కెటింగ్ గురించి కూడా శిక్షణ ఇచ్చారు. అప్పటి వరకు మా చుట్టుపక్కల వారికే గానుగ నూనె అమ్మేదాన్ని. శిక్షణ తర్వాత మరో ఐదు గానుగలను ఏర్పాటు చేశాను. 15 లక్షల రూపాయల పెట్టుబడితో షెడ్డు నిర్మించి కట్టెగానుగలను ఏర్పాటు చేసి నూనె ఉత్పత్తి పెంచాను. ఇతర రాష్ట్రాల నుంచి... వివిధ రకాల నూనెలను గానుగ ద్వారా తీసేందుకు అవసరమైన ముడి సరుకులకు ఒరిస్సా, కర్ణాటక నుంచి కూడా తెప్పిస్తాను. ప్రతి నెల ఆరు టన్నుల పల్లీలు, రెండు టన్నుల కొబ్బరి, మూడు టన్నుల కుసుమ, రెండు టన్నుల నువ్వులు తీసుకుంటున్నాను. వీటిలో గడ్డి నువ్వులు ఒరిస్సా నుండి, కుసుమ, కొబ్బరి కర్ణాటక నుండి, పల్లీలు, నువ్వులు మహబూబ్‌నగర్ నుండి దిగుమతి చేసుకుని నూనె తీస్తున్నాను’ అని వివరించింది జయమ్మ. కార్యక్రమాల ఏర్పాటు... గానుగలను ఏర్పాటు చేసిన తర్వాత 4 సార్లు 170 మందికి గానుగ నూనె తయారీపై శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది జయమ్మ. వారందరికీ వసతి, భోజన సదుపాయాలను కల్పించింది. ఆరోగ్యదాయిని పేరుతో వివిధ జిల్లాల్లో కొత్తగా ఎనిమిది గానుగలను ఏర్పాటు చేసేందుకు సహకరించింది. దీంతో పాటు పలు సేవా కార్యక్రమాలు కూడ ఆరోగ్యదాయిని పేరుతో చేపడుతోంది. పాఠశాలకు వాటర్ ఫిల్టర్, పుస్తకాలు, కరెంటు సౌకర్యం కల్పించడం వంటివి కూడ చేపడుతూ జయమ్మ ఆదర్శంగా నిలుస్తుంది. ‘మరో నాలుగు గానుగలు ఏర్పాటు చేసి అమెరికాకు కూడా ఇక్కడి నూనెలు ఎగుమతి చేస్తా. కల్తీ నూనెలకు అడ్డుకట్ట వేసి స్వచ్చమైన నూనెను అందిచడమే లక్ష్యం’ అంటూ గానుగల నిర్వహణ చూడటంలో మునిగిపోయింది జయమ్మ. విదేశాలకు ఎగుమతి ‘ఇప్పుడు మా ఊరు జక్లపల్లి నుండి కట్టె గానుగ ద్వారా తీసిన నూనె విదేశాలకు కూడా ఎగమతి అవుతుంది. హైద్రాబాద్‌లోని ఓ సంస్థ సహకారంతో దుబాయ్, సింగపూర్, మలేషియాలకూ పంపుతున్నాం. మూడు నెలలకొకసారి దాదాపు 4 వేల లీటర్ల నూనెను ఎగుమతి చేస్తున్నాం. గానుగ తీసిన పిప్పిని పశువుల దాణాగా వాడుతున్నాం. పశువుల దాణాకు ఇక్కడ మంచి గిరాకీ ఉంది. కర్నాటక, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు కొరియర్ ద్వారా స్వచ్ఛమైన కల్తీలేని నూనెను పంపుతున్నాం. మా కుటుంబ సభ్యులతో పాటు మరో 15 మంది ఈ నూనె వ్యాపారం ద్వారా ఉపాధి పొందుతున్నారు’ అని వివరించింది జయమ్మ. చేతి నిండా పని గానుగ ఏర్పాటైనప్పటి నుండి ఇక్కడ పనిచేస్తున్నా. అంతకు ముందు వ్యవసాయ పనులకు వెళ్లేదాన్ని. కొన్నాళ్లు పని ఉండేది. కొన్నాళ్లు ఖాళీగా ఉండేదాన్ని. ఈ గానుగలు వచ్చాక చేతి నిండా పని దొరుకుతుంది. పని కోసం వెదుకులాడే అవసరం లేకుండా పోయింది. – లక్ష్మి, జక్లపల్లి – బోయిని గోపాల్, గండీడ్, మహబూబ్‌నగర్, సాక్షి -
దేశంలో వైట్ రివల్యూషన్.. రూ. 1.60 లక్షల కోట్లు
ముంబై: భారత్‌లో వ్యవస్థీకృత డెయిరీ పరిశ్రమ మార్చితో ముగిసే 2021–22 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 12 శాతం పురోగమించే అవకాశం ఉందని క్రిసిల్ రేటింగ్స్ తాజా నివేదిక పేర్కొంది. విలువలో ఇది రూ.1.6 లక్షల కోట్లని విశ్లేషించింది. వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ (వీఏపీ) డిమాండ్ రికవరీ కావడం, లిక్విడ్ పాల అమ్మకాలు స్థిరంగా ఉండడం, రిటైల్ ధరలో పెరుగుదల వంటి అంశాలు శ్వేత విప్లవ పురోగతికి కారణమని పేర్కొంది. నివేదిక ముఖ్యాంశాలను పరిశీలిస్తే... - కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి పదేళ్ల కనిష్టం.. ఒక శాతం పడిపోయిన భారత వ్యవస్థీకృత డెయిరీ పరిశ్రమ ఆదాయాలు 2021–22లో మహమ్మారి ముందస్తు స్థాయికి క్రమంగా పరిశ్రమ కోలుకుంటున్నాయి. - వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ (వీఏపీ) విభాగం వ్యవస్థీకృత రంగ విక్రయాలలో మూడింట ఒక వంతు వాటా కలిగి ఉంది. దీనితోపాటు ఈ రంగంలో దాదాపు మూడింట రెండు వంతుల వాటా ఉన్న లిక్విడ్ పాల విభాగానికి స్థిరమైన డిమాండ్ కొనసాగుతోంది. ఈ విభాగాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం (మహమ్మారి ముందు ఉన్న ట్రెండ్‌కు అనుగుణంగా) 5–6 శాతం వృద్ధి నమోదయ్యే వీలుంది. - నిర్వహణ లాభదాయకత 2020– 2021 ఆర్థిక సంవత్సరంలో 6 శాతం ఉంది. వచ్చే రెండు రెండు ఆర్థిక సంవత్సరాలలో 5–5.5 శాతం శ్రేణిలో ఉండే వీలుంది. డెయిరీలు ఈ ఏడాది కేటగిరీల వారీగా రిటైల్ ఉత్పత్తుల ధరలను 3–4 శాతం పెంచడం, అధిక ముడి పాల ధరలు దీనికి కారణం. రవాణా, ప్యాకేజింగ్ వ్యయాలు పెరిగినప్పటికీ నిర్వాహణా లాభాలకు విఘాతం ఏర్పడదు. - మెరుగైన రాబడులు, వృద్ధి, స్థిరమైన నిర్వహణ లాభాలు, పటిష్ట బ్యాలెన్స్ షీట్ల వంటి అంశాలు డెయిరీ పరిశ్రమలకు ’స్థిరమైన’ క్రెడిట్ ఔట్లుక్ హోదా కల్పించే అవకాశం ఉంది. - నెయ్యి, వెన్న, జున్ను, పెరుగు వంటి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ (వీఏపీ) కోసం డిమాండ్ భారీగా పెరగనుంది. ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) పండుగలు, వివాహాల సీజన్, దేశ వ్యాప్తంగా వాణిజ్య సంస్థలు తిరిగి ప్రారంభమవడం వంటి అంశాలు ఈ విభాగాల్లో బలమైన పునరుద్ధరణకు కారణం. - వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ (వీఏపీ) అమ్మకాల్లో 17 నుంచి 18 శాతం వృద్ధి నమోదయ్యే వీలుంది. కరోనా ఆంక్షల అనంతరం హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లు (వ్యవస్థీకృత రంగాల విక్రయాలలో 20 శాతం వాటా) తిరిగి తెరుచుకోవడం, పండుగలు, వివాహ వేడుకలు, ఉపాధి కల్పన మెరుగుపడ్డం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. - కోవిడ్–19 రెండవ, మూడవ వేవ్‌ల ప్రభావం డెయిరీ పరిశ్రమపై ఎటువంటి భౌతిక ప్రభావం చూపలేదు. ఆంక్షలు స్థానిక స్థాయికి పరిమితం కావడం, ప్రత్యక్ష ఫుడ్–డెలివరీ సేవలు, తినుబండారాలు పని చేస్తూనే ఉండడం వంటి అంశాలు దీనికి కారణం. - 57 రేటెడ్ డెయిరీల క్రిసిల్ రేటింగ్స్ విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. వ్యవస్థీకృత సెగ్మెంట్ ద్వారా వస్తున్న రూ. లక్ష కోట్ల ఆదాయంలో ఈ 57 రేటెడ్ డెయిరీల వాటా దాదాపు 60 శాతం. చదవండి:భారీగా పామాయిల్ సాగు -
మేలుజాతి పశు పునరుత్పత్తి క్షేత్రాలు
సాక్షి, అమరావతి: అధిక దిగుబడినిచ్చే దేశవాళి ఆవులు, గేదెలు, విదేశీజాతి ఆవుల పునరుత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మేలుజాతి పశుపునరుత్పత్తి క్షేత్రాలను ఏర్పాటు చేస్తోంది. ఒక్కో యూనిట్ రూ.4 కోట్ల అంచనా వ్యయంతో ఈ క్షేత్రాల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో పాల ఉత్పత్తిని రెట్టింపు చేయాలని, మేలుజాతి పశుసంపదను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఆరోగ్యవంతమైన, అధిక పాల దిగుబడినిచ్చే పశుసంపద కోసం పాడిరైతులు మధ్యవర్తులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇప్పటివరకు దేశంలో వీటి పునరుత్పత్తికి సరైన వ్యవస్థ అందుబాటులో లేదు. ఈ పరిస్థితికి చెక్‌పెడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో మేలుజాతి పశుపునరుత్పత్తి క్షేత్రాల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఒక్కో యూనిట్‌కు అయ్యే రూ.4 కోట్ల వ్యయంలో రూ.2 కోట్లను సబ్సిడీ రూపంలో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) ద్వారా అందిస్తుంది. ఒక్కో క్షేత్రాన్ని 200కు తక్కువకాకుండా మేలుజాతి ఆవులు లేదా గేదెలతో ఏర్పాటు చేస్తారు. మినిమమ్ స్టాండర్స్ ప్రొటోకాల్స్ (ఎమ్మెస్పీ) ప్రకారం కనీసం రోజుకు 16 లీటర్ల పాలిచ్చే గేదెలు, 10 నుంచి 12 లీటర్ల పాలిచ్చే ఆవులు, 22 లీటర్లకుపైగా పాలిచ్చే సంకరజాతి ఆవులను ఎంపిక చేసుకోవాలి. ఒక ఈత అయిన ఆవులు, గేదెలను మాత్రమే కొనుగోలు చేయాలి. వీటివిలువ ఒక్కొక్కటి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది. వీటికోసం ప్రత్యేకంగా షెడ్లు, పోషణకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయాలి. మేలుజాతి పశువుల వీర్యాన్ని ఐవీఎఫ్ సాంకేతికత ద్వారా వినియోగించి నాణ్యమైన దూడెలను పునరుత్పత్తి చేయాలి. ఇలా అభివృద్ధి చేసిన ఆడదూడల పునరుత్పత్తి ద్వారా బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫారాలను అభివృద్ధి చేయవచ్చు లేదా తోటి రైతులకు విక్రయించుకోవచ్చు. మగ దూడలనైతే సెమన్ బ్యాంకుల ద్వారా కొనుగోలు చేయిస్తారు. ఎంపిక చేసే విధానం ► దరఖాస్తుదారులు.. వ్యాపారవేత్తలు, ప్రైవేట్ వ్యక్తులు, స్వయం సహాయక సంఘాలు/రైతు ఉత్పత్తి సంస్థలు, జాయింట్ లయబిలిటీ గ్రూపులు, సెక్షన్–8 కింద నమోదైన కంపెనీలై ఉండాలి. ► పాడి పశువుల పెంపకంలో అనుభవం ఉండాలి. ► కనీసం 5 ఎకరాల సొంత భూమి లేదా లీజుకు తీసుకున్న భూమి ఉండాలి. ► ఫారంలో పశువులకు అవసరమైన మేతను సేకరించేందుకు తగిన ఏర్పాటు ఉండాలి. ► పశుసంవర్ధకశాఖ, ఎన్డీడీబీ, నిపుణుల కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది. ► దరఖాస్తు, ప్రెజంటేషన్, ఫీల్డ్ వెరిఫికేషన్ ఆధారంగా వారి ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. అవసరమైతే బ్యాంకు/ఆర్థికసంస్థకు రుణం కోసం సిఫారసు చేస్తుంది ► బ్యాంకుల నుంచి రుణమంజూరు లేఖ అందిన తర్వాత తొలుత ఎన్డీడీబీ, చివరగా డీఏహెచ్డీ ఆమోదముద్ర వేస్తాయి. ► ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ)ను buy@ nddb.coop అనే ఈ మెయిల్ ద్వారా నిర్దేశిత ఫార్మాట్లో సమర్పించాలి. పశుక్షేత్రాల లక్ష్యాలు ► ఆవులు, గేదెల పెంపకంలో ఉత్తమ వ్యాపారవేత్తలను తయారు చేయటం. ► వ్యాధులు లేని, అధిక దిగుబడినిచ్చే దేశవాళి ఆవులు, గేదె జాతుల కోడెదూడలు, తొలిచూరు పడ్డలను అందుబాటులోకి తీసుకురావడం. ► పశుపోషణ, వ్యాధుల నివారణ, శాస్త్రీయ యాజమాన్య పద్ధతులపై అవగాహన పెంపొందించడం. ► ఐవీఎఫ్ సాంకేతికత, విజయవంతమైన వీర్యోత్పత్తి ద్వారా అధిక దిగుబడినిచ్చే పాడి పశువులను ఉత్పత్తి చేయడం. దరఖాస్తు గడువు నవంబర్ 30 రాష్ట్రంలో స్వదేశీ జాతి పశువుల కంటే వ్యాధిరహిత, అధిక దిగుబడినిచ్చే కోడెలు/గర్భిణి కోడెలు/ క్యూలను అందుబాటులో ఉంచే లక్ష్యంతో ఈ క్షేత్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ఏర్పాటుకు ఆసక్తిచూపేవారు ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తు ఫారాలు అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం పశుసంవర్ధకశాఖ సహాయ సంచాలకుడు డా.మురళీధర్ని 9985738718/7093360333 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. – ఆర్.అమరేంద్రకుమార్, డైరెక్టర్, పశుసంవర్ధకశాఖ -
పాల ఉత్పత్తిలో ‘తడకనపల్లి’ పశువుల హాస్టల్‌కు రెండోస్థానం
కర్నూలు (ఓల్డ్‌సిటీ)/ కల్లూరు : కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని తడకనపల్లి గ్రామంలో పాలు ‘వెల్లువలా’ ఉత్పత్తి అవుతోంది. అక్కడ ప్రభుత్వ పశువుల సంక్షేమ వసతి గృహం ఉండటమే ఇందుకు కారణం. గ్రామ సమీపంలోని పదెకరాల సువిశాల స్థలంలో నెలకొల్పారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదలైన ప్రత్యేక అభివృద్ధి నిధులు రూ. 1.50 కోట్లు, కేంద్ర ప్రభుత్వపు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు మరో రూ. 50 లక్షలు జోడించి సుమారు రూ. 2 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. నాలుగేళ్ల క్రితం (2017, జనవరి 2వ తేదీన) 40 గేదెలతో ప్రారంభమైన ఈ హాస్టల్ నేడు ఆ సంఖ్య 200కు పెరిగింది. గేదెలను ఉంచడానికి సుమారు ఎకరం స్థలంలో నాలుగు షెడ్లు నిర్మించారు. ఈ షెడ్లు సుమారు 300 గేదెల పెంపకానికి కూడా సరిపడతాయి. గేదెల మేత కోసం తొమ్మిది ఎకరాల్లో సూపర్ నేపియర్, ఏబీబీఎన్ రకాల గడ్డిని పెంచారు. ఆయా రకాల గడ్డిని మేత మేయడం వల్ల గేదెలు ఎక్కువ పాలు ఇస్తాయి. ఇలాంటి హాస్టల్ రాష్ట్రంలో ఇదే మొదటిదని, దేశంలో గుజరాత్ తర్వాతి స్థానం దీనికే లభిస్తుందని పశు సంవర్ధక శాఖ జేడీ రమేశ్‌బాబు వివరించారు. హాస్టల్ పుట్టుపూర్వోత్తరాలపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది.. వైఎస్ ప్రవేశపెట్టిన పీపీసీలే ఆవిర్భావానికి కారణం.. తడకనపల్లి గ్రామ పంచాయతీలో 4,300 జనాభా ఉంది. 1,050 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. పొదుపు లక్ష్మి గ్రూపులు 92 ఉన్నాయి. వాటిలో సభ్యులు దాదాపుగా ప్రతి కుటుంబానికి ఒకరుంటారు. ఇక్కడి మహిళలు చైతన్యవంతులు. ఆర్థిక స్వావలంబన అభిలాష బలంగా ఉంది. గేదెల పెంపకం ద్వారా కలిగే ప్రయోజనాలను గుర్తించి ఎక్కువ సంఖ్యలో అదే వృత్తిని అవలంబించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెంచాలనే ఉద్దేశంతో పాల ప్రగతి కేంద్రాలు (పీపీకేలు) ప్రవేశపెట్టారు. ఈ పథకాన్ని ఆతర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు సెర్ప్ ద్వారా అమలు చేశారు. ఐదుగురు డ్వాక్రా గ్రూపు మహిళలు ఒక యూనిట్‌గా జాయింట్ లయబుల్ గ్రూప్ (జేఎల్సీ)లను 2013లో ఏర్పాటు చేశారు. ఒక్కో జేఎల్సీకి ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించిన ముర్రా జాతి గేదెలను బ్యాంకు రుణం ద్వారా కొనిచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు రూ. 2.25 లక్షలు, బీసీ, మైనారిటీలకు రూ. లక్ష సబ్సిడీ ఇచ్చారు. గేదెలు కొనడానికి ముందే గడ్డి పెంపకానికి రూ. 30 వేల రుణాన్ని అడ్వాన్స్‌గా ఇప్పించారు. జిల్లా మొత్తంగా 60 పాల ప్రగతి కేంద్రాలు మంజూరైతే కేవలం తడకనపల్లి గ్రామానికి 12 పీపీకేలు కేటాయించారు. ఆ సమయంలో ఇక్కడ గేదెల పెంపకం, పాల ఉత్పత్తి తారాస్థాయికి చేరుకుంది. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక 2014లో అప్పటి పశుసంవర్ధక శాఖ ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్సింగ్ గ్రామాన్ని సందర్శించారు. ఇక్కడ మహిళలు గేదెల పెంపకంపై చూపిస్తున్న ఆసక్తిని గుర్తించి పశువుల హాస్టల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పటి చిన్నటేకూరు పశువైద్యుడు డాక్టర్ నాగరాజు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అప్పటి పశువైద్య శాఖ జేడీ వేణుగోపాల్‌రెడ్డి జిల్లా కలెక్టర్ విజయమోహన్‌ను ఆశ్రయించి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ. 50 లక్షలు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 1.50 కోట్ల ప్రత్యేక నిధులను విడుదల చేసింది. హాస్టల్ ఆవిర్భావానికి ముందు.. ఇంట్లో స్థలం లేని మహిళలు గేదెలను ఇంటి ముందు ఓ తడికె కింద కట్టేసేవారు. దానివల్ల వర్షానికి తడిసి, ఎండకు ఎండి గేదెల పెంపకానికి సరైన అనుకూల వాతావరణం లభించేది కాదు. రాత్రివేళ రక్షణ ఉండేది కాదు. ప్రభుత్వం పశువుల సంక్షేమ వసతి గృహం చేసిన తర్వాత సరైన సదుపాయాలు కలిగాయి. ఈ కారణంగా మొదట 40 గేదెలతో ప్రారంభమైన పశువుల హాస్టల్ క్రమేపీ అభివృద్ధి చెంది ప్రస్తుతం 200 గేదెలతో కళకళలాడుతోంది. హాస్టల్ నిర్వహణ ఇలా... ఈ హాస్టల్లో ప్రస్తుతం సుమారు నలభై నుంచి యాభై కుటుంబాల మహిళలు తమ గేదెలకు ఆశ్రయం కల్పించారు. ఎవరి గేదెలను వారు శుభ్రం చేసి, మేత వేసుకుని వెళ్లాలి. పాలు పిండుకోవాలి. హాస్టల్‌కు అవసరమైన నీటి వసతిని తడకనపల్లి చెరువు నుంచి కల్పించారు. చెరువులో బోరు వేసి పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. దీనికయ్యే కరెంటు బిల్లును పెంపకందారులంతా సమానంగా భరించాలి. హాస్టల్ మైదానంలో గడ్డి పెంచాలనుకుంటే సొంత ఖర్చుతోనే పెంచుకోవచ్చు. ప్రత్యేక నిర్వహణ కమిటీ.. పశువుల హాస్టల్‌కు ప్రత్యేక నిర్వహణ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ హాస్టల్ ప్రారంభంతోనే ఆవిర్భవించింది. ఈ కమిటీకి ప్రస్తుతం బొజ్జమ్మ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. జుబేదాబీ, అంజనమ్మ, గంగావతి, హుసేన్‌బీ, శేషమ్మ కమిటీ సభ్యులు. నెలకొకసారి సమావేశమై నిర్వహణ ఖర్చులపై చర్చిస్తారు. ఒక్కో గేదెపై నెలకు రూ. 100 చొప్పున ఫీజు వసూలు చేస్తారు. పెంపకం కూలీలుగా బీహార్‌వాసులు.. గేదెల పోషణలో బీహార్‌వాసులు నిష్ణాతులు. హాస్టల్లో ఎక్కువ సంఖ్యలో గేదెలు పెట్టుకున్న పెంపకందారుల (గేదెల యజమానుల)కు పోషణ సాధ్యం కాకపోవడంతో అలాంటి వారు తమ సొంత ఖర్చుతో బీహార్‌వాసులను కూలీలుగా నియమించుకున్నారు. గేదెకి రూ. వెయ్యి చొప్పున చెల్లిస్తే పాలు పిండే పని మొదలు సపరలన్నీ వారే చేస్తారు. అధిక పాలదిగుబడి... హాస్టల్లో పోషిస్తున్న గేదెలు దాదాపుగా హర్యానాకు చెందిన ముర్రా జాతి, తమిళనాడుకు చెందిన గ్రేడెడ్ ముర్రాజాతి రకాలకు చెందినవి. వీటికి పాల దిగుబడి ఎక్కువ. పైగా హాస్టల్లో గేదెలకు సరైన గాలి, వెలుతురు, మంచి వాతావరణం ఉంటుంది. దీనికి తోడు సూపర్ నేపియర్, ఏబీబీఎన్ రకాల గడ్డి వాడుతుండటం వల్ల ఒక్కో గేదె రోజుకు 18 మొదలు 20 లీటర్ల దాకా పాలిస్తుంది. పాల కొనుగోలుదారులు ఇక్కడికే వచ్చి లీటరు రూ.50కి చొప్పున కొనుగోలు చేసుకువెళతారు. గ్రామంలో కాకుండా కేవలం పశువుల హాస్టల్లోనే రోజుకు వెయ్యి లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయి. గేదెలు పోషించే మహిళలు లక్షాధికారులయ్యారు. ఉన్న చోటికే వైద్యం.. గతంలో ఇళ్ల వద్ద పోషణ చేసే సమయంలో పెంపకందారులు పశువును ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే వ్యయ, ప్రయాసలకు లోనయ్యేవారు. హాస్టల్లో అలాంటి ఇబ్బంది ఉండదు. పశువైద్యులే ఇక్కడికి వస్తారు. ఓ వెటర్నరీ అసిస్టెంట్ నిత్యం ఇక్కడే విధులు నిర్వర్తిస్తుంటారు. వారానికి ఒకసారి చిన్నటేకూరు పశువైద్యుడు పశువుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించి అవసరమైన వాటికి వైద్యం చేస్తారు. అనుబంధంగా పాలకోవా పరిశ్రమ... తడకనపల్లిలో పాల ఉత్పత్తి అధికంగా జరుగుతుండటం వల్ల ఇక్కడ పాలకోవా పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. కుటీర పరిశ్రమలా ప్రతి ఇంట్లో బట్టీలు పెట్టి కోవాను తయారు చేస్తున్నారు. ఎక్కువ ఆర్డర్లు వచ్చే కొందరు మహిళలు ఆధునిక సాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగించి యంత్రాల సాయంతో కోవా తయారు చేస్తున్నారు. తడకనపల్లి కోవా అనేది బ్రాండెడ్‌గా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్లు వస్తుంటాయి. అంతే కాకుండా కోవాను విక్రయించే ప్రత్యేక స్టాల్స్ వెలిశాయి. గ్రామంలోని ప్రధాన రహదారి వెంట వెళితే వరుసగా కనిపిస్తాయి. ఫలించిన స్థానిక ఎమ్మెల్యే కృషి... హాస్టల్ విద్యుత్తు బిల్లు గతంలో కమర్షియల్ కేటగిరీలో ఉండేది. దీనివల్ల యూనిట్ కాస్ట్ పెరిగి, బిల్లు కూడా పెద్ద మొత్తంలో వచ్చేది. కరెంటు బిల్లు ఖర్చును కూడా పెంపకందారులంతా పంచుకోవాల్సి ఉంటుంది. వీరికి మోయలేని భారంగా ఉండేది. విషయం స్థానిక శాసన సభ్యుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి దృష్టికి వెళ్లింది. ఆయన చొరవ తీసుకుని ‘డైరీ ఫాం’ కేటగిరీకి మార్చాలంటూ విద్యుత్ శాఖ ఎస్ఈతో మాట్లాడారు. అందుకు ఎస్ఈ కూడా ఒప్పుకున్నట్లు తెలిసింది. డైరీ ఫాం కేటగిరీ వల్ల తమకు బిల్లు భారం తగ్గనుందని పెంపకందారులు సంతోష పడుతున్నారు. నాకు పక్షం రోజులకు రూ. 20 వేల బిల్లు వస్తుంది: శేషమ్మ, గేదెల పెంపకందారు తడకనపల్లిలో ఉంటాను. జిలానీ గ్రూప్ ఎస్‌హెచ్‌జీ సభ్యురాలిని. ఏడు బర్రెలను హాస్టల్లో పెట్టాను. వీటికి మేత పెట్టడం, పేడ తీయడం, స్నానం చేయించడం, పాలు పితకడం వంటి అన్ని సపర్యలు మేమే చేసుకుంటాం. మా బర్రెలు ఉదయం 20, సాయంత్రం 12 చొప్పున రోజుకు 32 లీటర్ల పాలు ఇస్తాయి. పాల వ్యాపారి నుంచి నాకు పక్షం రోజులకు రూ. 20 వేల బిల్లు లభిస్తుంది. పశువుల హాస్టల్.. ఓ మంచి ఉద్దేశం: రమేశ్‌బాబు, పశుసంవర్ధక శాఖ జేడీ ప్రభుత్వం తడకనపల్లిలో పశువుల హాస్టల్ ఏర్పాటు చేయడం ఒక మంచి ఉద్దేశం. మహిళలు చిన్నచిన్న ఇళ్లల్లో గేదెలను కట్టుకోలేక ఇబ్బంది పడుతుంటారు. స్థలం లేక ఇంటి బయట షెడ్డు వేసి ఉంచుతున్నారు. అలాంటి వాతావరణంలో పశువుల ఆరోగ్యానికి రక్షణ ఉండదు. పాల ఉత్పత్తి కూడా వాటి స్వస్థతను బట్టి ఉంటుంది. ఇక్కడ పశువుల హాస్టల్ ఏర్పాటు చేయడం వల్ల గ్రామం పాల ఉత్పత్తి కేంద్రంగా మారింది. పశువైద్యం కూడా ఒకేచోట లభిస్తోంది. చిన్నటేకూరు పశువైద్యుని పర్యవేక్షణ ఉంటుంది. -
కుప్పంలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, చిత్తూరు: కుప్పంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో గురువారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సైబర్ డైనమిక్ పాల ఉత్పత్తి కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో యాజమాన్యం ఊపిరిపీల్చుకుంది. షార్ట్ సర్క్యూట్‌తోనే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. భారీగా అస్తి నష్టం సంభవించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. -
నాసిరకం సెమన్‌తో చిక్కులు.. అందుకే
సాక్షి, అమరావతి: పశువుల పునరుత్పత్తి విషయంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టబోతోంది. ఎవరుపడితే వారు, ఎలాబడితే అలా పశు వీర్యాన్ని ఉత్పత్తి చేయడం, ఎదకొచ్చిన పశువులను ఇష్టమొచ్చిన రీతిలో ఎద కట్టించడం, అనైతిక పశు సంపర్కం చేయించటం ఇకపై చెల్లదు. మేలు జాతి పశువుల పునరుత్పత్తి, అధిక పాల దిగుబడి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ పశు పునరుత్పత్తి చట్టం (ఏపీ బోవైన్ బ్రీడింగ్ యాక్ట్–21)ను తీసుకురాబోతోంది. తద్వారా నాసిరకం పశు వీర్యోత్పత్తి, అనైతిక పద్ధతుల్లో పశు సంపర్కానికి పాల్పడే వారికి అడ్డుకట్ట వేయడమే కాకుండా దేశీయ మేలు జాతి పశు సంతతిని భవిష్యత్ తరాలకు అందించే లక్ష్యంతో కొత్త చట్టం అమల్లోకి రానుంది. నాసిరకం సెమన్‌తో చిక్కులు కొంతమంది స్వార్ధపరులు ఎక్కడపడితే అక్కడ నాసిరకం పశువుల నుంచి వీర్యోత్పత్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఒక్కొక్క వీర్య నాళికను రూ.40కి సరఫరా చేస్తుంటే.. ప్రైవేటు వ్యక్తులు నాసిరకం వీర్యాన్ని ఉత్పత్తి చేస్తూ ఒక్కో నాళికను రూ.10, రూ.15కే సరఫరా చేస్తున్నారు. మేలు జాతి పశు వీర్యమని రైతుల్ని నమ్మబలికి ఎదకొచ్చిన పశువులకు వాటితో కృత్రిమ గర్భధారణ చేయిస్తున్నారు. దీనివల్ల్ల మేలు జాతి పశువులు అంతరించిపోవడంతోపాటు పాల దిగుబడి గణనీయంగా పడిపోయే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నాసిరకం వీర్యోత్పత్తి, అమ్మకాలు, పశువులకు కృత్రిమ గర్భధారణ చేయిస్తున్న వారికి అడ్డుకట్ట వేసేందుకు సరైన చట్టాలు లేకపోవడంతో వారిని నియంత్రించలేని పరిస్థితులు ఉన్నాయి. హైబ్రీడ్ రకాలతో రోగాలు క్షీర విప్లవంలో భాగంగా అధిక పాల ఉత్పత్తే లక్ష్యంగా చలి దేశాలైన అమెరికా, డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న పశువుల వీర్యంతో దేశీయ పశువుల పునరుత్పత్తి చేసేవారు. హైబ్రీడ్ జాతుల వీర్యంతో పశువుల్ని చూడి కట్టించటం వల్ల పాల ఉత్పత్తి పెరిగింది. కానీ.. పుట్టే పశువులు గతంలో ఎన్నడూ చూడని వ్యాధుల బారిన పడటంతోపాటు అనేక దుష్పరిణామాలు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి వాటికి ఇక చెక్ ఎవరుబడితే వారు నాసిరకం వీర్యాన్ని సరఫరా చేయడం, హైబ్రీడ్ రకాలతో చూడి కట్టించడం వంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు కేంద్రం ఆదేశాల మేరకు ఏపీ బోవైన్ బ్రీడింగ్ యాక్ట్–21ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో ఈ తరహా చట్టాలున్నాయి. ఈ యాక్ట్ ప్రకారం ఇక నుంచి ఏ జాతి పశువుల వీర్యాన్ని ఆ జాతి పశువులకే వాడాలి. జాతి గేదెలను అప్‌గ్రేడ్ చేయాలంటే ముర్రా జాతి పశు వీర్యాన్ని మాత్రమే వాడాలి. సంకర జాతి పశువులను గిర్, షాహివాల్, కాంక్రీజ్ వంటి జాతి పశువులతోనే సంకర పర్చాలి. ఇష్టమొచ్చిన రీతిలో నాసిరకం పశు వీర్యాన్ని ఉత్పత్తి చేయడం, అమ్మడం, చూడి కట్టించడం వంటి అనైతిక చర్యలకు పాల్పడే వారిపై ఈ చట్టం క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. నాసిరకం వీర్యోత్పత్తికి అడ్డుకట్ట అంతరించిపోతున్న మేలు జాతి పశువులను పరిరక్షించుకోవడంతో పాటు నాసిరకం వీర్యోత్పత్తికి అడ్డుకట్ట వేయడం, పాల ఉత్పత్తిని రెట్టింపు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ బోవైన్ బ్రీడింగ్ యాక్ట్–21ను తీసుకొస్తోంది. ఈ యాక్ట్ వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. అధిక పాల దిగుబడులనిచ్చే పశువుల పునరుత్పత్తికి బాటలు వేస్తుంది. – దామోదర్‌నాయుడు, సీఈవో, ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ -
కాలగర్భంలో కలిసిపోయిన మిలటరీ ఫామ్స్
న్యూఢిల్లీ: సైనిక యూనిట్లకు పాలు సరఫరా చేసేందుకు బ్రిటిష్ పాలకులు ఏర్పాటు చేసిన మిలటరీ ఫామ్స్ కాలగర్భంలో కలిసిపోయాయి. సైనిక సంస్కరణలలో భాగంగా వీటిని మూసివేసినట్లు భారత సైన్యం బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 132 ఏళ్లుగా సేవలందిస్తూ వచ్చిన పాల ఉత్పత్తి కేంద్రాలు మూతపడ్డాయి. దేశవ్యాప్తంగా పలు కంటోన్మెంట్లలో మిలటరీ ఫామ్స్ ఉన్నాయి. వీటిలో 25 వేల ఆవులు/గేదెలు ఉన్నట్లు అంచనా. ఇవి నిత్యం వేలాది లీటర్ల పాలు ఇచ్చేవి. భారత్‌లో మొదటి మిలటరీ ఫామ్ 1889 ఫిబ్రవరి 1న అలహాబాద్‌లో ప్రారంభమయ్యింది. స్వాతంత్య్రం వచ్చే నాటికి 130 ఫామ్‌లు, 30 వేల ఆవులు/గేదెలు ఉన్నాయి. 20 వేల ఎకరాల్లో వీటిని ఏర్పాటు చేశారు. మిల్క్ ఫామ్స్ నిర్వహణ కోసం సైన్యం ప్రతిఏటా రూ.300 కోట్లు ఖర్చు చేసేది. ఫామ్స్‌ను మూసివేయడంతో వీటిలో ఉన్న ఆవులు, గేదెలను ప్రభుత్వ విభాగాలకు, డెయిరీ సహకార సంఘాలకు తక్కువ ధరకే ఇవ్వాలని నిర్ణయించారు. ఇక్కడ చదవండి: కేంద్రం యూటర్న్ : ఏప్రిల్ ఫూల్ జోకా? సుప్రీంకోర్టుకు ‘సాగు చట్టాల’పై నివేదిక -
వెన్న రుచికరమే కాదు...ఆరోగ్యకరం కూడా!
ఇటీవల నూనెల వాడకం బాగా పెరిగాక వెన్నను గతంలోలా మునపటంత విరివిగా ఉపయోగించడం లేదు. కానీ నిజానికి వెన్న చాలా మంచి ఆరోగ్యకరమైన ఆహారం. వెన్నలోని కొన్ని పోషకాలూ, వాటితో కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం. వెన్నలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె2 చాలా ఎక్కువ. వాటితో పాటు ఇందులో బ్యుటిరేట్, కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్ఏ) అనే పోషకాలు ఉన్నాయి. వెన్నలోని కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్ఏ) గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వెన్నలోని బ్యుటిరేట్ అనే పోషకం అనేక మానసిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు... ఇది మంచి శక్తివనరు. మన జీవక్రియలకు అవసరమైన శక్తిని ఇది సమకూరుస్తుంది. మనం తిన్న ఆహారం చిన్నపేగుల్లోకి ప్రవేశించాక... అక్కడ ఆ జీర్ణాహారం ఏమాత్రం వృథాపోకుండా అంతా ఒంటికి పట్టేలా చేస్తుంది వెన్నలోని ఈ బ్యుటిరేట్. బ్యూటిరేట్కు మరో మంచి లక్షణం కూడా ఉంది. చిన్న పేగుల్లో ఇన్ఫ్లమేషన్ను కూడా అది సమర్థంగా తగ్గిస్తుంది. -
అవినీతికి తావు లేకుండా చూడాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి : స్వయం ఉపాధి కల్పనలో మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ చేయూత పథకంలో లబ్ధిదారులకు ఇచ్చే ఆవులు, గేదెల కొనుగోలులో నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు ఏ ఆవు లేదా గేదె కొనవచ్చు అన్నది మాత్రమే సూచించాలని తుది నిర్ణయం వారికే వదిలేయాలన్నారు. వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల అమలుపై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్ చేయూత పథకంలో మహిళలకు ఉపాధి కల్పనపై పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నందున ఎక్కడా లోపం లేకుండా చూసుకోవాలని సూచించారు. చదవండి: రేపే జగనన్న విద్యా కానుక ఉపాధి కోరుతున్న మహిళలు నిజంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని అభివృద్ధి చెందాలని ఆశించారు. దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలనని ఆదేశించారు. కిరాణా షాపుల నిర్వాహకులకు ఏ సమస్య వచ్చినా, ఎక్కడైనా, ఎవరైనా లంచం అడిగినా, వెంటనే ఫోన్ చేసేందుకు వారికి ఒక నెంబరు ఇవ్వాలన్నారు. ఆ నెంబర్‌ను షాపు వద్ద ప్రదర్శించాలని తెలిపారు. వ్యవస్థలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా చూడాలని, లేకపోతే విశ్వాసం కోల్పోతామని హెచ్చరించారు. లబ్దిదారుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం రాకుండా చూడాలని పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటవుతున్న షాపులకు ఒక బ్రాండింగ్ తీసుకురావాలని, వాటికి తగిన ప్రాచుర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. చదవండి: మహిళల ఆధ్వర్యంలో పాల సేకరణ కేంద్రాలు అవినీతికి తావునివ్వొద్దు వైఎస్సార్ చేయూత పథకంలో లబ్ధిదారులు ఆవు, గేదె ఏది తీసుకున్నా నాణ్యత ఉండేలా చూసుకోవాలని, ప్రభుత్వం తరపున వెటర్నరీ వైద్యుడి ద్వారా ఆ భరోసా కల్పించాలని సూచించారు. అన్ని విధాలుగా పరీక్షించిన తర్వాతే వారు ఏ ఆవు లేదా గేదె తీసుకోవాలో సూచించాలని, దీని కోసం ఎస్ఓపీ రూపొందించుకోవాలన్నారు. ఎక్కడైనా ప్రభుత్వం ఏదైనా ఇచ్చినప్పుడు సబ్సిడీ వస్తుందని, అప్పుడే అవినీతికి తెర లేస్తుందన్నారు. కానీ ఇక్కడ సబ్సిడీ లేకుండా లబ్ధిదారులకు నేరుగా నగదు ఇస్తున్నామన్నారు.అందుకే ఎలాంటి అవినీతికి తావు ఉండకూడదని ఆదేశించారు. ఇక పథకంలో ఆవు లేదా గేదె పొందిన వారికి ఆర్బీకేల ద్వారా పశు గ్రాసం కూడా పంపిణీ చేయాలని పేర్కొన్నారు. పశువుల సేకరణ, వాటికి దాణా, అవసరమైన మందుల పంపిణీ ప్రక్రియలో అమూల్ సంస్థ కూడా పాలు పంచుకోవాలని తెలిపారు. చదవండి: 42.43 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి నాణ్యత ముఖ్యం -మేలుజాతి ఆవులు, గేదెలు మాత్రమే కొనుగోలు చేయాలి. -అదే విధంగా నాణ్యతతో కూడిన నిర్వహణ (క్వాలిటీ ఆఫ్ మెయింటెనన్స్) కూడా ఎంతో ముఖ్యం. -ఇందులో వెటర్నరీ యూనివర్సిటీ నిపుణులను కూడా ఇన్వాల్వ్ చేయండి. మేకలు–గొర్రెలు – మేకలు, గొర్రెలలో ఆడ, మగ రెండూ సేకరించాలి. – లబ్ధిదారులకు ఇస్తున్న రూ.75 వేలకు ఎన్ని మేకలు, గొర్రెలు వస్తే అన్నీ తీసుకోవాలి. – లబ్ధిదారులకు ఒక మగ మేకపోతు లేక గొర్రెపోతు తప్పనిసరిగా ఇవ్వాలి. – అదే విధంగా ఏ మాంసానికి (మేక లేక గొర్రె) డిమాండ్ ఉందో, ఉంటుందో తెలుసుకుని, వాటిని ఎక్కువగా సేకరించాలి. – ఇంకా ఏది పెంచుకుని, అమ్ముకుంటే ఎక్కువ లాభం ఉంటుందో తెలుసుకుని వాటిని లబ్ధిదారులకు ఇవ్వాలి. – మేకలు, గొర్రెల సేకరణలో కూడా పక్కాగా ఎస్ఓపీ ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు. పథకాలు–లబ్ధిదారులు అదే విధంగా రాష్ట్రంలో వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా అమలుపై సమీక్షా సమావేశంలో అధికారులు పూర్తి వివరాలు తెలిపారు. పథకంలో ఇప్పుడు 21 లక్షల లబ్ధిదారులు ఉండగా, వారికి రూ.3937 కోట్లు,వైఎస్సార్ ఆసరా పథకంలో 87.74 లక్షల లబ్ధిదారులు ఉండగా వారికి రూ.6792 కోట్ల నిధులు విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. వారిలో స్వయం సహాయక బృందాలకు చెందిన 13.03 లక్షల మహిళలు రెండు పథకాల్లో ప్రయోజనం పొందారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 33,486 ఔట్లెట్లు (కిరాణా దుకాణాలు) ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 8,836 ఔట్లెట్లు ఏర్పాటయ్యాయని, మిగిలినవి కూడా ఈ నెలాఖరులోగా ఏర్పాటవుతాయన్న అధికారులు, ఆ తర్వాత వాటి సంఖ్య ఇంకా పెరుగుతుందని చెప్పారు. పాల ఉత్పత్తి రాష్ట్రంలో రోజూ 412.1 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయన్న అధికారులు, 9,889 గ్రామాల్లో పాల ఉత్పత్తి బాగా ఉందని తెలిపారు. వాటిలోనూ పాలు అత్యధికంగా ఉత్పత్తి అవుతున్న 6,510 గ్రామాల్లో పాల సేకరణకు ఆర్బీకేల వద్ద అదనంగా గదులు నిర్మించాలని ప్రతిపాదించామని, తద్వారా రోజూ 75 లక్షల లీటర్ల పాలు సేకరించవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా… ఆ 6510 గ్రామాల్లో 1000 నుంచి 5 వేల లీటర్ల సామర్థ్యంతో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ) ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం మీద రాష్ట్రంలో వచ్చే ఏడాది జూలై 31 నాటికి, బీఎంసీయూల ఏర్పాటుతో పాటు, పాల సేకరణ ప్రక్రియ మొదలవుతుందని అధికారులు వివరించారు. ఆవులు, గేదెల కొనుగోలు రాష్ట్రంలో 3.43 లక్షల గేదెలు, 2.20 లక్షల ఆవులు కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సమావేశంలో ఆ శాఖ అధికారులు వెల్లడించారు. తొలి ఏడాది 40 వేల ఆవులు, 55 వేల గేదెలు, రెండో ఏడాది 1.80 లక్షల ఆవులు, 2.88 లక్షల గేదెలు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా 2.97 లక్షల మేకలు, గొర్రెలు సేకరించి పంపిణీ చేయనున్నట్లు అధికారులు వివరించారు. ఈ సమావేశానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీతో పాటు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
పాలు వృథా.. రైతుకు వ్యథ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రం లాక్డౌన్ కావడం పాడిరైతుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రోజువారీ పాల దిగుబడులను ఎలా విక్రయించాలనే అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.ఆదివారం జనతా కర్ఫ్యూతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని హోటళ్లు, స్వీట్ షాప్‌లు, పాల ఉత్పత్తి సంస్థలు మూతపడ్డాయి. తాజాగా లాక్‌డౌన్‌తో ఈ నెల 31వరకు ఈ కేంద్రాలు తెరుచుకునే పరిస్థితి లేదు.దీంతో పాల దిగుబడులను ఎక్కడ విక్రయించాలో అర్థం కాని స్థితి నెలకొంది. రాష్ట్ర పశుసంవర్ధక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 36.79లక్షల పాలిచ్చే గేదెలు, ఆవులున్నాయి. వీటి ద్వారా రోజుకు సగటున 56.74లక్షల లీటర్ల పాలు ఉత్పత్తవుతున్నాయి. రాష్ట్రంలో రోజుకు సగటున కోటిన్నర లీటర్ల పాల డిమాండ్ ఉండగా... ఇందులో రెండొంతుల పాలు ఇతర రాష్ట్రాల నుంచే సరఫరా అవుతు న్నాయి. సరిహద్దులు మూసుకోవడంతో పొరుగు నుంచి వచ్చే దిగుబడులు నిలిచిపోగా... రాష్ట్రంలో ఉత్పత్తయ్యే పాల వినియోగం గణనీయంగా పడిపోయింది. వాణిజ్య అవసరాలకే ఎక్కువ... పాల ఎక్కువగా గృహ అవసరాల కంటే వాణిజ్య అవసరాలకే వినియోగిస్తున్నారు. దాదాపు 75శాతం పాల దిగుబడులు హోటళ్లు, రెస్టారెంట్లు, స్వీట్ హౌస్‌లు, పాల ఉత్పత్తి చేపట్టే సంస్థలు కొనుగోలు చేస్తుండగా... మిగతా పాలు ప్యాకెట్లు, చిల్లర విక్రయాల ద్వారా అమ్ముతున్నారు. తాజా పరిస్థితులు గృహ అవసరాలకు సరిపడా పాలను విక్రయించడం కష్టం కాగా... హోటళ్లు, పాల ఉత్పత్తులు చేపట్టే వాణిజ్య సంస్థలు, వ్యాపారులు కొనుగోళ్లను నిలిపివేశారు. దీంతో పాల డిమాండ్ గణనీయంగా పడిపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పాడిరైతులు రోజువారీ పాల దిగుబడులను సమీపంలోని పాల సేకరణ కేంద్రాల్లో విక్రయిస్తుంటారు. కొంత మంది హోటళ్లు, రెస్టారెంట్లకు అందిస్తున్నప్పటికీ అలాంటి వారి సంఖ్య తక్కువగా ఉంటుంది.కేంద్రాల ద్వారా సేకరించిన పాలను ఆయా నిర్వాహకులు ఇతర వాణిజ్య సంస్థలకు విక్రయిస్తుంటారు. ప్రస్తుతం రాష్ట్రం లాక్ కావడంతో వాణిజ్య సముదాయాలు, వాపార సంస్థలు మూతపడ్డాయి. దీంతో పాల విక్రయం నిలిచిపోయింది. దీంతో కేంద్రాలకు పాల దిగుబడులను తీసుకురావొద్దని పాడిరైతులను స్పష్టం చేస్తున్నారు. రోజువారీగా గృహ అవసరాల కోసం అమ్మకాలు జరుగుతున్నా ఎక్కువ మొత్తంలో పాలు మిగిలిపోతున్నాయి. దీంతో రోజువారీ దిగుబడులను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పాడి పశువులకు పశుగ్రాసం, దాణా తప్పదని, అందుకు ఖర్చులు భరించాల్సిందేనని, దీంతో నష్టపోతామని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన రైతు ‘సాక్షి’ వద్ద ఆందోళన వ్యక్తం చేశాడు. -
సేంద్రియ పాల ఆవశ్యకత
రైతులకు బాసటగా నిలుస్తున్నది. మన దేశం సగటున రోజుకు 170 మిలియన్ టన్నుల పాలను ఉత్పత్తి చేస్తూ, ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. అధిక పాల ఉత్పత్తితో పాటుగా, నాణ్యమైన పాలను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సేంద్రియ పాల ఉత్పత్తి ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ పూర్వరంగంలో మనం కూడా సేంద్రియ పాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. భూమిలో సేంద్రియ ఎరువులు వేసి పండించిన దాణాలను, పశుగ్రాసాలను మేసిన పశువులు ఇచ్చే పాలే సేంద్రియ పాలు. ఇందులో ఎటువంటి రసాయనిక అవశేషాలు ఉండవు. సేంద్రియ పాలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.. ► రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గడం, తద్వారా ఖర్చు తగ్గడం. ► రసాయనిక ఎరువులు, పురుగుమందుల అవశేషాలు లేని నాణ్యమైన, కల్తీ లేని పాలను ఉత్పత్తి చేయటం. ► సేంద్రియ పాలలో ఒమెగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేస్తాయి. అలానే పాలీ సాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఎక్కువే. ► సేంద్రియ పాల పదార్థాలలో ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది. ► రసాయనిక ఎరువుల అవశేషాలు పాల ద్వారా మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు అవి శరీరంలోని ముఖ్యభాగాలను – కాలేయాన్ని, మూత్రపిండాలను, పేగులను దెబ్బతీస్తాయి. ► సేంద్రియ పాలను ఉత్పత్తి చేయటం అంత తేలికైన విషయం కాదు. పశువుకు మేపే దాణా, మేత మొత్తాన్నీ సేంద్రియ పద్ధతుల్లోనే పండించాలి. మొక్కజొన్న, జొన్నలు, తవుడు మొదలైనవి. ► సాధారణంగా భూమిలో మేలు చేసే సూక్ష్మజీవులు చాలా ఉంటాయి. రసాయనిక ఎరువుల వాడకం వలన ఇవి నశిస్తాయి. దీని వలన భూసారం తగ్గిపోయి, భూమి తన ఉత్పాదక శక్తిని కోల్పోతుంది. ► రసాయనిక ఎరువులు గాని, పురుగుమందులు గాని పశుగ్రాసాల సాగులో వాడితే ఆ పశుగ్రాసాలను తిన్న పశువుల పాలలో వాటి అవశేషాలు పేరుకుంటాయి. కొవ్వులతో జత కట్టే గుణం రసాయనాలకు ఉండటమే ఇందుకు కారణం. ఇటువంటి పాలు అనారోగ్యాన్ని కలిగిస్తాయి. ► పిల్లలు త్వరగా పరిపక్వ దశకు రావడానికి కూడా ఇదే కారణం. కాబట్టి సేంద్రియ పాల ఉత్పత్తిపై దృష్టి పెట్టడం ఉత్తమం. – డా. ఎం.వి.ఎ.ఎన్. సూర్యనారాయణ, ప్రొఫెసర్ అండ్ హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవ్‌స్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి. -
పాలు ‘ప్రైవేటు’కే!
సాక్షి, ఖమ్మం :ప్రభుత్వ సంస్థకు పాలు పోసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. ‘విజయ’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం పాడి పరిశ్రమను నిర్వహిస్తుండగా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మినహా అన్ని జిల్లాల్లో మంచి ఫలితాలు ఇస్తోంది. ఉభయ జిల్లాల్లో విజయ పాల ఉత్పత్తులకు ఏటేటా డిమాండ్ పెరుగుతుండగా.. ఇక్కడ మాత్రం పాల సేకరణ ఏడాదికేడాది తగ్గుతోంది. ఉమ్మడి జిల్లాలో బల్క్ మిల్క్ సెంటర్లు 9 ఉన్నాయి. వీటిలో సత్తుపల్లి, మధిర సెంటర్లలో పాల సేకరణ పూర్తిగా నిలిచిపోగా.. కల్లూరులో నామమాత్రంగా సాగుతోంది. ఇదే బాటలో ఇల్లెందు, కామేపల్లి సెంటర్లు కూడా ఉన్నాయి. మొత్తంగా 9 సెంటర్ల నుంచి నెలలో రోజుకు 9,777 లీటర్ల పాల సేకరణ జరుగుతోంది. ఇవే సెంటర్ల నుంచి గత ఏడాది నవంబర్‌లో రోజుకు 13,515 లీటర్ల పాలను సేకరించారు. మూడేళ్ల క్రితం ఉమ్మడి జిల్లాలో రోజుకు 24వేల లీటర్ల పాలను సేకరించిన సందర్భాలున్నాయి. అయితే ప్రభుత్వ పాల సేకరణ తగ్గి పోతున్నా.. ప్రజల్లో(వినియోగదారులు) మా త్రం విజయ పాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో నిత్యం విజయ పాల విక్రయాలు 11వేల లీటర్లకు పైగా ఉన్నాయి. 1,200 కిలోల పెరుగు రోజూ విక్రయం జరుగుతోంది. అంటే.. పాల సేకరణకన్నా దాదాపు ఉమ్మడి జిల్లాలో 3వేల లీటర్ల పాలు, పాల ఉత్పత్తుల వినియోగం ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. స్థానికంగా సేకరించే పాలు విక్రయించడానికి సరిపోకపోవడంతో జనగామ జిల్లా నుంచి నిత్యం 1,200 లీటర్ల పాలను తెప్పించి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పాడి పరిశ్రమ పాల సేకరణలో ఫలితాలను రాబట్టలేకపోయినా.. విజయ పాలను, పాల ఉత్పత్తుల వినియోగాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెంచుకోగలుగుతోంది. ఉమ్మడి జిల్లాలో నిత్యం 70వేల లీటర్ల వరకు వినియోగం అవుతుండగా.. ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీలు 50వేల లీటర్లను మాత్రమే సేకరిస్తున్నాయి. అంటే.. మరో 20వేల లీటర్లు ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రం(ఏపీ) నుంచి దిగుమతి అవుతున్నాయి. ప్రైవేటు డెయిరీలకు రైతుల ప్రాధాన్యం.. ఉమ్మడి జిల్లాలో పాల ఉత్పత్తిదారులు ప్రైవేటు డెయిరీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ డెయిరీతోపాటు సుమారు 14 ప్రైవేటు డెయిరీలు నిర్వహణలో ఉన్నాయి. ప్రభుత్వ డెయిరీకన్నా రైతులకు ప్రైవేటు డెయిరీలు కొంత ఎక్కువగా పాల ధర చెల్లిస్తున్నాయి. దీంతో రైతులు వాటి వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాక ఇటీవలి వరకు ప్రభుత్వ డెయిరీలో పాల బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరిగేది. దీంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్రైవేటు డెయిరీలు క్రమం తప్పకుండా పాల బిల్లులు చెల్లింస్తుండడంతో రైతులు వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాక ఆంధ్ర రాష్ట్రానికి ఖమ్మం జిల్లా సరిహద్దున ఉండడంతో ప్రైవేటు డెయిరీల ప్రభావం ఎక్కువగా ఉంది. అక్కడ నిర్వహణలో ఉన్న డెయిరీలు కూడా ఇక్కడ పాల సేకరణ, విక్రయాలు నిర్వహిస్తున్నాయి. వాటి ప్రభావం కూడా ప్రభుత్వ డెయిరీపై పడుతోంది. ఫలించని ప్రభుత్వ చర్యలు.. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాల సేకరణ గణనీయంగా తగ్గుతోంది. జనగామ, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల్లో లక్ష్యాన్ని మించి పాల సేకరణ జరుగుతోంది. ఆ తరహాలోనే ఖమ్మం జిల్లాను కూడా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే లీటరుకు ప్రభుత్వం రూ.4 చొప్పున ప్రోత్సాహకంగా ఇస్తోంది. వాటితోపాటు రాయితీపై గేదెలు, దాణా, మందులు అందించే చర్యలు చేపట్టింది. పాడి పశువులకు, రైతులకు బీమా సౌకర్యాన్ని కూడా కల్పించింది. రైతుల పిల్లలు 9, 10, ఇంటర్ చదువుతున్న వారికి ఏడాదికి రూ.1,200 స్కాలర్షిప్ సౌకర్యాన్ని కూడా అందించే పథకాన్ని ముందుకు తెచ్చింది. ఇన్ని ప్రో త్సాహకాలు కల్పిస్తున్నప్పటికీ ఉమ్మడి జి ల్లాలో ప్రభుత్వం పాల సేకరణను రైతులు ఆదరించడం లేదు. దీంతో జిల్లా పాడి పరిశ్రమ పాల సేకరణలో ఫలితాన్ని సాధించలేకపోతోంది. పాల సేకరణను పెంచేందుకు కృషి.. పాల సేకరణలో ఉమ్మడి ఖమ్మం వెనుకబడి ఉంది. దీనిని అధిగవిుంచేందుకు కృషి చేస్తున్నాం. జిల్లాలో విజయ పాల పట్ల ప్రజల ఆదరణ బాగుంది. రైతుల నుంచి ఆదరణ పొందేందుకు కృషి జరుగుతోంది. ప్రభుత్వ డెయిరీ వల్ల కలిగే ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించే చర్యలు చేపట్టాం. ఖమ్మం పాల డెయిరీకి పూర్వ వైభవం తీసుకొస్తాం. – కె.శ్రావణ్‌కుమార్, డిప్యూటీ డైరెక్టర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా -
గొర్రెల లెక్కల్లేవ్.. ‘పాల’ పెంపులేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తొలిసారి తన సొంత శాఖ అధికారులపైనే తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో పూర్తి అలక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెడుతున్నారని చుర్రుమన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు లబ్ధిదారుల వద్ద ఉన్నాయా? లేదా? అనే అంశంపై సర్వే నిర్వహించాలని గత సమావేశంలో ఆదేశించినప్పటికీ, ఆ దిశగా చేసిన ప్రయత్నాలేమీ కనిపించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెంచాలని సూచించినా ఆ దిశగా కార్యాచరణ లేకపోవడంపై ఒంటికాలిపై లేచారు. శనివారం మాసాబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో అన్ని జిల్లాల పశు వైద్యాధికారులతో మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. తలసాని మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో మందులు, పరికరాలు ఉన్నప్పటికీ జీవాలకు వైద్యం అందించడంలో కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు వచ్చిన విషయాన్ని ప్రస్తావించి, ఇకపై అలసత్వంగా వ్యవహరించే అధికారులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. బాధ్యత మీదే.. పాల ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యంతో పాడిగేదెలు పంపిణీ చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఆశించినస్థాయిలో పాల ఉత్పత్తి పెరగడంలేదని, ఇందుకు గల కారణాలను సమీక్షించుకోవాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. ప్రభుత్వ పథకాల అమలు పట్ల అలసత్వం వహిస్తే చూస్తు సహించేదిలేదని హెచ్చరించారు. సమావేశంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి, విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావు, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, వివిధ జిల్లాల పశువైద్యాధికారులు పాల్గొన్నారు. -
'చక్కెర కర్మాగారాలకు పునర్ వైభవం తేవాలి'
సాక్షి, అమరావతి : సహకార చక్కెర కర్మాగారాలు, సహకార డెయిరీలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సహకార చక్కెర కర్మాగారాల పునర్ వైభవానికి సమగ్ర ప్రణాళిక తయారుచేయాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం పనిచేస్తున్న కర్మాగారాలు, తిరిగి తెరవాల్సిన కర్మాగారాల విషయంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఇప్పుడున్న పోటీని తట్టుకోవడానికి, లాభదాయకంగా నడపడానికి అవసరమైన చర్యలను అందులో పొందుపరచాలన్నారు. కర్మాగారాలను తాజా సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిచేయడంతో పాటు ఉప ఉత్పత్తులు ద్వారా అవి సొంతకాళ్లమీద నిలబడ్డానికి అవసరమైన అన్ని ఆలోచనలు చేయాలని నిర్దేశించారు. చక్కెర సరఫరా చేసినందుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వీలైనంత త్వరలో చెల్లించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రణాళికలో నిర్దేశించిన విధంగా సహకార డెయిరీలకు పాలు పోస్తున్నందుకు ప్రతి లీటరుకూ రూ.4ల బోనస్ అమలుపైనా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సహకార డెయిరీల బలోపేతం, రైతులకు మరింత లబ్ధి చేకూర్చే అన్నిరకాల చర్యలపైనా వీలైనంత త్వరగా ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సీఎం ఆదేశించారు. -
మురిసిన సిరిసిల్ల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాల వినియోగంలో రాజన్న సిరిసిల్ల, ఖమ్మం జిల్లాలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. రాష్ట్ర తలసరి వినియోగం కంటే ఆ రెండు జిల్లాలు ముందుండటం గమనార్హం. కాగా ఆదిలాబాద్ జిల్లా మాత్రం చిట్టచివరి స్థానంలో నిలిచింది. పశుసంవర్థశాఖ విడుదల చేసిన 2018–19 ఆర్థిక ఏడాది పాలనా నివేదిక ప్రకారం రాష్ట్ర తలసరి పాల వినియోగం నెలకు 4.6 లీటర్లుగా ఉంది. జిల్లాల ప్రకారం చూస్తే అత్యధికంగా రాజన్న సిరిసిల్ల నెలకు 6.3 లీటర్ల తలసరి వినియోగంతో టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత ఖమ్మం జిల్లా 5.5 లీటర్లతో రెండో స్థానంలో నిలిచినట్లు నివేదిక తెలిపింది. పాల ఉత్పత్తిలో దేశంలో 13వ స్థానం ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారత్ మొదటిస్థానంలో ఉండగా తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో పాల సేకరణ 3.92 లక్షల లీటర్లు ఉండగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో 7 లక్షల లీటర్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు విజయ డెయిరీ తన నివేదికలో తెలిపింది. 2025 నాటికి ఏకంగా 10 లక్షల లీటర్లు సేకరించి పురోగమించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు నివేదికలో స్పష్టంచేసింది. 57,538 పాడి పశువుల పంపిణీ సహకార డెయిరీలకు పాలు పోసే 2.13 లక్షల మంది రైతులకు పాడి పశువులను సబ్సిడీపై అందజేయాలని గతేడాది ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రూ. 1677 కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ పాడి రైతులకు 75%, ఇతర రైతులకు 50%సబ్సిడీపై పాడి పశువులను అందజేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 57,538 మంది పాడి రైతులకు గేదెలు, ఆవులను సబ్సిడీపై అందజేశారు. -
లీటర్‌కు రూ. 4 బోనస్!
‘ఇదిగో ఇటు చూడండి.. ఇది మంచి నీళ్ల సీసా. లీటర్ ధర అక్షరాల రూ. 20. ఇదిగో ఇది పాల సీసా.. లీటర్ పాలకు రైతుకు ఇచ్చే ధర రూ. 22, 23. నీళ్ల ధర, పాల సేకరణ ధర ఒకటే అయితే పాడి రైతు బతికేదెలా? ఆ కుటుంబం గడిచేదెలా?‘ అన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన. పాడి ఉన్న ఇంట సిరులు విరజిల్లునంట అనే సామెత పాతబడింది. పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ది దేశంలో ఐదోస్థానం. 47 లక్షల పశువులు (ఆవులు, గొర్రెలు, మేకలు), 64.62 లక్షల గేదెలు ఉన్నట్టు పశుసంవర్థక శాఖ అంచనా. లక్షలాది మంది రైతులు పాడి పశువుల పెంపకంతో జీవనాన్ని సాగిస్తున్నారు. ప్రస్తుతం 133 లక్షల మెట్రిక్ టన్నుల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. మొత్తం పాల ఉత్పత్తిలో 69 శాతంతో ఆవు పాలు అగ్రస్థానంలో ఉండగా గేదె పాలు ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ధరలో కూడా ఈ రెండింటికీ తేడా ఉంది. 2023 నాటికి పాల ఉత్పత్తి సుమారు 20 బిలియన్ లీటర్లకు చేరుతుందని అంచనా. కరవొచ్చినా కాటకం వచ్చినా ఇబ్బంది పడకుండా పాడి కాపాడుతుంది. ఏడాది పొడవునా అంతో ఇంతో ఆదాయం వస్తుందని పెద్దలు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. చంద్రబాబుకు కరవుకు అవినాభావ సంబంధం ఉంటుందన్నది నానుడి. దానికి తగ్గట్టే నాలుగైదు ఏళ్లుగా మృగశిర కార్తె చిందేయడం మానేసింది. ముసలి ఎద్దు రంకె వేయడమూ ఆగింది. కరవు, పశుగ్రాసం కొరతతో పశువులు కబేళాలకు తరలుతున్నాయి. మరోపక్క పశువుల దాణా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. తవుడు, చిట్టు, చెక్క ధరలు భారీగా పెరిగాయి. పాడి రైతులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ స్థాయిలో పాల సేకరణ ధరలు మాత్రం పెరగలేదు. దీంతో తీవ్ర నిరాశా నిస్పృహలతో రైతులు పాడిని వదిలేసుకుంటున్నారు. పశువు పోయాక పాడి బయటపడినట్టుగా– పాలు పోయించుకుంటున్న పాల సంఘాలు రైతులకు సకాలంలో చెల్లింపులు చేయడం లేదు. బకాయిలు పేరుకుపోతున్నాయి. సహకార డైరీలకు ప్రభుత్వం మొండి చేయి చూపడంతో మూతపడుతున్నాయి. హెరిటేజ్ వంటి ప్రైవేటు సంస్థలకు ఇది వరంగా మారింది. రైతుల ఆర్థిక అవసరాలను ఆసరా చేసుకుని బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నాయి. 2015 మే నెలకు ముందు లీటర్ పాల ఉత్పత్తికి 26 రూపాయలు ఖర్చయ్యేది. కరవు పరిస్థితుల నేపథ్యంలో ఆ ధర రూ. 30 దాటి పోయింది. కానీ, పాల సేకరణ ధర మాత్రం రూ. 18 నుంచి 28 మధ్యే ఉంది. పాలలో వచ్చే వెన్న శాతాన్ని బట్టి ఈ ధర ఉంటుంది. 2015 మే నెలకు ముందు పాల సేకరణ ధర రూ.32, 35 మధ్య ఉండేది. ఉత్పత్తి పెరిగిందన్న సాకుతో ధరను తగ్గించి పాడి రైతుల నోట మట్టికొడుతున్నారు. లీటర్ నీళ్ల ధర రూ.20గా ఉంటే పాల సేకరణ ధర 23, 24 రూపాయలకు మించడం లేదు (గేదె పాల ధర రూ.28 నుంచి 34 మధ్య ఉంటుంది). అంతర్జాతీయ మార్కెట్లో మిగులు పేరిట పెద్ద కంపెనీలు ధరలు తగ్గిస్తున్నాయి. విధాన నిర్ణేతల లోపభూయిష్టమైన విధానాల వల్ల చిన్న, సన్నకారు పాడి రైతులు బడా కార్పొరేట్ సంస్థలలో కాంట్రాక్ట్ కార్మికులుగా చేరాల్సి వస్తోంది. వ్యవసాయ సంక్షోభం, తీవ్ర కరవు పరిస్థితులను తట్టుకునేందుకు ఆసరా ఉంటుందని పాడి పశువుల్ని పెట్టుకుంటే ఇప్పుడు వాటినీ పోషించలేని దుస్థితి ఏర్పడింది. ఫలితంగా పాల ఉత్పత్తికి వెన్నుముకగా ఉన్న చిన్న రైతులు పశువుల్ని అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో మానవత్వం ఉన్న ఏ ప్రభుత్వమైనా పాడి రైతుల్ని కాపాడుకునేందుకు ముందుకు రావాలి. పాల సేకరణ ధర పెంచడమో, లీటర్‌కు ఇంతని బోనస్ ఇవ్వడమో చేయాలి. పాడి రైతుల కష్టాలకు చలించిన చాలా రాష్ట్రాలు లీటర్‌కు నాలుగైదు రూపాయల బోనస్‌ను ప్రకటించాయి. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణలో రూ.4, కర్ణాటకలో రూ.5, మహారాష్ట్ర ప్రభుత్వం లీటర్‌కు రూ.5 ల బోనస్ ఇస్తోంది. కర్ణాటకలో రైతులకు బోనస్ ఇవ్వడం వల్ల సహకార పాల సంఘాలు చాలా బలీయంగా తయారయ్యాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాడి రైతుల్ని గాలికి వదిలేశారు. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఎన్నికల ప్రణాళికలో భాగంగా వైఎస్సార్ రైతు భరోసాను ప్రకటించారు. సహకార రంగంలోని డైరీలకు పాలు పోసే ప్రతి రైతుకూ లీటర్‌కు 4 రూపాయల బోనస్ ఇస్తానని భరోసా ఇచ్చారు. ఇలా చేయడం వల్ల రాష్ట్రంలో దాదాపు 60, 65 లక్షల మంది కుటుంబాలకు మేలు జరుగుతుంది. జగన్ ఇచ్చే బోనస్‌తో కలుపుకుని పాల సేకరణ ధర లీటర్‌కు రూ. 30 దాటుతుంది. చంద్రబాబు హయాంలో మూతపడిన చిత్తూరు, ప్రకాశం, విశాఖ, కాళహస్తి కో ఆపరేటివ్ డైరీ వంటి వాటినన్నింటినీ తిరిగి తెరిపిస్తానని హామీ ఇవ్వడం పట్ల పాడి రైతులు సంబరపడుతున్నారు. బకాయిల కోసం రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి లేకుండా పాల డైరీలన్నింటినీ సహకార రంగంలోకి తీసుకువస్తానని భరోసా ఇస్తున్నారు. డైరీలను సహకార రంగంలోకి తీసుకువచ్చి ప్రోత్సహిస్తే రైతులకు మేలు జరుగుతుంది. అప్పుడు చచ్చినట్టు ప్రై వేటు డైరీలు కూడా పాల సేకరణ ధర పెంచకతప్పదు. సకాలంలో డబ్బులు ఇస్తాయి. విశ్వసనీయతా పెరుగుతుంది. పాల సంఘాలను కంపెనీ చట్టం నుంచి సహకార చట్టంలోకి తీసుకువచ్చి ప్రభుత్వ పర్యవేక్షణలో నడపగలిగితే ప్రైవేటు డైరీల ఆగడాలకు ముగుతాడు వేయడమే కాకుండా అటు పాడి రైతులకు ఇటు వినియోగదారులకు మేలు చేసినట్టవుతుంది. ఆ పని చేస్తానని జగన్ ఇచ్చిన హామీ పట్ల రాష్ట్ర పాడి రైతాంగం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నది. – ఆకుల అమరయ్య, చీఫ్ రిపోర్టర్, సాక్షి -
క్రీమ్‌లైన్ డెయిరీ విస్తరణ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జెర్సీ బ్రాండ్ పేరుతో పాలు, పాల ఉత్పాదనల తయారీలో ఉన్న క్రీమ్‌లైన్ డెయిరీ ప్రోడక్ట్స్ విస్తరణ చేపట్టనుంది. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలో మూడేళ్లలో కొత్తగా ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.400 కోట్లు వెచ్చిస్తామని సంస్థ ఎండీ కె.భాస్కర్‌రెడ్డి తెలిపారు. నూతన ఉత్పాదన జెర్సీ థిక్‌షేక్స్ ఆవిష్కరణ సందర్భంగా బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. కంపెనీ ప్రస్తుత ప్రాసెసింగ్ సామర్థ్యం రోజుకు 12 లక్షలు. విస్తరణతో 15 లక్షల లీటర్లకు చేరుతుందని చెప్పారు. రూ.35 కోట్లతో వైజాగ్ వద్ద నిర్మిస్తున్న రోజుకు లక్ష లీటర్ల కెపాసిటీగల ప్లాంటు ఈ ఏడాది చివరికి కార్యరూపంలోకి వస్తుందన్నారు. మూడు వేరియంట్లలో..: గోద్రెజ్ అగ్రోవెట్ అనుబంధ కంపెనీ అయిన క్రీమ్‌లైన్ డెయిరీ జెర్సీ థిక్‌షేక్స్‌ను మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. 180 మిల్లీలీటర్ల ఈ ఫ్లేవర్డ్ మిల్క్ ప్యాక్ ధర రూ.25 ఉంది. రూ.22,000 కోట్ల శీతల పానీయాల మార్కెట్లో పాలతో తయారైన ఉత్పత్తుల వాటా 4 శాతం. అయితే వృద్ధి పరంగా చూస్తే అత్యధికంగా 15 శాతం నమోదు చేస్తోందని క్రీమ్‌లైన్ డెయిరీ సీఈవో రాజ్ కన్వర్ తెలిపారు. దేశంలో డెయిరీ ఇండస్ట్రీ 5–6 శాతం వార్షిక వృద్ధితో రూ.6 లక్షల కోట్లుంది. 2025 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయని గోద్రెజ్ అగ్రోవెట్ ఎండీ బలరామ్ సింగ్ యాదవ్ వెల్లడించారు. రుచి సోయా ఆయిల్‌పామ్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు బిడ్లను దాఖలు చేశామని పేర్కొన్నారు. -
పాల ఉత్పత్తితో ఉపవాస లాభాలు!
ఉపవాసముంటే ఆయుష్షు పెరుగుతుందని ఇప్పటికే చాలా ప్రయోగాలు రుజువు చేశాయి. అయితే మనలో చాలామందికి తిండి లేకుండా ఉండటమన్న ఆలోచనే చికాకు కలిగిస్తూంటుంది. ఇలాంటి వారికోసమే అన్నట్లు కొలరాడో బౌల్డర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఒక శుభవార్త తీసుకొచ్చారు. పాలతో పాటు కొన్ని ఇతర ఆహార ఉత్పత్తుల్లో ఉండే ఒక పదార్థం ఉపవాసం చేయకపోయినా.. దాంతో వచ్చే ఫలితాలన్నింటినీ ఇస్తుందట. అదెలా? అన్న డౌట్ వస్తోందా? చూసేద్దాం మరి. ఈ పదార్థం పేరు నికొటినోమైడ్ రైబోసైడ్. క్లుప్తంగా ఎన్ఆర్. మార్కెట్లో వాణిజ్య స్థాయిలోనూ లభ్యమయ్యే ఎన్ఆర్ను రోజుకు వెయ్యి మిల్లీగ్రాముల చొప్పున కొంతమందికి అందించారు. ఆరు వారాలపాటు ఉత్పత్తి మాత్రలు ఇచ్చిన తరువాత ఎన్ఆర్ను ఇవ్వగా.. ఇంకొంతమందికి ముందు ఎన్ఆర్.. ఆ తరువాత ఉత్తుత్తి మాత్రలు ఇచ్చారు. ఆ తరువాత వారి రక్తాన్ని పరిశీలించినప్పుడు ఉపవాసం చేసినప్పుడు జరిగే మార్పులు చాలావరకూ కనిపించినట్లు స్పష్టమైంది. ఎన్ఆర్ తీసుకున్న వారిలో నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ 60 శాతం ఎక్కువగా ఉత్పత్తి అయిందని ఈ రసాయనం సిర్టూయిన్స్ అనే ఎంజైమ్ ఉత్పత్తికి దోహదపడుతుందని తెలిసింది. అంతేకాకుండా ఎన్ఆర్ తీసుకున్న వారిలో కొంతమందికి రక్తపోటు కూడా గణనీయంగా తగ్గినట్లు స్పష్టమైంది. మరిన్ని పరిశోధనలు చేసిన తరువాత తాము ఈ పదార్థం ప్రభావాన్ని మరింత కచ్చితంగా మదింపు చేయవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మార్టెన్స్ తెలిపారు. -
క్షీరం..క్షీణం
రాజధాని ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పాడి పరిశ్రమ వట్టిపోతోంది. ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలతో ఈ పరిశ్రమ వర్ధిల్లుతోందని అధికారులు చెబుతున్న లెక్కలను వెక్కిరిస్తూ ఇతర రాష్ట్రాల నుంచి రోజూ పాలను దిగమతి చేసుకోవాల్సి వస్తోంది. మూడేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో గ్రాసం లేక పాడిపశువులు బక్కచిక్కుతున్నాయి. మూగజీవాలకు రైతులు మేత అందించలేక, వాటిని పోషించలేక మనసుకు కష్టంగా ఉన్నా కబేళాలకు విక్రయిస్తున్నారు. సాక్షి, అమరావతిబ్యూరో : ప్రజల అవసరాల మేరకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పాల ఉత్పత్తి జరగడం లేదు. ప్రభుత్వ పథకాలు, రాయితీల వల్ల పాల ఉత్పత్తి వృద్ధి రేటు పెరిగిందని అధికారుల గణాంకాలు పేర్కొంటున్నా, వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. రోజూ ప్రభుత్వ రంగ, ప్రైవేటు డెయిరీలు ఇతర రాష్ట్రాల నుంచి సుమారు పదిలక్షల లీటర్ల పాలను దిగుమతి చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. మూడేళ్లుగా రెండు జిల్లాల్లో వర్షభావ పరిస్థితులు నెలకొన్నాయి. వరిసాగు విస్తీర్ణం తగ్గిపోయింది. ఫలితంగా ఎండు గడ్డి కూడా కరువై రైతులకు పశుపోషణ కష్టంగా మారింది. ఈ క్రమంలో పశువులను పోషించలేక, బక్కచిక్కుతున్న వాటిని చూడలేక రైతులు పశువులను విక్రయిస్తున్న దీన పరిస్థితి పల్లెల్లో కన్పిస్తోంది. కృష్ణా జిల్లాలో ప్రస్తుతం పాలిచ్చే పశువులు (గేదెలు) 3.15 లక్షలు ఉన్నాయి. వాటి నుంచి రోజూ సగటున 18.9 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. గుంటూరు జిల్లాలో 2.89 లక్షల పశువులు రోజూ 17.34 లక్షల లీటర్ల పాలు ఇస్తున్నాయని అధికారిక గణాంకాలు పేర్కొంటున్నాయి. కృష్ణా జిల్లాలో 17, గుంటూరు జిల్లాలో 27 కంపెనీలు రోజువారీగా పాడి రైతుల నుంచి పాలను సేకరిస్తున్నాయి. వ్యవస్థీకృత రంగంలో 9.5 లక్షల లీటర్ల సేకరణ జరుగుతోంది. పాడి రైతులు సొంత అవసరాలకు వాడుకోవడం, డెయిరీలకు కాకుండే నేరుగా పట్టణ ప్రాంతాల్లో విక్రయించడం, ఇరుగుపొరుగు విక్రయించడం అవ్యవస్థీకృత రంగంలోకి వస్తాయి. ప్రస్తుతం పాల ఉత్పత్తి ఇలా.. సగటున రోజుకు ఒక పశువు గతంలో 6 లీటర్లు పాలు ఇచ్చేది. రాయితీ పథకాలు, ప్రోత్సాహకాల కారణంగా 6.75 లీటర్ల పాలు ఇస్తోందని అధికారులు చెబుతున్నారు. అయితే మూడేళ్లగా పాడి సంపద ఒట్టిపోయింది. వర్షభావ పరిస్థితుల నేప«థ్యంలో వరిసాగు విస్తీర్ణం తగ్గింది. వరి కోతల సమయంలో వర్షాల కారణంగా యంత్రాలతో రైతులు కోతలను పూర్తిచేస్తున్నారు. ఇలా కోసిన వరిగడ్డి మేతకు పనికిరావడంలేదు. ఫలితంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పశుగ్రాసం కొరత నెలకొంది. ఇతర జిల్లాల నుంచి గ్రాసం కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీంతో గ్రాసం ధర పెరిగింది. మరోవైపు ప్రభుత్వ పథకాల్లో మితిమీరిన రాజకీయ జోక్యం, అమలులో అవినీతి పెరగడంతో పాడి రైతులకు లబ్ధిచేకూరడంలేదు. దీంతో పశు పోషణ కష్టంగా మారింది. ఆరు లీటర్ల పాలు ఇవ్వాల్సిన పశువులు 4 లీటర్లు కూడా ఇవ్వడంలేదు. దీంతో మూగజీవాలను పోషించలేక రైతులు వాటిని దళారులకు విక్రయిస్తున్నారు. దళారులు కబేళాలకు తరలిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని రెండు జిల్లాల్లో ఒక్క ఏడాదిలోనే సుమారు లక్షకు పైగా పశువుల విక్రయాలు జరిగి కబేళాలకు తరలించినట్లు ఓ అధికారి వెల్లడించారు. రోజుకు 10 లక్షల లీటర్లు దిగుమతి రాజధాని ప్రాంతంలో వినియోగదారుల అవసరాల మేరకు పాల ఉత్పత్తి జరగడం లేదు. రాజధాని నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఉద్యోగులు తరలివచ్చారు. వివిధ పనుల నిమిత్తం వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇలా వేల కుటుంబాలు రెండు జిల్లాల్లో నివసిస్తున్నాయి. పెరిగిన ప్రజల అవసరాలకు తగినట్లుగా డెయిరీలు స్థానికంగా పాల సేకరణ చేయలేక పోతున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి పాలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఒక్క విజయవాడలోనే రోజుకు 2.30 లక్షల లీటర్లు అవసరం. పండుగలు పబ్బాలకు మరో 70 వేల లీటర్లు అదనంగా అవసరమవుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలోని కోలార్ ప్రాంతం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీలు పాలు దిగుమతి చేసుకుంటున్నాయి. కృష్ణా జిల్లాకు సంబంధించి విజయ డెయిరీ రోజుకు 2.5 లక్షల లీటర్ల మేర కోలార్ నుంచి పాలు దిగుమతి చేసుకుంటున్నారని సమాచారం. ప్రైవేటు డెయిరీలు కూడా ఇలానే పాలు కొనుగోలు చేసి, విక్రయిస్తున్నాయి. అయితే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే పాలల్లో అధిక శాతం ఆవు పాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. -
నాకు ధైర్యం ఎక్కువ : కేసీఆర్
హైదరాబాద్ : ప్రగతి భవన్లో ఆదివారం పాల ఉత్పత్తిదారులతో సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. 60 ఏళ్లగా అస్తవ్యస్థపాలన సాగిందని, వేరుపడ్డ సంసారం బాగుపడడానికి సమయం పడుతుందన్నారు. 'నాకు ధైర్యం ఎక్కువ. రెండేళ్లలో గోదావరి నీళ్లతో మీ కాళ్లు కడుగుతా. గోదావరి నీళ్లొస్తే చెరువులు నిండుతయి. తెలంగాణలో కోటి మూడు లక్షల కుటుంబాలున్నాయి. అంటే కోటి లీటర్ల పాలు అవసరం. కానీ, రాష్ట్రంలో 7 లక్షల లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. 7 లక్షల మంది యాదవులకు గొర్రెలు పంపిణీ చేస్తున్నాం. మొదటి దశలో 84 లక్షల గొర్రెలు పంపిణీ చేస్తున్నాం. గొర్రెల పెంపకంతో గొల్ల కుర్మలు బాగుపడుతున్నారు. హైదరాబాద్‌కు రోజు 350 లారీల గొర్రెలు దిగుమతి అవుతున్నాయి. తెలంగాణలో 650 లారీల గొర్రెల్ని ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. రోజు 40 లారీల చేపలు హైదరాబాద్‌కు దిగుమతి అవుతున్నాయి. రైతులకు ఎరువుల కొరత లేకుండా చేస్తున్నాం. గ్రామాల్లో భూముల సర్వే జరుగుతోంది. భూముల సర్వేకు రైతులు సహకరించాలి. భూముల లెక్క తేలితే ఎకరానికి రూ.4 వేలు పెట్టుబడి ఇస్తాం' అని కేసీఆర్ పేర్కొన్నారు. -
రూ.196కోట్ల టర్నోవర్ లక్ష్యం
జిల్లా పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయ సహకార సమితి అధ్యక్షుడు నంద్యాల: 2016–17లో 331 లక్షల లీటర్ల పాలను సేకరించి, రూ.196కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా ఎంచుకున్నామని జిల్లా పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయ సహకార సమితి అధ్యక్షుడు భూమా నారాయణరెడ్డి తెలిపారు. స్థానిక పాల డెయిరీలో ఆయన అధ్యక్షతన బుధవారం 27వ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015–16లో 378లక్షల లీటర్ల పాలను విక్రయించి రూ.181కోట్ల టర్నోవర్ సాధించామని చెప్పారు. మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ రైతులకు పశుగ్రాస క్షేత్రాలు, కల్యాణమస్తు పథకాలు, సాంకేతిక వనరుల కోసం గత ఏడాది రూ.48.83 లక్షలు ఖర్చు చేశామని, ఈ ఏడాది రూ.80.3 లక్షలను కేటాయించామని చెప్పారు. అనంతరం అధిక నాణ్యతతో పాలను సేకరించిన రైతులకు, మహిళా పాల సంఘాలకు ప్రోత్సాహాక బహుమతిని, బాగా పని చేసిన సిబ్బందికి ఉత్తమ ఉద్యోగి అవార్డులను అందజేశారు. సమావేశంలో డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ పరమేశ్వరరెడ్డి, మార్కెటింగ్ ప్లాంట్ ప్రొటెక్షన్ డిప్యూటీ జనరల్ మేనేజర్లు సుబ్రమణ్యం, శంకర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, కర్నూలు డెయిరీ డిప్యూటీ జనరల్ మేనేజర్ నాగపుల్లయ్య, అసిస్టెంట్ డెయిరీ ఇంజినీర్ శ్యాంసన్‌బాబు పాల్గొన్నారు. -
పాల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు
జేసీ 2 రాజ్‌కుమార్ నెల్లూరు(పొగతోట): జిల్లాలో పాల ఉత్పత్తిని పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జేసీ 2 రాజ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాథమిక రంగాల్లో రెండంకెల వృద్ధిరేటు సాధించేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జీవనోపాధి కల్పించాలన్నారు. పశువులు, కోళ్లు, గొర్రల యూనిట్లు మంజూరయ్యాయన్నారు. డీఆర్డీఏ, పశుసంవర్థక శాఖలు సమన్వయంతో పని చేసి లభ్ధిదారులు ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. కోళ్లు, గొర్రెల యూనిట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే కేటాయించాలన్నారు. 4500ల కోళ్ల యూనిట్లు, 475 గొర్రెల యూనిట్లు మంజూరయ్యాయన్నారు. కోళ్ల యూనిట్ రూ.4 వేలు, గొర్రెల యూనిట్ రూ.50 వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ యూనిట్లకు సబ్సిడీ ఉండదన్నారు. 480 పశువుల యూనిట్లు మంజూరు చేశామన్నారు. యూనిట్ కాస్ట్ రూ.60 వేలుగా నిర్ణయించినట్లు తెలిపారు. పశువుల యూనిట్లకు 75 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. ఈ యూనిట్లు ఎస్‌స్సీలకు మాత్రమే మంజూరు చేయాలన్నారు. అనంతరం వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, వైద్య శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయ డెయిరీ చైర్మన్ కె.రంగారెడ్డి, డీఆర్‌ఆఏ పీడీ లావణ్యవేణి, పశుసంవర్థక శాఖ జేడీ శ్రీధర్ పాల్గొన్నారు. -
పాలు ఇవ్వడంలో ఇబ్బంది... ఏం చేయాలి?!
సందేహం నాకు ఈ మధ్యనే బిడ్డ పుట్టింది. ఆరోగ్యంగానే ఉంది. అయితే నాకు పాలివ్వడంలోనే సమస్యగా ఉంటోంది. కుడివైపు ఓకే కానీ ఎడమవైపు స్తనం నుంచి అస్సలు పాలు రావడం లేదు. అలా ఎందుకవుతోంది? ఏదైనా సమస్య ఉందంటారా? ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? - చంద్రకళ, మెయిల్ సాధారణంగా బిడ్డ పుట్టిన తర్వాత ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ అనే హార్మోన్ల ప్రభావం వల్ల రొమ్ములో పాల ఉత్పత్తి మొదలవుతుంది. బిడ్డ రొమ్ము మొనను (నిపుల్) చీకడం మొదలు పెట్టిన తర్వాత ఆక్సిటోసిన్ హార్మోన్ మరింతగా విడుదలై పాల ఉత్పత్తిని మరింతగా ప్రేరేపించి, వాటిని నిపుల్ ద్వారా బయటకు పంపిస్తుంది. పైన చెప్పిన హార్మోన్స్, బిడ్డ చీకడం, మానసిక, శారీరక ప్రశాంతత అన్నీ సరిపడా ఉన్నప్పుడు, బిడ్డకు సరిపడా పాలు చక్కగా వస్తాయి. మీకు ఒకవైపు వస్తున్నాయి, మరోవైపు రావట్లేదు అంటున్నారు కాబట్టి కొన్ని విషయాలు పరిశీ లించాలి. కొంతమందిలో నిపుల్పైన ఉన్న రంధ్రాలపై పొక్కు కట్టి, మూసుకుపోతాయి. అలాంటప్పుడు పొక్కులను తడిబట్టతో మెల్లిగా తీసేసే ప్రయత్నం చేయొచ్చు. ఒకవైపే పాలు వస్తున్నాయని, అటే బిడ్డకు పాలు ఇస్తూ పోతే, ఇటువైపు ప్రేరేపణ లేకపోవడం వల్ల కూడా రాకపోవచ్చు. కాబట్టి ఈసారి బిడ్డ బాగా ఆకలిగా ఉన్నప్పుడు మొదట పాలు రాని రొమ్మును శుభ్రం చేసి పట్టిస్తే, బిడ్డ చీకే కొద్దీ, అది ప్రేరేపణకు గురై పాలు మెల్ల మెల్లగా రావడం మొదలవుతుంది. అయినా రాకపోతే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించండి. నా వయసు 22. నాకిప్పుడు నాలుగో నెల. నా సమస్య అంతా బరువుతోనే. నా ఎత్తు ఐదడుగుల రెండంగుళాలు. బరువు 72 కిలోలు. ఇంత బరువు ఉంటే ప్రసవం తేలికగా జరగదని, చాలా కాంప్లికేషన్స్ వస్తాయని అంటున్నారు. నిజమేనా? ఇప్పుడు బరువు ఎలా తగ్గాలి? వ్యాయామాలవీ చేస్తే కడుపులో బిడ్డకు ఇబ్బంది రాదా? చాలా భయంగా ఉంది. సలహా ఇవ్వండి. - వి.మృదుల, విశాఖపట్నం సాధారణంగా అయిదున్నర అడుగుల ఎత్తుకు 50-55 కిలోల బరువు ఉంటే సరిపోతుంది. మీరు 72 కిలోల బరువు ఉన్నారంటే, ఉండాల్సిన దాని కన్నా, అంటే దగ్గర దగ్గరగా 15 కిలోలు ఎక్కువ బరువు ఉన్నారు. బరువు తగ్గి ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే బాగుండేది. ఇప్పుడు నాలుగో నెల కాబట్టి భయపడి చేసేది ఏమీ లేదు. ప్రెగ్నెన్సీలో బరువు ఎక్కువగా ఉండటం వల్ల కడుపులో బిడ్డ పెరిగే కొద్దీ, పొట్ట పైకి వచ్చే కొద్దీ.. తినడానికి, కూర్చోడానికి, మాట్లాడటానికి, నడవడానికి ఆయాసం వస్తుంది. గాలి తీసుకోవడానికి ఇబ్బంది. పడుకోవడానికి, ఒకవైపు నుంచి మరోవైపుకు తిరగడానికి ఇబ్బంది. నడుము నొప్పి, కాళ్లవాపులు, తిన్నది గొంతులోనే ఉన్నట్లుండటం వంటి ఇబ్బందులతో పాటు బీపీ పెరగడం, షుగర్ లెవెల్స్ పెరగడం కూడా జరగొచ్చు. వీటివల్ల తల్లికి, బిడ్డకి రిస్క్ ఎక్కువగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోక పోతే ప్రాణాపాయస్థితికి కూడా చేరవచ్చు. బరువు ఎక్కువగా ఉండటం వల్ల సాధారణ కాన్పుకు కష్టం అవుతుంది. అంతే కాకుండా పొట్ట మీద కొవ్వు ఎక్కువగా ఉండటం వల్ల సిజేరియన్ ఆపరేషన్ చేయడానికి కూడా డాక్టర్లు చాలా కష్టపడవలసి వస్తుంది. డెలివరీ (ఆపరేషన్) తర్వాత కూడా శరీరంలో రక్తం ఎక్కడైనా గూడుకట్టి, pulmonary embolism, thrombo embolism అనే ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువ. అదీగాక మీరు ఎత్తు కూడా తక్కువగా ఉన్నారు కాబట్టి, పొట్ట పైకి పెరిగే కొద్దీ ఆయాసంగా, ఇబ్బందిగా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు డైటింగ్, విపరీతమైన వ్యాయామాలు చేసి బరువు తగ్గాలనే నిర్ణయాన్ని, ఆలోచనను వెంటనే మానెయ్యండి. కాకపోతే సాధారణంగా ప్రెగ్నెన్సీలో 10-11 కేజీల వరకు బరువు పెరగొచ్చు. మీరు ప్రయత్నిస్తే అంత ఎక్కువగా పెరగకుండా 5 కేజీల వరకు నియంత్రించు కోవచ్చు. అంటే ఆహార నియమాల్లో అన్నం తక్కువ తిని, కూరలు, పండ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవడం, పండ్లలో షుగర్ ఎక్కువగా ఉండే అరటిపండ్లు, సపోటా వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. డైటీషియన్ పర్యవేక్షణలో ఆహార నియమాలను పాటించవచ్చు. ఇక వ్యాయామం చేయాలను కుంటే, మొట్టమొదటగా చిన్న నడకతో మొదలు పెట్టి, ఆయాసం లేనంత వరకు పొద్దున 15 నిమిషాల నుంచి అరగంట, సాయంత్రం అరగంట చేయవచ్చు. తర్వాత ప్రాణాయామం, బ్రీతింగ్ వ్యాయామాలు, తేలికపాటి వ్యాయామాలు మీ గైనకాలజిస్ట్ సలహా మేరకు మీ ఆరోగ్యం, బిడ్డ మాయ, గర్భాశయ ముఖ ద్వార పొజిషన్‌ను బట్టి చేయవచ్చు. డాక్టర్ పర్యవేక్షణలో చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే బిడ్డకు ఎలాంటి ప్రమాదం ఉండదు. -
ఆపసోపాలు
► జిల్లాలో తీవ్రమైన పాల కొరత ► రోజుకు 10లక్షల లీటర్లు అవసరం ► ప్రస్తుతం ఉత్పత్తి 6 లక్షల లీటర్లే.. ► పశుగ్రాసం, నీటి సమస్యతో తగ్గిన ఉత్పత్తి ► డెయిరీల్లో పాల పొడి వినియోగం? ► భారంగా మారిన పశువుల పెంపకం ప్రతి ఒక్కరూ రోజుకు 220 మిల్లీలీటర్ల పాలు తీసుకున్నప్పుడే తగిన పోషకాలు లభించి ఆరోగ్యంగా ఉంటారని నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ చెబుతోంది. ప్రస్తుతం జిల్లా జనాభా 45లక్షలు. ఈ ప్రకారం దాదాపు 10 లక్షల లీటర్ల పాలు అవసరం. అయితే జిల్లాలో ఉత్పత్తి అవుతున్న పాలు 6లక్షల లీటర్లు మాత్రమే. దీన్నిబట్టి చూస్తే జిల్లాలో పాల కొరత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. పాల పొడి వినియోగం పాల కొరతను అధిగమించేందుకు డెయిరీల్లో పాల పొడి ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. శీతాకాలం, వానాకాలంలో పాల ఉత్పత్తి అధికంగా ఉన్నపుడు పాల పొడి తయారుచేసుకోవడం సర్వసాధారణం. కొరత ఏర్పడినప్పుడు అదే పొడిని ఉపయోగించి పాలు తయారు చేస్తారు. కరువు, వేసవి కారణంగా ప్రస్తుతం పాల కొరత ఉత్పన్నం కావడంతో డెయిరీల్లో పాల పొడి ఉపయోగిస్తున్నట్లు సమాచారం. కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో నెలకొన్న కరువు పాల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నీటి సమస్య.. పశుగ్రాసం కొరత పశు పోషణను ప్రశ్నార్థకం చేస్తోంది. పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో పాడి పశువులు దాదాపు 8 లక్షలు. కరువు కారణంగా గత రెండు నెలల్లో దాదాపు 2లక్షల పాడి పశువులను అమ్మేసినట్లు తెలుస్తోంది. మరో 4లక్షల పశువులు ఒట్టిపోవడంతో.. పచ్చిమేత దొరక్క, నీటి సమస్యతో పాల ఉత్పత్తి భారీగా తగ్గిపోయింది. మనుషులు తాగేందుకే నీళ్లు దొరకని పరిస్థితుల్లో పశువుల దాహార్తి తీర్చడం రైతులకు భారంగా మారుతోంది. శీతా కాలం, వానా కాలంలో సగటున ఒక పాడి పశువు 6 లీటర్ల వరకు పాలు ఇస్తుండగా.. ప్రస్తుతం 3 లీటర్లకు పడిపోయింది. అంటే రోజుకు జిల్లా వ్యాప్తంగా 6లక్షల లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. గత డిసెంబర్ నెలలో 8.50 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి చేయడం చూస్తే.. కొరత ఏ స్థాయిలో పెరుగుతుందో తెలుస్తోంది. తగ్గిన పాల ఉత్పత్తి ఇటీవల కాలంలో పాడి పరిశ్రమ పట్ల యువత ఆసక్తి చూపుతోంది. పట్టణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమ ఊపందుకుంది. వేసవిలోనూ నిర్వాహకులు పాల ఉత్పత్తి తగ్గకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ పశుగ్రాసం కొరత.. నీటి సమస్య.. దాణా కారణంగా పాల ఉత్పత్తి 10 నుంచి 20 శాతం వరకు తగ్గినట్లు తెలుస్తోంది. ఇందుకు ఉష్ణోగ్రతలు పెరగడమే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 10 ఆపై పాడి పశువులు కలిగిన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా ఉత్పత్తి తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో సాధారణ రైతుల పరిస్థితి ఘోరంగా ఉంటోంది. వసతుల కల్పనలో అధికారుల వైఫల్యం గ్రామాల్లో పాల ఉత్పత్తి తగ్గకుండా పశు సంవర్ధక శాఖ తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయింది. పశువుల దాహర్తి తీర్చేందుకు గ్రామాల్లో తోట్లు ఏర్పాటు చేసి ప్రతి రోజు నీటితో నింపాల్సి ఉన్నా 80 శాతం గ్రామాల్లో వీటి ఊసే కరువైంది. దాదాపు 3 నెలలుగా నీటితొట్ల పేరిట హడావుడి చేయడం తప్పిస్తే కార్యరూపం దాల్చని పరిస్థితి. ఇక పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలు కూడా నామమాత్రమే. సైలేజి గడ్డి సబ్సిడీపై పంపిణీ చేస్తున్నా పశువులు తినకపోవడం వల్ల రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. కాగితాల్లోనే కొత్త పాడి కొత్త పాడి కాగితాలకే పరిమితం అవుతోంది. డీఆర్డీఏ-వెలుగులో 2015-16లో 10వేలకు పైగా పాడి పశువులు కొని స్వయం సహాయక సంఘల మహిళలకు పంపిణీ చేసినట్లు లెక్కలు ఉన్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. ఇతర జిల్లాల నుంచి గ్రేడెడ్ ముర్రా గేదెలను తెచ్చి పంపిణీ చేయాల్సి ఉన్నా.. స్థానికంగానే ఇతరుల పశువులు చూపి మమ అనిపించినట్లు తెలుస్తోంది. పాల ఉత్పత్తి పెంచేందుకు చర్యలు జిల్లాలో పశుగ్రాసం కొరతను అధిగమించి పాల దిగుబడి పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం సబ్సిడీపై రైతులకు సైలేజి గడ్డి పంచుతున్నాం. సబ్సిడీ పోను రైతులు కిలోకు రూ.2 ప్రకారం చెల్లించాలి. ముఖ్యంగా వేసవిలో పాల ఉత్పత్తి తగ్గకుండా రైతులకు 75 శాతం సబ్సిడీపై మొలకగడ్డి యూనిట్లు పంపిణీ చేస్తున్నాం. ఇళ్లలోనే ప్టాస్టిక్ ట్రేల్లో ఉత్పత్తి చేసుకోవచ్చు. అజొల్లా యూనిట్లను 75 శాతం సబ్సిడీపై పాడి రైతులకు అందిస్తున్నాం. దాణాకు అజొల్లాను ప్రత్యామ్నాయంగా వినియోగించవచ్చు. నీటి వసతి కలిగిన రైతులకు పశుగ్రాసాల సాగుకు 75 శాతం సబ్సిడీపై గడ్డి విత్తనాలు పంపిణీ చేస్తున్నాం. అవసరమైన రైతులు సంబంధిత పశువైద్యులను సంప్రదించవచ్చు. - డాక్టర్ సుదర్శన్ కుమార్, జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ -
పశువులకూ హాస్టల్
రాష్ట్రంలోనే తొలిసారిగా కొయ్యూరు మండలంలో ఏర్పాటుకు ప్రతిపాదన రూ.2 కోట్లు ఖర్చవుతుందని అంచనా ఎకరా స్థలంలో షెడ్ల నిర్మాణం.. 200 గేదెలకు అవకాశం 13 ఎకరాల్లో పశుగ్రాసం పెంపకం రాష్ట్రంలోనే మొదటిసారిగా పశువుల హాస్టల్‌ను కొయ్యూరు మండలంలో ఏర్పాటుచేసేందుకు మంగళవారం ప్రతిపాదనలు తయారు చేశారు. దీనికి రూ.రెండు కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. పాల ఉత్పత్తిని పెంచి గిరిజన రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నడింపాలెం పంచాయతీ నల్లగొండలో దీన్ని ఎకరా స్థలంలో ఏర్పాటు చేస్తారు. 200 గేదెలను ఇక్కడ ఉంచుతారు. 13 ఎకరాల్లో పశుగ్రాసం పెంచేందుకు రైతులు అంగీకరించారు. ఐటీడీఏ పీవో నుంచి ఈ ప్రతిపాదన కలెక్టర్‌కు వెళ్తే అక్కడ నుంచి నేరుగా ప్రభుత్వానికి చేరుతుంది. కొయ్యూరు: పశువుల పెంపకంలో సరికొత్త పద్ధతిని ప్రవేశపెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా పశు సంవర్థక శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొయ్యూరు వెటనరీ వైద్యుడు కె.రాజేశ్‌కుమార్ మంగళవారం పశువుల హాస్టల్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలను పాడేరు ఏడీ కిషోర్‌కు అందజేశారు. ఆయన వాటిని ఐటీడీఏ పీవో హరినారాయణన్‌కు అందజేస్తారు. దానిని పరిశీలించిన అనంతరం పీవో కలెక్టర్‌కు ప్రతిపాదన పంపిస్తారు. అది ప్రభుత్వానికి చేరిన తరువాత నిధులు విడుదలవుతాయి. గత నెలలో పశుసంవర్థక శాఖ జేడీ నల్లగొండను సందర్శించారు. అక్కడ రైతులతో మాట్లాడి ఇక్కడే పశువుల హాస్టల్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనిలో భాగంగా ప్రతిపాదన తయారుచేశారు. కంపరేగుల, నల్లగొండ, పెదమాకవరం, వెలగలపాలెం పంచాయతీ శీకాయపాలేనికి చెందిన 70 మంది రైతుల గేదెలను ఇక్కడ ఉంచుతారు. ఉపాధి హామీ నుంచి పశువులకు గ్రాసం నిమిత్తం భూమిని సేకరిస్తారు. దీనికి అవసరమైన సాగునీటిని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు కల్పిస్తారు. అక్కడ రైతులు పశుగ్రాసానికి 13 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకరించారు. పాల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని భూమి ఇచ్చిన రైతులకు చెల్లిస్తారు. ఇందుకు రివాల్వింగ్ నిధిని ఏర్పాటు చేస్తారు. ప్రతి లీటరు పాలకు వచ్చే ఆదాయంలో కొంత ఈ నిధికి జమచేసి పశుగ్రాసానికు చెల్లిస్తారు. వెయ్యి లీటర్ల వరకు పాల సేకరణ 200 గేదెలను హాస్టల్లో ఉంచితే సుమారు వెయ్యి లీటర్ల వరకు పాల దిగుబడి వస్తుంది. దీని ద్వారా రైతులు నెలకు రెండు గేదెలు ఉంటే రూ.16 వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఎక్కువమంది రైతులు పాలను విక్రయిండం ద్వారా నెలకు ఒక గేదె నుంచి రూ. 8 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. పశువుల హాస్టల్ ఏర్పాటు తరువాత ఎవరు ఎక్కువ చెల్లిస్తే వారికే పాలు విక్రయించాలని రైతులు నిర్ణయించారు. పశువులను శుభ్రమైన వాతావరణంలో ఉంచి వాటికి నీరు, గ్రాసం కొరత లేకుండా చూడటం హాస్టల్ ఏర్పాటు ద్వారా సాధ్యపడుతుందని అధికారులు భావిస్తున్నారు. పాల ఉత్పత్తితో పాటు గిరిజనుల ఆదాయాన్ని పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. దీనిపై కొయ్యూరు పశువైద్యుడు కె.రాజేశ్‌కుమార్‌ను సంప్రదించగా హాస్టల్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు పంపామని చెప్పారు. దీనికి రూ.రెండు కోట్ల వరకు ఖర్చవుతుందన్నారు. రైతుల ఆధార్ కార్డులతో పాటు పూర్తి వివరాలను అందజేశామని తెలిపారు. -
అమృతాహారం.. విషతుల్యం!
పశువుల దాణాలో రసాయనాలు, మద్యం వ్యర్థాలు దిగుబడి పెంచేందుకు వ్యాపారుల ఎత్తుగడ ఫలితంగా పాలలో కలుస్తున్న ఆల్కహాల్ పిల్లల ఆరోగ్యంపై పెనుప్రభావం పాడిపశువులకు ప్రాణాంతకంగా మారుతున్న వైనం సాక్షి, రంగారెడ్డి జిల్లా : పౌష్టికాహారమైన పాలు ప్రస్తుతం కలుషితమవుతున్నాయి. పాల దిగుబడి పెంచి భారీ లాభాలు మూటగట్టుకునేందుకు కొందరు సరికొత్త పద్ధతికి తెరలేపారు. బ్రెవరేజెస్ కంపెనీల వ్యర్థాలను పశువుల దాణాలో కలిపి వాటికి అందిస్తున్నారు. ఈ ప్రక్రియతో రోజుకు సగటున నాలుగు లీటర్ల పాలిచ్చే గేదె.. ఈ పద్ధతితో ఏకంగా ఏడు లీటర్ల పాలిస్తోంది. దిగుబడి పెరిగి లాభాలందుకుంటున్న నేపథ్యంలో ఈ విధానాన్ని ఇతర రైతులూ అనుసరిస్తున్నారు. అయితే.. కొత్త పద్ధతితో పాల దిగుబడి పెరుగుతున్నప్పటికీ.. ఆ పాలు ఎంతవరకు శ్రేష్టమనే సంగతినే మర్చిపోయారు. ఖర్చు తక్కువ.. లాభాలు ఎక్కువ రాజధాని చుట్టూ విస్తరించి ఉండడంతో జిల్లాలో పాడిపరిశ్రమకు విపరీతమైన డిమాండ్ ఉంది. నగరానికి రోజుకు సగటున 25లక్షల లీటర్ల పాలు అవసరం. ఈ స్థాయిలో ఉత్పత్తి లేనప్పటికీ.. రవాణా, ఇతర ఖర్చులు తగ్గే అవకాశం ఉండడంతో జిల్లా పాడి రైతులకు బాగా కలిసివస్తోంది. ప్రస్తుతం జిల్లాలో 3.1 లక్షల ఆవులు, 2.6 లక్షల గేదెలున్నట్లు పశుసంవర్ధక శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రోజుకు జిల్లానుంచి మూడున్నర లక్షల లీటర్ల పాలు నగరానికి సరఫరా అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. న గరంలోని డిమాండ్‌ను ఆసరా చేసుకుని కొందరు దాణా వ్యాపారులు కొత్త పద్ధతికి తెరలేపారు. బ్రెవరేజెస్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఆయా కంపెనీల వ్యర్థాలను రైతులకు విక్రయిస్తున్నారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లోని రైతులకు విజయవాడ సమీపంలోని ఓ బ్రెవరేజెస్ కంపెనీ పక్షం రోజులకోసారి ఈ వ్యర్థ ద్రావణాన్ని ట్యాంకర్ల ద్వారా లీటరుకు సగటున రూ.7 వసూలు చేస్తూ విక్రయిస్తోంది. చేవెళ్ల, శంషాబాద్, పరిగి రైతులకు కరీంనగర్‌కు చెందిన ఓ కంపెనీ ఈ వ్యర్థ ద్రావణాన్ని సరఫరా చేస్తోంది. ఈ పద్ధతితో పాడి రైతుకు ఫీడ్ ఖర్చు భారీగా తగ్గుతుండగా.. దిగుబడితో అధిక లాభాలొస్తున్నాయి. మద్యం 10 శాతం పైమాటే.. పశువులకు దాణాలో భాగంగా పలు గింజల పొడిని నీటితో కలిపి ఇస్తారు. అయితే తాజాగా పలు చోట్ల ఈ మిశ్రమంలో రసాయనాలతో కూడిన మద్యం వ్యర్థాన్ని కలుపుతున్నారు. వీటిని తీసుకున్న పశువులు మత్తుగా.. సాధారణం కంటే భిన్నంగా ప్రవర్తిస్తాయి. ఈ సమయంలో పాలు అధికంగా ఇస్తున్నప్పటికీ.. అందులో మద్యంతో పాటు ఇతర రసాయనాలు కూడా నమోదవుతున్నాయి. ఇవి పిల్లలకివ్వడం హానికరమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మద్యం వ్యర్థాలు పశువుల ఆరోగ్యాన్ని సైతం పూర్తిగా దెబ్బతిస్తాయని పరిశోధనలో తేలింది. ఇటీవల ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ రైతు మద్యం వ్యర్థాల్ని దాణాలో కలిపి ఇవ్వడంతో వాటి కాలేయం చెడిపోవడం, మూత్రపిండాలు పాడవ్వడంతో ఏకంగా రెండు గేదెలు మృత్యువాత పడ్డాయి. దీంతో స్థానిక పశు వైధ్యాధికారి సూచన మేరకు కొత్త పద్ధతికి స్వస్తి చెప్పాడు. ఉత్ప్రేరకాల ద్వారా.. మద్యం వ్యర్థాల్ని కలిపే పద్ధతితో పాటు కొన్నిచోట్ల రసాయనాలను ఉత్ప్రేరకాలుగా వాడుతున్నారు. వీటిని పశువులకు నేరుగా ఇంజక్షన్ రూపంలో ఎక్కిస్తున్నారు. ఈ పద్ధతితో పశువులు ఎక్కువ ఉత్తేజితమవుతున్నాయి. తాండూరు, వికారాబాద్‌లలోని కొందరు రైతులు ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో అవిచ్చే పాలు పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని శాస్త్రవేత్తల పరిశోధనలు చెబుతున్నాయి. సాధారణం కంటే మితిమీరిన ఎదుగుదల ప్రమాదమేనని పశుసంవర్ధక శాఖ అధికారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నష్టాలపాలు
- గిట్టుబాటు కాని పాల ధర - సిండికేట్‌గా ప్రయివేటు డెయిరీలు - లీటర్‌పై రూ.10 వరకు తగ్గింపు - పట్టించుకోని ప్రభుత్వం ‘రోజూ 50 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి చేసి జిల్లాను రాష్టంలోనే అత్యధిక పాలఉత్పత్తి కేంద్రంగా మారుస్తా. అన్ని రకాల ప్రాత్సాహకాలు అందిస్తా.. పాడి రైతును ఆదుకుంటా’నంటూ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పే మాటలివి. (కానీ ఇప్పుడేం జరుగుతోందంటే..) జిల్లాలో రోజుకు 20 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. వాటిలో గృహ, ఇతర అవసరాలకు పోను మార్కెట్‌కు 13 లక్షల లీటర్ల పాలు వస్తున్నాయి. వీటిని కొనేనాథుడే లేరు. ఒకటికి సగానికి అమ్ముకుని నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోందని పాడి రైతులు వాపోతున్నారు. సాక్షి,చిత్తూరు: జిల్లాలో కరువు కరాళనృత్యం చేస్తోంది. బక్కచిక్కిన రైతు పాడిపై ఆధారపడి జీవన యాత్ర కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పాల ఉత్పత్తి అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం 20 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. దోచేయ్.. ప్రభుత్వం జిల్లా గ్రామీణాభివృద్ధి పథకం ఆధ్వర్యంలో బల్క్‌మిల్క్ సెంటర్ యూనిట్ల ద్వారా రోజుకు 3.38 లక్షల లీటర్లు కొనుగోలు చేస్తోంది. లీటరు పాలకు సరాసరి *26 ఇస్తోంది. మిగిలిన 11 లక్షల లీటర్ల పాలను హెరిటేజ్, విజయ, తిరుమల, దొడ్ల తదితర డెయిరీలతో పాటు దాదాపు 45 డెయిరీలు లీటరు పాలకు కేవలం *16 నుంచి రూ.19లోపు ధర చెల్లించి రైతును నిలువు దోపిడీ చేస్తున్నాయి. సిండి‘కేట్లు’ 50 రోజుల క్రితం వరకూ లీటరు పాలకు *26కు తగ్గకుండా చెల్లించిన ప్రయివేటు డెయిరీలు ప్రస్తుతం లీటరు పాలపై అమాం తంగా *10 తగ్గించి కొనుగోలు చేస్తున్నాయి. ప్రయివేటు డెయిరీలు మొత్తం సిండికేట్‌గా మారి తక్కువ ధరకు పాలను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఇక బీఎంసీయూలు నాణ్యత లేని పాలను సేకరిం చడంలేదు. పాడిరైతు నష్టాలపాలవుతున్నాడు. -
ఇక డెయిరీపై సర్కారు దృష్టి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెయిరీ పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. సహకార రంగంలో పాల ఉత్పత్తిని మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ పాల అభివృద్ధి మండలి (ఎన్డీడీబీ)తో చర్చలు జరిపింది. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఎన్డీడీబీ ప్రతినిధులు సయీద్, లతతో కూడిన బృందంతో సోమవారం పశు సంవర్ధకశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ చర్చలు జరిపారు. డెయిరీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సహకార డెయిరీని అభివృద్ధి చేయాల్సిన అవసరంపై చర్చించారు. రెండు నెలల్లోగా ‘తెలంగాణ డెయిరీ పాలసీ’ తీసుకురావాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. అవకాశాలపై అధ్యయనం... వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా గ్రామాల్లో పాడిరంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సర్కారు ఈ రంగంపై దృష్టి సారించింది. అందులో భాగంగా విజయ డెయిరీకి పాలు పంపిణీ చేసే రైతులకు సేకరణ ధరను లీటరుకు అదనంగా రూ.4 పెంచింది. విజయ పాలు రోజుకు 5.26 లక్షల లీటర్లు విక్రయిస్తున్నా ప్రైవేటు వాటా 75 శాతంగా ఉంది. దీంతో ప్రైవేటు రంగం నుంచి పోటీ తట్టుకుని విజయ డెయిరీని గట్టెక్కించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని సర్కారు నిర్ణయించింది. అలాగే లాలాపేటలోని విజయ డెయిరీ పాల ఉత్పత్తి కర్మాగారాన్ని ఆధునీకరించాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ రోజుకు 5 లక్షల లీటర్ల వరకు పాల ప్రక్రియ చేపట్టే సామర్థ్యం మాత్రమే ఉంది. దాన్ని 10 లక్షల లీటర్ల సామర్థ్యానికి పెంచాలని సర్కారు నిర్ణయించింది. రాష్ట్రంలో పాడి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను క్షేత్రస్థాయిలో పరిస్థితిని అధ్యయనం చేయాలని ఎన్డీడీబీని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎన్డీడీబీ బృందం 45 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది. ఆ తర్వాత డెయిరీ పాలసీలో ఉండాల్సిన అంశాల ముసాయిదాను ఎన్డీడీబీ ఇవ్వనుంది. అయితే గుజరాత్ నుంచి వస్తున్న అమూల్, కర్ణాటకకు చెందిన నందిని పాల విక్రయాలను నిరోధించాల్సిన అవసరం లేదని దేశమంతా ఎక్కడైనా పాలు విక్ర యించుకునే స్వేచ్ఛ ఉందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, నెయ్యి, వెన్న, పన్నీరు, పాల పొడి తదితర పాల పదార్థాలపై 14.5 శాతం ఉన్న వ్యాట్‌ను 5 శాతానికి తగ్గించాల్సిన అవసరముందని చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు సహకార, ప్రైవేటు డెయిరీలు ప్రభుత్వానికి కూడా విన్నవించాయి. అయితే దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
పాల ఉత్పత్తిపై దృష్టి పెట్టిన తెలంగాణ సర్కారు
-
మరింత అభివృద్ధి సాధిద్దాం
పాల ఉత్పత్తిలో అగ్రస్థానం మనదే అక్షరాస్యతలో ఐదో స్థానం మామిడి, టమాట ఉత్పత్తుల్లోనూ మనమే కీలకం గణతంత్ర దిన వేడుకల్లో కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ చిత్తూరు : జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తోందని, అన్ని విభాగాలు సమర్థవంతంగా పనిచేసి మరింత అభివృద్ధిని సాధించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ అకాంక్షించారు. పాల ఉత్పత్తిలో మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. సోమవారం పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన గణతంత్రదిన వేడుకల్లో ఆయన మాట్లాడుతూ రోజుకు 22 నుంచి 24లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోందన్నారు. మామిడి, టమాట ఉత్పత్తుల్లోనూ కీలక స్థానం ఈ జిల్లాదేనన్నారు. 85 వేల హెక్టార్లల్లో మామిడి, 16వేల హెక్టార్లల్లో టమాట సాగువుతోందని తెలిపారు. ఈ పంటలను విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం కల్పిస్తే రైతులకు గిట్టుబాటు ధర వస్తుందన్నారు. అక్షరాస్యతలో రాష్ట్రంలో ఐదో స్థానంలో ఉండగా, మహిళా అక్షరాస్యతలో ముందంజలో ఉన్నామని తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం మరిన్ని పరిశ్రమలు రావాల్సి ఉందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలన్నారు. జిల్లాలో ప్రధాన పంటలైన వరి, చెరకుతో పాటు పండ్ల తోటల పెంపకానికి పట్టు, పాడి పరిశ్రమ అభివృద్ధికి అవకాశం ఉందన్నారు. ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేసి రైతన్నలు అభివృద్ధి సాధించాలని కోరారు. వ్యవసాయంలో యాంత్రీకరణ తప్పనిసరి అన్నారు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో నాణ్యత కోసం రైతులు మూడు సర్వీసులకు ఒక ట్రాన్ఫార్మర్ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. తక్కువ నీటితో పంటల సాగుకు డ్రిప్ ఇరిగేషన్ శ్రేయస్కరమని తెలిపారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలన్నారు. పారిశ్రామిక వేత్తలు జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఆవశ్యకత గుర్తించి వాటి నిర్మాణానికి ప్రజలు ముందుకు రావాలన్నారు. స్వైన్‌ఫ్లూ లాంటి ప్రాణంతక వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. పసిపిల్లలకు వ్యాధుల నివారణలో బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గర్భిణులు పూర్తి స్థాయిలో వైద్యసౌకర్యం ఉన్న ఆస్పత్రిలోనే కాన్పులు చేసుకోవాలన్నారు. స్త్రీలకు సముచిత స్థానం కల్పించాలన్నారు. ప్రతి అమ్మాయి ఆడపిల్లగా పుట్టినందుకు గర్వపడాలన్నారు. సమాజంలో పరివర్తన వస్తేనే స్త్రీజాతి అభివృద్ధి చెందుతుందన్నారు. అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నారు. బడిఈడు పిల్లలంతా బడిలో ఉండేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 72.36 అక్షరాస్యత ఉందన్నారు. పురుషుల అక్షరాస్యత 81.15 శాతం కాగా స్త్రీల అక్షరాస్యత 63.65 శాతం మాత్రమే ఉందని తెలిపారు. 2001 - 2011 మధ్య కాలంలో జిల్లా అక్షరాస్యత పెరుగుదల రేటు 5.59 శాతంగా నమోదైందన్నారు. అక్షరాస్యతలో రాష్ట్రంలో జిల్లా ఐదో స్థానంలో ఉందన్నారు. విశాఖలో సంభవించిన హుద్‌హుద్ తుపాను బాధితులకు జిల్లా తరఫున సత్వర సేవలు అందించిన జిల్లా అధికారులకు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ అభినందనలు తెలిపారు. చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, జాయింట్ కలెక్టర్ నారాయణభరత్‌గుప్త, జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డి, ఎంపీ శివప్రసాద్, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, మేయర్ అనురాధ, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 26సీటీఆర్ 02 - జాతీయపతాకాన్ని ఆవిష్కరిస్తున్న కలెక్టర్ 26సీటీఆర్03 గణతంత్ర దినోత్సవ ప్రసంగం చేస్తున్న కలెక్టర్ 26సీటీఆర్ 06- హాజరైన అధికారులు -
పచ్చిమేతతోనే పాడి
ఖమ్మం వ్యవసాయం: మన రాష్ట్రంలో పశుసంపదకు కావాల్సిన మేతలో మూడో వంతు మాత్రమే లభిస్తోంది. ఈ పశుగ్రాసం కొరత కారణంగానే పాల ఉత్పత్తి తక్కువగా ఉంది. రోజుకు ఒక పశువుకు 30 నుంచి 40 కిలోల పచ్చిమేత అవసరం. అంటే సంవత్సరానికి ఒక పశువు 10 నుంచి 14 టన్నుల పచ్చిమేత తింటుంది. పాడి రైతులకు ఇంత వరకు అనేక రకాలైన పశుగ్రాసాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన సంకరజాతి పశుగ్రాసాల్లో ముఖ్యమైనవి ఒకటి షుగర్గ్రేజ్, రెండోది న్యూట్రిఫీడ్. ఈ రకాల పశుగ్రాసాలను ఇప్పటికే జిల్లాలోని మధిర, ఎర్రుపాలెం తదితర ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఈ మేతనే పాడి పశువులకు మేపుతూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. షుగర్ గ్రేజ్ ఇది ఏక వార్షిక పశుగ్రాసం. ఒక ఎకరానికి 4-5 కిలోలు పశుగ్రాసం విత్తనాలు వేసుకోవాలి. షుగర్గ్రేజ్ వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఆరోగ్యకరమైన పిలకలు వస్తాయి. ఈ మేత విత్తనాలను 2-3 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. సాలు నుంచి సాలుకు 30 సెంటీమీటర్ల నిడివి, మొక్క నుంచి మొక్కకు 25 సెం.మీ దూరం ఉండాలి. ఇది నీటి ఎద్దడిని తట్టుకుని అధిక దిగుబడిని ఇచ్చే పంట. తేలికైన నేలల్లో 5-7 రోజుల్లో ఒక తడి, బరువు నేలల్లో 7-10 రోజుల్లో ఒక తడి పెట్టాలి. అత్యధిక పశుగ్రాసం ఉత్పత్తి చేయడమే కాక కాండం మెత్తగా ఉండి చెరుకులాగా తీయగా రుచికరంగా ఉంటుంది. ఈ పశుగ్రాసం తీపిగా ఉండటం వల్ల పశువులు ఇష్టంగా తింటాయి. పశుగ్రాసం కూడా వృథా కాదు. ఈ పశుగ్రాసాన్ని మేపడం వల్ల రోజుకు రెండు లీటర్ల పాలు పెరిగే అవకాశం ఉంది. జిల్లాలోని ఎర్రుపాలెం మండలానికి చెందిన రైతులు ఈ పశుగ్రాసాన్ని పెంచుతున్నారు. అధిక పాల ఉత్పత్తి సాధిస్తున్నారు. పాతరగడ్డిగా కూడా షుగర్గ్రేజ్ను ఉపయోగించుకోవచ్చు. న్యూట్రిఫీడ్ సజ్జ పశుగ్రాసం నుంచి అభివృద్ధి చేసిన సంకరజాతి గడ్డి రకం ఇది. ఈ పశుగ్రాసంలో 14 నుంచి 16 శాతం మాంస కృత్తులు ఉంటాయి. అధికశక్తినిచ్చే ఖనిజ లవణాలనూ ఇది కలిగి ఉంటుంది. ఈ పశుగ్రాసం మేపడం వల్ల గేదె, పాడిపశువులలో పాల ఉత్పత్తి, వెన్నశాతం పెరుగుతుంది. ఒక ఎకరానికి 3 కిలోల విత్తనాలు సరిపోతాయి. బోదెలు తోలి బోదెల్లో ఈ విత్తనాలు విత్తుకోవడం మంచిది. ఈ విధానం వల్ల అధిక పశుగ్రాసం పొందవచ్చు. బహువార్షిక పశుగ్రాసం విత్తితే 70-80 రోజులకు మొదటి కోత వస్తుంది. తర్వాత నత్రజని ఎరువులు, నీరు పెట్టడం వల్ల రెండో కోతను 40-45రోజుల్లో పొందవచ్చు. ఆరుతడులు ఇవ్వడం వల్ల చాలా కోతలకు అవకాశం ఉంది. ఈ రెండు రకాల పశుగ్రాస విత్తనాలను పశుసంవర్థకశాఖ 75 శాతం సబ్సిడీపై రైతులకు అందజేస్తోంది. -
శ్రేష్టమైన పశుగ్రాసం ‘న్యూట్రిఫీడ్’
విత్తుకునే విధానం: న్యూట్రిఫీడ్ను అన్ని రకాల నేలల్లో విత్తుకోవచ్చు. దీని వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఆరోగ్యవంతమైన పిలకలు వచ్చేం దుకు విత్తనాలను 2-3 సెంటీ మీటర్లు లోతులో వేయాలి. మొక్కకు మొక్కకు మధ్య సుమారు 25 సెంటీమీటర్ల దూరం, సాలుకు సాలుకు మధ్య సుమారు 30 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ఇలాగైతే మొదటి కోత అనంతరం ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది. నీటి పారుదల: న్యూట్రిఫీడ్ నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. అయినా తేలిక నేలల్లో 5-7 రోజులకు ఒక తడి, బరువు నేలల్లో 7-10 రోజులకు ఒక తడి నీటి అవసరం ఉంటుంది. లాభాలు: న్యూట్రిఫీడ్ తినడం ద్వారా పశువులు ఎక్కువ రోజులు పాలిస్తాయి. పాల ఉత్పత్తి, వెన్నశాతం పెరుగుతుంది. ఈ పశుగ్రాసం తినడం ద్వారా పశువులు సరైన సమయంలో గర్భధారణ అవుతాయి. ఇతర దాణా ఖర్చులు తగ్గుతాయి. విత్తిన సమయంలో మంచి ఎరువులు వేసుకుంటే 40 రోజుల్లో మొదటి దఫా కోతకు వస్తుంది. ప్రతి కోత తర్వాత ఎకరాకు 50 కిలోల యూరియా వేసుకుంటే ఆరోగ్యవంతమైన పశుగ్రాసం పెరుగుతుంది. -
లక్ష్మీనగరం.. క్షీరసాగరం
మంజీరా తీరాన పాపన్నపేట మండలానికి మధ్యలో వెలసింది లక్ష్మీనగరం. అయిదారు దశాబ్దాల క్రితం తమ్ము చెట్లు రాళ్లూరప్పలతో కూడిన భూములు నేడు రతనాలు పండించే మాగాణిగా మారాయి. మగాళ్లంతా వ్యవసాయ పనులు చేస్తుండగా..మహిళలంతా పాడిపరిశ్రమతో స్వాలంబన సాధిస్తున్నారు. ఎకరాకు 35 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని పండిస్తూ..62 టన్నుల చెరకును ఉత్పత్తి చేస్తూ..నిత్యకృషీవలురుగా నిలుస్తుంటే...మహిళలు ఒక్కో గేదె నుంచి సుమారు పది లీటర్ల పాల దిగుబడిని సాధిస్తున్నారు. పాలనురగల లోగిళ్లు లక్ష్మీనగరం జనాభా 954. కాగా అక్కడ సుమారు 700 పాడి గేదెలున్నాయి. ప్రతి ఇంటికి పాడిగేదెలున్నాయి. వీటి పూర్తి బాధ్యతను మహిళలే తీసుకుంటారు. ఒక్కో గేదె నుంచి సుమారు 10 లీటర్ల పాలను పొందుతారు. కనీసం 400 గేదెలు పాలిచ్చినా..రోజుకు 4వేల లీటర్ల దిగుబడి వస్తుంది. లీటర్‌కు రూ.35ల చొప్పున రోజుకు రూ.1.40లక్షలు, నెలకు రూ.42లక్షలు ఆదాయాన్ని సాధిస్తున్నారు. పిల్లల చదువులు...ఇంటి నిర్వహణలో మహిళల సంపాదనే కీలకం. హరితవనాల వాకిళ్లు లక్ష్మీ నగరంలోని ఇళ్లు..ప్రకృతి రమణీయతకు ప్రతిరూపంగా నిలుస్తాయి. ఏ ఇంటి లోగిళ్లు చూసినా..పచ్చని చెట్లు..రంగు రంగుల పూల మొక్కలు, కూరగాయలు, పండ్ల చెట్లతో హరిత వనాలను తలపిస్తాయి. నిరుపేద గుడిసైనా..అద్దాల మేడయినా..ఆ ఇంటి ముందు పచ్చని చెట్ల తోరణాలతో ఆహ్వానం పలుకుతున్నట్లు కనిపిస్తాయి. కృషితో..సుభిక్షం ఆరు దశాబ్దాల క్రితం వలస వచ్చిన ఆ కుటుంబాలన్నీ అప్పట్లో అక్షర జ్ఞానానికి ఆమడ దూరంలో ఉండేవి. స్వేదాన్ని చిందించి..సిరులు పండిస్తూ...ఆర్థిక అభివృద్ధి సాధించారు. విద్యా ప్రాధాన్యతను గుర్తించి నాటితరం మహిళలంతా రాత్రిబడికి వెళ్లి..సంతకాలు నేర్చుకున్నారు. గ్రామంలో 21 డ్వాక్రా గ్రూప్‌లు ఉన్నాయి. బ్యాంకులిచ్చే ఆర్థిక రుణాలతో పాడి గేదెలు కొనుగోలు చేసి పాల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో పిల్లలందర్నీ గొప్ప చదువులు చదివించారు. ప్రస్తుతం ఆ పల్లెలో 40 మంది ఇంజనీర్లు..నలుగురు డాక్టర్లు దేశ విదేశాల్లో పనిచేస్తున్నారు. ఒకప్పుడు ఆ పల్లెలో అన్నీ గుడిసెలే. కాని నేడు ఒక్కటి రెండు తప్పా..99 శాతం ఆర్సీసీ భవనాలే కనిపిస్తాయి. ఈ ఒక్క గ్రామంలోనే 42 వరికోత మెషిన్లు ఉన్నాయి. కోలాటం...భజనలు పొద్దంతా కష్టపడుతూ..స్వేదం చిందించే ఈ గ్రామ మహిళలు సాయంత్రం కోలాటం..భజన కార్యక్రమాలతో..సేదదీరుతుంటారు. 30 మంది మహిళలు కలిసి లక్ష్మీ కళా కోలాట భజన బృందంగా ఏర్పడ్డారు. శ్రీశైలం మహా శివరాత్రి ఉత్సవాలు, భద్రాచలంలో శ్రీరామ నవమి, విజయవాడ కనక దుర్గ ఆలయ ఉత్సవాల్లో, ఏడుపాయల, బిక్కనూర్ సిద్దిరామేశ్వరాలయ ఉత్సవాల్లో వీరు ప్రదర్శనలిచ్చి భళా అనిపించారు. ఏళ్ల క్రితం వలస వచ్చిన వారు స్థానికులతో కలిసి మెలసి ఉంటూ..వారి పండగలు, శుభకార్యాల్లో పాల్గొంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
డెయిరీ కళకళ
కర్ణాటక నుంచి పాల వెల్లువ నిత్యం 40 ట్యాంకర్ల వరకు రాక ఇప్పటివరకు 60 లక్షల లీటర్లు సరఫరా పూర్తిస్థాయిలో పనిచేస్తున్న పాల పొడి ఫ్యాక్టరీ డెయిరీకి పెరగనున్న ఆదాయం ఒంగోలు డెయిరీకి మంచి రోజు లొచ్చాయి. ఉద్యోగులకు చేతిని ండా పనిదొరికింది. వారానికి రెండు రోజులు పనిచేసే పాల పొడి ఫ్యాక్టరీ గత పదిరోజుల నుంచి పూర్తి స్థాయిలో పని చేస్తోంది. పాల పొడి, వెన్న తయారీ కోసం కర్ణాటక నుంచి పాలు వెల్లువలా వస్తున్నాయి. అక్కడ పాల ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుండటంతో పాల పొడి తయారీ, వెన్న తయారీ కోసం ప్రకాశం జిల్లా ఒంగోలు డెయిరీకి తెప్పిస్తున్నారు. కనీసం రోజుకు 30 నుంచి 40 ట్యాంకర్లు అక్కడ నుంచి వస్తున్నాయి. కేజీ పాల పొడి తయారీకి రూ.30, కేజీ వెన్న తయారీకి రూ.15 డెరుురీకి చెల్లిస్తారు. ఈ లెక్కన ఒంగోలు డెయిరీకి రోజుకు నాలుగు లక్షల రూపాయలకు పైగా ఆదాయం వస్తుంది. గత పది రోజులుగా కర్ణాటక నుంచి 60 లక్షల లీటర్ల పాలు వచ్చాయి. రూ.45.50 లక్షల వరకు ఆదాయం సమకూరింది. కర్ణాటక పాలతో కళకళ జిల్లాలో పాడిపరిశ్రమ గత రెండు, మూడేళ్లుగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోంది. పాల దిగుబడి తగ్గిపోయింది. ప్రస్తుతం డెయిరీకి వస్తున్న పాలకు బయట బాగా డిమాండ్ ఉండటంతో పాల పొడి, వెన్న తయారీకి పాలు మిగలని పరిస్థితి. ఈ నేపథ్యంలో గత పది రోజులుగా ఒంగోలు డెయిరీకి పాల పొడి తయారీ కోసం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నిత్యం పెద్ద సంఖ్యలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తోంది. ఫ్యాక్టరీ సామర్థ్యానికి మించి పాల ట్యాంకర్లు వస్తుండటంతో డెయిరీ కళకళలాడుతోంది. ట్యా ంకర్లను నిలిపేందుకు కూడా ఖాళీ లేని పరిస్థితి నెలకొంది. అన్‌సీజన్‌లో అంతంతమాత్రమే.. ఒంగోలు డెయిరీలో 20 సంవత్సరాల క్రితం రూ.30 కోట్లకు పైగా ఖర్చు చేసి పాల పొడి ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. రోజుకు మూడు నుంచి నాలుగు లక్షల టన్నుల పాల పొడి, వెన్న తయారుచేసే సామర్థ్యం ఫ్యాక్టరీకి ఉంది. ప్రస్తుతం కర్ణాటక నుంచి వస్తున్న పాల వల్ల ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో పనిచేస్తోంది. సాధారణంగా పాల సీజన్లో మాత్రమే ఈ ఫ్యాక్టరీ 24 గంటలూ పనిచేస్తుంది. ఈసారి సీజన్ ప్రారంభమైనా జిల్లాలో పాల ఉత్పత్తి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. వర్షాభావ పరిస్థితులు జిల్లాను వెంటాడుతుండటమే అందుకు కారణం. అన్ సీజన్లో అరుుతే ఫ్యాక్టరీ కేవలం వారానికి రెండు రోజులు పనిచేస్తుంది. స్థానిక పాలతో పాల పొడి, వెన్న తయూరుచేస్తుంది. ఫ్యాక్టరీ ఏ మేరకు పనిచేస్తే ఆ మేరకు డెయిరీకి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కర్ణాటక పాలతో రోజుకి 35 టన్నుల పాల పొడి, 15 నుంచి 20 టన్నుల వెన్న తయారు చేస్తున్నారు. దీంతో ఫ్యాక్టరీ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశముంటుందని డెయిరీ ఎండీ శివరామయ్య తెలిపారు. -
మరో 50 కొత్త పాల కేంద్రాలు
బడేవారిపాలెం(కోడూరు) : మరింత పాల ఉత్పత్తి పెంచేందుకుగానూ కృష్ణామిల్క్ యూనియన్ పరిధిలో కొత్తగా మరో 50 పాలకేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని కృష్ణామిల్క్ యూనియన్ అధ్యక్షుడు మండవ జానకిరామయ్య చెప్పారు. మండల పరిధిలోని బడేవారిపాలెంలో కొత్తగా నిర్మించిన పాలకేంద్రం నూతన భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మండవ మాట్లాడుతూ కృష్ణామిల్క్ యూనియన్ రోజుకు 2.50లక్షల లీటర్లు పాలసేకరణ లక్ష్యంగా ముందుకు వెళుతుందన్నారు. దేశంలోనే పాల ఉత్పత్తిదారులకు అత్యధికంగా రూ.47కోట్ల బోనస్ ఇస్తున్న ఘనత కృష్ణామిల్క్ యూనియన్‌కే దక్కిందన్నారు. బడేవారిపాలెంలో నూతన భవన నిర్మాణం కోసం రూ.30వేలు సాయమందించిన బడే నారాయణరావు, రూ.50 వేలతో భవన నిర్మాణానికి తోడ్పడిన అధ్యక్షుడు మలిశెట్టి వీరబ్రహ్మవెంకటేశ్వరరావును జానకిరామయ్య అభినందించారు. మండవ జానకిరామయ్యతో పాటు అతిథులను పాలకేంద్రం పాలకవర్గం ఘనంగా సత్కరించింది. జిల్లాలో మరో 12బీఎంసీలు... అవనిగడ్డ : జిల్లాలో మరో 12మిల్క్‌బల్క్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని మండవ జానకిరామయ్య తెలిపారు. జిల్లాలోని పడమటిపాలెం, పెడనలో ఇప్పటికే స్థల సేకరణ చేశామని, మోపిదేవి, శ్రీకాకుళం, గరికిపర్రులో ఈ కేంద్రాల ఏర్పాటుకు కృషిచేస్తున్నామని ఆయన చెప్పారు. స్థానిక మిల్క్‌బల్క్ సెంటర్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2013-14 ఆర్థిక సంవత్సరంలో రెండు దఫాలుగా లీటరుకు రూ.6 చొప్పున రూ.27కోట్లు పాల ఉత్పత్తిదారులకు బోనస్‌గా చెల్లించామన్నారు. ప్రస్తుతం పాలసేకరణ ధరను లీటరురూ.55కు పెంచామని తెలిపారు. యూనియన్ మేనేజర్ ఎం.జగన్మోహనరావు, సంఘం డెరైక్టర్లు జాస్తి రాధాకృష్ణ, వేమూరి రత్నగిరి, పామర్రు పాలశీతల కేంద్రం మేనేజర్ గరికపాటి శ్రీధర్, పీఏసీఎస్ అధ్యక్షుడు బడే వెంకటరమణ, ప్రముఖులు బడే నాగరాజు, గుత్తి ప్రసాద్, మారుబోయిన పులేంద్రరావు , బీఎంసీ సూపర్వైజర్ బీవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మిల్క్‌యూనియన్ డెరైక్టర్ జాస్తిని మండవ ఘనంగా సత్కరించారు. -
లాభాల పాడి
లక్సెట్టిపేట : పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. దేశ జనాభా సుమారు 125 కోట్లు ఉంటే ప్రస్తుత పాల సగటు తలసరి వినియోగం 235 గ్రాములు మాత్రమే కావడం గమనార్హం. న్యూట్రిషనిస్టుల సూచనల ప్రకారం సగటు తలసరి వినియోగం రోజుకు 250 గ్రాముల పైనే ఉండాలని మండల పశువైద్యాధికారి శ్రీనివాస్ వివరించారు. ప్రస్తుతం దేశంలో పాల దిగుబడి 110మిలియన్ టన్నులు.. ఐదు శాతం వృద్ధి రేటుతో 2020వ సంవత్సరానికి మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధిక పాల దిగుబడికి ఎక్కువ పాలసార కలిగిన శ్రేష్టమైన జాతి పశువులు అవసరం. మనకున్న పశువుల్లో ఎక్కువ శాతం తక్కువ పాలసార ఉన్న నాటి జాతి పశువులు. కావున వీటిలో అధిక దిగుబడి ఆశించడం అసాధ్యం. దేశవాలి పశువుల స్థానంలో శ్రేష్టమైన జాతుల్ని పెంపొందించుకుని పోషించాల్సిన అవసరం ఉంది. రైతులు ముర్రాజాతి గేదెలను పెంచుకుంటే అధిక పాల దిగుబడితోపాటు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు. ముర్రాజాతి గేదెలను పొందే విధానం ముర్రాజాతి గేదెలను గ్రామీణ ప్రాంతాల్లో గౌడిగేదెలు అని కూడా పిలుస్తారు. కృత్రిమ గర్భోత్పత్తి విధానం ద్వారా మన దేశవాళి గేదెల నుంచి గ్రేడీడ్ ముర్రాజతి దూడలను పొందవచ్చు. పిండమార్పిడి ప్రక్రియ ద్వారా కూడా పొందవచ్చు. పశుక్రాంతి పథకం ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు. ఈ మూడింటిలో ప్రస్తుతం కృత్రిమ గర్భోత్పత్తి, పశుక్రాంతి పథకం ద్వారా సులభంగా పొందవచ్చు. లాభాలు.. ముర్రా అంటే మెలివేయబడిన అని అర్థం. వీటి కొమ్ములు మెలివేయబడి పొట్టిగా ఉండి గట్టిగా లోపలి వైపునకు స్పైరల్ ఆకారంలో తిరిగి ఉంటాయి. అందుకే వీటిని ముర్రా అని పిలుస్తారు. దేశంలోని జీవ జాతుల్లో అత్యంత శ్రేష్టమైనది. పాడికి, వెన్న శాతానికి పేరెన్నిక కలిగినది. దీని పుట్టినిల్లు హర్యానా రాష్ట్రం. దేశవాలి గేదె జాతుల నుంచి అధిక పాల దిగుబడిని పొందడానికి వాటిని అప్‌గ్రేడ్ చేయడానికి ముర్రాజాతి వీర్యాన్ని దేశమంతటా విరివిగా వినియోగిస్తారు. దేశవాళి గేదెల కంటే ఎక్కువ పాలు ఇస్తాయి. రోజుకు సుమారు 10 నుంచి 12 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. పాల ఉత్పత్తి ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువ(వెన్న శాతం అధికంగా ఉండడం వల్ల, ఎక్కువ కాలం పాడితో ఉండడం వల్ల). వీటికి ఋతుక్రమం సరిగా ఉంటూ జీవిత కాలంలో ఎక్కువ ఈతలు ఈనడంతోపాటు దృఢమైన దూడలనిస్తాయి. దూడబరువు రోజువారీగా 400 నుంచి 500 గ్రాములు పెరుగుతూ త్వరగా ఎదకు వస్తాయి. పొందే విధానం.. ముర్రాజాతి గేదెకు ఒక్కో దానికి సుమారు రూ.50వేలు ఉంటుంది. రవాణా ఖర్చు సుమారు రూ.6,500 అవుతుంది. గేదె బీమాకు రూ.2వేలు చెల్లించాలి. గేదె ధరను బట్టి 4 నుంచి 5 శాతం వరకు బీమా లెక్కిస్తారు. బీమా చేయించడం వల్ల ప్రమాదవశాత్తు చనిపోతే యజమాని నష్టపోకుండా ఉంటారు. బీమా కంపెనీలు నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యునెటైడ్ ఇండియా ఇన్య్సూరెన్స్ కంపెనీ న్యూ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ బ్యాంకు రుణాలు.. యజమాని ఒక గేదెను కొనడానికి సుమారు రూ.60వేల వరకు పెట్టుబడి పెట్టాలి. కానీ అంత పెట్టుబడి పెట్టలేని వారి కోసం ప్రభుత్వం సాధారణ, మధ్య తరగతి రైతులకు ఇతర రాష్ట్రాల నుంచి ముర్రాజాతి గేదెలను దిగుమ తి చేసుకునే అవకాశాన్ని బ్యాంకు రుణాల ద్వారా కల్పిస్తోంది. గేదె ధరకు మార్జిన్ మనీ కింద 20శాతాన్ని చెల్లిం చాలి. మిగితా మొత్తం బ్యాంకు చెల్లించి గేదెను దిగుమతి చేస్తుంది. ఇందులో సుమారు 25 నుంచి 50శాతం వరకు సబ్సిడీ కూడా వర్తిస్తుంది. మధ్య తరగతి కుటుంబాలు ఒ కేసారి ఐదు నుంచి పది గేదెలతో మినీ డెయిరీ ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకు అధికారులను సంప్రదిస్తే వివరాలు తెలియజేస్తారు. గేదె చనిపోతే బీమా కంపెనీ పరి హారం అందజేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర విభజన దృష్ట్యా ఇంకా ఎటువంటి సబ్సిడీ, రుణాల సమాచారం రాలేదు. -
పాలతో పూలబాట
వర్షాభావ పరిస్తితులు, విద్యుత్ కోతల కారణంగా వ్యవసాయం కష్టాలను మిగల్చడంతో ప్రత్యామ్నాయంగా పలువురు రైతులు పాడిపరిశ్రమ వైపు దృష్టి సారించారు. రైతులకు బోరు బావుల కింద నీటి సౌకర్యం ఉండడం.. స్థానికంగా పాల శీతలీకరణ కేంద్రం ఉండడం వారికి మరింత కలిసొచ్చింది. రైతులు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి రూ.30వేల-రూ. 50వేల వరకు వెచ్చించి పాడి ఆవులను, గేదెలను కొనుగోలు చేశారు. కేవలం కుమ్మరిగూడ గ్రామంలోనే 3,500 వరకు పాడి గేదెలున్నట్లు అంచనా. రోజుకు 7 వేల లీటర్లకుపైగా పాలను ఈ గ్రామం నుంచి షాబాద్, పరిగి, షాద్‌నగర్, చేవెళ్ల పాల శీతలీకరణ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఒక్కో రైతు నెలకు రూ.10 వేలనుంచి రూ.15వేల వరకు ఆదాయం పొందుతున్నారు. 15 నుంచి 40 లోపు గేదెలున్న పాల ఉత్పత్తిదారులు ప్రతి నెలా నిర్వహణ ఖర్చులు పోగా రూ.25వేల నుంచి రూ.45 వేల వరకు, 70కు పైగా గేదెలు ఉండే పెద్ద పాల ఉత్పత్తిదారులు ప్రతి నెలా రూ.లక్షకు పైగా సంపాదిస్తున్నారు. గ్రామంలో జెర్సీ, రిలయన్స్, జ్యోతి, సరిత, మదర్ డెయిరీలు వెలిశాయి. ఇవి పోటాపోటీగా ధరలు చెల్లించడంతో ఎక్కువమంది రైతులు పాడి ఆవులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక్కో పశువు పేడకు సైతం ఏడాదికి రూ.1000 చొప్పున లాభాలు వస్తున్నాయి. -
గాడి తప్పిన పాడి
సగానికి పడిపోయిన పాల ఉత్పత్తి పొలాల్లోనూ పశువులకు పచ్చగడ్డి కరవు పోషణ భారమై సంతలకు తరలిస్తున్న రైతులు పాలధర ఆశాజనకంగా ఉన్నా గిట్టుబాటు కాని వైనం తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న పశుపోషకులు {పభుత్వం ఆదుకోకపోతే మరింత నష్టపోయే ప్రమాదంగ పాడిని నమ్మినవాడు.. భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ నష్టపోడు అనే పెద్దల నానుడి. కానీ రానురాను కాలం మారుతోంది. రుతుపవనాల రాక ఆలస్యమవుతోంది. కనుచూపు మేరలో చినుకు జాడ కనిపించ డం లేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పొలాల్లో పశువులు మేసేందుకు కూడా పచ్చగడ్డి కరువైంది. ఫలితంగా పాల ఉత్పత్తి సగానికి పైగా పడిపోయింది. ప్రభుత్వం నుంచి చేయూత కొరవడటంతో పాడి పరిశ్రమ కుదేలైంది. నూజెండ్ల: పంటలు లేని సమయాల్లో సాధారణంగా రైతులు వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పరిశ్రమ మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ఈ ఏడాది జిల్లాలో నెలకొన్న ప్రత్యేక వాతావరణ పరిస్థితులు పాడికి కూడా అనుకూలించక రైతులు నష్టాల బారిన పడుతున్నారు. లక్షలు వెచ్చించి గేదెలను కొనుగోలు చేసిన పాల ఉత్పత్తిదారుల ఇబ్బందులు చెప్పనలవి కావటం లేదు. పచ్చగడ్డి పెంచేందుకు నీరు లేదు. కొన్ని ప్రాంతాల్లో పచ్చిక బయళ్లు, పశుగ్రాసం కోసం సాగుచేసిన పంటలు ఎండిపోయాయి. ఎండుగడ్డి కొందామంటే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చేసేది లేక రైతులు గేదెలను పొలాల మీదకు వదిలేస్తున్నారు. పొలాల్లో కూడా గడ్డి దొరకక పశువులు అలమటిస్తున్నాయి. పోషణ భారమై సంతలకు తర లించాల్సి పరిస్థితులు దాపురించాయి. పాల ఉత్పత్తిలో నూజెండ్ల ప్రథమం.. నూజెండ్ల మండలానికి పాడి పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. జిల్లాలో అత్యధికంగా పాల ఉత్పత్తి ఇక్కడి నుంచే జరుగుతుంది. మండలంలో గేదెలు, ఆవులు కలపి 37,640వరకూ ఉన్నాయి. మండలంలో మూడు ప్రయివేటు డెయిరీలు నడుస్తున్నాయి. ఈ డెయిరీలు గతంలో ఇదే సీజన్లో రోజుకు 25 వేల లీటర్లు పాలను సేకరించేవి. అలాగే మరో ఐదు ప్రయివేటు డెయిరీలు 15 వేల లీటర్లకు పైగా పాలను సేకరించేవి. ఇవి కాక పలు గ్రామాల్లో సంగం డెయిరీ పాల సేకరణ కేంద్రాలూ ఉన్నాయి. మండలంలోని గాంధీనగరం, కంభపాడు, ములకలూరు, వి.అప్పాపురం, పమిడిపాడు తదితర గ్రామాల్లో పాడి పరిశ్రమ ఆధారంగా జీవించే వారు అధికం. మొత్తమ్మీద 30 వేల లీటర్లకు పైగా పాలను ఒక్క నూజెండ్ల మండలంలో ఉత్పత్తి చేస్తున్నారు. కానీ ఈ ఏడాది పాల ఉత్పత్తి సగానికి పడిపోయింది. ధర పెరిగినా గిట్టుబాటేది..? పాలధర ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఏమాత్రం గిట్టుబాటు కావటంలేదని ఉత్పత్తిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాదిలో 10 శాతం వెన్న ఉన్న పాల ధర రూ. 42 ఉండగా ఈ ఏడాది రూ. 50కి చేరింది. అయినా ఉత్పత్తి సగానికి పడిపోయిన పరిస్థితుల్లో పెరిగిన ఎండుగడ్డి, దాణా ధరలతో పోల్చితే గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండల తీవ్రతకు మేతకూడా లభించక ఎనిమిది లీటర్ల పాలిచ్చే గేదెలు నాలుగు లీటర్లు కూడా ఇవ్వటం లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభుత్వం ఆదుకోకపోతే పశుపోషణకు స్వస్తి పలకడం మినహా చేసేది లేదని వాపోతున్నారు. మూగజీవాల ఆకలి కేకలు బెల్లంకొండ: వర్షాభావ పరిస్థితుల్లో గ్రాసం దొరక్క మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. వీటిని సంరక్షించలేక పెంపకందారులు అష్టకష్టాలు పడుతున్నారు. కనీసం దప్పిక తీర్చుకునేందుకు నీరు కూడా దొరక క జీవాలు మృత్యువాత పడుతున్నాయి. బెల్లంకొండ మండలంలో ఎనిమిది వేలకుపైగా ఆవులు, గేదెలు, 1.3 లక్షల వరకు గొర్రెలు, మేకలు ఉన్నట్టు పశుసంవర్థక శాఖ అధికారుల అంచనా. నాగిరెడ్డిపాలెం, వన్నాయపాలెం, నందిరాజుపాలెం, మన్నెసుల్తాన్‌పాలెం, పాపాయపాలెం, చండ్రాజుపాలెం, గ్రామాల్లో ఎక్కువ మంది రైతులు ఆవులు, గేదెలు, జీవాలను పోషిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. సమీపంలో పచ్చగడ్డి లభించక పోవడంతో రైతులు ఒకటి, రెండు పశువులను ఉంచుకొని మిగిలిన వాటిని కబేళాకు తరలిస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సహకారాలు అందటంలేదని, అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మూగజీవాలను కాపాడాలని పశుపోషకులు కోరుతున్నారు. పశుసంవర్ధక కేంద్రాల్లో జొన్న విత్తనాలు పంపిణీ చేస్తున్నారని, అసలే వర్షాలు లేక అల్లాడుతుంటే తాము ఈ విత్తనాలను ఏం చేసుకోవాలో అర్థం కావటం లేదని అధికారుల తీరును నిరసిస్తున్నారు. -
కెరీర్ కౌన్సెలింగ్
నేను డెయిరీ రంగంలో ఉపాధిని కోరుకుంటున్నాను. డెయిరీ రంగంలో ఉన్న కోర్సులు, అర్హతలతోపాటు కెరీర్ ఏ విధంగా ఉంటుందో వివరించండి? పాల ఉత్పత్తిలో మనదేశం ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఎన్నో డెయిరీలు ఉన్నాయి. దీంతో డెయిరీ రంగంలో నిపుణులైన మానవ వనరుల అవసరం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే డెయిరీ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టారు. ఈ కోర్సులో మిల్క్ ప్రాసెసింగ్, స్టోరేజీ, ప్యాకేజింగ్, రవాణా, పంపిణీ వంటి అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. డెయిరీ కోర్సులు: డిప్లొమా స్థాయిలో డెయిరీ టెక్నాలజీ, ఫుడ్ అండ్ డెయిరీ టెక్నాలజీ ఉన్నాయి. ఎంఎస్సీలో డెయిరీ కెమిస్ట్రీ/ టెక్నాలజీ, డెయిరీ ఇంజనీరింగ్, డెయిరీ మైక్రో బయాలజీ, డెయిరీ సైన్స్ కోర్సులూ, బీటెక్‌లో డెయిరీ టెక్నాలజీ, ఎంటెక్‌లో డెయిరీ కెమిస్రీ ్ట/టెక్నాలజీ, డెయిరీ మైక్రోబయాలజీ, పీహెచ్డీ లో డెయిరీ కెమిస్ట్రీ, డెయిరీ మైక్రో బయాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హత: బ్యాచిలర్ డిగ్రీలో ప్రవేశానికి ఇంటర్మీడియెట్ (10+2) బైపీసీలో ఉత్తీర్ణత సాధించాలి. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ(బీఈ/బీటెక్)లో ఉత్తీర్ణులై ఉండాలి. కెరీర్: డెయిరీ కోర్సులు చేసినవారికి ఉపాధి అవకాశాలకు కొదవలేదు. ఐస్‌క్రీమ్ యూనిట్లు, క్వాలిటీ కంట్రోల్ యూనిట్లు డెయిరీ టెక్నాలజిస్టులను నియమించుకుంటున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మేనేజర్, ఎడ్యుకేషనిస్టు, డెయిరీ టెక్నాలజిస్టు, మైక్రో బయాలజిస్టు, న్యూట్రీషనిస్టు, డెయిరీ సైంటిస్టు, ఇండస్ట్రీ సూపర్వైజర్, డెయిరీ మెడికల్ ఆఫీసర్ తదితర పోస్టుల్లో స్థిరపడొచ్చు. సొంత డెయిరీ ఫామ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. వేతనాలు: ప్రారంభంలో నెలకు రూ.6 వేల నుంచి రూ.12 వరకు ఆర్జించొచ్చు. తర్వాత అనుభవం ఆధారంగా నెలకు రూ.15 వేలకు పైగా వేతనం పొందొచ్చు. డెయిరీ కోర్సులను అందిస్తున్న సంస్థలు నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెబ్సైట్: www.ndri.res.in ఆనంద్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ- ఆనంద్ వెబ్సైట్: www.aau.in ఇందిరాగాంధీ కృషి విశ్వవిద్యాలయ వెబ్సైట్: www.igau.edu.in కర్ణాటక వెటర్నరీ, యానిమల్ అండ్ ఫిషరీస్ యూనివర్సిటీ-బీదర్ వెబ్సైట్: www.kvafsu.kar.nic.in మన రాష్ట్రంలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ - తిరుపతి డెయిరీ టెక్నాలజీలో బీటెక్, ఎంటెక్; ఎంఎస్సీలో డెయిరీంగ్ కోర్సులను అందిస్తోంది. వెబ్సైట్: www.svuu.edu.in -
రాష్ట్రంలో క్షీర విపవ్లం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ 2006-11 సంవత్సరకాలంలో పాల ఉత్పత్తిలో 41 శాతం వృద్ధిని నమోదు చేయడం ద్వారా దేశంలోనే మొదటి స్థానంలో రాష్ట్రం నిలిచింది. వృద్ధిరేటులో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ మొత్తం పాల ఉత్పత్తి పరిమాణం రీత్యా ఇంకా మూడో స్థానంలోనే ఉంది. ఈ ఐదేళ్ల కాలంలో తలసరి పాల లభ్యతల్లో 36 శాతం వృద్ధిని నమోదు చేయడం ద్వారా రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచినట్లు అసోచామ్ విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడయ్యింది. 2006-07 కాలంలో 79.38 లక్షల టన్నులుగా ఉన్న పాల ఉత్పత్తి 2010-11 నాటికి 1.12 కోట్ల టన్నులకు చేరింది. ఈ ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 19 శాతం వృద్ధితో 12.1 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తి చేయడం ద్వారా ఇండియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 2.1 కోట్ల లీటర్ల ఉత్పత్తితో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలవగా, 1.3 కోట్ల లీటర్ల ఉత్పత్తితో రాజస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. 2020కల్లా ఇండియాలో పాల ఉత్పత్తి 17.7 కోట్ల టన్నులు దాటొచ్చని అసోచామ్ అంచనావేసింది. పాల వినియోగం తక్కువే.. ప్రపంచంలో అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తున్నప్పటికీ రోజువారి సగటు వినియోగంలో ఇండియా ఇప్పటికీ వెనుకబడే ఉంది. అంతర్జాతీయంగా రోజుకు ప్రతీ వ్యక్తి 279 గ్రాముల పాలను వినియోగిస్తుంటే ఆ సగటు ఇండియాలో 252 గ్రాములుగా ఉంది. అదే న్యూజిలాండ్ 9,773 గ్రాముల వినియోగంతో మొదటి స్థానంలో ఉండగా, ఆ తరువాతి స్థానాల్లో ఐర్లాండ్ (3,260 గ్రాములు), డెన్మార్క్ (2,411 గ్రాములు) ఉన్నాయి. కాని ఈ ఐదేళ్ళ కాలంలో రాష్ట్రంలో సగటు పాల వినియోగం బాగా పెరిగినట్లు అసోచామ్ పేర్కొంది. 2006-07లో రోజుకు 268 గ్రాములుగా ఉన్న సగటు వినియోగం 2010-11 నాటికి 36 శాతం పెరిగి 364 గ్రాములకు పెరిగింది. కాని దేశం మొత్తం మీద హర్యానా 679 గ్రాములు వినియోగించడం ద్వారా మొదటి స్థానంలో ఉంది. వృద్ధికి మరిన్ని అవకాశాలు ప్రపంచ సగటు కంటే ఇండియా పాల వినియోగం తక్కువగా ఉండటంతో ఈ రంగంలో వృద్ధికి మరిన్ని అవకాశాలున్నాయని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నట్లు అసోచామ్ జాతీయ కార్యదర్శి డి.ఎస్.రావత్ తెలిపారు. ఏటా సగటున నాలుగు శాతం చొప్పున వృద్ధి చెందితే 2019-20 నాటికి దేశ పాల ఉత్పత్తి 17.7 కోట్ల టన్నులకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు అనుగుణంగా చిన్న రైతులకు, డెయిరీ ఉత్పత్తులు తయారు చేసే వారికి అనుసంధానంగా ఒక వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ప్రజల ఆదాయం కూడా పెరుగుతుండటంతో పాల ఉత్పత్తుల వినియోగం కూడా పెరుగుతోందని అసోచామ్ పేర్కొంది. -
కరువు కోరల్లో ‘పాడి’
ఉదయగిరి, న్యూస్‌లైన్: జిల్లాలోని మెట్ట ప్రాంతం కరువు కోరల్లో చిక్కుకుంది. పంటలు పూర్తిగా ఎండిపోవడంతో కనీసం పాడితోనైనా జీవనం సాగిద్దామనుకున్న రైతుకు కష్టాలు తప్పడం లేదు. నీటి చుక్క నేలరాలక, పశువులకు పచ్చిగడ్డి కరువైంది. తినడానికి మేత లేక, తాగడానికి నీరు లేక పశువుల పొదుగులు ఎండిపోతున్నాయి. పాల దిగుబడి గణనీయంగా పడిపోయింది. పూటకు ఐదు లీటర్ల పాలిచ్చే గేదె..రెండు లీటర్లు ఇవ్వడం కష్టంగా మారింది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిని పాడిరైతు ఎదుర్కొంటున్నాడు. కళ్ల ముందే గేదెలు నీళ్లు లేక, తిండిలేక శుష్కించిపోతుంటే చూడలేక అందినకాడికి కబేళాలకు అమ్ముకుంటున్నారు. ఎక్కువ ధర పెట్టి కొన్న గేదెల్ని కూడా కాలం కలిసిరాక దళారులు అడిగిన రేటుకు తెగనమ్ముతున్నారు. జిల్లాలో వ్యవసాయం తర్వాత పాడి ఆధారంగానే లక్షలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో పంటలు పండక, పాడిగేదెల ద్వారానే భృతి కొనసాగిస్తున్నారు. గత ఏడాది పాలవెల్లువ రావడంతో కొనే వారు లేక రైతులు నష్టపోయారు. ఈ ఏడాది ఉదయగిరి, ఆత్మకూరు, కావలి నియోజకవర్గంలోని పలు మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. పంటల సంగతి దేవుడెరుగు. కనీసం పశువులు, జీవాలకు కూడా మేత, నీరు లేదు. అనేక గ్రామాల్లో బోర్లలో నీరు పూర్తిగా అడుగంటింది. వాగులు, వంకలు,చెరువులు బోసిపోయాయి. ఈ పరిస్థితుల్లో పశువులకు కష్టాలు మొదలయ్యాయి. వీటిని నమ్ముకున్న పాడి రైతుకు ఇబ్బందులు తప్పలేదు. గణనీయంగా తగ్గిన దిగుబడి జిల్లాలో రోజుకు సగటున 2 లక్షలకుపైగా లీటర్ల పాలను విజయ డెయిరీతో పాటు ప్రైవేటు డెయిరీలు సేకరిస్తాయి. రెండు మూడునెలల నుంచి సేకరణ పడిపోతోంది. ప్రస్తుతం జిల్లాలో లక్ష లీటర్లు మాత్రమే పాల సేకరణ జరుగుతోంది. కరువు కారణంగా రెండు నెలలుగా విజయ డెయిరీకి వచ్చే పాలు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం 25 వేల లీటర్ల స్థాయికి పడిపోయింది. మార్చి, ఏప్రిల్‌లో మరింత దిగజారి పది వేల స్థాయికి పడిపోయే అవకాశం ఉంది. పాల రంగంలో చక్రం తిప్పుతున్న తిరుమల, దొడ్ల, హెరిటేజ్, విష్ణుప్రియ తదితర ప్రైవేటు డెయిరీలకూ కరువు పోటు తప్పలేదు. వీటికీ పాలసేకరణ తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో పాడి రైతుల్ని ఆదుకునేందుకు ముందుకు రావాల్సిన ప్రైవేటు, ప్రభుత్వ డెయిరీ యాజమాన్యాలు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. -
పాల ఉత్పత్తిలో నంబర్ వన్ కావాలి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో పాల ఉత్పత్తి లక్ష్యం 60 లక్షల లీటర్లకు పెరగాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆకాంక్షించారు. బెంగళూరు-తుమకూరు రహదారిలోని నైస్ జంక్షన్ వద్ద ఉన్న నైస్ మైదానంలో శనివారం నిర్వహించిన నందిని పాలు ఉత్పత్తిదారుల బృహత్ సమావేశాన్ని ఆయన ప్రారంభించి ప్రసంగించారు. పాల ఉత్పత్తిలో గుజరాత్ ప్రథమ స్థానం, కర్ణాటక రెం డో స్థానాల్లో ఉన్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం రోజూ 55 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతోందంటూ, 60 లక్షల లీటర్లకు పెంచడం ద్వారా తొలి స్థానంలో నిలవాలని రైతులకు సూచించారు. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్యక్షుడుగా, పశు సంవర్ధక శాఖ మం త్రిగా పని చేసిన తనకు పశు పోషణ ఎంత కష్టమో తెలుసునని చెప్పారు. కర్ణాటక పాడి సమాఖ్య (కేఎంఎఫ్) ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడీ స్థాయికి ఎదిగిందని కొనియాడారు. సంస్థకున్న మంచి పేరును కాపాడుకోవాలని సూచించారు. రైతులు తమ వినియోగానికి ఉంచుకుని మిగిలిన పాలను కేఎంఎఫ్‌కు పోయాలని కోరారు. రైతులకూ పౌష్టికత అవసరమన్నారు. విద్యార్థుల కోసం క్షీర భాగ్య పథకాన్ని అమలు చేయడం ద్వా రా కేఎంఎఫ్‌ను నష్టాల బారి నుంచి తప్పించామని ఆయన వెల్లడించారు. నటుడు పునీత్ రాజ్ కుమార్ మాట్లాడుతూ... కేఎంఎఫ్‌తో తమ కుటుంబానికి 15 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. గతంలో తన తండ్రి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండానే కేఎంఎఫ్ బ్రాండ్ అయిన నందిని ఉత్పత్తుల కోసం ప్రచారం చేశారని తెలిపారు. తాను కూడా తండ్రి బాటలో పయనిస్తున్నానని చెప్పారు. ఇంత వ ుంది ప్రజల ఆశీర్వాదమే తనకు సంభావన అని పేర్కొన్నారు. ఈ బృహత్ సమావేశంలో తనకు జరిగిన సన్మానాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటానని ఆయన చెప్పారు. కార్యక్రమంలో కేఎంఎఫ్ అధ్యక్షుడు జీ. సోమశేఖర రెడ్డి, ఎండీ ఏఎస్. ప్రేమనాథ్ ప్రభృతులు పాల్గొన్నారు. ఇదే సందర్భంలో గాలికుంటు వ్యాధి నియంత్రణపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు చన్నపట్టణ తాలూకా కన్నమంగల వద్ద పశు ఆహారోత్పత్తి కేంద్రానికి శంకు స్థాపన చేశారు. నందిని ప్రత్యేక పాలును కూడా విడుదల చేశారు. -
పాల ఉత్పత్తిని పెంచేందుకే సబ్సిడీ పథకాలు
మహబూబ్‌నగర్ వ్యవసాయం, న్యూస్‌లైన్: జిల్లాలో పాల ఉత్పత్తిని పెంచేందుకే ప్రభుత్వం సబ్సిడీ పథకాలను పకడ్బందీగా అమలు చేయనున్నట్లు పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ జిల్లా డిఫ్యూటి డెరైక్టర్ సి.తిరుపతిరెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉత్పత్తిని పెంచడంలో భాగంగానే గతేడాది డిసెంబర్ 1న పాల ధరలను పెంచినట్లు ఆయన తెలిపారు. రైతులకు పశుదాణా, ముడి పదార్థాలు, పచ్చిగడ్డి, ఇతర నిర్వహణ ఖర్చులు పెరిగినందున వారు నష్టపోకుడదనే ప్రభుత్వం ఈ నిర్ణయ తీసుకున్నట్లు తెలిపారు. ఈ పెంపుతో గేదె పాలకు లీటర్ ధరపై నాణ్యతను బట్టి గరిష్ఠంగా 0.50 పైసలు, ఆవు పాలకు లీటరుధరపై నాణ్యతను బట్టి గరిష్ఠంగా 0.27 పైసలు పెంచినట్లు ఆయన తెలిపారు. కల్తీలేని నాణ్యమైన పాలను ఆయా గ్రామాల్లోని విజయ పాల సేకరణ కేంద్రానికి తీసుకువెళ్ళి సరియైన ధరను పొందవచ్చన్నారు. కోనుగోలులో ఎవరైనా ఏజెంట్లు అవకతవకలకు పాల్పడినట్లు తన దృష్టికి తీసుకువ స్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చారించారు. ప్రభుత్వ సబ్సిడిలను వినియోగించుకోవాలి విజయ పాల సేకరణ కేంద్రంలో క్రమం తప్పకుండా పాలను సరఫరా చేసే రైతులను ప్రోత్సహించేందుకు గాను ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టిందని తిరుపతిరెడ్డి తెలిపారు. పాడి రైతులు వీటిని సద్వినియోగం చేసుకొని అభివృధ్ధి పథంలో ముందుకు వెళ్లాలని కోరారు. తమ సంస్థ సహకారంతో తక్కువ ధరకు విజయ పశువుల దాణాను పాడి రైతులకు సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏభైశాతం సబ్సిడీపై గడ్డి విత్తనాలు, లవణ మిశ్రమం( మినరల్ మిక్చర్), గాలి కుంటువ్యాధి నివారణ టీకాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అదే విధంగా 75శాతం సబ్సిడీపై నట్టల నివారణ మందులను ఇస్తున్నామన్నారు. ఉచిత పశువైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పశువులకు వచ్చే రోగాలను గుర్తించి, మందులను సరాఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పశువుల బీమా, చాఫ్ కట్టర్స్, కృతిమ గర్భధారణ లాంటి సాంకేతిక సదుపాయాలను కల్పిస్తున్నమని తెలిపారు.అంతేకాకుండా జిల్లా కేంద్రంలోని మహబూబ్‌నగర్ డెయిరీ ఆవరణలో ఎ.పి.బి.ఎన్ పశుగ్రాసం పెంచి రైతులకు గడ్డి కాండం మొక్కలు ఉచితంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు. -
తిరుమల మిల్క్ ఫ్రెంచ్ కంపెనీ చేతికి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద డెయిరీ సంస్థగా ఉన్న ఫ్రెంచ్ కంపెనీ లాక్టాలిస్... దేశీయ పాల ఉత్పత్తుల వ్యాపారంలోకి ప్రవేశించింది. రాష్ట్రానికి చెందిన తిరుమల మిల్క్ ప్రోడక్ట్స్‌ను రూ.1,750 కోట్లకు (275 మిలియన్ డాలర్లు) లాక్టాలిస్ కొనుగోలు చేసింది. నలుగురు ప్రమోటర్లకు చెందిన 76 శాతం వాటాతో పాటు, ప్రైవేటు ఈక్విటీ సంస్థ కార్లీ గ్రోత్ క్యాపిటల్ ఫండ్ చేతిలో ఉన్న 24 శాతం వాటాను కూడా లాక్టాలిస్ కొనుగోలు చేస్తోంది. ఈ ఒప్పందాన్ని ప్రమోటర్లలో ఒకరైన బొల్లా బ్రహ్మ నాయుడు ధృవీకరించారు. అయితే ఒప్పందం వివరాలు, విలువను తెలియచేయడానికి ఆయన నిరాకరించారు. లాక్టాలిస్ అధికార ప్రతినిధి మైకెల్ నాలెట్ మాత్రం ఈ ఒప్పందాన్ని జాతీయ మీడియాకి నిర్ధారించారు. 2010లో కార్లే గ్రోత్ ఫండ్ తిరుమల మిల్క్‌లో 24 శాతం వాటాను 22 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఇపుడు అదే వాటా కోసం లాక్టాలిస్ 85 మిలియన్ డాలర్లు చెల్లించింది. అంటే మూడేళ్లలో కార్లీ గ్రోత్ ఫండ్‌కు 225 శాతానికి పైగా లాభాలొచ్చాయి. దేశీయ డెయిరీ పరిశ్రమపై దృష్టి దాదాపు 150కిపైగా దేశాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న లాక్టాలిస్ అమ్మకాల పరిమాణం రూ.1.40 లక్షల కోట్లు. రూ.60,000 కోట్ల పాల ఉత్పత్తుల మార్కెట్ కలిగిన ఇండియాలోకి లాక్టాలిస్ తొలి అడుగు కూడా ఇదే. ప్రపంచ పాల ఉత్పత్తిలో దాదాపు 20 శాతం వాటా కలిగిన ఇండియా అంతర్జాతీయ డెయిరీ కంపెనీలకు ప్రధానమైన మార్కెట్‌గా కనిపిస్తోంది. రూ.1,500 కోట్ల అమ్మకాలతో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తుల తయారీ సంస్థగా ఉన్న తిరుమల డెయిరీని కోనుగోలు చేయడం ద్వారా ఇండియాలో అడుగు పెట్టడమే కాకుండా మరింతగా విస్తరిచే యోచనలో ఈ ఫ్రెంచ్ కంపెనీ ఉంది. లాక్టాలిస్ రంగ ప్రవేశంతో ఇప్పటి వరకు ఇండియాలో నంబర్ వన్‌గా ఉన్న ‘అమూల్’కి గట్టి పోటీ తప్పదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.2.25 లక్షలతో ఆరంభమైన తిరుమల... ఆటో మొబైల్ ఫైనాన్స్ కంపెనీ నిర్వహిస్తున్న నలుగురు స్నేహితులు కలిసి రూ.2.25 లక్షల మూలధనంతో 1998లో తిరుమల డెయిరీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తిరుమల డెయిరీ... రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్నాటకల్లో బాగా విస్తరించింది. పాల ప్యాకెట్లు, టెట్రా ప్యాకెట్లు, పాలపొడి, స్వీట్లు, పన్నీర్, నెయ్యి, వెన్న వంటి ఉత్పత్తులను ఇది అందిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1427 కోట్ల వ్యాపారంపై రూ.70 కోట్ల లాభాన్ని తిరుమల మిల్క్ ప్రకటించింది. -
పాడి రైతులకు శుభవార్త
= లీటరుకు రూ.2 ప్రోత్సాహకాన్ని పెంచిన సమాఖ్య = రేపటి నుంచి అమల్లోకి సాక్షి,బెంగళూరు : బెంగళూరు పాల ఉత్పత్తిదారుల సంఘంలోని సభ్యులకు లీటరు పాలు ఉత్పత్తి పై రూ.2 ప్రోత్సాహకాన్ని ఇవ్వనున్నట్లు సంఘం అధ్యక్షుడు హుల్లూరు సి. మంజునాథ్ వెళ్లడించారు. బెంగళూరులో మీడియాతో ఆయన సోమవారం మాట్లాడారు. సంఘంలోని సభ్యులకు ప్రోత్సాహకాన్ని ఇవ్వడమే కాకుండా సంఘంలోని సిబ్బందికి ప్రతి లీటరు కొనుగోలు పై 15 పైసల కమిషన్ ఇవ్వమనున్నామన్నారు. అంతేకాకుండా ప్రతి లీటరు క్రయవిక్రయాల పై వచ్చే లాభంలో 2 పైసలును సంఘం నిర్వహనకు కేటాయించనున్నామని వివరించారు. జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు. రైతులకు చెల్లించే మొత్తం పెరగడం వల్ల పాల విక్రయధర పెంపు జరగదన్నారు. దీని వల్ల వినియోగదారుల పై భారం పడబోదని ఆయన స్పష్టం చేశారు. తాజా నిర్ణయం వల్ల సమాఖ్య పై మార్చి 14 వరకూ రూ. 21.62 కోట్ల భారం పడనుందన్నారు. అటు పై తదుపరి విషయాల పై నిర్ణయం తీసుకోనున్నామన్నారు. గాలికుంటు వ్యాధి వల్ల సంఘంలోని చాల మంది సభ్యుల పాడి పశువులు మృతి చెందాయని గుర్తుచేశాయి. తాజా నిర్ణయం వల్ల వారికి బాధిత రైతులకు ఎంతో ఉపయోగం ఉంటుందని మంజునాథ్ అభిప్రాయపడ్డారు.