సంప్రదాయ ఆయుర్వేద చికిత్సలతోనే 42 రకాల పశు వ్యాధులకు 90% ఖచ్చితత్వంతో చికిత్స
ఎత్నో వెటర్నరీ మెడిసిన్ ప్రాక్టీసెస్ (ఈవీపీ) నిపుణులు
ప్రొఫెసర్ డా. ఎన్. పుణ్యస్వామితో ‘సాక్షి సాగుబడి’ ముఖాముఖి
పశువైద్యంలో సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతుల (ఎత్నోవెటర్నరీ ప్రాక్టీసెస్ –ఈవీపీల) ద్వారా యాంటీబయాటిక్స్ వాడకాన్ని 90% తగ్గించవచ్చంటున్నారు తమిళనాడుకు చెందిన విశ్రాంత పశువైద్య ఆచార్యుడు డా. ఎన్. పుణ్యస్వామి. గత 20 ఏళ్లుగా సంప్రదాయ పశువైద్యంపై ఆయన పరిశోధనలు చేస్తున్నారు. ఈ చికిత్సలు పొదుగువాపు సహా 42 పశువ్యాధులను 3–5 రోజుల్లో 90% ఖచ్చితత్వంతో తగ్గిస్తున్నాయని రుజువైంది.
జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ (ఎన్.డి.డి.బి) దేశవ్యాప్తంగా వీటిని పశువైద్యంలో భాగం చేసింది. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎ.ఎం.ఆర్.) సమస్యను అధిగమించాలన్నా, యాంటిబయాటిక్స్‌ను రక్షించుకోవాలన్నా సంప్రదాయ పశువైద్యమే మేలైన మార్గమని పుణ్యస్వామి స్పష్టం చేస్తున్నారు. రైతునేస్తం ఫౌండేషన్ ఇటీవల నిర్వహించిన ‘గోసంజీవని’ ఆంగ్ల పుస్తకావిష్కరణ సభలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన పుణ్యస్వామితో ‘సాక్షి సాగుబడి’ ముచ్చటించింది. ముఖ్యాంశాలు.
అల్లోపతి పశువైద్య శాస్త్రంలో ప్రొఫెసర్ అయిన మీ దృష్టి సంప్రదాయ ఆయుర్వేద పశు వైద్య (ఈవీపీ) పద్ధతుల వైపు ఎలా మళ్లింది?
పశువైద్యానికి సంబంధించి ఇప్పుడున్న వ్యవస్థ అరకొరగా ఉందని నా అభిప్రాయం. ప్రతి పశువుకు ఆరోగ్య సేవలు అందాలి. వనరులు రైతులకు తక్కువ ఖర్చుతో పరిసరాల్లోనే అందుబాటులో ఉండాలి. చికిత్సకు పొందబోయే ఫలితంపై ఖచ్చితమైన అంచనా ఉండాలి. అల్లోపతి పశువైద్య వ్యవస్థలో ఇవి లోపించాయి. ఎంత ఖచ్చితంగా ఫలితం వస్తుందో చెప్పలేం. అందువల్లే ఆయుర్వేదం, సంప్రదాయ సిద్ధ వైద్య రీతులను 2001 నుంచి అధ్యయనం చేశా. 20 ఏళ్ల నుంచి ఈవీపీ పద్ధతులపై పనిచేస్తున్నాం. 42 పశువ్యాధులకు చికిత్సా పద్ధతులను అభివృద్ధి చేశాం. మేం సూచించిన ఇంట్లోని దినుసులతో రైతులే స్వయంగా ఈ మందులను తయారు చేసుకొని పశువైద్యం చేసుకుంటున్నారు. స్వల్ప ఖర్చుతోనే 3–5 రోజుల్లోనే 80–90% పశువ్యాధులు ఖచ్చితంగా తగ్గిపోతున్నాయి. ఇది శాస్త్రీయంగా నిర్థారణ అయిన సంప్రదాయ చికిత్స పద్ధతి. అందువల్లే ఈ సంప్రదాయ చికిత్సను జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ (ఎన్.డి.డి.బి.) అంగీకరించింది. 2016లో నన్ను సంప్రదించింది. అప్పటి నుంచి 12 రాష్ట్రాల్లో మిల్క్ యూనియన్లతో కలసి పనిచేస్తున్నాం. పశువైద్యులకు, పాడి రైతులకు శిక్షణ ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో ఈవీపి పద్ధతుల్లో పశువైద్యం జరుగుతోంది.
పొదుగు వాపు నమ్మకంగా తగ్గిపోతుందా?
తప్పకుండా తగ్గి΄ోతుంది. ఎన్.డి.డి.బి. పరిధిలో వేలాది రైతుల అనుభవాలే ఇందుకు నిదర్శనం. పొదుగు వాపు నుంచి గాంగ్రీన్ వరకు 10 రకాల పొదుగు సంబంధిత జబ్బులు వస్తుంటాయి. గాంగ్రీన్ మినహా మిగతా 9 రకాల పశువ్యాధులను 3–5 రోజుల్లోనే ఈవీపీ వైద్యం ద్వారా సమర్థవంతంగా 85–90% కేసుల్లో శాశ్వతంగా తగ్గించవచ్చని నిరూపితమైంది. నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ ఆధ్వర్యంలో సిక్కింలో డాక్టర్లకు శిక్షణ ఇచ్చాం. బీహార్‌లో పశు సఖిలకు శిక్షణ ఇచ్చాం. భారత ప్రభుత్వం కూడా ఎత్నో వెటరినరీ జ్ఞానాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావటం ప్రారంభించింది. పశువైద్యంలో డిగ్రీ కోర్సు (బీవీఎస్సీ) సిలబస్‌లోకి ప్రభుత్వం చేర్చింది.
అంతర్జాతీయంగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్(ఎఎంఆర్) సమస్యను పరిష్కరించేందుకు ఈవీపీ చికిత్సలు ఉపయోగ పడతాయా?
ప్రపంచవ్యాప్తంగా అందరూ యాంటీబయాటిక్ ఔషధాలను పశువైద్యంలో తగ్గించా లంటున్నారు. అయితే, వీటికి ప్రత్యామ్నాయ మందుల్ని సూచించలేక΄ోతున్నారు. ఇండియాకున్న బలమైన సంప్రదాయ విజ్ఞానం పెద్ద ఆస్థి. ఈవీపీ పద్ధతుల ఉగాండా, ఇథియోపియాలో రైతులకు శిక్షణ ఇచ్చాం. అమలు చేయటం సులభం కాబట్టి ఆయా దేశాల్లో రైతులు సత్ఫలితాలు సాధించారు. నెదర్లాండ్స్ దేశంతో, వాగనింగన్ విశ్వవిద్యాలయంతో కలసి పనిచేస్తున్నాం. అక్కడి పశువైద్యులకు శిక్షణ ఇచ్చాం.
ఆహార వ్యవసాయ సంస్థ (యు.ఎన్. ఎఫ్.ఎ.ఓ.) గుర్తించిందా?
ఐక్యరాజ్యసమితికి చెందిన ఎఫ్.ఎ.ఓ. కేంద్ర పశుసంవర్థక శాఖతో కలసి ఇటీవలే ‘స్టాండర్డ్ వెటరినరీ ట్రీట్‌మెంట్ గైడ్‌లైన్స్’ను విడుదల చేసింది. ఇందులో కూడా ఈవీపీ సంప్రదాయ చికిత్సా పద్ధతులను చేర్చింది. అల్లోపతి పశువైద్య చికిత్సా పద్ధతి ఆధిపత్యం గురించో, మరో పద్ధతి ఆధిపత్యం నిరూపణ గురించో మనం మాట్లాడటం లేదు. ఒక జబ్బుకు చికిత్స అందించే సమయంలో పశువైద్యులకు, రైతులకు అనేక రకాల చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉండేలా చూడాలంటున్నాం. ఇప్పటికే అమల్లో ఉన్న అల్లోపతి పశువైద్య చికిత్సా పద్ధతిని తీసివేసి సంప్రదాయ మూలికా వైద్య పద్ధతులను ఆచరణలోకి తేవాలని మేం అనుకోవటం లేదు. ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకండి. నేనూ అల్లోపతి పశువైద్య శాస్త్రం చదువుకున్న వాడినే. రోగ నిర్థారణకు అల్లోపతి జ్ఞానాన్ని, చికిత్సకు సంప్రదాయ పద్ధతిని వాడుతూ మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం.
యాంటీబయాటిక్స్ వాడకం తగ్గుతుందా?
పొదుగు వాపు వ్యాధి చికిత్సలో కూడా 90% కేసులలో యాంటీబయాటిక్ మందులను వాడాల్సిన అవసరం లేదు. దూరంలో ఉన్న వైద్యులు టెలిమెడిసిన్ వ్యవస్థ ద్వారా పశువులకు సత్వర చికిత్సను అందించడానికి ఈవిఎం చికిత్సా పద్ధతులు ఎంతో అనువైనవి. ఇతర వైద్య పద్ధతుల్లో ఇది వీలు కాదు. రైతులు నేర్చుకొని, అవసరం వచ్చినప్పుడు తమంతట తాము ఆచరించదగిన గొప్ప పద్ధతి ఎత్నోవెటరినరీ మెడిసిన్. పశువులకు గాలికుంటు వ్యాధి (ఎఫ్.ఎం.డి.) వంటి అంటువ్యాధులు ప్రబలినప్పుడు ఫోన్ ద్వారా రైతులకు సూచనలు ఇచ్చి చికిత్స చేయవచ్చు.
35–40 ఏళ్లలో ఏ ఒక్క కొత్త యాంటీ బయాటిక్‌ను తయారు చేసుకోలేకపోయాం. అదే సమయంలో మనుషుల చికిత్సకు వాడాల్సిన అనేక యాంటీ బయాటిక్స్‌ను పశు వైద్యంలో విస్తృతంగా వాడటంతో ఆ యాంటీబయాటిక్స్ రోగకారక క్రిముల నిరోధకత (మల్టిపుల్ డ్రగ్ రెసిస్టెన్స్)ను పెంపొందించు కున్నాయి. దీంతో ఆ యాంటీబయాటిక్స్ పనిచేయక మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. యాంటీబయాటిక్ ఔషధాలను మనం రక్షించుకోవాలి. యాంటీబయాటిక్ ఔషధాల జోలికి పోకుండానే పశువుల్లో జ్వరం, విరేచనాలు వంటి సాధారణ జబ్బులకు వైద్యం చేయటానికి ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులను ఆచరించాలి.
దేశీ ఆవులు, సంకరజాతి ఆవులు, బర్రెలు అన్నిటికీ ఈ వైద్యం పనిచేస్తుందా?
ఏ జాతి పశువులకైనా తప్పకుండా పనిచేస్తుంది. సంకరజాతి ఆవుల్లో మాదిరిగా అధిక పాలు ఇచ్చే సాహివాల్ ఆవుల్లోనూ పొదుగు సంబంధిత సమస్యలు ఎక్కువే. వీటన్నిటికీ ఈవీపీలో నమ్మదగిన పరిష్కారం ఉంది. కృష్ణా మిల్క్ యూనియన్‌లో పొడి రైతులు ఈవీపీల చికిత్స ద్వారా పొదుగువాపు తదితర జబ్బులతో పాటు వంధ్వత్వం వంటి సమస్యలను సైతం అధిగమించారు.
కోళ్ల వ్యాధులకు కూడా..?
కోళ్ల ఫారాల్లో కూడా ఈవీపీ చికిత్సలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. నేల ఉసిరి (భూమి ఆమ్ల), జిలకర్ర కలిపి నూరి, ఉండలు చేసి.. గంట గంటకు కొక్కెర సోకిన కోళ్లకు తినిపిస్తే 1–2 రోజుల్లోనే తగ్గిపోతుంది. ఇలా ఏ జాతి పశువులైనా, కోళ్లయినా, బాతులైనా.. వాటికి ఇతర ఔషధాల మాదిరిగానే ఈవిఎం మందులను కూడా తయారు చేసుకొని వాడుకోవచ్చు.
అల్లోపతి పశువైద్య చికిత్సా పద్ధతిని తీసివేసి సంప్రదాయ మూలికా వైద్య పద్ధతులను ఆచరణలోకి తేవాలని మేం అనుకోవటం లేదు. ఒక జబ్బుకు చికిత్స అందించే సమయంలో పశువైద్యులకు, రైతులకు అనేక రకాల చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉండేలా చూడాలంటున్నాం.
సేంద్రియ పాల ఉత్పత్తికి ఈవీపీలు దోహదం చేస్తాయా?
నిస్సందేహంగా. అంతర్జాతీయంగా ఇటీవల ‘మెడిసినల్ అగ్రోఎకాలజీ’ భావన బలం పుంజుకుంటున్నది. పంటలనే కాదు పశువులను కూడా రసాయనాల్లేకుండా పెంచటమే ఇందులో ముఖ్యాంశం.
(నవంబర్ 18 నుంచి ‘వరల్డ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వీక్’ సందర్భంగా..)
నిర్వహణ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment