ఎదకు రాని పశువులకు హోమియో చికిత్స! | Good animal care and homeopathic medication | Sakshi
Sakshi News home page

ఎదకు రాని పశువులకు హోమియో చికిత్స!

Published Mon, Jul 21 2014 12:19 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

ఎదకు రాని పశువులకు  హోమియో చికిత్స! - Sakshi

ఎదకు రాని పశువులకు హోమియో చికిత్స!

పశు సంరక్షణలో హోమియో మందులతో సత్ఫలితాలు
గుజరాత్‌లోని సర్డా కృషినగర్ హోమియో కళాశాలలో విజయవంతమైన పరిశోధన

 
‘ఒక జాతి గొప్పతనం జంతువులతో ఆ జాతి వ్యవహరించే తీరులోనే వ్యక్తమౌతుంది’ అంటారు జాతిపిత మహాత్మగాంధీ. మూగజీవుల ఆర్తిని అర్థం చేసుకోగలిగేవారే సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారన్నది ఆయన మాటల్లో వ్యక్తమయ్యే భావన. మన చుట్టూ జంతువులు లేని లోకాన్ని ఉహించనే లేం. పెంపుడు జంతువులు విశ్వసనీయ సహచరుల్లా, రక్షకులుగా ఒకానొక సందర్భంలో పోషకులుగా వ్యవహరిస్తాయి.  వాటి సంరక్షణలోనే రైతు సౌభాగ్యం ఇమిడి ఉందంటే అతిశయోక్తి లేదు.

మానవ ఆరోగ్యం పట్ల అనుసరించే సహజ సంరక్షణ విధానాలనే పశు సంతతికి వర్తింప జేస్తే.. వాటి పోషణ, రక్షణలలో మరింత భరోసా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా హోమియో వైద్య విధానంతో పశు సంతతికి చికిత్స చేస్తున్నారు. అనేక యూరోపియన్, ఆసియా దేశాల్లో హోమియో ఔషధాలతో పశుగణాభివృద్ధికి కృషి చేస్తున్నారు. మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే అక్కడక్కడా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.

సహజ రోగ నిరోధక శక్తికి ప్రేరణ కలిగించి రోగ నిరోధక శక్తిని పెంపొందించడమే హోమియో వైద్య విధానం లక్షణం. హోమియో విధానంలో వాడే ఔషధాలన్నీ కూడా సహజమైన మొక్కలు, లవణాలతో తయారు చేసినవే. ఈ వైద్య విధానానికి 200 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంది. మన దేశంలో పాడి పశువులపై జరిగిన ఓ పరిశోధన ఫలితాలను పాఠకుల అవగాహన కోసం అందిస్తున్నాం..
 పశువులో పునరుత్పత్తి శక్తి సాధారణంగా ఉంటేనే రైతుకు పాడి, దూడ దక్కేది. ఎదకు రాని పశువులకు మేపు, కాపు రెండూ దండగే అంటారు పాడి రైతులు. పశువైద్యులు కూడా ఈ సమస్యకు పరిష్కారం చూపలేక పెదవి విరిచినప్పుడు.. రైతులు మనసు చంపుకొని పశువులను కబేళాలకు అమ్ముకునే దృష్టాంతాలున్నాయి. ఈ సమస్యకు ఇంగ్లిషు వైద్యవిధానంలో పరిష్కారం అందని సందర్భాల్లో హోమియో వైద్య విధానం దారి చూపించింది.

పశువు గొడ్డుపోవడానికి రెండు ప్రధాన కారణాలుంటాయి. ఒకటి సక్రమంగా అండం విడుదల కాకపోవడం, రెండు గర్భవిశ్ఛితి జరగడం. ఇలాంటి పశువులను రైతు పూర్తిగా గొడ్డుపోయిన వాటిగా భావించలేడు. అలా అని వాటిని పొలం పనుల్లో వినియోగించనూ లేడు. వదులుకోలేక.. సాదుకోలేక.. ఇబ్బంది పడే పరిస్థితిలో రైతులకు కమ్మని కబురందిస్తోంది హోమియో వైద్య విధానం. హోమియో మందులు వాడడం వలన పశువు పునరుత్పత్తి క్రమం సాధారణ స్థాయికి వస్తుందని గుజరాత్‌లోని సర్డాకృషినగర్ పశు వైద్య కళాశాలలో నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. రాబర్ట్స్, పేంద్‌ల్రు సర్డా కృషినగర్ పశు వైద్య కళాశాల సహకారంతో 100 సంకర జాతి ఆవులు, 85 గేదెలపై అధ్యయనం చేశారు. వీటిలో పది ఆవులు, పది గేదెలకు ఎలాంటి మందులు ఇవ్వలేదు. 90 ఆవులు, 75 గేదెలకు హోమియో మందులతో చికిత్స చేశారు. వీటికి వరుసగా 21 రోజుల పాటు అల్టేరీస్ ఫరినోసా-30, ఆరమేట్-30, ఎపిస్‌మెల్-30, బోరెక్స్-30, కల్కేరియాఫాస్-30, కోలోసెంథిస్-30, ఫోలికులినమ్-30, ఐయోడిన్-30, మూరెక్స్-30, ఓఫోరియమ్-30, పల్లాడియం-30, ప్లాటీనియం-30, పల్సాటిల్లా-30, సెపియా-200ల సమ్మేళనంతో తయారు చేసిన మాత్రలిచ్చారు.

చికిత్స మొదలు పెట్టిన తరువాత 16 రోజుల్లోనే 50 ఆవులు ఎదకు వచ్చాయి. వీటికి 2 నెలల తర్వాత గర్భనిర్ధారణ పరీక్షలు చేయగా గర్భం నిలిచినట్లు నిర్ధారణ అయింది. తక్కిన 40 ఆవుల్లో 30 ఆవులు చికిత్స పూర్తయిన వారం రోజుల్లో ఎదకు వచ్చాయి. మిగిలిన పదింటికి మరోసారి ఇదే మందు వాడారు. వాడడం ప్రారంభించిన 15 రోజుల్లో ఎనిమిది ఆవులు ఎదకొచ్చినట్లు గుర్తించారు. వీటన్నిటికీ గర్భం నిలిచి చక్కటి దూడలను ఈనాయి. ఇక హోమియో మందులు ఇవ్వని 10 ఆవుల్లో ఏ ఒక్కటీ ఎదకు రాలేదు.
 పరీక్షలు నిర్వహించడానికి ఎంపిక చేసుకున్న సంకరజాతి గేదెలకు జరిపిన చికిత్సల్లో తొలి విడత ఔషధ వినియోగం తర్వాత 65 ఎదకు వచ్చాయి. తక్కిన 10 రెండోసారి చికిత్స ప్రారంభించిన తర్వాత ఎదకు వచ్చాయి. గేదెలన్నిటికీ గర్భం నిలిచి దూడలను ఈనాయి. అసలు ఏ మందూ ఇవ్వని 10 గేదెల్లో ఏ ఒక్కటీ ఎదకు రాలేదు.

పశువుల్లోని ఎండ్రోకైన్ గ్రంధిని ఉత్తేజపర్చడం ద్వారానే పునరుత్పత్తి చక్రం సాధారణ స్థితికి వచ్చినట్లు పరిశోధకులు రాబర్ట్, పేంద్‌ల్రు నిర్ధారణకు వచ్చారు. పేంద్ ్రఅప్పటికే హోమియో వైద్య విధానంలో ఎం.డీ. కోర్సు ఉత్తీర్ణుడు. డెయిరీ ఆవుల పునరుత్పత్తి సమస్యలపై  చేసిన పరిశోధనలకుగాను బుడాపెస్ట్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టాపుచ్చుకున్నారు. రాబర్ట్స్ పశువుల గర్భధారణ సమస్యల మీద పరిశోధన చేశారు.

 - జిట్టా బాల్‌రెడ్డి
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement