Jitta balreddy
-
ఎదకు రాని పశువులకు హోమియో చికిత్స!
పశు సంరక్షణలో హోమియో మందులతో సత్ఫలితాలు గుజరాత్‌లోని సర్డా కృషినగర్ హోమియో కళాశాలలో విజయవంతమైన పరిశోధన ‘ఒక జాతి గొప్పతనం జంతువులతో ఆ జాతి వ్యవహరించే తీరులోనే వ్యక్తమౌతుంది’ అంటారు జాతిపిత మహాత్మగాంధీ. మూగజీవుల ఆర్తిని అర్థం చేసుకోగలిగేవారే సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారన్నది ఆయన మాటల్లో వ్యక్తమయ్యే భావన. మన చుట్టూ జంతువులు లేని లోకాన్ని ఉహించనే లేం. పెంపుడు జంతువులు విశ్వసనీయ సహచరుల్లా, రక్షకులుగా ఒకానొక సందర్భంలో పోషకులుగా వ్యవహరిస్తాయి. వాటి సంరక్షణలోనే రైతు సౌభాగ్యం ఇమిడి ఉందంటే అతిశయోక్తి లేదు. మానవ ఆరోగ్యం పట్ల అనుసరించే సహజ సంరక్షణ విధానాలనే పశు సంతతికి వర్తింప జేస్తే.. వాటి పోషణ, రక్షణలలో మరింత భరోసా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా హోమియో వైద్య విధానంతో పశు సంతతికి చికిత్స చేస్తున్నారు. అనేక యూరోపియన్, ఆసియా దేశాల్లో హోమియో ఔషధాలతో పశుగణాభివృద్ధికి కృషి చేస్తున్నారు. మన దేశంలోనూ ఇప్పుడిప్పుడే అక్కడక్కడా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. సహజ రోగ నిరోధక శక్తికి ప్రేరణ కలిగించి రోగ నిరోధక శక్తిని పెంపొందించడమే హోమియో వైద్య విధానం లక్షణం. హోమియో విధానంలో వాడే ఔషధాలన్నీ కూడా సహజమైన మొక్కలు, లవణాలతో తయారు చేసినవే. ఈ వైద్య విధానానికి 200 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంది. మన దేశంలో పాడి పశువులపై జరిగిన ఓ పరిశోధన ఫలితాలను పాఠకుల అవగాహన కోసం అందిస్తున్నాం.. పశువులో పునరుత్పత్తి శక్తి సాధారణంగా ఉంటేనే రైతుకు పాడి, దూడ దక్కేది. ఎదకు రాని పశువులకు మేపు, కాపు రెండూ దండగే అంటారు పాడి రైతులు. పశువైద్యులు కూడా ఈ సమస్యకు పరిష్కారం చూపలేక పెదవి విరిచినప్పుడు.. రైతులు మనసు చంపుకొని పశువులను కబేళాలకు అమ్ముకునే దృష్టాంతాలున్నాయి. ఈ సమస్యకు ఇంగ్లిషు వైద్యవిధానంలో పరిష్కారం అందని సందర్భాల్లో హోమియో వైద్య విధానం దారి చూపించింది. పశువు గొడ్డుపోవడానికి రెండు ప్రధాన కారణాలుంటాయి. ఒకటి సక్రమంగా అండం విడుదల కాకపోవడం, రెండు గర్భవిశ్ఛితి జరగడం. ఇలాంటి పశువులను రైతు పూర్తిగా గొడ్డుపోయిన వాటిగా భావించలేడు. అలా అని వాటిని పొలం పనుల్లో వినియోగించనూ లేడు. వదులుకోలేక.. సాదుకోలేక.. ఇబ్బంది పడే పరిస్థితిలో రైతులకు కమ్మని కబురందిస్తోంది హోమియో వైద్య విధానం. హోమియో మందులు వాడడం వలన పశువు పునరుత్పత్తి క్రమం సాధారణ స్థాయికి వస్తుందని గుజరాత్‌లోని సర్డాకృషినగర్ పశు వైద్య కళాశాలలో నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. రాబర్ట్స్, పేంద్‌ల్రు సర్డా కృషినగర్ పశు వైద్య కళాశాల సహకారంతో 100 సంకర జాతి ఆవులు, 85 గేదెలపై అధ్యయనం చేశారు. వీటిలో పది ఆవులు, పది గేదెలకు ఎలాంటి మందులు ఇవ్వలేదు. 90 ఆవులు, 75 గేదెలకు హోమియో మందులతో చికిత్స చేశారు. వీటికి వరుసగా 21 రోజుల పాటు అల్టేరీస్ ఫరినోసా-30, ఆరమేట్-30, ఎపిస్మెల్-30, బోరెక్స్-30, కల్కేరియాఫాస్-30, కోలోసెంథిస్-30, ఫోలికులినమ్-30, ఐయోడిన్-30, మూరెక్స్-30, ఓఫోరియమ్-30, పల్లాడియం-30, ప్లాటీనియం-30, పల్సాటిల్లా-30, సెపియా-200ల సమ్మేళనంతో తయారు చేసిన మాత్రలిచ్చారు. చికిత్స మొదలు పెట్టిన తరువాత 16 రోజుల్లోనే 50 ఆవులు ఎదకు వచ్చాయి. వీటికి 2 నెలల తర్వాత గర్భనిర్ధారణ పరీక్షలు చేయగా గర్భం నిలిచినట్లు నిర్ధారణ అయింది. తక్కిన 40 ఆవుల్లో 30 ఆవులు చికిత్స పూర్తయిన వారం రోజుల్లో ఎదకు వచ్చాయి. మిగిలిన పదింటికి మరోసారి ఇదే మందు వాడారు. వాడడం ప్రారంభించిన 15 రోజుల్లో ఎనిమిది ఆవులు ఎదకొచ్చినట్లు గుర్తించారు. వీటన్నిటికీ గర్భం నిలిచి చక్కటి దూడలను ఈనాయి. ఇక హోమియో మందులు ఇవ్వని 10 ఆవుల్లో ఏ ఒక్కటీ ఎదకు రాలేదు. పరీక్షలు నిర్వహించడానికి ఎంపిక చేసుకున్న సంకరజాతి గేదెలకు జరిపిన చికిత్సల్లో తొలి విడత ఔషధ వినియోగం తర్వాత 65 ఎదకు వచ్చాయి. తక్కిన 10 రెండోసారి చికిత్స ప్రారంభించిన తర్వాత ఎదకు వచ్చాయి. గేదెలన్నిటికీ గర్భం నిలిచి దూడలను ఈనాయి. అసలు ఏ మందూ ఇవ్వని 10 గేదెల్లో ఏ ఒక్కటీ ఎదకు రాలేదు. పశువుల్లోని ఎండ్రోకైన్ గ్రంధిని ఉత్తేజపర్చడం ద్వారానే పునరుత్పత్తి చక్రం సాధారణ స్థితికి వచ్చినట్లు పరిశోధకులు రాబర్ట్, పేంద్‌ల్రు నిర్ధారణకు వచ్చారు. పేంద్ ్రఅప్పటికే హోమియో వైద్య విధానంలో ఎం.డీ. కోర్సు ఉత్తీర్ణుడు. డెయిరీ ఆవుల పునరుత్పత్తి సమస్యలపై చేసిన పరిశోధనలకుగాను బుడాపెస్ట్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టాపుచ్చుకున్నారు. రాబర్ట్స్ పశువుల గర్భధారణ సమస్యల మీద పరిశోధన చేశారు. - జిట్టా బాల్‌రెడ్డి -
పలచగా పంట దిట్టంగా దిగుబడి
ఎకరానికి 28 క్వింటాళ్ల పత్తి దిగుబడి ఏరువాక పౌర్ణమి వెన్నెల విరబూసినట్లు.. తొలకరికి వానల్లో మట్టి పరిమళం విస్తరించినట్టు.. వానాకాలం ముంగిట నిలిచిన రైతు సోదరులు ఈ ఏటి పంటల సాగు ప్రణాళికలతో తలమునకలై ఉన్నారు. రైతు సోదరుల ఆశలు, ఆకాంక్షలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఫలవంతమవ్వాలని కోరుకుంటూ.. వినూత్నమైన ప్రత్యామ్నాయ పద్ధతుల్లో.. తక్కువ ఖర్చుతో పత్తి సాగు చేసి.. అత్యధిక దిగుబడి సాధిస్తున్న రైతు శాస్త్రవేత్త పొన్నుస్వామి అనుభవాలను ఈ వారం మీ కోసం.. పత్తి తెల్లబంగారం! క్రీస్తు పూర్వం నాటి నుంచే భారతదేశంలో సాగవుతోంది. బ్రిటన్ తన అవసరాల కోసం భారతదేశంలోని గంగా మైదానం నుంచి దక్షిణాది కావేరి డెల్టా వరకు పత్తి సాగు విస్తరించింది. తెల్ల బంగారాన్ని ఓడలకెత్తి మాంచెస్టర్ నగర పరిశ్రమల వెలుగులకు తళుకులద్దింది. ఇంతింతై వటుడింతై అన్నట్లు.. నేడు పత్తి దేశంలోనే అతి పెద్ద వాణిజ్య పంటగా విస్తరించింది. ఆదిలో కేవలం ముడిపత్తి మాత్రమే వ్యాపార సరుకు కాగా అనంతర కాలంలో విత్తనం కూడా భారీ వ్యాపార వనరైంది. అయితే, పగి లిన పత్తి కాయలు తెల్లబంగారం ముద్దలను ఆరబోసి నట్లు విరబూసి విరగకాసినా.. సాగు చేస్తున్న రైతన్న లు మాత్రం ఏలిన నాటి శని వెంట తరిమినట్లు గానే బతుకులీడుస్తున్నారు. పత్తి రైతుల ఆత్మహత్యలు ప్రపంచవ్యాప్తంగా సంచలన వార్తలయ్యాయి. కర్ణుడి చావుకు కారణాల మాదిరిగానే అన్నదాత వెన్ను విరగ డానికి కారణాలు అనేకం. రాజకీయ, ఆర్థిక కారణాల ను పక్కనబెట్టి సాగు సంగతులను పరిశీలిద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఆంధ్ర రాష్ట్రంలోని ఉత్తర కోస్తా వంటి పలు ప్రాంతాల్లో 10 క్వింటాళ్ల సగటు దిగుబడి కూడా ఘనమనే పరిస్థితి ఉంది. దీనికి భిన్నంగా మెరుగైన యాజమాన్య పద్ధతులను అనుసరించి, రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడ కుండానే ఎకరాకు 28 క్వింటాళ్ల దిగుబడి సాధించిన రైతులున్నారు. మెదక్ జిల్లా ముబారక్పూర్ రైతు పొన్నుస్వామి దాదాపు సేంద్రియ పద్ధతిలో గత సంవత్సరం 28 క్వింటాళ్ల పత్తి దిగుబడి సాధించారు. ఆయన అనుసరించిన యాజమాన్య పద్ధతులను ఆయన మాటల్లోనే తెలుగు రాష్ట్రాల్లో పత్తి సాగు చేస్తున్న రైతు సోదరులకు ఈ వారం అందిస్తున్నాం.. పంట ఏదైనా దానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటేనే ఆశించిన ఫలితం అందుతుంది. పత్తి సాగు చేయాలనుకున్న భూమిని వేసవిలో లోతు దుక్కులు వేసుకోవాలి. దీని వలన నేలలోని చీడపీడల గుడ్లు, లార్వాలు బహిర్గతమై ఎండ వేడికి చనిపోతాయి. తొలకరి వర్షాలు పడిన వెంటనే దుక్కి మెత్తగా దున్నుకోవాలి. కంపోస్టు ఎరువుకు పత్తి గింజల నూనె కలపాలి! బాగా కుళ్లిన (డీకంపోజ్ చేసిన) ఎరువుకు, పత్తి గింజల నూనెను కలిపి వాడుకుంటే పత్తి పంట దిగుబడి చాలా బాగా వస్తున్నది. పశువుల ఎరువు లేదా కోళ్ల ఎరువును డీ కంపోజ్ బ్యాక్టీరియా సహాయంతో కంపోస్టుగా మార్చుకోవాలి. సుమారు 600 కిలోల ఎరువు ఎకరాకు సరిపోతుంది. ఎరువుకు నూనెను కలిపే పద్ధతి: ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో 170 లీటర్ల నీటిని నింపుకోవాలి. ఇందులో 15 లీటర్ల నూనెను పోసుకోవాలి. దానికి ఒకటిన్నర లీటర్ల ఎమ ల్సీఫయర్ను కలపాలి. నూనె నీటిలో కరిగి కలిసిపోయేలా చేయడానికి ఎమల్సీఫయర్ ఉపకరిస్తుంది. ఈ మిశ్రమాన్ని నేల మీద పరుపుగా పోసుకున్న ఎరువు మీద చల్లుకోవాలి. తొలుత అర అడుగు మందంలో ఎరువు పరుచుకొని, దాని మీద నూనె కలిసిన నీటిని చల్లుకోవాలి. తరువాత ఎరువు మరో పొరగా వేసుకోవాలి. ఈ విధంగా నూనె నీరు ఎరువు అయిపోయే వరకు వరుసలుగా పర్చుకోవాలి. అయితే.. నీరు కేవలం ఎరువును తడిపే విధంగా మాత్రమే చల్లాలి. జారుగా నీరు కారే విధంగా చేయరాదు. పూర్తిగా దిబ్బ కట్టుకున్న ఎరువు మీద ప్లాస్టిక్ కవర్ కప్పాలి. లేదా గడ్డిగాదం కప్పి ఉంచాలి. వారం తరువాత ఈ ఎరువును బస్తాలకు ఎత్తుకోవాలి. మొత్తం 600 కిలోల ఎరువును 50 కిలోల బస్తా చొప్పున 12 బస్తాలకు ఎత్తిపెట్టుకోవాలి. తొలి మోతాదుగా 3 బస్తాల ఎరువును, 25 కిలోల యూరియాను కలిపి గింజ పెట్టే సమయంలో వేసి.. గింజ నాటుకోవాలి. తరువాత విడతల వారీగా.. పాటు చేసే సమయంలో వేసుకోవాలి. ఎరువు వేసే సమయంలో నేలలో తేమ ఉండేలా చూసుకోవాలి. మొక్క మొలిచి 2 నెలలయ్యే నాటికి మొత్తం ఎరువును అందించాలి. కానుగ, సీతాఫలం గింజల నూనెల పిచికారీతో పురుగులకు చెక్! పత్తి పంటను తొలి దశలో రసం పీల్చే పురుగులు ఆశిస్తాయి. వీటిని అదుపు చేయడానికి లీటరు నీటికి 1.5 మిల్లీ లీటర్ల కానుగ నూనెతోపాటు, అంతే మొత్తం ఎమల్సీఫయర్ను కలిపి పిచికారీ చే యాలి. ఇలా చేస్తే రసం పీల్చే పురుగు శక్తి నిర్వీర్యమై.. తరువాత చనిపోతుంది. అయితే, వేడి చేసి తీసే పద్ధతిలో తీసిన నూనె ఇందుకు పనికి రాదు. శీతల విధానం ద్వారా తీసిన నూనెను వాడుకోవాలి. పై పాటుగా మూడు ఆకుల దశలో లీటరు నీటికి 5 మిల్లీ లీటర్ల వేరుశనగ నూనెలో ఒక మిల్లీ లీటర్ చొప్పున ఎమల్సీఫయర్ కలిపి పిచికారీ చేసుకోవాలి. పల్లి నూనె తరువాత పత్తి నూనె, తవుడు నూనెలు వినియోగించుకోవాలి. ఎకరా చేనుకు లీటరుకు మించి నూనెను పిచికారీ చేయరాదు. కాయతొలిచే పురుగు, కాండం తొలిచే పురుగు, పచ్చదోమ, తెల్లదోమలను నిరోధించడానికి సీతాఫలం గింజల నూనెను ఇదే మోతాదులో పిచికారీ చేసుకుంటే చక్కటి ఫలితాలు వస్తాయి. ఈ పద్ధతిలో పత్తి సాగు చేయదలచిన రైతు సోదరులు సూచనలు, సలహాల కోసం పొన్నుస్వామిని 9494982306 నంబరులో (సాయంకాలం 6 గంటల తరువాత మాత్రమే) సంప్రదించవచ్చు. - జిట్టా బాల్‌రెడ్డి, ‘సాగుబడి డెస్క్ ఎకరంలో 4,320 మొక్కలు..! నీటిపారుదల వనరు లేదా డ్రిప్పు సౌకర్యం ఉన్న వారు సాళ్ల మధ్య నాలుగున్నర అడుగులు, మొక్కల మధ్య రెండున్నర అడుగుల దూరం ఉండే విధంగా చాళ్లు తోలుకోవాలి. అచ్చుల వెంట ఏర్పడిన గుర్తుల వద్ద ఒక పత్తి గింజ, మరో పెసర గింజ విత్తుకోవాలి. పెసర విత్తనం కొద్దిపాటి తేమతోనే మొలకెత్తుతుంది. పెసర గింజ మొలకె త్తినప్పుడు నేల గుల్లబారి.. దాని తరువాత మొలిచే పత్తి విత్తనానికి దారిని ఏర్పరుస్తుంది. రైతులు విత్తనం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సూటి రకాలైనా, సంకర జాతి రకాలైనా, బీటీ రకాలైనా పర్వాలేదు.ఇక వర్షాధారంగా పత్తి సాగు చేసే రైతులు.. వరుసల మధ్య నాలుగు అడుగులు, మొక్కల మధ్య రెండున్నర అడుగులు అచ్చు తోలుకొని విత్తనం నాటుకోవాలి. ఈ దూరంతో విత్తిన చేలో ఎకరానికి 4,320 మొక్కలు వస్తాయి. సగటు మొక్క పది అడుగుల వైశాల్యంలో విస్తరించే అవకాశం ఉంది. సగటున మొక్కకు 100 కాయలు, కాయకు 4 గ్రాముల చొప్పున పత్తి దిగుబడి వచ్చినా.. 17 క్వింటాళ్ల పత్తి పంట రైతు చేతికందుతుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు వరుసల మధ్య దూరం 3 అడుగులు, మొక్క మొక్కకు మధ్య దూరం అడుగు చొప్పున పాటించమని సిఫారసు చేస్తున్నారు. దీని ప్రకారం ఎకరానికి 12,445 మొక్కలు పడతాయి. అయినా సగటు దిగుబడి 8 నుంచి 12 క్వింటాళ్లకు మించడం లేదు. మిగతా దిగుబడి ఏమైనట్లు? అని ప్రశ్న వేసుకుంటే దిగుబడి లోటును పూరించుకోవడం ఎలాగో బోధపడుతుంది. పత్తి మొక్కకు సగటున 100 కాయలు రావాలి. ఒక కాయలో 4 నుంచి 5 గ్రాముల పత్తి వస్తుందనుకున్నా, మొత్తం 12,445 మొక్కలకు 62 క్వింటాళ్ల దిగుబడి రావాలి. కానీ మన ప్రాంతాల్లో సగటు దిగుబడి 8 నుంచి 12 క్వింటాళ్ల మధ్యనే ఉంది. మరి మిగతా దిగుబడి ఏమైనట్లు? మొక్కల సంఖ్య పెరగడంతో పోషకాలను, నీటిని తీసుకోవడంలో మొక్కల మధ్య పోటీ పెరుగుతుంది. దీని వలన ఎదుగుదల తగ్గుతుంది. మొక్కలు బలహీనంగా ఉండడం వలన చీడపీడల బారిన పడతాయి. ఫలితంగా దిగుబడి తగ్గిపోతుంది. వరుసలు, మొక్కల మధ్య దూరం పెంచడం వలన.. మొక్కల సంఖ్య తగ్గుతుంది. సాళ్ల మధ్య 4 అడుగులు, మొక్కల మధ్య రెండున్నర అడుగులు ఉన్నప్పుడు 10 అడుగుల విస్తీర్ణంలో ఒక మొక్క ఉంటుంది. దీని వలన ఆ ప్రాంతంలోని పోషకాలను, నీటిని వినియోగించుకొని ఏపుగా ఎదిగి బాగా కాపునకు వస్తాయి. విత్తనం ఖర్చు కూడా తగ్గుతుంది. వరుసలు, మొక్కల మధ్య దూరం పెరగడం వలన.. ఒక గింజ చొప్పున పెడితే ఒక ప్యాకెట్, 2 గింజల చొప్పున పెడితే 2 ప్యాకెట్లు సరిపోతాయి. 2 విత్తనాలు నాటుకొని బలంగా పెరిగిన మొక్కను ఉంచి రెండో దాన్ని తీసివేసుకోవచ్చు. ఒకే గింజ వాడడం వలన మొలక రాకపోయినట్లయితే మరోసారి విత్తుకోవాల్సి వస్తుంది. కాబట్టి రెండు గింజల పద్ధతే రైతుకు మేలు. -
రసాయనిక ఎరువు, నేల గుండె బరువు
భార్యను సంతృప్తి పర్చడానికి ఒక కొడుకు తల్లి గుండెను కోరుతాడు. ఆ తల్లి కొడుకు సంతోషం కోసం తన గుండెను తీసి అతని దోసిట పెడుతుంది. దొసిటి కందిన తల్లి గుండెను భార్యకు చేర్చి మెప్పందుకోవడానికి వడివడిగా పరుగెడు తుండగా పోటురాయి తగిలి తుళ్లిపడబోతాడు. అతగాడి దోసిట్లో ఉన్న అమ్మ గుండె ‘అయ్యో నాయనా భద్రంరా! దెబ్బేమైనా తగిలిందా?’ అని ఆదుర్దా పడిందని జానపద గాథ. కన్నతల్లి ఔన్నత్యాన్ని చాటే ఈ కథ అచ్చంగా నేల తల్లికి వర్తి స్తుంది. తీరొక్కరీతిలో విధ్వంసం చేస్తూ తనువెల్ల గాయాలు చేస్తున్నా జీవకోటికి అన్నం పెట్టి ప్రాణాలు నిలుపుతోంది. ఇది నేలతల్లి ఔదార్యం. మనిషి పేరాశ ప్రకృతి వనరుల విధ్వంసానికి కారణమయింది. విచక్షణ లేకుండా సాగిన ఈ విధ్వంస క్రీడ పర్యావరణ చక్రాన్ని విరగదోసింది. లాభమే పరమావధిగా మారిన వ్యవసాయంలో విచక్షణా రహితంగా వాడుతున్న రసా యనాలు నేలను కుళ్లబొడిచి గుల్ల చేశాయి. ఫలితంగా నేలవారణంలోని మను గడ సాగించే వృక్ష, పశు, ప్రాణకోటి సమతౌల్యం దెబ్బతింది. ఫలితంగా సకల జీవకోటికి ఆహారం అందించే జీవావరణం దారుణంగా దెబ్బతింది. నిస్సార మైన నేల సమాజ ఆహార అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేని స్థితికి చేరింది. మనిషిలాగే స్వాభావికంగా శోషణ, జీర్ణ, శ్వాస, విసర్జక ధర్మాలను కలిగి ఉండే నేల తనలో కలుస్తున్న లక్షలాది టన్నుల విషరసాయనాల ఫలితంగా నిర్వీర్యమయింది. నేలకు నిరంతరం జీవశక్తి అందించే సూక్ష్మజీవావరణాన్ని రసాయనాలు నాశనం చేశాయి. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) శాస్త్రవేత్తలు పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 9 వ్యవసాయ మండలాలలో జరిపిన పరిశోధనల్లో సూక్ష్మ, స్థూల పోషకాలు కనిష్ట స్థాయికి పడిపోయాయని ప్రకటించారు. సారవంతమైన నేలలుగా పేరుపడిన డెల్టా ప్రాంతాల్లో కూడా మొక్కల ఎదుగుదలకు అవసరమైన నత్రజని శూన్యస్థాయికి దిగజారిందని తేలింది. జాతీయ భూ సర్వేక్షణ, వినియోగ ప్రణాళిక మండలి దేశపు మొత్తం సాగుభూమి 329 మిలియన్ హెక్టార్లలో 121 మిలియన్ల హెక్టార్లు పూర్తిగా నిస్సారమైనట్లు ప్రకటించింది. ఈ ఉసరక్షేత్రాలను సాగులోకి తేవడం పెద్ద సవాలని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో పత్తిసాగు చేస్తున్న పలు ప్రదేశాల్లో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో రసాయనిక ఎరువుల ద్వారా వెలువడుతున్న కర్బన ఉద్గారాల శాతం అత్యధికం అని తేలింది. మెరుగైన యాజమాన్య పద్ధతులు అనుసరిస్తున్న వ్యవసాయ క్షేత్రాలలో హెక్టార్‌కు 547 కిలోగ్రాముల రసాయనిక ఎరువులు వాడుతున్నారు. దీంతో 1,642 కిలోగ్రాముల కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయి. అదే సంద్ర వ్యవసాయంలో హెక్టారుకు 1,127 కిలోల ఎరువులు వినియోగిస్తుండగా వెలువడుతున్న కర్బన ఉద్గారాలు 3,312 కిలోగ్రాములు. తీవ్రత రెట్టింపు కంటే ఎక్కువని తేలింది. ప్రపంచాన్ని వణికిస్తున్న గ్లోబల్ వార్మింగ్ ఈ ఉద్గారాల ఫలితమే. ఫలితంగా సంభవిస్తున్న ప్రకృతి విలయాల ధాటికి అభివృద్ధి చెందిన దేశాలు, అగ్రరాజ్యాలు భయభ్రాంతమై నిలువునా నీరుకారిపోతున్నాయి. ఇప్పుడిది మనిషి ఆహార సమస్య మాత్రమే కాదు, మనుగడను ప్రశ్నిస్తున్న సమస్య. నేల తల్లికి కొత్తజీవంపోయడమే మానవాళి మనుగడకు భరోసా. మనవ హక్కులు మనిషికే కాదు మట్టికీ ఉండాలని, ఇక నుంచి ఉంటాయని బొలీవియా దేశాధక్ష్యుడు ఎవోమోరెల్ ప్రకృతి పరిరక్షణ చట్టాన్ని ప్రకటించారు. దేశ రాజకీయ వర్గాలు, సామాజిక బృందాలు స్వాగతించాయి. బొలీవియా బంగారు, తగరపు ఖనిజాలపై డేగకన్నేసిన అగ్రరాజ్యం దశా బ్దాలుగా విచక్షణరహితంగా తవ్వి తీసుకుపోయింది. ఫలితంగా పర్యావర ణానికి తీవ్ర హాని జరిగింది. ఈ విధ్వంసం ఇలాగే సాగితే సమీప భవిష్యత్‌లోనే బొలీవియా ఎడారి అవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఆ నేపథ్యంలోనే బొలీవియా ప్రపంచంలోనే తొలిసారిగా ప్రకృతి పరిరక్షణ చట్టం చేసింది. పచ్చమమ పేరుతో ప్రకృతి మాతను కొలిచే అండియాన్ ఆదివాసీ సమాజం విశ్వాసాల ప్రభావం ఈ చట్టానికి ప్రేరణ. ఆదీవాసుల విశ్వాసం ప్రకారం ‘‘పచ్చమమ సజీవ స్వరూపం, పవిత్రురాలు. జీవకోటి మనుగడకు ఆధారం. తన తేజస్సుతో శాశ్వత సమతుల్యాన్ని, సామరస్యతా సందేశాలను అందిస్తోంది. చరాచర ప్రాణికోటి వైవిద్యాలను తనలో ఇముడ్చుకొని నడిపిస్తోంది’’ అని ఈ చట్టం పేర్కొంది. ఈ చట్టాన్ని పరిచయం చేస్తూ బొలీవియా విదేశీ వ్యవహారాల మంత్రి డేవిడ్ చొక్వెహూవంకా ‘‘మాను, మనిషితో పాటు ప్రాణమున్న ప్రతిజీవితో కలిసి అంతా ఓ పెద్ద కుటుంబం. భూప్రపంచమంతా ఆ కుటుంబంలో భాగమే అనేది మా విశ్వాసం. అదే మా తాతతండ్రులు మాకు నేర్పింది. ఆహారం, వాతావరణం, ఇంధనం, ధనం, ఏ సమస్యనైనా ఈ విశ్వాసం వెలుగులోనే పరిష్కరించుకుంటాం’’అని డేవిడ్ చొక్వెహూవంకా చెప్పారు. మనుగడ హక్కు, ప్రకృతి మార్పుల్లో మానవ ప్రమేయ నిరోధంతో పాటు, జన్యుమార్పిడి నిరోధక హక్కులు ఇందులో ముఖ్యమైనవి. ఈ చట్టం అమలు బాధ్యత పౌరసమాజానికి బదలాయిస్తున్నామని డేవిడ్చొ ప్రకటించారు. - జిట్టా బాల్‌రెడ్డి, ‘సాక్షి’ సాగుబడి డెస్క్