రసాయనిక ఎరువు, నేల గుండె బరువు
భార్యను సంతృప్తి పర్చడానికి ఒక కొడుకు తల్లి గుండెను కోరుతాడు. ఆ తల్లి కొడుకు సంతోషం కోసం తన గుండెను తీసి అతని దోసిట పెడుతుంది. దొసిటి కందిన తల్లి గుండెను భార్యకు చేర్చి మెప్పందుకోవడానికి వడివడిగా పరుగెడు తుండగా పోటురాయి తగిలి తుళ్లిపడబోతాడు. అతగాడి దోసిట్లో ఉన్న అమ్మ గుండె ‘అయ్యో నాయనా భద్రంరా! దెబ్బేమైనా తగిలిందా?’ అని ఆదుర్దా పడిందని జానపద గాథ. కన్నతల్లి ఔన్నత్యాన్ని చాటే ఈ కథ అచ్చంగా నేల తల్లికి వర్తి స్తుంది. తీరొక్కరీతిలో విధ్వంసం చేస్తూ తనువెల్ల గాయాలు చేస్తున్నా జీవకోటికి అన్నం పెట్టి ప్రాణాలు నిలుపుతోంది. ఇది నేలతల్లి ఔదార్యం.
మనిషి పేరాశ ప్రకృతి వనరుల విధ్వంసానికి కారణమయింది. విచక్షణ లేకుండా సాగిన ఈ విధ్వంస క్రీడ పర్యావరణ చక్రాన్ని విరగదోసింది. లాభమే పరమావధిగా మారిన వ్యవసాయంలో విచక్షణా రహితంగా వాడుతున్న రసా యనాలు నేలను కుళ్లబొడిచి గుల్ల చేశాయి. ఫలితంగా నేలవారణంలోని మను గడ సాగించే వృక్ష, పశు, ప్రాణకోటి సమతౌల్యం దెబ్బతింది. ఫలితంగా సకల జీవకోటికి ఆహారం అందించే జీవావరణం దారుణంగా దెబ్బతింది. నిస్సార మైన నేల సమాజ ఆహార అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేని స్థితికి చేరింది.
మనిషిలాగే స్వాభావికంగా శోషణ, జీర్ణ, శ్వాస, విసర్జక ధర్మాలను కలిగి ఉండే నేల తనలో కలుస్తున్న లక్షలాది టన్నుల విషరసాయనాల ఫలితంగా నిర్వీర్యమయింది. నేలకు నిరంతరం జీవశక్తి అందించే సూక్ష్మజీవావరణాన్ని రసాయనాలు నాశనం చేశాయి. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) శాస్త్రవేత్తలు పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 9 వ్యవసాయ మండలాలలో జరిపిన పరిశోధనల్లో సూక్ష్మ, స్థూల పోషకాలు కనిష్ట స్థాయికి పడిపోయాయని ప్రకటించారు. సారవంతమైన నేలలుగా పేరుపడిన డెల్టా ప్రాంతాల్లో కూడా మొక్కల ఎదుగుదలకు అవసరమైన నత్రజని శూన్యస్థాయికి దిగజారిందని తేలింది.
జాతీయ భూ సర్వేక్షణ, వినియోగ ప్రణాళిక మండలి దేశపు మొత్తం సాగుభూమి 329 మిలియన్ హెక్టార్లలో 121 మిలియన్ల హెక్టార్లు పూర్తిగా నిస్సారమైనట్లు ప్రకటించింది. ఈ ఉసరక్షేత్రాలను సాగులోకి తేవడం పెద్ద సవాలని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లో పత్తిసాగు చేస్తున్న పలు ప్రదేశాల్లో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో రసాయనిక ఎరువుల ద్వారా వెలువడుతున్న కర్బన ఉద్గారాల శాతం అత్యధికం అని తేలింది. మెరుగైన యాజమాన్య పద్ధతులు అనుసరిస్తున్న వ్యవసాయ క్షేత్రాలలో హెక్టార్‌కు 547 కిలోగ్రాముల రసాయనిక ఎరువులు వాడుతున్నారు. దీంతో 1,642 కిలోగ్రాముల కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయి. అదే సంద్ర వ్యవసాయంలో హెక్టారుకు 1,127 కిలోల ఎరువులు వినియోగిస్తుండగా వెలువడుతున్న కర్బన ఉద్గారాలు 3,312 కిలోగ్రాములు. తీవ్రత రెట్టింపు కంటే ఎక్కువని తేలింది. ప్రపంచాన్ని వణికిస్తున్న గ్లోబల్ వార్మింగ్ ఈ ఉద్గారాల ఫలితమే. ఫలితంగా సంభవిస్తున్న ప్రకృతి విలయాల ధాటికి అభివృద్ధి చెందిన దేశాలు, అగ్రరాజ్యాలు భయభ్రాంతమై నిలువునా నీరుకారిపోతున్నాయి. ఇప్పుడిది మనిషి ఆహార సమస్య మాత్రమే కాదు, మనుగడను ప్రశ్నిస్తున్న సమస్య. నేల తల్లికి కొత్తజీవంపోయడమే మానవాళి మనుగడకు భరోసా.
మనవ హక్కులు మనిషికే కాదు మట్టికీ ఉండాలని, ఇక నుంచి ఉంటాయని బొలీవియా దేశాధక్ష్యుడు ఎవోమోరెల్ ప్రకృతి పరిరక్షణ చట్టాన్ని ప్రకటించారు. దేశ రాజకీయ వర్గాలు, సామాజిక బృందాలు స్వాగతించాయి.
బొలీవియా బంగారు, తగరపు ఖనిజాలపై డేగకన్నేసిన అగ్రరాజ్యం దశా బ్దాలుగా విచక్షణరహితంగా తవ్వి తీసుకుపోయింది. ఫలితంగా పర్యావర ణానికి తీవ్ర హాని జరిగింది. ఈ విధ్వంసం ఇలాగే సాగితే సమీప భవిష్యత్‌లోనే బొలీవియా ఎడారి అవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఆ నేపథ్యంలోనే బొలీవియా ప్రపంచంలోనే తొలిసారిగా ప్రకృతి పరిరక్షణ చట్టం చేసింది.
పచ్చమమ పేరుతో ప్రకృతి మాతను కొలిచే అండియాన్ ఆదివాసీ సమాజం విశ్వాసాల ప్రభావం ఈ చట్టానికి ప్రేరణ. ఆదీవాసుల విశ్వాసం ప్రకారం ‘‘పచ్చమమ సజీవ స్వరూపం, పవిత్రురాలు. జీవకోటి మనుగడకు ఆధారం. తన తేజస్సుతో శాశ్వత సమతుల్యాన్ని, సామరస్యతా సందేశాలను అందిస్తోంది. చరాచర ప్రాణికోటి వైవిద్యాలను తనలో ఇముడ్చుకొని నడిపిస్తోంది’’ అని ఈ చట్టం పేర్కొంది.
ఈ చట్టాన్ని పరిచయం చేస్తూ బొలీవియా విదేశీ వ్యవహారాల మంత్రి డేవిడ్ చొక్వెహూవంకా ‘‘మాను, మనిషితో పాటు ప్రాణమున్న ప్రతిజీవితో కలిసి అంతా ఓ పెద్ద కుటుంబం. భూప్రపంచమంతా ఆ కుటుంబంలో భాగమే అనేది మా విశ్వాసం. అదే మా తాతతండ్రులు మాకు నేర్పింది. ఆహారం, వాతావరణం, ఇంధనం, ధనం, ఏ సమస్యనైనా ఈ విశ్వాసం వెలుగులోనే పరిష్కరించుకుంటాం’’అని డేవిడ్ చొక్వెహూవంకా చెప్పారు. మనుగడ హక్కు, ప్రకృతి మార్పుల్లో మానవ ప్రమేయ నిరోధంతో పాటు, జన్యుమార్పిడి నిరోధక హక్కులు ఇందులో ముఖ్యమైనవి. ఈ చట్టం అమలు బాధ్యత పౌరసమాజానికి బదలాయిస్తున్నామని డేవిడ్‌చొ ప్రకటించారు.
- జిట్టా బాల్‌రెడ్డి, ‘సాక్షి’ సాగుబడి డెస్క్