పంటలకు వేసే రసాయనిక ఎరువులే రైతులను, వినియోగదారులను షుగర్, గుండె జబ్బుల పాలుజేస్తున్నాయా? అవునని తాజా అధ్యయనంలో వెల్లడైంది. రసాయనిక ఎరువులలోని విషతుల్యమైన భారఖనిజాలకు.. రైతులు షుగర్, గుండెజబ్బుల పాలు కావడానికి మధ్య సంబంధం ఉందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖకు అనుబంధంగా ఉన్న నానోసైన్స్, వాటర్ రీసెర్చ్ యూనిట్ శాస్త్రవేత్తలు నిర్ణయానికి వచ్చారు. తమిళనాడులోని ఒక గ్రామంలో 900 మంది రైతులు, వినియోగదారుల మూత్ర నమూనాలను సేకరించి అధ్యయనం చేసినప్పుడు ఆశ్చర్యకరమైన ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ నిధులతోనే ఈ అధ్యయనాన్ని చేపట్టడం విశేషం. కోయంబత్తూరులోని కొవై మెడికల్ సెంటర్ అండ్ హాస్పిటల్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో ఈ మూత్ర నమూనాలను పరీక్షించారు.
మద్రాస్ ఐఐటీలో రసాయన శాస్త్ర ఆచార్యుడు ప్రదీప్ తలప్పిల్ ఈ అధ్యయన వివరాలు వెల్లడించారు. ‘మూత్ర నమూనాలు ఇచ్చిన ఈ 900 మందిలో 82.5% మంది వ్యవసాయదారులు. అధ్యయనం చేసిన ఆ గ్రామంలో పంటలకు వాడుతున్న రసాయనిక ఎరువుల్లో అత్యంత విషతుల్యమైన భార ఖనిజాలు ఉన్నట్లు కనుగొన్నారు. 43.4% మంది షుగర్‌కు ముందు దశలో ఉన్న వారు, 16.2% మంది షుగర్ వ్యాధికి గురైన వారు, 10.3% మంది గుండెలో రక్తనాళాలు పూడుకుపోయే జబ్బు (అథెరోసెలెరోసిస్) బారినపడ్డారని... ప్రదీప్ తలప్పిల్ చెప్పారు. ఊబకాయం, రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలున్న వారికి ఈ జబ్బులు రావడం సహజం. అయితే, ఈ 900 మందికి అటువంటివేమీ లేకపోయినప్పటికీ ఆశ్చర్యకరంగా షుగర్, గుండె జబ్బుల పాలయ్యారని ఆయన వివరించారు. గ్రామీణుల్లో షుగర్, గుండె జబ్బులు గతంలో కన్నా పెరుగుతున్నాయని భారతీయ వైద్య పరిశోధనా మండలి చెబుతోంది. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఇటీవల ఒక అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే... ఏటేటా ప్రతి వెయ్యి మంది గ్రామీణులలో ఇద్దరు షుగర్ వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారు.
వీటికి రసాయనిక ఎరువులే కారణమవుతున్నాయన్నది తాజా అధ్యయనంలో తేలిన విషయం. రైతులు ఆహార ఉత్పత్తిదారులైతే... వినియోగదారులమైన మనం సహ ఉత్పత్తిదారులమని అనుకోవచ్చు. మనం ఎటువంటి ఆహారం కావాలంటే రైతులు అటువంటి ఆహారాన్నే పండిస్తారు. మనం వరి బియ్యం, గోధుమలు వద్దు... ఆరోగ్య సిరులనిచ్చే సిరిధాన్యాలే కావాలని మనం అంటే... రైతులు వాటినే పండించి మనకు ఇస్తారు. కాబట్టి, రసాయనాలు అవసరం లేకుండా ఆరోగ్యదాయకంగా పంటలు పండించడాన్ని ప్రోత్సహిద్దాం. సేంద్రియ పద్ధతుల్లో చిరు(సిరి)ధాన్యాలను, పప్పుధాన్యాలను, నూనెగింజలను పండించే రైతులను అధిక ధర ఇచ్చి మరీ ప్రోత్సహిద్దాం. భూమాతను అనారోగ్యం నుంచి పోషకాల లోపం నుంచి కాపాడదాం. అనవసర జబ్బుల నుంచి, ఆత్మహత్యల నుంచి రైతులను రక్షించుకుందాం. మన పిల్లల, మన ఆరోగ్యాలను రక్షించుకుందాం. మనం కదలడానికి, మంచి వైపు కదలడానికి ఇంకా ఎన్నెన్ని అధ్యయనాలు చేయాలి? ఎంత కాలం చేజారాలి? అన్నవే మనముందున్న ప్రశ్నలు.
రసాయనిక ఎరువుల వల్లే షుగర్, గుండెజబ్బులు!
Published Thu, Apr 26 2018 12:21 AM | Last Updated on Thu, Apr 26 2018 12:21 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment