సాగుబడి కథనాలను ఆసక్తిగా చదువుతున్న వెంకట రమణ
అడపా వెంకట రమణ చైతన్యవంతుడైన రైతు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలంలోని భోగాపురం ఆయన స్వగ్రామం. సొంత పొలంలో నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ.. సంతోషంగా ఉన్నారు. ‘సాక్షి’లో ప్రతి మంగళవారం ప్రచురితమవుతున్న ‘సాగుబడి’ కథనాల ద్వారా పొందిన స్ఫూర్తితోనే ప్రకృతి వ్యవసాయం చేపట్టానని, అప్పటి నుంచీ ‘సాగుబడి’ పేజీలన్నిటినీ సేకరించి దాచుకుంటూ మళ్లీ మళ్లీ చదువుకుంటున్నానని వెంకట రమణ సంతోషంగా చెప్పారు.రసాయనాలు వాడకుండా పండించిన బియ్యం తినడం వల్ల తనకున్న ఆస్తమా, డస్ట్ ఎలర్జీ పూర్తిగా పోయాయని, భూమి తల్లితోపాటు తన ఆరోగ్యం కూడా బాగైందని ఈ విలేకరితో ముఖతా చెబుతున్నప్పుడు ఆయన కళ్లలో కృతజ్ఞతాపూర్వకమైన సంతృప్తి, ఆనందం కనిపించింది. వెంకట రమణ తొలినాళ్లలో ఒడిదుడుకులను, ఇరుగు పొరుగు వారి ఎగతాళి మాటలను లక్ష్యపెట్టకుండా ముందడుగు వేసి.. అమృతాహారాన్ని అపురూపంగా పండిస్తున్న ఒక రైతుగా గొప్ప ఆనందాన్ని అనుభవిస్తూ ఆర్థికానందాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా పొందుతున్నారు.తన ప్రకృతి వ్యవసాయ ప్రస్థానం గురించి ఆయన మాటల్లోనే..
‘‘సాక్షి సాగుబడిలో ప్రచురితమైన ‘జీవితేచ్ఛకు నార్వోసి నీర్వెట్టి..’ అనే కథనం నాలుగేళ్ల క్రితం నన్ను కదిలించింది. అదే సంవత్సరం నుంచే ప్రకృతి వ్యవసాయం చేపట్టాను. ప్రతి వారం సాగుబడి కథనాలు చదివి, అవగాహన చేసుకుంటున్నాను. పాటించాల్సిన మెలకువలు, పద్ధతులను సవివరంగా వస్తున్న కథనాలతో సొంతంగా అన్ని సేంద్రియ ఎరువులు తయారు చేసుకోగలుగుతున్నాను.. ఎక్కడెక్కడో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల క«థనాలతో అదే బాటలో తాము పయనించడానికి సాక్షి సాగుబడి మార్గదర్శిగా మారింది.
తొలి ఏడాదే మా సొంత పొలం ఆరెకరాల్లో వరిని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వేశాను. పిండీ(రసాయనిక ఎరువులు), పురుగుమందులు కొట్టిన తోటి రైతులకు ఎకరానికి 30 బస్తాల ధాన్యం పండితే నాకు 15 బస్తాలు పండాయి(నాలుగో ఏడాదికి ఎకరా దిగుబడి 25 బస్తాలకు పెరిగింది). పిండెయ్యకపోతే ఎలా పండుతుంది? అంటూ ప్రత్తిపాడు– రాపర్తి గ్రామాల రైతులు తెగ ఎగతాళి చేశారు. ఇది పనికొచ్చే వ్యవసాయం కాదన్నారు. అయితే, మార్కెట్‌లో సాధారణ ధరకే ధాన్యం అమ్ముకోవాల్సి వచ్చింది. రసాయనిక అవశేషాల్లేని బియ్యం అని చెప్పి అమ్ముకోవడం తెలియలేదు.
ఆవేశంతో ఒకేసారి ఆరెకరాలు వేయడం తప్పని అర్థమైంది. తర్వాత నుంచి రెండెకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే ఏలేరు కాల్వ నీటితో సార్వా, దాళ్వా ఊడుస్తున్నాను. ఇప్పుడు ఎకరానికి ఖాయంగా 25 బస్తాలు పండిస్తున్నా. చీడపీడలొస్తాయేమోనన్న బెంగ లేదు. రెండేళ్లుగా అయితే పురుగు కషాయాల అవసరం కూడా నాకు రాలేదు. కలుపు మందులు చల్లటం లేదు. నిశ్చింతగా పంట పండుతుంది. మూడో పంటగా మినుములు వేస్తున్నా. వర్షాలు దెబ్బతీయకపోతే చేతికి మినుములు వస్తాయి. లేదంటే భూసారం పెంచడానికి భూమిలో కలిపి దున్నేస్తున్నాను..
నేను చిన్నప్పుడు వర్షాధారంగా పిండి వేయకుండానే మా అమ్మానాన్నా పంటలు పండించే వారు. పెద్దయ్యేటప్పటికి రసాయనిక వ్యవసాయం పుంజుకుంది. రెండు పంటలకూ కలిపి ఎకరానికి 14 బస్తాల రసాయనిక ఎరువులు వేస్తున్నారు. రెండు సార్లు గుళికలు, ఐదారుసార్లు పురుగుమందులు చల్లుతున్నారు. రెండు పంటలకు ఎకరానికి రూ. 50 వేలు ఖర్చవుతున్నది. సార్వాలో 30–35 బస్తాలు, దాళ్వాలో 27 బస్తాలు పండిస్తున్నారు. వాళ్లు బస్తా ధాన్యం మహా అయితే, రూ. 1,400కు అమ్ముతున్నారు. ప్రకృతి వ్యవసాయంలో నాకు ఎకరానికి రెండు పంటలకు కలిపి రూ. 20 వేలు ఖర్చవుతుంది.
సార్వా, దాళ్వా కలిపి 50 బస్తాలు పండించి, క్వింటా ధాన్యం రూ. 2,000కు అమ్ముతున్నా. వాళ్లకన్నా నాకే నికరాదాయం ఎక్కువగా వస్తున్నది. వాళ్లు మార్కెట్‌కు తీసుకెళ్లి ధర ఎంతుంటే అంతకు అమ్ముకోవాలి. నేను మార్కెట్ కోసం వెతుక్కోనక్కరలేదు. ఖాతాలున్నాయి. వాళ్లే ఇంటికి వచ్చి నేను చెప్పిన ధరకు తీసుకెళ్తున్నారు..పిండేసిన బియ్యం తినేటప్పుడు నాకు ఆస్తమా, డస్ట్ ఎలర్జీ ఉండేవి. ప్రకృతి ఆహారం తిన్నాక అవి పోయాయి. మా చేనును చూస్తుంటే పసిపాప నవ్వును చూసినట్టుంటుంది. ఎటెళ్లి వచ్చినా చేలోకి వెళ్లి 10 నిమిషాలు గట్టుమీద కూర్చుంటే కానీ ఊసుపోదు..’’
– వెలుగుల సూర్య వెంకట సత్యవరప్రసాద్, సాక్షి, పిఠాపురం, తూ.గో. జిల్లా
నేను ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన రెండో ఏడాది మా ఇరుగు పొరుగు వరి పొలాలకు ఎండాకు తెగులు వచ్చింది. ఎకరానికి 10 బస్తాలు కూడా రాలేదు. అయితే, మా పొలానికి ఎండాకు తెగులు రాలేదు. నా దిగుబడి తగ్గలేదు. ఇది చూసిన తర్వాత రైతుల్లో ఆలోచన మొదలైంది. ఏమో అనుకున్నాం గానీ ప్రకృతి వ్యవసాయంలో ఇంత శక్తి ఉందా? అంటూ నోరెళ్లబెట్టారు. అయితే, కౌలు రైతులు నష్టాల భయంతో ముందుకు రాలేకపోతున్నారు. ఎకరానికి కౌలు పది బస్తాలు. అందువల్ల వాళ్లు వెనకాడుతున్నారు. ఎరువుల మీద సబ్సిడీని రైతులకు నేరుగా నగదు రూపంలో వరుసగా మూడేళ్లు ఇస్తేగానీ కౌలు రైతులు మారలేరు. భూమికి, రైతుకు తల్లీబిడ్డకున్న అనుబంధం ఉంది. ప్రకృతి వ్యవసాయంతో భూమిని బతికించి, రైతును బతికించుకోవాలి.. (రైతు వెంకట రమణను 99899 84347 నంబరులో సంప్రదించవచ్చు).
జీవామృతం కలుపుతున్న వెంకట రమణ
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment