ఓ వైపు వర్షాభావ పరిస్థితులు, మరో వైపు పెరుగుతున్న పెట్టుబడులతో రైతులకు ఆదాయం రాక, అప్పుల ఊబిలో చిక్కుకుపోయి, వ్యవసాయం అంటేనే పారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లుగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తూ, ఉన్న వనరులతోనే అధిక నికరాదాయం పొందుతున్నారు ప్రకృతి వ్యవసాయదారుడు మిట్టపెల్లి రాములు. భూమిని రసాయనాలతో పాడు చేయటం మాని.. జీవామృతంతో సారవంతం చేస్తే వ్యవసాయదారుడి జీవితం ఆనందంగా ఉంటుందని చాటిచెబుతున్నారు.
నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న రైతు సంతోషంగా ఉంటాడనడానికి మిట్టపెల్లి రాములే నిదర్శనం. జగిత్యాల జిల్లాలోని బీర్‌పూర్ మండలంలోని తుంగూర్ గ్రామమే రాములు స్వస్థలం. దుబాయ్ వెళ్లి 15 ఏళ్లు కార్మికుడిగా పనిచేసి 20 ఏళ్ల క్రితమే తిరిగి వచ్చారు. అప్పట్లోనే గ్రామంలో దాదాపు 12 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. భూమిని చదును చేయించి, 10 ఎకరాల మామిడి తోటలో 600 చెట్లు నాటారు. రెండెకరాల్లో వరిని రసాయనిక పద్ధతిలో సాగు చేశారు. రెండు బావులు తవ్వారు.
బంగెనపల్లి, దశేరి, హిమాయత్, కేసరి వంటి మామిడి చెట్లతోపాటు ఉసిరి, జామ, బొప్పాయి, బత్తాయి, మునగ తదితర చెట్లు ఉన్నాయి. ‘సాక్షి సాగుబడి’ ద్వారా పాలేకర్ ప్రకృతి వ్యవసాయాన్ని గురించి తెలుసుకొని, కరీంనగర్‌లో జరిగిన పాలేకర్ శిక్షణకు హాజరయ్యారు. మహారాష్ట్ర వెళ్లి అక్కడ కొందరు రైతుల క్షేత్రాలను పరిశీలించి అవగాహన పెంచుకున్నారు. నాలుగేళ్లుగా అనుసరిస్తున్నారు. మామిడి తోటలకు జీవామృతాన్ని వర్షాకాలం ప్రారంభం నుంచి నెలకోమారు ఇస్తుంటారు. దోమ ఎక్కువగా ఉన్నప్పుడు అగ్ని అస్త్రం పిచికారీ చేస్తారు.
దశపర్ణ కషాయాన్ని పూత దశకు ముందు పిచికారీ చేస్తారు. అలాగే, వరి సాగుకు ముందు.. జనుము పెంచి పొలంలో కలియ దున్నుతారు. బీజామృతం తయారు చేసి విత్తనాలను విత్తనశుద్ధి చేస్తారు. నాటు వేసే ముందు ఎకరానికి క్వింటాల్ ఘన జీవామృతం వేస్తారు. 20 రోజులకొకసారి జీవామృతాన్ని నీటితో కలిపి ఇస్తుంటారు. ఇటీవల తయారు చేస్తున్న వర్మీవాష్‌ను లేత మామిడి మొక్కలకు అందిస్తున్నారు. గతంలో 2 ఆవులను కొన్నారు. ఇప్పుడు వాటి సంతతి 20కి పెరిగాయి. ఒక్కో ఆవును ఉదయం ఓ మామిడి చెట్టు నీడన, సాయంత్రం ఓ చెట్టు దగ్గర కట్టేస్తుంటారు.
చెట్ల చుట్టూ ఉండే పచ్చిగడ్డిని తినటంతోపాటు పేడ, మూత్రం విసర్జించటం ద్వారా నేలను సారవంతం చేస్తున్నాయి. నీటి నిల్వ కోసం గుంతను తవ్వారు. జీవామృతం నేరుగా డ్రిప్ ద్వారా వెళ్లేలా ఏర్పాటు చేశారు. గత నాలుగేళ్లుగా ఏనాడూ మామిడి తోటను ట్రాక్టర్‌తో గానీ, నాగలితో గానీ దున్నలేదు. సొంత వరి విత్తనాన్నే వాడుతున్నారు. ఎకరానికి 30 క్వింటాళ్ల వరి ధాన్యం దిగుబడి వస్తున్నది. మర ఆడించి నేరుగా వినియోగదారులకు బియ్యం అమ్ముతున్నారు. మామిడి కాయలను తోట దగ్గరే అమ్ముతున్నారు. ఎడాపెడా ఖర్చులు పెట్టాల్సిన పని లేకుండా.. హైరానా పడకుండా ప్రశాంతంగా వ్యవసాయం చేస్తూ.. రసాయనిక అవశేషాల్లేని దిగుబడితోపాటు అధిక నికరాదాయం పొందుతున్నారు.
రైతును నిశ్చింతగా బతికించేది ప్రకృతి వ్యవసాయమే!
ప్రకృతి వ్యవసాయం పరిచయం అయిన తర్వాత గత నాలుగేళ్లుగా రసాయనాలు వాడలేదు. ఈ ఏడాది అందరి వరి పొలాలకు దోమ పోటు వచ్చినా మా పొలానికి ఏ చీడపీడా రాలేదు. నాలుగేళ్లుగా పెద్దగా ఖర్చు పెట్టింది లేదు. నన్ను చూసి మా గ్రామంలో నలుగురు, ఐదుగురు రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంతో సాగు ఖర్చులు తగ్గించుకుంటేనే రైతు నిశ్చింతగా బతకగలిగేది. తరచూ మా తోటను సందర్శిస్తున్న రైతులకు నా అనుభవాలను పంచుతున్నాను.
– మిట్టపెల్లి రాములు (81878 23316), తుంగూరు, బీర్‌పూర్(మం.), జగిత్యాల జిల్లా
– పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్, జగిత్యాల జిల్లా
భూమి బాగుంటేనే రైతు బాగుండేది!
Published Tue, Nov 21 2017 4:45 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment